నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Aug 28, 2009

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ చూపునట్టివా కై తలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పసిఁడి పళ్ళెరమునఁ గవిగండపెండేరమును గొనివచ్చి సభాస్థానమున నిడి సంస్కృ తాంధ్రము లందు సమముగాఁ గవనము సెప్పనేర్చినవారిద్దానిఁ గైకొన నర్హు లనఁగా సభ్యులు మిన్నకుండిరనియు దానిపై నాతఁడే--
ఉ।।
ముద్దుగ గండపెండియరమున్ గొనుఁడంచు బహుకరింపఁగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరుఁ గోరఁగలేరు లేరొకో-

అని సగముపద్యముఁ జదివినఁ బెద్దనామాత్యుడు లేచి-

పెద్దనఁబోలుపండితులు పృథ్విని లేరని నీ వెఱుంగవే
పెద్దన కీఁదలంచినను బేరిమి నా కిడు కృష్ణరాణ్ణృపా !

అని చదివెనట।
'ద్ద' కార ప్రాసతో కృష్ణరాయలు పద్యాన్ని ప్రారంభించగానే ఆ గండపెండేరం ఎవరికుద్దేశింపబడిందో అక్కడి అష్టదిగ్గజ కవులందరికీ అర్థమై పోయుంటుంది। అందుకే ఎవ్వరూ నోరిప్పలేదు। పెద్దనగారే చివరికి నోరు చేసుకోవాల్సొచ్చింది మరి।

అలా ఆపద్యాన్ని పూరించి పెద్దన గారు ఈ మాలికను ఆశువుగా చదివారట।
ఉ॥
పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా
కై తలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని
ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు
స్మే తెలియబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
బూఁతలనూనెకాయసరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా
సాతతతానతానలపసన్ దివుటాడెడుగోటమీటుబల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ

రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీ తపనీయగర్భనికటీభవ దాననపర్వసాహితీ
భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా
శీతనగాత్మ జా గిరిశ శేఖర శీత మయూఖరేఖికా
పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మ లయసంగతిచుంచు విపంచి కామృదం
గాతత తేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ
నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీమరందసం
ఘాతవియద్ధునీచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమార గంధవహ హారిసుగంధ విలాసయుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా
రాతిరసప్రసారరుచిర ప్రసరంబుగ సారె సారెకున్।

రాయ లంతటఁ గవిగండపెండేరమును దానై యాతని పాదమునఁ దొడిగెనఁట ?
పై మాలికకు సంపూర్ణమైన అర్థం, వివరణ ఇవ్వటం నాకు చేతరాదు। భైరవభట్ల వారూ, రాఘవ గారూ ఇతర పెద్దలూ పూనుకొని మమ్మల్నానందపరుస్తారనే ఆశతో దీన్నిక్కడ ముగిస్తున్నాను।

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks