అభిషేక ఖండము
శ్రీరామ పట్టాభిషేక వార్తను రాముని ద్వారా విన్న కౌసల్య రామునితో ఇలా పలికినది।
చ।
ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొరవింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా ! ७६
రాముని వయసు అప్పుడు २४ సంవత్సరాలన్నమాట। విఱచిన వెండికొండదొరవింటిని వింటినిగాని -మంచి అందమైన అనుప్రాసం। పాపం కౌసల్య ఆశపడింది కాని జరిగింది మాత్రం వేరు।
మంథర నిదురలోనున్నకైకేయిని నిదుర లేపి ఆమెతో ఇలా అంటుంది।
గీ।
అవునె దౌర్భాగ్య మాకారమైన దాన!
నీకు నిదుర యెటుపట్టునే దరిద్రు
రాల ! యొకవంక నింటిచూరంటుకొనిన
సొగసుగాఁ జలి కాగెఁడుపగిది తోఁప। १०५
సామెతలంటే విశ్వనాథవారికెంతిష్టమో కదా.
క।
మిన్నొక పెడపెడ చీలుచు
కొన్నది యాయేమి గుబులుకొన్న సవంబో
నిన్నను లే దభిషేకపు
సన్నయు నే మంత దొంగచాటుతనంబో ! १०६
కైకేయిని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో మంథర అన్న మాటలు
గీ।
పిల్లవానిని భరతుఁ బంపించినాఁడు
మేనమామల యిండ్లకుఁ, దా నెఱుంగు
మన్నుదిన్నపామ వటంచు నిన్ను రాజు
ఇంక భయ మేటికో? దాచుటేలొ యింక ? १०७
రెచ్చగొట్టటానికి ఉపయోగించే మాటనేర్పు.
మ।
తనకుం గన్నులు విప్పుకో ల్పడవటే , తా వచ్చి పెద్దమ్మ నె
త్తినిఁ గూర్చున్నది యేమొ కావలయు, ధాత్రీజాని రాముండె య
య్యెనయేనీ తినఁగూడు లేదుజుమి నాకేకాదు నీకున్ , బురా
తనవైరంబులు సర్వమున్ సవతి పంతా ల్పాతరల్ తీసెఁడున్। १०८
నీ నెత్తిని శనిపెద్దమ్మ వచ్చి కూర్చున్నది కాబోలు, నీకనులు తెఱిపిళ్ళు పడటం లేదు। రాముడే రాజయినట్లైతే నాకే కాదు నీకుకూడా తినడానికి కూడుండదు రేపటినుంచీని। నీ సవతి కౌసల్య పాత వైరాలనన్నిటినీ తవ్వి బయటకు తీస్తుంది గదా।
Aug 27, 2009
ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment