దశరథుఁ డంతఃపురములకేగి పాయసమును రాణులకు పంచియిచ్చుట
గీ.
చెఱువులోఁ బూలు చేతులఁ జిమ్ముకొంచుఁ
గడకుఁ జేరం జను నీఁతగాఁడువోలె
నెదురయిన నవ్వు మొగముల యిఱకటమున
రాజు నీఁదుచు నంతిపురంబుఁ జేరె. 118
శాంత యెదురుగా వచ్చింది. ధశరథుడామెతో
శా.
అమ్మా ! నీ వొకదైవమై వెలసినా వస్మద్గృహమ్మందు నీ
వ మ్మౌనిన్ గొని వెంటవచ్చితివి పుత్త్రావాప్తికై నా కటం
చు మ్మోదమ్మునెసంగఁ బట్టమహిషింజూపొంద నీ విద్ది కై
కొమ్మా ! పాయసమంచు నర్థమొసగెన్ క్షోణీశ్వరుండామెకున్. 120
కౌసల్యకు సగం పాయసాన్నిచ్చాడట. ఆ పాయసాన్ని కౌసల్య ఆరగించింది.
ఉ.
అంతటరాజు శాంతమృదుహాసముఁ జేసెను శాంతఁ గాంచుచున్
శాంతయు మందహాస రుచిసంపదఁ జూపెను రాజుఁ గాంచుచన్
ప్రాంత చరత్త్ర పా లవ విరాజితలోచనవారిజాత శ్రీ
కాంతవిభాసి నవ్వెసఁగఁ గాంచె మహాసతి తండ్రికూఁతులన్. 123
దశరథుడు శాంతను చూసి శాంతమృదుహాసాన్ని చేసాడట. బదులుగా శాంత కూడా రాజును చూసి మందహాస రుచిసంపదను చూపినదట. వారిద్దరినీ నవ్వుతూ కౌసల్య చూసినదట. ఇక్కడో పెద్దసమాసాన్ని వేసారు విశ్వనాధ.
ప్రాంత చరత్త్ర పా లవ విరాజితలోచనవారిజాత శ్రీకాంతవిభాసి అంటూను.దీని అర్థం నాకు తెలియలేదు.
ఉ.
నవ్వుచు నేగె రాజు లలనామణియైన సుమిత్రమేడకున్
బువ్వలరారుబోఁడిఁ గనఁబోవక చేఁగలపాయసంబునం
దవ్వరవర్ణినీ మణికి నర్థము వేఱుగ నేర్పఱించి జౌ
జవ్వున నూఁగుచిత్తమున సాగెను కేకయరాజపుత్త్రి కై.124
అక్కడ సుమిత్ర కనబడకపోయేసరికి ఆమె కోసం సగం వేఱుగా నుంచి మిగిలినదానితో కైకేయీ గృహానికి వెళ్ళాడు రాజు.
క.
అలచేఁ గలిగిన దానన్
జలజాయతనేత్ర కొసఁగె సగము నిలేశుం
డలఘుతరగాఢనిష్ఠా
ప్రలుబ్ధకై కేయి తినియెఁ బాయసమంతన్. 125
తన దగ్గఱనున్న దానిలో సగం కైకేయి కిస్తే ఆమె దానిని ఆరగించింది. అలఘుతరగాఢనిష్ఠాప్రలుబ్ధ ట కైకేయి.
క.
మగిడి చనుదెంచి కనుగొని
జగతీపతియున్ సుమిత్రఁ జానా ! నీకై
సగముంచితినే యదియును
మిగిలినదియున్ భుజింపుమీ యని యొసగెన్.126
తిరిగి సుమిత్ర దగ్గఱకొచ్చి ఇందాక తనకొఱకుంచిన సగమూ ఈ మిగిలిన సగమూ తినమంటాడామెను. కాని ఆమె ముందుగా కౌసల్యతినాలి కదా అంటుంది. కౌసల్య తిన్నదని చెప్తాడు. అప్పుడామె---
శా.
కౌసల్యాతనుజాతుఁడైన ప్రభువున్ గారాము మిత్రంబుగా
నై సేవించెడువాడు నా కడుపునం దావిర్భవింపంగ నే
నాసింతున్ భవదీయసత్కరుణచే నంచున్ మహాభక్తితోఁ
బ్రాసించెన్ బరిధూతకల్మష సుమిత్రాదేవి తద్భాగముల్. 128
ఆ విధంగా ముగ్గురు రాణులకూ పాయసాన్ని దశరథుడు పంచి పెట్టటం జరిగింది.
Jul 2, 2009
అంతటరాజు శాంతమృదుహాసముఁ జేసెను శాంతఁ గాంచుచున్
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment