శ్రీకృష్ణబలరాములు నందుని చూడవచ్చుట
గోనిందుడు నందునితో యిట్లనియె.
శా.
తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా
తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం దొల్లి యే
తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి భవ త్సౌజన్యభావంబులన్
దండ్రీ! యింతటివార మైతిమి గదా త త్త ద్వయోలీలలన్.
బలరామ కృష్ణులు సాందీపని యొద్ద విద్య నభ్యసించుట.
శా.
ఉర్విన్ మానవు లెవ్వ రై న గురు వాక్యోద్యుక్తు లై కాని త
త్పూర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్
సర్వజ్ఞత్వముతో జగద్గురువు లై సంపూర్ణులై యుండియున్
గుర్వంగీకరణంబు సేయఁ జని రా గోవిందుడున్ రాముడున్.
గోపికలు ఉద్ధవునితో కృష్ణునికి చెప్పమని పలికిన మాటలు
శా.
ఏకాంతంబున నీదుపై నొరగి తా నేమేని భాషించుచో
మాకాంతుండు వచించునే రవిసుతా మధ్యప్రదేశంబునన్
రాకాచంద్ర మయూఖముల్ మెఱయఁగా రాసంబు మాతోడ నం
గీకారం బొనరించి బంధనియతిం గ్రీడించు విన్నాణముల్.
సీ.
తనుఁ బాసి యొక్కింత తడ వై న నిటమీఁద నేలపై మేనులు నిలువ వనుము
నేలపై మేనులు నిలువక యటమున్న ధైర్యంబు లొక్కటఁ దలఁగు ననుము
ధైర్యంబు లొక్కటఁ దలఁగిన పిమ్మటఁ జిత్తంబు లిక్కడఁ జిక్క వనుము
చిత్తంబు లిక్కడఁ జిక్కక వచ్చినఁ బ్రాణంబు లుండక పాయు ననుము
తే.
ప్రాణములు పోవ మఱి వచ్చి ప్రాణవిభుఁడు
ప్రాణి రక్షకుఁ డగు తన్నుఁ బ్రాణు లెల్ల
జేరి దూఱంగ మఱి యేమి సేయువాఁడు
వేగ విన్నప మొనరింపవే మహాత్మ!
క.
తగులరె మగలను మగువలు, తగులదె తను మున్ను కమల తగవు విడిచియున్
దగిలిన మగువల విడుచుట, దగుఁ దగదని తగవు బలుకఁ దగుదువు హరికిన్.
Mar 10, 2009
తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment