జరాసంధుడు మథురపై దండెత్తుట
జరాసంధుడు కృష్ణునితో యిట్లనెను.
సీ.
అదలించి రొప్పంగ నాలమందలు గావు గంధగజేంద్ర సంఘములు గాని
పరికించి వినఁగ నంభారవములు గావు వాజీంద్ర హేషారవములు గాని
పదహతిఁ గూల్పంగఁబ్రాతబండ్లును గావు నగసమాన స్యందములు గాని
ప్రియము లాడంగ నాభీరలోకము గాదు కాలాభ వైరి వర్గంబు గాని
తే.
యార్ప వనవహ్ని గాదు బాణాగ్ని గాని
మఱియు బృందావనము గాదు మొనలు గాని
యమున గాదు నటింప ఘోరాజి గాని
పోరు నీ కేల గోపాల ! పొమ్ము పొమ్ము.
మ.
తరుణిం జంపుటయో బకుం గెడపుటో ధాత్రీజముల్ గూల్చుటో
ఖరమున్ ద్రుంచుటయో ఫణిం బఱపుటో గాలిన్ నిబంధించుటో
గిరి హస్తంబునఁ దాల్చుటో లయమహాగ్ని స్ఫార దుర్వార దు
ర్భర బాణాహతి నెట్లు నిల్చెదవు స ప్రాణుండ వై గోపకా!
వ. అదియునుం గాక.
సీ.
గోపికావల్లకీ ఘోషణంబులు గావు శింజినీరవములు చెవుడుపఱచు
వల్ల వీకర ముక్త వారిధారలు గావు శరవృష్టిధారలు చక్కు సేయు
ఘోషాంగనాపాంగ కుటిలాహతులు గావు నిశితాసి నిహతులు నిగ్రహించు
నాభీరకామినీ హస్తాబ్జములు గావు ముష్టిఘాతంబులు మురువు డించు
తే.
నల్ల వ్రేపల్లె గాదు ఘోరావనీశ
మకరసంఘాత సంపూర్ణ మగధరాజ
వాహినీసాగరం బిది వనజనేత్ర !
నెఱసి నిను దీవి కై వడి నేఁడు ముంచు.
ఉ.
బాలుఁడ వీవు కృష్ణ ! బలభద్రునిఁ బంపు రణంబు సేయ గో
పాలక బాలుతోడ జనపాల శిఖామణి యైన మాగధుం
డాలము సేసె నంచు జను లాడెడి మాటకు సిగ్గు వుట్టెడిన్
జాలుఁ దొలంగు దివ్య శరజాలుర మమ్ము జయింపవచ్చునే.
Mar 11, 2009
అదలించి రొప్పంగ నాలమందలు గావు గంధగజేంద్ర సంఘములు గాని
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment