రుక్మిణీ కల్యాణము-4
వ.
అని వితర్కింపుచు.
ఉ.
పోఁడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుడున్
రాఁ డను నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్
లేఁ డను రుక్మికిం దగవు లే దిటఁ జై ద్యున కిత్తు నంచు ను
న్నాఁ డను గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁ డనున్.
ఉ.
చెప్పదు తల్లికిం దలఁపుఁ జిక్కు దిశల్ దరహాస చంద్రికన్
గప్పదు వక్త్రతామరస గంధసమాగత భృంగసంఘమున్
రొప్పదు నిద్రఁ గై కొన దురోజ పరస్పరసక్త హారముల్
విప్పదు కృష్ణమార్గగత వీక్షణపంక్తులఁ ద్రిప్ప దెప్పుడున్.
చ.
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు కొప్పుఁ జక్కగా
ముడువదు నెచ్చలిం గదిసి ముచ్చటకుం జన దన్న మేమియున్
గుడువదు నీరమున్ గొనదు కూరిమి కీరముఁ జేరి పద్యమున్
నొడువదు వల్లకీగుణ వినోదము సేయదు డాయ దన్యులన్.
సీ.
మృగనాభి యలఁదదు మగరాజమధ్యమ జలముల నాడదు జలజగంధి
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దుఱుమదు పువ్వుఁ బోణి
వనకేళిఁ గోరదు వనజాతలోచన హంసంబుఁ బెంపదు హంసగమన
లతల బోషింపదు లతికా లలితదేహ తొడవులు దొడవదు తొడవు తొడవు
ఆ.
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు
గమల గృహముఁ జొరదు కమలహస్త
గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి యనుచు.
వ.
మఱియును,
మ.
మలఁగున్ మెల్లనిగాలికిన్ బటు నట న్మత్త ద్విరేఫాళికిన్
గలఁగున్ గోయిల మ్రోఁత కై యలఁగు నుద్యత్ కీరసంభాషలన్
గలఁగున్ వెన్నెల వేఁడిమిన్ మలఁగు మాకందాంకుర చ్ఛాయకున్
దొలఁగున్ గొమ్మ మనోభవానల శిఖా దోదూయమానాంగి యై.
వ.
ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబుల యందును విరక్త యై, మనోజాలంబునం బొగిలెడి మగువకు శుభంబు చెప్పు చందంబున వామోరులోచన భుజంబు లదరె. అంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు సనుదెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠి మహోత్కంఠతోడ నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురుచని నిలువంబడిన, బ్రాహ్మణుం డి ట్లనియె.
ఉ.
మెచ్చె భవద్గుణోన్నతి క మేయ ధనాదుల నిచ్చె నాకుఁ దా
వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె సురాసురు లెల్ల నడ్డ మై
వచ్చిన నై న రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేఁడు ఫలించెఁ గన్యకా !
వ.
అనిన వైదర్భి యిట్లనియె.
మ.
జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి నన్
నిలువం బెట్టితి నీ కృపం బ్రతికితిన్ నీయట్టి పుణ్యాత్మకుల్
గలరే దీనికి నీకుఁ బ్రత్యుపకృతిన్ గావింపఁగానేర నం
జలి గావించెద భూసురాన్వయమణీ ! సద్బంధు చింతామణీ !
వ.
అని నమస్కరించె.
Mar 13, 2009
రుక్మిణీ కల్యాణము-4
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment