రుక్మిణీ కల్యాణము-3
చ.
కన్నియమీఁద నాతలఁపు గాఢము కూరుకురాదు రేయి నా
కెన్నఁడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే
మున్నె యెఱుంగుదున్ బరులమూఁ క లడంచి కుమారిఁ దెత్తు వి
ద్వన్నుత! మాను ద్రచ్చి నవవహ్ని శిఖన్ వడిఁ దెచ్చు కై వడిన్.
క.
వచ్చెద విదర్భ భూమికిఁ, జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి, వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చినఁ బోరన్.
వ.
అని పలికి, రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు దెలిసి, తనపంపున రథసారథియైన దారకుండు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి రథ మాయత్తంబు చేసి తెచ్చిన, నమోఘ మనోరథుం డైన హరి తానును, బ్రాహ్మణుండును, రథారోహణంబు చేసి, యేకరాత్రంబున నాన ర్తక దేశంబులు గడచి, విదర్భ దేశంబునకుం జనియె. అందుఁ గుండిన పురీశ్వరుం డైన భీష్మకుండు కొడుకునకు వశుం డై, కూఁతు శిశుపాలున కిత్తు నని తలంచి, శోభనోద్యోగంబు సేయించె. అప్పుడు,
సీ.
రచ్చలుఁ గ్రంతలు రాజమార్గంబులు విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి చందనసిక్త తోయంబులు గలయంగఁ జల్లిరి కలువడములు
రమణీయ వివిధతోరణములు గట్టిరి సకల గృహంబులు సక్కఁ జేసి
కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి రతివలు పురుషులు నన్నియెడల
ఆ.
వివిధవస్త్రములను వివిధ మాల్యాభర
ణానులేపనముల నమరి యుండి
రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి
రుత్సవమున నగర మొప్పియుండె.
వ.
అంత నా భీష్మకుండు విహితప్రకారంబులం బితృదేవతల నర్చించి, బ్రాహ్మణులకు భోజనంబులు వెట్టించి, మంగళాశీర్వచనంబులు సదివించి, రుక్మిణిదేవి నభిషిక్తం జేసి, వస్త్రయుగళ భూషితం గావించి, రత్నభూషణంబు లిడి, ఋ గ్యజు స్సామ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొఱకు నిగమనిగదిత న్యాయంబున హోమంబు గావించె. మఱియు నా రాజు దంపతుల మేలు కొఱకు తిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగె. అయ్యవసరంబున.
మ.
భటసంఘంబులతో రథావళులతో భద్రేభ యూథంబుతోఁ
బటు వేగాన్విత ఘోటక వ్రజముతో బంధుప్రియ శ్రేణితోఁ
గటు సంరంభంముతో విదర్భతనయం గై కొందు నంచున్ విశం
కట వృత్తిన్ జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి య వ్వీటికిన్.
ఉ.
బంధులఁ గూడి కృష్ణ బలభద్రులు వచ్చినఁ బాఱఁద్రోలి ని
ర్మంధరవృత్తిఁ జై ద్యునికి మానినిఁ గూర్చెద మంచు నుల్లసత్
సింధుర వీర వాజి రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరథ పౌండ్రకాదులున్.
వ.
మఱియు, నానాదేశంబుల రాజు లనేకు లేతెండిరి. అందు శిశుపాలు నెదుర్కొని, పూజించి, భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె. అంతఁ దద్వృత్తాంతంబు విని,
చ.
హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్య హితానుసారు లై
నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం
గర మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి నంచు వేగఁ దా
నరిగె హలాయుధుండు కమలాక్షునిఁ జూడ ననేక సేనతోన్.
క.
ఆలోపల నేకతమున, నాలోలవిశాలనయన యగు రుక్మిణి త
న్నా లోకలోచనుఁడు హరి, యాలోకము చేసి కదియఁ డని శంకిత యై.
శా.
లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె నా యత్నంబు సిద్ధించునో
భగ్నం బై చనునో విరించి కృత మెబ్భంగిన్ బ్రవర్తించు నో !
మ.
ఘనుడా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో
విని కృష్ణుం డిది తప్పుగా దలఁచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో.
వ.
అని వితర్కింపుచు.
(ఇంకా వుంది)
Mar 12, 2009
రుక్మిణీ కల్యాణము-3
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Entha chakkani varnana ! Pothana telugu , teneloorutu undi !
Post a Comment