సీ.
అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేలపాసితి వని యైలేయ లతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగడు గదా! చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి మాధవీలతలార! మనుపరమ్మ!
ఆ.
జాతిసతులఁ బాయ నీతియే హరి కని, జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ, జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!
గోపికలు కృష్ణుని లీలలను అనుకరించుట
సీ.
పూతనయై యొక్క పొలఁతి చరింపగ శౌరియై యొక కాంత చన్నుఁ గుడుచు;
బాలుఁడై యొకభామ పాలకు నేడ్చుచో బండి నే నను లేమఁ బాఱఁ దన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ; హరి నని నర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ; బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
ఆ.
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ, గోపవత్సగణము గొంద ఱగుదు;
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ, బసుల మనెడి సతుల భరతముఖ్య!
ఇంకా గోపికలు కృష్ణుని వెదకుచు--
సీ.
కొమ్మకుఁ బువ్వులు గోసినా డిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ దృణములోఁ దోఁపదు తెఱవజాడ
ప్రియకు ధమ్మిల్లంబు వెట్టినాఁ డిక్కడఁ గూర్చున్న చోటిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మావి యిచ్చినాఁ డిక్కడ వెలఁది నిక్కిన గతి విశదమయ్యె
ఆ.
సుదతి తోడ నీరు సొచ్చినాఁ డిక్కడఁ, జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడ, ననగి పెనఁగియున్న యందమొప్పె.
సీ.
ఈ చరణంబులే యిందునిభానన! సనకాదిముని యోగసరణి నొప్పు
నీ పాదతలములే యెలనాఁగ! శ్రుతివధూ సీమంతవీధులఁ జెన్నుమిగులు
నీ పదాబ్జంబులే యిభకులోత్తమయాన! పాలేటి రాచూలి పట్టుగొమ్మ
లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ! ముక్తికాంతా మనోమోహనంబు
ఆ.
లీ యడుగుల రజమె యింతి! బ్రహ్మేశాది
దివిజవరులు మౌళిదిశలఁ దాల్తు
రనుచుఁ గొంద ఱబల లబ్జాక్షుఁ డేగిన
క్రమముఁ గనియు నతనిఁ గానరైరి.
పాలేటి= పాల సముద్రము యొక్క
సీ.
ఈ పొదరింటిలో నిందాఁకఁ గృష్ణుండు నాతోడ మన్మథనటన మాడె
ని య్యోల మగుచోట నిందాఁకఁ జెలువుండు గాఢంబుగా నన్ను గౌఁగిలించె
నీ మహీజము నీడ నిందాఁక సుభగుండు చిట్టంటు సేతల సిగ్గు గొనియె
నీ పుష్పలత పొంత నిందాఁక దయితుండు నను డాసి యధర పానంబు సేసె
ఆ.
నీ ప్రసూనవేది నిందాఁక రమణుండు
కుసుమదామములనుఁ గొప్పు దీర్చె
ననుచు గొంద ఱతివ లంభోజనయనుని
పూర్వలీలఁ దలఁచి పొగడి రధిప!
చిట్టంటు సేతలు=విలాసముగా
Jan 17, 2009
అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ బాటలీతరులార! పట్టరమ్మ!
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment