నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 16, 2009

బాంధవముననైనఁ బగనైనఁ వగనైనఁ, బ్రీతినైనఁ బ్రాణభీతినైన

ఆ.
బాంధవముననైనఁ బగనైనఁ వగనైనఁ, బ్రీతినైనఁ బ్రాణభీతినైన
భక్తినైన హరికిఁ బరతంత్రులై యుండు, జనులు మోక్షమునకుఁ జనుదు రధిప!


సీ.
ప్రాణేశుఁ డెఱిఁగిన బ్రాణంబునకుఁ దెగు దండించు నెఱిఁగిన ధరణివిభుఁడు
మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ దలవరి యెఱిఁగినఁ దగులు సేయుఁ
దలిదండ్రు లెఱిఁగిన దల లెత్తకుండుదు రేరా లెఱింగిన నెత్తిపొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి బంధువు లెఱిఁగిన బహి యొనర్తు

ఆ.
రితరు లెఱిఁగిరేని నెంతయుఁ జుల్కగాఁ, జూతు; రిందు నందు సుఖము లేదు;
యశము లేదు నిర్భయానందమును లేదు, జారుఁ జేరఁ జనదు చారుముఖికి.

కృష్ణుడు గోపికలతో--
క.
నడవడి గొఱ గాకున్నను, బడుగైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్
జడుఁడైన రోగి యైనను, విడుచుట మరియాద గాదు విభు నంగనకున్.

చ.
వనితలు నన్నుఁ గోరి యిట వచ్చితి, రింతఁ గొఱంత లేదు;మే
లొనరె;సమస్త జంతువులు నోలిఁ బ్రియంబులు గావె? నాకు; నై
నను నిలువంగఁ బోలదు, సనాతన ధర్మము లాఁడువారికిం
బెనిమిటులన్ భజించుటలు పెద్దలు చెప్పుచు నుందు రెల్లెడన్.

క.
ధ్యానాకర్ణన దర్శన, గానంబుల నా తలంపు గలిగినఁ జాలుం
బూనెదరు కృతార్థత్వము, మానవతుల్!చనుఁడు మరలి మందిరములకున్.

అని కృష్ణుడు హితబోధ చేస్తే గోపికలు అతనితో-
సీ.
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని తరలి పోవంగఁ బాదములు రావు;
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని తక్కిన పనికి హస్తములు సొరవు;
నీ వాగమృతధార నిండఁ గ్రోలఁగఁ గాని చెవు లన్యభాషలు సేరి వినవు;
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని చూడ వన్యంబులఁ జూడ్కి కవలు;
ఆ.
నిన్నె కాని పలుకనేరవు మా జిహ్వ, లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు
మా మనంబు లెల్ల మరపించి దొంగిలి, తేమి సేయువార మింకఁ? గృష్ణ!


సీ.
నీ యధరామృత నిర్ఝరంబుల నేఁడు సేరి వాతెఱలపైఁ జిలుకకున్న
నీ విశాలాంచిత నిర్మలవక్షంబుఁ గుచకుట్మలంబులఁ గూర్పకున్న
నీ రమ్యతర హస్త నీరజాతంబులు చికురబంధంబులఁ జేర్పకున్న
నీ కృపాలోకన నివహంబు మెల్లన నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న
ఆ.
నీ నవీన మాననీయ సల్లాపంబు, కర్ణరంధ్రదిశలఁ గప్పకున్న
నెట్లు బ్రదుకువార?మెందుఁ జేరెడువార? మధిప!వినఁగఁ దగదె యాఁడుకుయులు.

అంటారు.తరువాత కృష్ణుడు వారికి కనిపించకుండాపోతే అతడిని వెతుకుతూ ఇలా అన్నిటినీ అడుగుతూ ఉంటారు.
సీ.
పున్నాగ!కానవే పున్నాగవందితుఁ;దిలకంబ!కానవే తిలకనిటలు;
ఘనసార!కానవే ఘనసారశోభితు;బంధూక!కానవే బంధుమిత్రు;
మన్మథ!కానవే మన్మథాకారుని; వంశంబ!కానవే వంశధరునిఁ;
జందన!కానవే చందనశీతలుఁ; గుందంబ!కానవే కుందరదను;

తే.
నింద్రభూజమ!కానవే యింద్రవిభవుఁ, గువలవృక్షమ!కానవే కువలయేశుఁ
బ్రియకపాదప!కానవే ప్రియవిహారు;ననుచుఁ గృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.


ఇంకా--
ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెడివాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార!మీ పొదలమాటున లేఁడు గదమ్మ చెప్పరే?

ఉ.
అంగజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించు వాఁడు శ్రీ
రంగదురంబు వాఁడు మధురంబగు వేణురవంబు వాఁడు మ
మ్మంగజు పువ్వుఁదూపులకు నగ్గము సేసి లవంగ లుంగ నా
రంగములార!మీకడకు రాఁడు గదా!కృప నున్నఁ జూపరే!

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks