నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 21, 2009

తెలుగు భాషాభివృద్ధి

తెలుగు భాషాభివృద్ధి
సురేష్ గారి బ్లాగులో మనమందరం తెలుగు భాషాభివృద్ధి గురించి మన ప్రభుత్వము వారికి ఎన్నికల సమయంలో సమర్పిద్దా మను కుంటున్న వినతి పత్రం గురించి-- ఇటువంటి పనిని మన బ్లాగర్లందరూ కలిసి ప్రారంభిస్తే బాగుంటుందని దీనిని గురించి టపా వ్రాద్దామని నేను అనుకుంటున్న సమయంలో సురేష్ గారు టపా ప్రచురించారు.చాలా సంతోషమనిపించింది.నా వలెనే ఇంకా ఎంతోమంది ఇటువంటి ఆలోచననే చేస్తున్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది.ఇదే సందర్భంలో శ్రీ తాడేపల్లిగారి టపా కూడా నాకు చాలా ఆనందం కలిగించింది. సందర్భంగా నేను నాకు తోచిన కొన్ని విషయాలను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.నా సూచనలు: 1.ప్రాధమిక పాఠశాలలలో తరగతి గోడలపై నాలుగువైపులా గుండ్రని తెలుగు అక్షరాలతో మంచి మంచి తెలుగు సూక్తులను వ్రాయించటం.(చిన్నప్పటి మా పాఠశాలలో ఇలా ఉండేవి.) 2.పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలచేత 'మా తెలుగు తల్లికీ మల్లెపూదండ','వందే మాతరం','జయ జయ జయ జయభారత జనయిత్రీ దివ్యధాత్రి' మొదలైన దేశభక్తి గీతాలను ఆలపించేలా చెయ్యడం. 3.1 నుంచి 6,7 తరగతుల వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చూడాలి. ఇంగ్లీషు భాష ఒక పాఠ్యాంశం గా మాత్రమే ఉండాలి. 4.చిన్నపిల్లల పాఠ్యపుస్తకాలలో వేమన శతకం, సుమతీ శతకం,భాస్కర శతకం, దాశరథీ శతకం,కాళహస్తీశ్వర శతకం మొదలగు శతక పద్యాలని కంఠస్థ పద్యాల విభాగంలో చేర్చాలి. 5.నీతి కథల మాథ్యమం ద్వారా పిల్లల చదువులకు ప్రణాళికలు తయారు చేసి అవి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. 6.ప్రభుత్వ వ్యవహారాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను వీలైనంతవరకూ తెలుగు భాషా మాథ్యమంలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి. 7.దూరదర్శన్ లో ప్రసారితమయ్యే అనేకానేక తెలుగు ఛానళ్ళలో వార్తలకు,ఇతర ప్రసారాలకు పేర్లు తెలుగులో మాత్రమే ఉండేలా యా సంస్థల యజమానులను ఒప్పించిగానీ నొప్పించి అయినా సరే వారందరూ తెలుగుకి మారేలా చెయ్యాలి. 8.తెలుగు పద్యం -దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇస్తూ- 'అవధాన విద్య'ను కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తూ విద్యార్థులలో ధారణాశక్తి పెంపొందేలా చెయ్యటం వలన-- వారు- తరువాత వారెన్నుకున్న రంగాలలో పతాక స్థాయి చేరుకోవటానికి బాగా ఉపకరిస్తుంది. 9.ప్రస్తుతం అధిక వాడకం లో ఉన్న ఆంగ్లపదాలకు సరియైన తెలుగు పదాల్ని అభివృద్ధి చేసి అవి వాడుకలోకొచ్చేలా చెయ్యటం జరగాలి. 10.మన బ్లాగ్మిత్రులందరూ వారి వారి బ్లాగులను- తెలుగు భాషా వ్యాప్తికి ఉపయోగించే విధంగా- అంతర్జాలంలో కృషి జరపాలి. 11.పిల్లలకు భారత,రామాయణ,భాగవత కథలతో పాటుగా మిత్రబేధం,మిత్రలాభం వగైరా నీతి కథలను పాఠ్యాంశాలుగా చేసి చిన్నతనం నుండీ కూడా వారు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు దోహదం చెయ్యాలి. 12.దిన,వార,మాస పత్రికలలో తెలుగు భాషా వ్యాప్తి కోసం వ్యాసాలనూ,పద్యాలనూ,కథలనూ ప్రచురింప చేసి భాషావ్యాప్తికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా పెద్దలూ విజ్ఞులూ అందరూ కలసి ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ప్రభుత్వం వారికి ఎన్నికల సమయంలో అందజేసి ప్రభుత్వం కార్యాచరణకి పూనుకొనేలా వత్తిడి చెయ్యటానికిదే తగిన సమయం.హైదరాబాదులోని బ్లాగ్మిత్రులు మొన్న జరిగిన e-తెలుగు కార్యక్రమాలను జయప్రదం చేసిన తీరులో అదే దీక్ష పట్టుదలలతో కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపించి ఫలవంతం చేస్తారని,నా కెందుకో పూర్తి నమ్మకంగా ఉంది.శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు.అందరూ కలిసి చేస్తే జరగనిదంటూ ఏమీ ఉండదు.

3 comments:

Bolloju Baba said...

చాలా మంచి విషయాలను చక్కగా క్రోడీకరించారండీ.
నా వంతు సహాయం చేయటానికి నేను రెడీ.
భవదీయుడు

srinivasrjy said...

నేనూ రెడీ..!!

Unknown said...

బాగున్నాయండి మిగిలిన శతకాలు కూడా. పిల్లలకి నేర్పాలి వీటిని అందరూను.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks