|
సామంతం
పసిఁడియక్షంత లివె పట్టరో వేగమే రారో
దెసలఁ బేరటాండ్లు దేవుని పెండ్లికిని. IIపల్లవిII
శ్రీవేంటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి
దైవికపుఁ బెండ్లిముహూర్తము నేఁడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజం బెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని. IIపసిఁడిII
కందర్ప జనకునికిఁ గమలాదేవికిఁ బెండ్లి
పందిలిలోపలఁ దలఁబాలు నేఁడు
గందమూ విడె మిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని.IIపసిఁడిII
అదె శ్రీవేంకటపతి కల మేలుమంగకును
మొదలితిరునాళ్ళకు మొక్కేము నేఁడు
యెదుట నేఁగేరు వీరె యిచ్చేరు వరము లివె
కదలి రారో ఘనుల పెండ్లికిని. IIపసిఁడిII౩-౧౯౪
0 comments:
Post a Comment