ఏరుపరచఁగ రావు యెవ్వరి సొమ్ములో యివి
చేరి నిన్ను నడిగేము చెప్పవయ్య తగవు IIపల్లవిII
అలులు నరచంద్రుడు నతనుని విండ్లును
కలువలు సంపెఁగయుఁ గమ్మఁ జిగురు
పలుచని యద్దములు పచ్చిపోఁకయు శ్రీలు
చెలియ సింగారాలో చిత్తజుని పౌజులో IIఏరుII
తిన్నని సంక్కును మంచితీగెలునుఁ దామరలు
చిన్ని జక్కవపిల్లలు సింహమును
యెన్నరాని చిమితరి ఇసుక దిబ్బలును
కన్నె సింగారాలోఇవి కాముని బలములో IIఏరుII
అరటికంబములును అమ్ముల పొదులును
మినుకుఁ గూర్మములు మించు వజ్రాలు
యెనసితివి శ్రీ వేంకటేశ యలమేల్మంగను
వనిత సింగారాలో వలరాజు మూకలో IIఏరుII
ఈ కీర్తనలో చెలికత్తెలు శ్రీవెంకటేశ్వరుని ఓ తగవు తీర్చమని వేడుకొంటారు. అదేమిటంటే - కొన్ని కొన్నివస్తువులు అలమేల్మంగ సింగారాలో లేక మన్మధునికి చెందిన ఆయుధములో తగవు చెప్పమంటారు.
అలులు, అరచందమామ, మన్మధుని విండ్లు, కలువలు, సంపెగ, కమ్మ, చిగురు, పలుచని అద్దములు, పచ్చి పోక, శ్రీలు-
అలమేలు మంగకు మన్మధునికి ఇద్దరితోనూ ఉండేవే.అలులు-అలకలు(ముంగురులు)-బాణములు, అరచందమామ-అర్ధచంద్రుని వంటి మోము-
తిన్నని శంఖము(మెడ),మంచి తీగెలు,తామరలు, చిన్నవైన జక్కవ పక్షులు,(చనుదోయి), సింహము(నడుమునకు పోలిక) , యెన్నరాని చిమితరి(?) ఇసుక దిబ్బలు
ఇంకా
అరటి కంబములు, అమ్ములపొదులు, కుర్మములు,వజ్రాలు --ఇవన్నీ కూడా ఇద్దరికీ సంబంధించినవి-వీనిలో ఏవి ఎవరివో వేరుపరచమని అడుగుతున్న కీర్తన.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
17 hours ago
3 comments:
వ్యాఖ్యానం కొంచెం తడబడినట్లుంది.. పద్యంలోకి వెళితే కానీ సొబగు, అర్ధం కాలేదు. (మరొక సీక్రెట్టు: నేను మీ పద్యాన్ని చదవను. వాఖ్యానాన్నె చదువుతాను.). గమనించగలరు.
బొల్లోజు బాబా
పద్యాలు కావు.పదాలు.అన్నమయ్య పదకవితా పితామహుడు.నా వ్యాఖ్యానం తడబడినమాట నిజమే.నాకు అన్ని మాటలకు పూర్తిగా అర్దాలు తెలియలేదు.కామేశ్వరరావు,రానారె,కొత్తపాళీ లేక ఇతరు లెవరైనా కామెంట్ల రూపంలో అర్ధాలు విడమరచి చెపితే ఆనందించాలని.మీరు పదాన్ని మొదట చదివి తరువాత వివరణ చదవండి.పదం వదిలి వివరణ చూట్టం చెరకు రసాన్ని పారబోసి,రుచిని పిప్పిలో వెదుక్కోవటమే.అన్యధా భావించరని తలుస్తా.
ఇది మీ మోడెష్టీ.
బొల్లోజు బాబా
Post a Comment