రామక్రియ
అంపఁగల వెల్లా నంపె నతనిరాకకుఁ జెలి
చెంపజాఱుఁదురుముల చిఱునవ్వు లంపె IIపల్లవిII
కాంతఁ దనరమణునికడకుఁ జెలియ నంపె
వింతకనుచూపులు వెంటనే యంపె
మంతనాన నెదురుగా మనోరథము లంపె
పంతపుఁ గన్నీట యర్ఘ్యపాద్యము లంపె IIఅంపII
పిలిచి తెమ్మని పతిపేరిట లేఖ లంపె
వెలిఁ దనయడుగులు వెంటనే యంపె
నెలవయి వేగిరాన నిట్టూర్పుగాలి నంపె
అలర నాందోళపు టందలము లంపె IIఅంపII
కౌఁగిటికిఁ గరములఁ గైకోలు వీడె మంపె
నీఁగిన గొరిచంద్రుల వెంటనే యంపె
రాఁగి శ్రీవేంటపతి రతిఁ గూడి యీ చెలి
లోఁగిన సిగ్గుల నెల్లా లోలోనే యంపె IIఅంపII
పంపించ గలిగిన వాటినెల్లా చెలియె తన రమణుని రాక కోరి ఎదురుగా పంపించినదట. చెంపను జారే కొప్పున ముడిచిన (పూవుల) చిఱుత నవ్వులను పంపినదట.
కాంత తన ప్రియుని దగ్గరకు చెలికత్తెను పంపినది. ఆ వెంటనే వింత కనుచూపులను పంపినది.
రహస్యముగా తన మనోరథములను ఎదురుగా పంపినది. పౌరుషముతో కూడిన కన్నీటితో అర్ఘ్యపాద్యములను(పూజ కొరకు ఉపయోగించు నీరు ) పంపించింది.
పిలచికొని తెమ్మని పతి పేరు మీదుగా లేఖలను పంపించినది. బయలులో తన అడుగులను వెంటనే పంపినది.
ఉన్నచోటునుండి త్వరితంగా తన నిట్టూర్పుగాలిని పంపినది.సంతోషముతో ఊగులాడే పల్లకీని పంపినది.
కౌగిలికంగీకరిస్తున్న చేతులతో తాంబూలమంపినది.చలించుచున్న గొరిచంద్రుల(?) ను వెంటనే పంపినది.
అనురాగముతో యీ చెలి శ్రీవేంకటపతిని రతిగూడి లోకువైనసిగ్గులను లోలోనే పంపినది.
ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?
14 hours ago
0 comments:
Post a Comment