నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 19, 2008

నవ్వు వచ్చీ నిన్నుఁ జూచి నాకు నేఁడు

నవ్వు వచ్చీ నిన్నుఁ జూచి నాకు నేఁడు I యీ
రవ్వలు నీకే చెల్లు రాజసపు దేవుడా IIపల్లవిII
సతి కుచములు మోవ సాము చేసినటువలె
సతముగా మోచేవు శంఖచక్రములు
మతకాన వేఁడుకొనే మార్గమున నున్నట్టు
తతి నభయహస్తము తప్పవు నీ విపుడు IIనవ్వుII

కామిని నలమిపట్టే గతి అలవాటుగా
యేమరవు కటి హస్తమెంతైనా నీవు
నేమమున ఆకె రాక నిక్కి చూచే మతకాన
కోమలపు నీకు నిల్వుఁ గొలువులే ఇపుడు IIనవ్వుII

అంకె నుపరిసురత మలవాటు చెడకుండా
వుంకువ శ్రీసతి మోచే వురమునను
అంకపు శ్రీవేంకటేశ అంది మమ్ముఁ గాచేటి-
పొంకమున మన్నన చూపులు చల్లే విదిగో. IIనవ్వుII 22-73

ఈ సంకీర్తన చెలికత్తె స్వామితో విన్నపము చేసినట్లుగా ఉంటుంది.
ఓ రాజువైన దేవుడా! నా కీ రోజు నిన్ను చూచి నవ్వు వస్తోంది.ఇటువంటి అల్లరి నీకే చెల్లుతుంది.
నీ సతి చన్నులను మోయటం కొరకు సాము(వ్యాయామము) చేసినట్లుగా ఎల్లప్పుడూ శంఖుచక్రాలను మోస్తూ ఉన్నావు. నీ సతిని వేడుకొంటున్న దారిలో నున్నట్లుగా (ఆవంకతో) నీవు అభయ హస్త ముద్రను తప్పకుండా ధరిస్తావు.
కామినిని అలమి పట్టుకొనే విధం అలవాటుగా మారి నీ రెండవ చేతిని కటి ప్రదేశంలో ఉంచటాన్ని యెప్పటికీ మరచిపోవు.నియమంతో ఆమె రాకను నిక్కి చూచేటందు కన్నట్టుగా ఇపుడు కోమలుడవైన నీకు నిలువు కొలువులే.
ఆమె పైబడి చేసే సురతము అలవాటు తప్పకుండా ఉండేందుకుగాను శుల్కరూపమున ఆమెను హృదయము మీదే మోస్తున్నావు.ఓ వేంకటేశ్వరా ! మమ్ములను సమీపము నుండి అంది పుచ్చుకొని కాపాడి పొందికగా మా మీద నీ చల్లని చూపులు చల్లేవిదిగో.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks