వేణు శ్రీకాంత్ గారూ! మీ రడిగిన కీర్తన నాకు అర్ధమైన రీతిలో:
దేసాళం
నెయ్యములల్లోనేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో IIపల్లవిII
పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో IIనెయ్యII
తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంపు యీ వన్నెల మోవికి
గుటుకులలోనా గుక్కిళ్ళో IIనెయ్యII
గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలే
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుపగుగ్గిళ్ళో IIనెయ్యII 5-179
స్నేహము(ప్రకృతి)-నెయ్యము(వికృతి).స్నేహములు తిన్నగా త్వరితంగా వూరుతున్న
అల్లోనేరేళ్ళు పండ్ల వంటివి.అంత మధురంగా వుంటాయి.
ఈ చెలువములు అంటే స్నేహాలు చంకల్లో పుట్టే పలచని చెమటలనే నీటి చెలమలు(ఎండిపోయిన యేటిలో నీటి కొరకు తవ్విన చిన్న చిన్న గోతులు).థళథళమని మెరిసే గుండ్రని విసనకర్ర లాంటి ముత్యాలతో కూడిన పైటకొంగు దులిపినప్పుడు జారిన నీళ్ళతుంపిళ్ళు లాంటివి ఈ స్నేహాలు.
తొటతొటమని(ధ్వన్యనుకరణం) కన్నుల నుండి స్రవించే కన్నీళ్ల చిట్టిపొట్టి కోపతాపాలతో కూడిన చిరునగవులే ఈ స్నేహాలు.
మర్రిపండు వంటి రంగైన పెదవికి గుటకలు వేసినప్పటి గుక్కిళ్లు యీ స్నేహాలు.
అందమైన శ్రీవేంకటేశ్వరుని కౌగిటిలోని కస్తూరి మొదలగు పూతల వంటివి యీ స్నేహాలు.
మన్మధుని వింటి నుండి వెలువడిన కమ్మనైన యంప(?) పూలబాణాలు గురిగా తగిలిన ఇనప గుగ్గిళ్ళ వంటివి యీ నెయ్యములు.
నాకు తోచిన అర్ధం సరైనదో కాదో పెద్దలెవరైనా చెబితే సంతోషిస్తాను.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago