నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

May 23, 2008

చెప్పరాదీ యింతి సిరులు - దీని (పాట తో)

Get this widget | Track details | eSnips Social DNA

ముఖారి

చెప్పరాదీ యింతి సిరులు - దీని
వొప్పులిన్నియుఁ జూడ వొరపులో కాని IIపల్లవిII

ముదిత జఘనము మీఁది మొలనూలిగంటలవి
కదలు రవ మెట్లుండెఁ గంటిరే చెలులు
మదనుఁడుండెడి హేమమందిరము దిరిగిరాఁ
గదిసి మ్రోసెడి పారిఘంటలో కాని IIచెప్పII

కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ
జిమ్ముటది యెట్లుండెఁ జెప్పరే చెలులు
యిమ్మైన మరుధనములెల్ల రాసులు వోసి
కమ్ముకొని చెంగావి గప్పిరో కాని IIచెప్పII

నెలతకంఠమునందు నీలమణిహారములు
అలరు టెట్లుండు కొనియాడరే చెలులు
లలితాంగి ప్రాణవల్లభుఁడు వేంకటవిభుఁడు
నెలకొన్న కౌఁగిటనె నిలిచెనో కాని IIచెప్పII 5-259
నాకు అర్ధం కాని పద బంధాలు:
వొరపులు
పారిఘంటలు
కుచమూలరుచి

మొలనూలి గంటల రవము అంటే చప్పుడు (శబ్దము)
మ్రోయుచున్న పారిఘంటలు (గుడి ప్రాకారపు గంటలు?) గాను,
కుచమూలరుచి(వక్షోజ సంపద యొక్క అందము?) రాసులుగా పోసిన మరుధనముల
మీద కప్పిన చెంగావి లాగానూ,మెడలోని నీలమణిహారములు వేంకటవిభుని
కౌగిట నిలచిన లలితాంగి లాగానూ ఈ యింతి సిరులు (అందాలు) చెప్పనవసరం
లేనంతగా ఆమె వొప్పు లిన్నీ వొరపులు(?) గా ప్రకాశిస్తున్నాయి.

9 comments:

ఓ బ్రమ్మీ said...

అయ్యా మల్లిన నరసింహా రావుగారూ,

ముందుగా మీకు ధన్యవాదములు. మీ మొదటి పుటనుంచి చదువుతూ వస్తున్న నాకు ఈ పుట చాలా ఆనందాన్నిచ్చింది. ఇంత చక్కగా వర్ణించిన అన్నమయ్యను ఏవిధంగా కీర్తించాలో తెలియటం లేదు.

అన్నమయ్య భావానికి ఏవిధంగా కళంక రాకుండా మీ భావాన్ని తెలియజేసిన తీరు అన్యధా ప్రశంసనీయ్యం. మీరు ఇలాగే అజేయంగా సాగిపోతూ ఉండండి.

నేను స్వతహాగా నాట్యాభిమానిని. ఎదో ఒక రోజు అన్నమయ్య కీర్తనలలో నుంచి ఒకదానికి నా కళని జోడించి, ఒక దృశ్య రూపకం చెయ్యాలన్న నా ఆలోచనకు మీ (explanation) వివరణ బాగా ఉపయోగ పడేటట్టుంది.

Unknown said...

చక్రవర్తి గారూ నెనరులు.మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
మీ అందరి ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో "అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు" పేరుతో ఇంకో బ్లాగు విడిగా ప్రారంభిస్తున్నాను.సందర్శించగలరు.

రాఘవ said...

నేననుకోవడం ఒరపు అంటే ఒడుపు అని (రూపం కొంచెం మార్పుతో). అలాగే పారిఘంటలంటే "చుట్టూతా ఉండే" గంటలై ఉంటాయి. కుచమూలమంటే వక్షము (కుచములంటే వక్షోజములు, వక్షమునుండి పుట్టినవి కాబట్టి). రుచి అంటే మీకు తెలుసు... అందం, ప్రకాశం.

అదేం మాయో తెలియదు, ఇది అన్నమాచార్యునికే చెల్లింది, ఆయన వ్రాసినవి శృఙ్గారకీర్తనలైనా వాటిలో భక్తే తాణ్డవిస్తూంటుంది. దీనికే భగవత్కృప అని మరో పేరు అనుకుంటాను.

Anonymous said...

అద్భుతం..రాఘవ గారు సరిగ్గా చెప్పారు. అన్నమయ్య పదాలలో శృంగారం అభాసలానే ఉంటుంది.

మరుధనముల మీది చెంగావి అంటే ? చెంగావి అంటే ఎఱుపు రంగు అనుకుంటున్నాను.

కుచమూలం అంటే చూచుకములు అనుకుంటున్నాను.

కొత్త పాళీ said...

"ఈ శృంగార సంకీర్తనలో శృంగారం పాలు కొంచెం ఎక్కువనిపించినా అందమైన పదబంధాలు వాడటం వలన ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా హాయిగా సాగింది."
నరసింహ గారూ, మీ పై స్టేట్మెంటుకి తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నాను. అలాగే రాఘవ గారి వ్యాఖ్యకి కూడా.
శృంగారం పాలు ఎక్కువ అవడం ఏమిటి?
అందమైన పదబంధాల వల్ల ఎబ్బెట్టు కాకపోడం ఏమిటి?
స్తనాల ప్రస్తావన వచ్చినందుకే శృంగారం పాలు ఎక్కువైతే మన సాంప్రదాయ సాహిత్యం అంతా బూతులబుంగే అన్నమాట.
రాఘవ వ్యాఖ్య గురించి .. మీకు ఈ పదంలో భక్తి కనబడితే కనబడి ఉండొచ్చు. కానీ అన్ని శృంగార పదాల్లో భక్తే ఉంది, అందరికీ అదే కనబడుతుందన్నట్టు జెనరలైజ్ చెయ్యలేము.
అదీ కాక, భక్తి రంగరిస్తే గానీ శృంగారం జీర్ణించుకోలేక పోతే అసలు శృంగారపు జోలికి పోవడమెందుకు?
అన్నమయ్య శృంగార పదాల్ని ఎలా అర్ధం చేసుకోవచ్చు అని ఒక దృష్టి (ఒక దృష్టి మాత్రమే .. ఇంకా చాలా ఉండొచ్చు) నాకు తోచినది ఇక్కడ రాశాను.
కుచమూలము అంటే మొనలు కాదు .. స్తనం వక్షానికి అతికి ఉండే చోటు, స్తనం మొదలయ్యే చోటు.
చెంగావి అంటే సుమారు కాషాయ రంగు (గోల్డ్ స్పాట్ రంగు). ఇక్కడ ఆ రంగులో ఉన్న పల్చటి గుడ్డ అనుకోవచ్చు.

రానారె said...

కొమ్మపయ్యెదలోని కుచమూలరుచి వెలికిఁ
జిమ్ముట ...

ఇందులో "కుచమూల రుచి" పాడుకోవడానికి వీలుగా 'మూ' అన్నారేగానీ అది "కుచముల రుచి" మాత్రమేనని నాకనిపిస్తోంది. "మొలనూలిగంటలవి, కుచమూల రుచి వెలికి, నీలమణిహారములు" ఇవన్నీ పది మాత్రల మాటలు. ఈ లయ కుదర్చడంకోసం కుచమూలరుచి అని సాగదీసి పాడతారనుకుంటా. జానపదగీతాల్లో లయకోసం ఇలా సాగదీయడం మామూలే కదా! "కలుముల రాణి" అనేదాన్ని "కలుమూల రాణీ" అని పాడతారు సంక్రాంతి పాటల్లో...

Unknown said...

కొత్త పాళీ గారికి,రాఘవ గారికి,రవి గారికి,రానారె గారికి నెనరులు.కొత్త పాళీ గారి అభ్యంతరాన్ని గౌరవిస్తూ నా వ్యాఖ్యను నిరభ్యంతరంగా వెనక్కు తీసుకుంటున్నాను.చాలా పదాలకు అర్ధాలు తెలియజేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.

కామేశ్వరరావు said...

అక్కడున్నది "కుచమూల" రుచే అనుకుంటాను. దీన్నే పెద్దనగారు "బాహుమూల రుచి" అన్నారు, "ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లు పొంగార...".
ధగధగా మెరిసే ధనరాసులు (బంగారమో/నగలో) కుప్పగా పోసి, దాని మీద ఓ గుడ్డ కప్పిన దృశ్యాన్ని ఊహించుకోండి. అప్పుడా కప్పిన వస్త్రం అంచుల కిందనుంచి కాంతి బయటకి ప్రసరిస్తుంది. ఇక్కడ అన్నమయ్య చెప్పిన కుచమూలరుచి అదే!

నాదో చిన్న సందేహం, కొత్తపాళిగారు తీర్చాలి. "మధుర భక్తి"లో భక్తుడు స్త్రీగాను, భగవంతుని పురుషుడిగానూ భావించడం ప్రధానమైన విషయం కదా. అందువల్లనే శృగారం ఒక భక్తి మార్గమయ్యింది. కృష్ణుడు భగవంతుడైతే భక్తులందరూ గోపికలయ్యారు. అన్నమయ్యది మధురభక్తి సాంప్రదాయం అనడానికి, అలాటి భావన అతనిలో కనిపిస్తుందా?

కొత్త పాళీ said...

కామేశ్వర్రావుగారికి,
మనకి ఎక్కువగా కనిపించే మధురభక్తి ఉదాహరణల్లో నాయికయే మాట్లాడ్డం, నాయిక గొంతే వినిపిస్తుంది. అన్నమయ్య పదాల్లో నాయిక తానే మాట్లాడిన శృంగార పదాలు ఎందుకో అంత ప్రాచుర్యం పొందలేదు (కనీసం నాకు గుర్తు రావట్లేదు). కానీ అటువంటివి కూడా అన్నమయ్య రాశాడు. ఇటీవల ఆచార్య వెల్చేరు గారు ప్రచురించిన ఆంగ్లానువాద సంకలనంలో కొన్ని ఉన్నాయి. మనకి ఎక్కువగా వినబడే శృంగారపదాల్లో మూడో మనిషి గొంతే మనకి వినిపిస్తుంది. ఏమొకో చిగురుటధరమున, పలుకు తేనెల తల్లి, కొమ్మ తన ముత్యాల కొంగు .. ఇత్యాది. అది ఎవరి గొంతు అనేది పదానికీ పదానికీ మారుతూ ఉంది. మధురభక్తి సాహిత్య చరిత్ర, కాలాలు నాకు అవగాహన లేదు.
అన్నమయ్య పరమ వైష్ణవుడు .. అందులో సందేహం లేదు.
మహా పండితుడు .. అందులోనూ సందేహం లేదు
జయదేవుడికి సుమారు రెండొందల ఏండ్ల తరవాతి వాడు .. గీతగోవిందంతో సన్నిహ్త పరిచయం ఉండే అవకాశం ఉంది.
ఆయన ద్రావీడ వేదాలని చెప్పబడే నాలాయిర ప్రబంధం ఇత్యాది తమిళ విఅష్ణవ సాహిత్యంతో చాలా ప్రభావితుడయ్యాడని పరిశోధకులు చెబుతున్నారు. మధురభక్తి కి అంకురాలు ఆ సాహిత్యంలోనూ ఉన్నాయని పలువురు పరిశోధకులు చెప్పారు. అంచేత మధుర భక్తి సాంప్రదాయాన్ని అనుసరించాడనే అనుకోవచ్చును అనిపిస్తుంది నాకు. శృంగారం లో కూడా గమనించండి .. అక్కడ జరుగుతున్న డ్రామా, ఆ నాయిక మనో భావాల చిత్రణ ఇదంతా జరుగుతుండగానే .. ఒక్క క్షణం కూడా అవతల ఉన్నది అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన జగన్నాథుడని మరువడు, మరువనివ్వడు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks