నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 23, 2014

వర్ణన రత్నాకరము - నల చరిత్రము - సిరిప్రగడ ధర్మయామాత్యుఁడు -క్షత్రియులు

వర్ణన రత్నాకరము - నల చరిత్రము - సిరిప్రగడ ధర్మయామాత్యుఁడు -క్షత్రియులు

సీ.
వేరంపుఁ బరునికి వెన్నిచ్చె నని కాని, ఘనుఁడు దధీచి యొక్కరుఁడె సాటి
వెఱవైన మగతనం బఱఁ గొఱంతని కాని, కనకాద్రి ధన్వుఁ డొక్కరుఁడె సాటి
గణుతించుచోఁ గళంకముఁ జెందెనని కాని,కమలాభియాతి యొక్కరుఁడె సాటి
ప్రతిదినంబును భంగపాటొందునని కాని, కన్నిధిస్వామి యొక్కరుఁడె సాటి
గీ.
కాని యితరులు సరిగారు దానశూరు, లతుల విక్రము లకలంకు లతి గభీరు
లగుచు వెలసిన రూపజితార్ధి పుత్త్ర, మారులకుఁ బురి రాజకుమారులకును.

నెఱవు= నిండైన, పూర్తిగా నున్న
అఱ=సగము,  "అఱచందురుని క్రొత్తమెఱుఁగుల
అభియాతి=వైరి, పగతుడు, 
ఈ పద్యానికి సరియైన అర్థం బోధపడటం లేదు. ఎవరైనా తెలియజేస్తే వారికి ముందుగా నా ధన్యవాదములు.ఈ పద్యంలోని అలంకారం యొక్క వివరణనూ తెలియ పఱచగలరని ఆశిస్తూ---

0 comments

వర్ణన రత్నాకరము - బిల్హణీయము - చిత్రకవి సింగనార్యుఁడు -సూర్యోదయము

వర్ణన రత్నాకరము - బిల్హణీయము - చిత్రకవి సింగనార్యుఁడు -సూర్యోదయము

చ.
సమయవినోది మిన్ననెడి చక్కని రంగమునందు  సర్వ ది
గ్రమణులు చూఁడ గారడము రక్తిని జూప విధుండ నెండు న
ద్దము నొక కర్ణమం దునిచి దాపలి కర్ణము నందు హేమ చ
క్రము వెడలంగఁ దీసెననఁగా రవి దోఁచెఁ బ్రభా ప్రభావుఁడై.

బల్హణీయము. అ.3, పద్య 187.

ఈ కావ్యము గుఱించి నాకు ఏమీ తెలియదు. పూర్వం "వెయ్యేళ్ళ తెలుగు పద్యం" అనే శీర్షికన కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఓ వారపత్రికలో నిర్వహిస్తున్నధారావాహికలో మొట్టమొదటి పద్యం అనుకుంటాను ఈ పద్యం. చూడండి ఎంత అందమైన వర్ణనో.

కాలపురుషుడు ఆకాశమనే చక్కని రంగస్థలం మీద అన్ని దిక్కులలోని స్త్రీలు చూస్తూ ఉండగా గారడీవిద్యను ప్రదర్శిస్తూ ఆ గారడీవిద్యను  రక్తి కట్టించే విధంగా చూపనెంచి బ్రహ్మ అనే అద్దాన్ని తన ఒక చెవి వెనకగా ఆనించి ఉంచి తన రెండవ చెవినుండి బంగారు చక్రాన్ని బయటకు వెలికి వచ్చేలా తీసేడా అన్నట్లుగా సూర్యుఁడు తూర్పున తన సహస్రకిరణాలతోనూ ప్రకాశిస్తూ ఉదయంచేడట. ఎంత అందమైన ఊహ!!

అప్పటినుండీ ఎప్పటికైనా బిల్హణీయాన్ని దొరకబుచ్చుకొని చదవాలని అనుకుంటున్నాను.ఎప్పటికి కుదురుతుందో ఏమో!
.

0 comments

Feb 22, 2014

వర్ణన రత్నాకరము - తారాశశాంక విజయము - శేషము వేంకటపతి - స్త్రీ వర్ణనము

వర్ణన రత్నాకరము - తారాశశాంక విజయము - శేషము వేంకటపతి - స్త్రీ వర్ణనము


సీ.
ఇది మనోహర కాంతి కింపైన బింబంబు, బింబంబు కాదిది బెడగు కెంపు
కెంపు గాదిది తేఁటి యొంపని మంకెన, మంకెన గాదిది మంచి చిగురు
చిగురు కాదిది వింత జిగి హెచ్చు పగడంబు, పగడంబు గాదిది పానకంబు
పానకంబిది గాదు పలుచని చెఱకుపాల్, చెఱుకుపాలిది గాదు కురుజు తేనె
గీ.
కురుజు తేనెయు గాదిది కుసుమరసము, కుసుమరసమును గాదిది గొనబు జున్ను
జున్ను గాదిది చవిఁ గుల్కు సుధలదీవి, సుధల దీవియు గాదిది సుదతి మోవి.
                                                           తారాశశాంక విజయము - శేషము వేంకట కవి - అ 1

0 comments

వర్ణన రత్నాకరము -కుశల ప్రశ్న - భాగవతము - పోతన, వాల్మీకి చరిత్రము - రఘునాథ భూపాలుడు.

వర్ణన రత్నాకరము -కుశల ప్రశ్న - భాగవతము - పోతన, వాల్మీకి చరిత్రము - రఘునాథ భూపాలుడు.

సీ.
మాతామహుండైన మన శూరుఁ డున్నాఁ డె, మంగళమే మన మాతులునకు
మోదమే నలుగురు ముగురు మేనత్త ల, కానందమే వారి యాత్మజులకు
నక్రూర కృతవర్మ లాయుస్సమేతులే, జీవితుఁడే యుగ్రసేనవిభుఁడు
కళ్యాణయుక్తులే గద సారణాదులు, మాధవు తమ్ములు మానధనులు
గీ.
నంద మే మన సత్యక నందనునకు, భద్రమే శంబరాసుర భంజనునకుఁ
గుశలమే బాణదనుజేంద్రు కూఁతు పతికి, హర్షమే పార్థ ముసలికి హలికి బలికి..

                                                               భాగవతము - స్కం.1, పద్య 347


సీ.
శౌనకా సుఖమె విశ్వామిత్ర లెస్సలా, కణ్వ మంచిదియె భార్గవ శుభంబె
సుత పరిణామంబె సుతప సంతోషంబె, చ్యవన సేమమె పరాశర శివంబె
కపిల మంగళమె మార్కండేయ కుశలమే, వత్స సౌఖ్యమె కాత్స్య యుత్సవంబె
మాండవ్య భవ్యమే మైత్రేయ భద్రంబె, సుబల మేలె వశిష్ట శోభనంబె
గీ.
క్రతు భరద్వాజ గౌతమ కశ్యపాత్రి, కలశ సంభవ కౌండిన్య గర్గ మంద
పాల జాబాలి రోమశ ప్రముఖులార, యీర లానందముగ నున్న వారె యిచట.

                                                          వాల్మీకి చరిత్రము - రఘునాథ భూపాలుడు - అ 1.  

కుశల ప్రశ్నను ఇంత అందంగా అడగవచ్చునన్నమాట!

0 comments

Feb 21, 2014

వర్ణన రత్నాకరము - వేశ్యలు - పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామలింగ కవి

వర్ణన రత్నాకరము - వేశ్యలు - పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామలింగ కవి

సీ.
మొలక చీకటి జలజల రాల్పగా రాదె, నెఱులు మించిన వీరి కురులయందు
కెరలించి యద్భుతంబు గిలకొట్టఁ గా రాదె, ముద్దు చూపెడి వీరి మోవులందు
పచ్చ బంగారు కుప్పలు సేయఁగా రాదె, గబ్బి మీఱిన వీరి గుబ్బలందు
పండువెన్నెల తేటఁ బరిఢవింపఁగ రాదె, నగవు గుల్కెడి వీరి మొగములందు
గీ.
నౌర కరవాఁడి చూపుల యౌఘళంబు, బాపురే భూరి కటి తటీ భార మహిమ
చాగు మద మందగమనలక్షణములనఁగ, నేరుపులమింతు రప్పురి వారసతులు.
                                         
                                                     పాండురంగ మహాత్మ్యము - అ.1, పద్య 117
    
  

0 comments

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - ఆముక్త మాల్యద - మొల్ల రామాయణము

వర్ణన రత్నాకరము - క్షత్రియులు - ఆముక్త మాల్యద - మొల్ల రామాయణము

చ.
ఉరువడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందు దక్క సు
స్థిర నిజశక్తి నైదు పది సేయరు ద్గత్తినఁ దక్క మంటికై
పొదల రధీశుఁ డీ కమల బుద్ధి ఖళూరిక దక్క వజ్రదోః
పరిఖవశీకృతాన్య నరపాలకు లప్పురి రాకుమారకుల్.
                                ఆముక్తమాల్యద అ.2, పద్య 25.
కవచము=
1. Armour, a cover, a leather cover or case
 మంత్రకవచము an amulet, a prayer or phylactery for the safety of the body.




ఉ.
రాజులు కాంతి యందు రతి రాజులు రూపమునందు వాహినీ 
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారు లందఱున్.
                                        మొల్లరామాయణము - బాల. పద్య 35.
ఎంతో ఇష్టమయిన పద్యాలలో ఇది ఒకటి.
 

 

 

0 comments

Feb 20, 2014

వర్ణన రత్నాకరము - సౌధ వర్ణనము - విజయ విలాసము - చేమకూర వెంకటకవి

వర్ణన రత్నాకరము - సౌధ వర్ణనము - విజయ విలాసము - చేమకూర వెంకటకవి 

 పున్నమరేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళిఁ దాకి 
వి చ్చిన్నగతిన్ సుధారసము చింది పయిం దిగువాఱ నంత నుం
డి న్నెల సన్నగిల్లు నది నిక్కము గాదని రేని యా పదా 
ర్వన్నె పసిండి మేడలకు రాఁ బని యే మిల సౌధనామముల్.

ఆహా! ఎంత అందమైన ఊహ!!
పున్నమనాటి రాత్రులందు చందమామ ఆ పట్టణం  గుండా పోతున్నప్పుడు ఆ చెంతన ఉన్న ఎత్తైన శిఖరాల్నితాకడం వల్ల కాబోలు ఆ చందమామకు చిల్లుపడి అందలి సుధ ఆ మేడలపై దిగజాఱటం చేత అప్పటినుండి చందమామ క్షీణ చంద్రుడిగా మారి ఉండి ఉండవచ్చు. ఇదే కనక నిజం కాకపోయినట్లయితే  ఆ నగరం లోని మేడలకు "సౌధములు" అనే పేరు వచ్చి ఉండేది కాదు గదా!

చేమకూరవారి కవిత్వంలోని అందచందాలకు ఈ పద్యం ఓ మచ్చు తునక.

మరో బంగారు  మొలక.
ఉ.
ప్రాయపు గాయకుల్ వెల నెపాన నెగాదిగఁ జూడ, ' నేర్పు లౌ 
రా యివి ! దండ మీఁదఁ గొసరం దొర కొంటిరి ! మంచి సాము లే
పో ! యిటు లైనచో సరసముల్ గద మీ కిపుడం' చు నప్పురిన్
గాయజు తూపు లమ్ముదురు కందువ మాటల పుష్పలావికల్ . 
                                                                                             విజయ విలాసము అ. 1 పద్య 79

0 comments

Feb 18, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - అచ్చ తెలుఁగు రామాయణము -కూచిమంచి తిమ్మకవి

వర్ణన రత్నాకరము - స్త్రీ వర్ణనము - అచ్చ తెలుఁగు రామాయణము -కూచిమంచి తిమ్మకవి

సీ.
తలిరు లేమావి  క్రొత్త జవాది బలు క్రోవి, వలపుల దీవి చెంగలువ బావి
ముగుదల మేల్బంతి సొగసుల దొంతి క్రొం, బొగడ బూబంతి యబ్బురపు టింతి
మానికమ్ములమూట మరుని గెల్పుల కోట, పండు వెన్నెల తేట పసిఁడి వేఁట
కపురంపు దిమ్మ చొక్కపుఁ దళ్కు కీల్బొమ్మ, మొల్లంపు దానిమ్మ ముద్దుగుమ్మ
గీ.
తేజుల కొటారు వలుద ముత్తియపుఁ బేరు, కడిఁది జగరంగు తొలకరి కార్మెఱుంగు
మనుపికిలిచెండు పరువంపుఁ బనసపండు, నాఁగఁ దగు నెన్న యన్నాతి మిన్న.

తలిరు = చిగురు, పల్లవము
బలు= బలువురూపాంతరము, బాగుగా
 క్రోవి=ఆసుపోసెడు గొట్టము, మూస, బుడ్డి
కొటారు =ధాన్యపు రాసులు ఉంచెడి చోటు, కొట్ట కొన, చివర
వలుద= లావు, స్థూలము
కడిఁద=ఆపద, అధికము, ఆవశ్యకము, కఠినము
జగరంగు= ఇది జడ రంగు అని నా అనుమానం. నివృత్తి చేసుకోవాల్సి ఉంది
మను= జీవించు
పికిలి చెండు= పికిలి పక్షి యొక్క జుట్టు
వృత్యను ప్రాస ఎంత అందంగా కుదిరిందో!

0 comments

Feb 17, 2014

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు

వర్ణన రత్నాకరము - స్త్రీ ధర్మములు - జైమిని భారతము - పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవి

గీ.
బాల్యమునఁ దల్లిదండ్రులు ప్రాయమున ధ,వుండు వార్ధకమున నందనుండుఁ జెప్పి
నట్లు చెయంగ దగుఁ గాని యరసి చూడఁ, దెఱవలకు నెందుఁ దమయిచ్చఁ దిరుగఁ జనదు. అ 2, పద్య 37


వసు చరిత్రము - రామరాజభూషణుడు

ఉ.
తమ్ములఁ బంపుదున్ మణిసతమ్ములఁ బంపుదు రాజహంస పో మై
తమ్ములఁ బంపుదున్ బరిచితమ్ములఁ గానన దేవతాళి జా
తమ్ముఁల బంపుదున్ ద్రుతగతమ్ముల నే నును సారణీప్రపా
తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మది తాప మేటికిన్. అ.6, పద్య 60

తారాశశాంక విజయము - శేషము వేంకటపతి 

 చ. 
అలుకలు దువ్వరాదు సరసాన్నములన్ భుజియింపరాదు
కలప మలందరాదు తిలకంబు రకంబుగ దిద్దరాదు సొ
మ్ములు గయి సేయరాదు సుమముల్ ధరియింపఁగ రాదు సాధ్వి యౌ
నలినదళాయతాక్షికిని నాథుఁడు చెంగట లేకయుండినన్. అ-2, పద్య 158
 


0 comments

Feb 16, 2014

వర్ణన రత్నాకరము - భాగవతము - బమ్మెర పోతన - స్త్రీధర్మములు

వర్ణన రత్నాకరము - భాగవతము - బమ్మెర పోతన - స్త్రీధర్మములు

శరద్రాత్రి యందు గోపికలు గానము చేసెడి శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చే ఘట్టంలో ఆ గోపికలతో కృష్ణుడు వారిని వారిస్తూ చెప్పిన పలుకులు.
సీ. 
ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు దండించు నెఱిఁగిన ధరణి విభుఁడు
మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ దలవరి యెఱిఁగినఁ గులు సేయు
దలిదండ్రు లెఱిఁగిన దలలెత్తకుండుదు రేరా లెఱింగిన నెత్తివొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి బంధువు లెఱిఁగిన బలిసి చెఱుతు
ఆ.
రితరు లెఱిఁగి రేని నెంతయుఁ జులుకఁగాఁ, జూతు రిందు నందు సుఖము లేదు
యశము లేదు నిర్భయానందమును లేదు , జారుఁ జేరఁ జనదు చారుముఖికి.  10 పూర్వ.977
 పోతన గారి శైలి దాని అందం వర్ణింప నలవి కానివి. కదా!
 క.
నడవడి గొఱగాకున్నను, బడుఁ గైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్
జడుఁ డైన రోగి యైనను, విడుచుట మరియాద గాదు విభు నంగనకున్. స్కంద 10 పూర్వ, పద్య 978



నారదుడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాల్ని చెప్తూ శూద్ర ధర్మాల్ని వివరించే ఘట్టంలోని పద్యాలు.
సీ. 
నిలయము వాటించి నిర్మల దేహి యై, శృంగార మే ప్రొద్దుఁ జేయవలయు
సత్యప్రియాలాప చతుర యై ప్రాణేశు, చిత్తంబు ప్రేమ రంజింప వలయు
దాక్షిణ్య సంతోష ధర్మ మేధావుల , దైవత  మని ప్రియుఁ దలఁప వలయు
నాథుఁ డేపద్ధతి నడచు నా పద్దతి, నడచి సద్బంధుల నడప వలయు
ఆ.
మార్దవమునఁ బతికి మజ్జన భోజన, శయనపాన రతులు జరప వలయు
విభుఁడు పతితుఁ డైన వెలఁది పాతివ్రత్య, మహిమఁ బుణ్యు జేసి మనుప వలయు. 7-416
క.
తరుణి దన ప్రాణ వ ల్లభు, హరిభావముగా భజించి యతఁడును దానున్
సిరి కైవడి వర్తించును, హరిలోకమునందు సంతతానందమునన్. 7-417
క.
ఉపవాసంబులు వ్రతములుఁ, దపములు వేయేల భర్త దైవత మని ని
ష్కపటతఁ గొల్చిన సాధ్వికి, నృపవర! దుర్లభము లేదు నిఖిల జగములన్.  7-418

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks