అనేజ దేకం మనసో జవీయో, నై నద్ధేవా ఆప్‌ను వన్ పూర్వమర్షత్ తధ్ధావతో2న్యా నత్యేతి తిష్ఠత్, తస్మిన్న పో మాతరిశ్వాదధాతి "యచ్ఛాప్నోతి య దాదత్తే, యచ్ఛాత్తి విషయా నిహ య చ్చాస్య సంతతో భావ, స్తస్మా దాత్మేతి కీ ర్త్యతే ". 4 మధు. మెదల దొకటె యాత్మము, కాని మించు మనోజవంబు గదియలేరు దేవులు దాని ; కాని ముందదియె పోవు అది కదలకయె పరువెత్తు నన్నింటి దాటిపోవు అదియె యుండఁగ వాయువు ప్రాణుల పనులు దిద్దు. దేవులు - ద్యోతనస్వభావముగల నేత్రాది జ్ఞానేంద్రియములని శంకరులు. ఆత్మ ఆకాశమువలె సర్వవ్యాపియు నామరూపాదులు లేనిదియుఁ గాన కదలకయె యన్నిటిని దాటి యుండునని భావము. ఆత్మ కలదు, ఒకటె. మనసుకంటె వేగము గలది. దీనిని దేవులు - (ఇంద్రియములు ) సమీపింపలేరు. అది ముందుగానే పోవును. అది కదలనిదై పరువెత్తుకొనిపోవునట్టి యితరేంద్రియములను అతిక్రమించి పోవును. ఆ యాత్మ యన్నపుడు వాయువు ప్రాణులకు చేష్టాదిశక్తులను విభజించుచున్నది. ఆత్మ పదమునకు వ్యుత్పత్తి యీ విధముగాఁ జెప్పబడినది. అన్నిటిని వ్యాపించునది, అన్నిటిని దనయందు లయింపఁ జేయునది, విషయముల ననుభవించునది, త్రాటియందుఁ బాముగుణములవలె దీనియందు ప్రపంచరూపము లారోపింపఁబడునుగాన " ఆత్మ" అని వ్యుత్పత్తి.( చర్ల గణపతి శాస్త్రి గారి ఉపనిషత్సుధ నుండి ) |
Apr 26, 2010
అనేజ దేకం మనసో జవీయో, నై నద్ధేవా ఆప్‌ను వన్ పూర్వమర్షత్
Posted by
Unknown
0
comments
కుర్వ న్నే వేహ కర్మాణి, జిజీవిషే చ్ఛతం సమా:
కుర్వ న్నే వేహ కర్మాణి, జిజీవిషే చ్ఛతం సమా: ఏవం త్వయి నాన్యథేతో2స్తి, న కర్మ లిప్యతే నరే . కం. ధరఁ గర్మలు చేయుచునే నిరతము నూరేండ్లు బ్రతుక నెంచఁగ వలయున్ మఱొకగతి లేదు నీ కిఁక నరసి యిటులు చేయఁ గర్మ లంటవు నరునిన్. 2 కర్మలు - అగ్నిహోత్రాది కర్మలని పూర్వులు, స్వస్వభావోచిత కర్మలని నవీనులు. ఈ లోకమందు కర్మలు చేయుచునే నూరుసంవత్సరములు జీవింపఁ గోరవలయును. మఱియొక మార్గము లేదు. ఇట్లు జీవింపఁ గోరు నరుఁడవయిన నీకు అశుభకర్మములు అంటుకొనవు. |
Posted by
Unknown
0
comments
ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్
ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం , 1 కం. భగవంతుడు భువి మాఱుచు నగపడు నీ ప్రతిపదార్ధమందును నుండెన్ తగ నది త్యాగము చే నిపు డె గాచికొను ; మిది యెవరి ధనంబౌ. సంస్కృతమున "ఈశావాస్య" అని మొదలు పెట్టఁబడుటచే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చెను. అవిద్యను అజ్ఞానమును నశింపఁ జేయునదిగాన ఉపనిషత్తు అని వ్యుత్పత్తి. జగతిసందు మార్పుచెందు నిది యంతయుఁ బరమేశ్వరునిచే నిండియుండెను. దానిని త్యాగముచే నిన్ను రక్షించుకొనుము. దేనిని గోరకుము. ఇది యెవరి ధనము ? |
Posted by
Unknown
0
comments
ఈశావాస్యోపనిషత్
ఈశావాస్యోపనిషత్ | ||||||
ఆవాహన / నాందీ శ్లోకం: ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే కం. పూర్ణము బ్రహ్మము జగ మిది పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్ పూర్ణం బగు నీజగతికిఁ బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్. ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది. పైన వ్రాసిన విషయములు శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి ఉపనిషత్సుధ మొదటి భాగము -1 నుండి ఎత్తి వ్రాయబడినవి. వారు ఈ పుస్తకములో ఈశ కేన కఠ ప్రశ్నోపనిషత్తులను తెలుగు పద్యములుగా తెనిగించిరి. | |
Posted by
Unknown
0
comments
ముద్దులు మోమున ముంచఁగను
| |||||||||||||||||||||||||||||||||
Posted by
Unknown
0
comments
హరిదంభోరుహలోచన ల్గగగనరంగాభోగ రంగ త్తమో
వెయ్యేళ్ళ తెలుగు పద్యం. మ. హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్ వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్. ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన. వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం. గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే నట్టువకత్తెకు వరుసగా ముందు మౌక్తిక పట్టము, తఱువాత నుదుటి భాగము ఆ తఱువాత నిండుముఖమూ కనిపించినట్లుగా మొదట ఒక వంకర రేక గాను తఱువాత సగ భాగముగాను తఱువాత పూర్ణబింబమూ గాను తూర్పున ఉదయిస్తూన్న ( లేడిని తనయందు గలిగి ఉన్న) చందమామ కనిపించినదట. ఎంత మనోహర వర్ణన ! |
Posted by
Unknown
0
comments
Apr 14, 2010
శ్రీ అన్నమాచార్య సంకీర్తనా గానం
విజయవాడ శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే శ్రీ అన్నమాచార్య సంకీర్తనా గానం | ||||||||||||||||
5 వ నంబరు గుంపు వారిచే గానం చేయబడు సంకీర్తనలు - వాటి వివరములు. మొదటి సంకీర్తన - నానాటి బతుకు నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము IIపల్లవిII పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము యెట్ట నెదుట కల దీ ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము. IIనానాII కుడిచే దన్నము కోక చుట్టెడిది నడు మంత్రపు పని నాటకము వొడి గట్టుకొనిన వుభయ కర్మములు గడి దాటినపుడే కైవల్యము. II నానా II తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యెగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక గగనము మీదిది కైవల్యము. IIనానాII రెండవ సంకీర్తన - మర్ద మర్ద మమ బంధాని నాట |
మర్ద మర్ద మమ బంధాని దుర్దాంత మహాదురితాని IIపల్లవిII చక్రాయుధ రవిశతతేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖా విక్రమక్రమా విస్ఫులింగకణ నక్రహరణ హరినవ్యకరాంకా. II మర్దII కలితసుదర్శన కఠిన విదారణ కులిశ కోటిభవ ఘోషణా ప్రళయానల సంభ్రమవిభ్రమకర రళితదైత్యగళరక్తవికీరణా. II మర్ద II హితకర శ్రీ వేంకటేశ ప్రయుక్త సతత పరాక్రమజయంకర చతురో2హం తే శరణం గతో2స్మి యితరాన్ విభజ్య యిహ మాం రక్ష. II మర్ద II2-81 మూడవ సంకీర్తన - రామ రామ రామకృష్ణ రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి బంటననే తేజమే నాది II పల్లవిII వారధి దాటి మెప్పించ వాయుజుడ నే గాను సారె చవుల మెప్పించ శబరి గాను బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండ గాను ఏ రీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో. II రామ II ఘనమై మోవి మెప్పించ గరుడుడ నే గాను కొన కామ సుఖమిచ్చు గోపిక గాను వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగి గాను నిన్నెట్లు మెప్పించు నన్ను గాచే దెట్లా. II రామ II నవ్వుచు పాడి మెప్పించ నారదుడ నే గాను అవ్వల ప్రాణమీయ జటాయువు గాను ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా. II రామ II నాల్గవ సంకీర్తనవాఁడె వేంకటేశుఁడనే వాఁడే వీఁడు (భూపాళం పుస్తకం లోనిది) పాడాల్సినది (రసికరంజని) వాఁడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడు వాఁడి చుట్టుఁ గైదువవలచేతివాఁడు II పల్లవిII కారిమారసుతునిచక్కనిమాటలకుఁ జొక్కి చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు తీరని వేడుకతో తిరుమంగయాళువారి- ఆరడిముచ్చిమికూటి కాసపడ్డవాఁడు II వాఁడె II పెరియాళువారిబిడ్డ పిసికి పై వేసిన- విరులదండల మెడవేసినవాఁడు తరుణి చేయివేసిన దగ్గరి బుజము చాఁచి పరవశమై చొక్కి పాయలేనివాఁడు II వాఁడె II పామరులఁ దనమీఁది పాటలెల్లాఁ బాడుమంటా భూమికెల్లా నోర నూరిఁపోసినవాఁడు మామ కూఁతురల మేలుమంగనాచారియుఁ దాను గీముగానే వేంకటగిరి నుండేవాఁడు. II వాఁడె II ఐదవ సంకీర్తన - ఎదుట నున్నాడు వీడె ఎదుట నున్నాడు వీడె ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో కాని II పల్లవి II పరమ పురుషుడట పసుల గాచెనట సరవులెంచిన విన సంగతాయిది పరియె తానట ముద్దులందరికి జేసెనట ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని II ఎదుట II వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట నాదించి విన్నవారికి నమ్మికా యిది ఆదిమూల మీతడట ఆడికెల చాతలట కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని II ఎదుట II అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట కొలదొకరికి చెప్పకూడునా యిది తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట కలదమ్మ తనకెంతో కరుణో కాని II ఎదుట II ఆఱవ సంకీర్తన - జయ జయ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామా II పల్లవి II జలధి బంధించిన సౌమిత్రి రామా సెలవిల్లు విరచిన సీతారామా అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా కలిగి యజ్ఞము కాచె కౌసల్య రామా II జయ II అరి రావణాంతక ఆదిత్యకుల రామా గురు మౌనులను గాచే కోదండ రామా ధర నహల్య పాలిటి దశరథ రామా హరురాణి నుతుల లోకాభి రామా II జయ II అతి ప్రతాపముల మాయామృగాంతక రామా సుత కుశలవ ప్రియ సుగుణ రామా వితత మహిమల శ్రీవేంకటాద్రి రామా మతిలోన బాయని మనువంశ రామా II జయ II ఏడవ సంకీర్తన - వెనకేదో ముందరేదో వెనకేదో ముందరేదో వెర్ఱి నేను, నా మనసు మరులు దేర మందే దొకో II పల్లవి II చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని ఏ రూపై పుట్టుదునో ఎఱగ నేను కోరి నిద్రించ పరచుకొన నుద్యోగింతు కాని సారె లేతునో లేవనో జాడ తెలియ ( నేను ) II వెన II తెల్లవారినపుడెల్లా తెలిసితి ననేకాని కల్ల యోదొ నిజమేదో కాన నేను వల్ల చూచి కామినుల వలపించే గాని మొల్లమై నా మేను ముదిసిన దెఱగ II వెన II పాపాలుచేసి మరచి బ్రదుకు చున్నాడగాని వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెఱగ ఏపున శ్రీవేంకటేశు నెక్కడో వెదకేగాని నాపాలి దైవమని నన్నుగాచు టెరగ II వెనII 8 వ సంకీర్తన - రామచంద్రు డితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము లియ్యగలిగె నిందరికి II పల్లవిII గౌతము భార్యపాలిటి కామధేను వితడు ఘాతల కౌశికుపాలిటి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసులపాలిటి ఇహపర దైవము II రామ II పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము. II రామ II తలప శబరి పాలి తత్త్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్ను లెదుటి మూరితి వెలయ శ్రీ వేంకటాద్రి విభు డితడూ. II రామ II 9 వ సంకీర్తన - ఆదిదేవ పరమాత్మా దేవగాంధారి ( పుస్తకములో నున్నది) పాడవలసినది (సింధు భైరవి ) ఆదిదేవ పరమాతుమా వేదవేదాంతవేద్య నమో నమో II పల్లవి II పరాత్పరా భక్త భవభంజనా చరాచరలోకజనక నమో నమో II ఆది II గదాధరా వేంకటగిరినిలయా సదానంద ప్రసన్న నమో నమో II ఆది II 10 వ సంకీర్తన - శరణు శరణు శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా ii శరణు ii కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినా రెచ్చరికయా ii శరణు ii అనిమిషేంద్రులు మునులుదిక్పతు లమర కిన్నర సిద్ధులు ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా ii శరణు ii ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచల నాయకా. ii శరణు ii |
Posted by
Unknown
5
comments
Apr 9, 2010
శ్రీరాముని సద్గుణాలు ( మందరం నుంచి )
కైక కోరికపై వనవాసం చేయటానికి వెళ్తున్న శ్రీరామునకై యంతఃపురస్త్రీలు దుఃఖించుట |
కం. మ్రొక్కుచుఁ దల్లికిఁ దండ్రికి,నక్కరణిని రామచంద్రుఁ డరిగిన నాపై నొక్కమొగి నంతిపురమున, మిక్కుటమై యార్తరవము మింటికి నెగసెన్. ప్రస్తుతము శ్రీరామప్రజల వృత్తాంతము చెప్పుటచాలించి యీలోపల నంతఃపురమున జరిగిన వృత్తాంతమును గవి చెప్పుచున్నాడు.ముందు చెప్పిన విధముగా శ్రీరాముఁ డందఱు తల్లులకుఁ దండ్రికి నమస్కరించి రథమెక్కి పయనమై పోఁగా నంతఃపురమున మిక్కిలి యధికమైన యేడుపుధ్వని యాకాసమున కెగసెను. కం. గతి యెవ్వఁ డనాథులకున్, గతి యెవ్వఁడు దుర్బలులకుఁ గడుఁ దపసులకున్ గతి యెవఁడు శరణ మెవఁడా, పతి గతిచెడి యెచటి కేగువాఁడో యకటా.పోతనగారి బాణీ స్పష్టంగానే కనిపిస్తున్నది. దిక్కులేనివారికిని బలములేనివారికిని నెవఁడు పొందఁదగివనవాఁడో తపస్సు చేసికొనువారికిఁ బ్రాపింపఁ దగినవాఁడు రక్షకుఁడు నెవఁడో యట్లందఱకు రక్షకుఁడు ప్రాప్యుఁడైనవాఁడు ప్రాపురక్షకుఁడు లేక యయ్యో యెక్కడఁ బోవుచున్నాఁడో. సీ. తనమీఁద నెవరైనఁ దంట లాడిన నైనఁ , గోపంబు చెందఁడే కొమ్మలార ! యేమి చేసిన నది యెవరి నొప్పించునో, యని జంకుచుండునే యమ్మలార ! యెవ్వరేనియుఁ గింక నొ వ్వొంద వారల, నూఱట లాడునే యువిదలార ! పరసుఖదుఃఖముల్ స్వసుఖదుఃఖము లట్లు , పరికించు చుండునే తరుణులార ! తే. కన్న తల్లిని గౌసల్యఁ గన్న పగిది మనల నందఱఁ జూచునే మగువలార ! యట్టి పుణ్యాత్ముఁ డటువంటి యనఘు చరితుఁ డెచట నున్నాఁడొ కటకటా యెందు జనునొ. 1124 తనమీద నెవరైనను గొండెములు చెప్పినను గోపింపఁడు. తానుజేయు కార్య మెవరి మనమునకైన నొప్పి కలిగించునో యనిసందేహించి యట్లెవరి మనసు నొవ్వని కార్యములే చేయుచుండును. తనమీఁద నెవరైన గోపించి నొప్పి చెందినను వారలను సమాధానపఱుచును. ఇతరుల సుఖము తనసుఖముగను ఇతరుల దుఃఖము తన దుఃఖముగను జూచుచుండును. కన్నతల్లిని గౌసల్య నేవిధముగఁ జూచునో యట్టులే మనలనందఱఁ జూచును. అటువంటి పుణ్యాత్ముఁడు అటువంటి నిర్దుష్ట చరిత్రుఁడు ఎందున్నాఁడో - యెందు బోవుఁచున్నాఁడో , ఈలాంటి ఎన్నో అందమైన పద్యాలతోనూ, అర్థ తాత్పర్య వాఖ్యానాలతోనూ సాగిపోతుంటుంది వాసుదాసు ( వావిలికొలను సుబ్బారావు ) గారి సుందరమైన మందర వ్యాఖ్యానము. అందఱూ తప్పక చదవాల్సిన మంచి పుస్తకం. |
Posted by
Unknown
1 comments
Mar 18, 2010
కరుణశ్రీ గారి మందార మకరందాలు - చుక్కగుర్తు పద్యాలు
Posted by
Unknown
1 comments
*
కరుణశ్రీ
Mar 15, 2010
నూతన సంవత్సర శుభాకాంక్షలు
బ్లాగ్మిత్రులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకూ వికృతి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మల్లిన నరసింహారావు |
Posted by
Unknown
3
comments
Subscribe to:
Posts (Atom)