నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అన్నమయ్య శృంగార సంకీర్తనలు. Show all posts
Showing posts with label అన్నమయ్య శృంగార సంకీర్తనలు. Show all posts

Nov 4, 2008

నీతితో నడచితేను నొగులే లేదు

సామంతం
నీతితో నడచితేను నొగులే లేదు
జాతి దప్ప కుండితేను చలమే ఫలము. IIపల్లవిII

వొలిసి కై కొంటేను వొగరై నాఁ దీపే
తెలిసితేఁ దనలోనే దేవుఁడున్నాఁడు
పలుకులు మంచివై తే పగవారుఁ జుట్టాలే
చెలఁగి దిష్టించితేను చీఁకటిల్లు వెలుఁగు. IIనీతితోII

నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
వోరిచితేఁ దనపంత మూరకే వచ్చు
సారెకు నుతించితేను చట్టైనాఁ గరఁగును
వూరకే గుట్టుననుంటే వూరికెల్లా నెక్కుడు. IIనీతితోII

వాడికె సేసుకొంటేను వలపెల్లా నిలుపౌను
వేడుకతో నుండితే వెనకే ముందౌ (ను?)
యీడులేని శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితేను
జాడుపడ్డపనులెల్లా సఫలమౌను. IIనీతితోII ౧౪-౪౨


నీతిగా నడిస్తే నెగులే(బాధే)లేదట.తత్వం తెలిస్తే దేవుడెక్కడో లేడు,తనలోనే ఉన్నాడట.మన మాటలు మంచివైతే పగవారైనా మనకు చుట్టాలే అవుతారట.ఉత్సహించి ఉపదేశిస్తే జ్ఞానోదయమే(చీకటిల్లు వెలుగు)అవుతుంది.
నేర్పుతో బ్రతకటం తెలిస్తే భూమిమీద యెక్కడైనా బ్రతికేయొచ్చు.ఓర్పుగా ఉంటే తన పంతము దానికదే నెరవేర్తుంది.మాటిమాటికి ప్రార్ధిస్తే చివరికి రాయైనా కరుగుతుంది.వూరకే గుట్టుగా ఉంటే చాలు మనం మన ఊరిలోవారందరికంటే ఎక్కువే.
అలవాటు చేసికొంటే వలపంతా స్థిరమౌతుంది.వేడుకగా నుంటే వెనకటిదే ముందునకౌతుంది.సాటిలేని శ్రీవేంకటేశ్వర స్వామిని కొలిస్తే గింజ పట్టని జొన్నకర్ర సైతము పూర్తిగా ఫలిస్తుంది.(అన్నిపనులూ చక్కబడతాయన్నమాట)

0 comments

Oct 28, 2008

ఆరగింపవో మాయప్ప యివే

కాంభోజి
ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును IIపల్లవిII

తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరులును నురుగులు వడలును
పానకములు బహు ఫలములును. IIఆరII

పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెఁగలు
పరిపరివిధముల భక్ష్యములు. IIఆరII ౬-౪

కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొను నప్పాలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును. IIఆరII

కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరానియంబాళపుఁగాయలు
నాయతమగు దధియన్నములు. IIఆరII

ఒడికపుఁగూరలు నొలుపు బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా. IIఆరII

వెన్నట్లు
నురుగులు
నవుగులు
ఖండమండెగఁలు
అప్పాలు
సుకినప్పాలు
అంబాళపుఁగాయలు
రాజాన్నములు
ఈ పై పదార్ధాలన్నీ నేనెప్పుడూ రుచి చూచినట్లు లేదే.
శ్రీ వేంకటరమణునికి ఈ దీపావళి సందర్భముగా అన్నమయ్య పెట్టిన నైవేద్యం.

0 comments

Oct 26, 2008

విన్నపాలు వినవలె వింత వింతలు

Get this widget | Track details | eSnips Social DNA


భూపాళం
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా. IIపల్లవిII

తెల్లవాఱె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదివో వారె
చల్లని తమ్మిరేకుల సారస్యపుఁ గన్నులు
మెల్ల మెల్నె విచ్చి మేలుకొనవేలయ్యా. IIవిన్నII

గరుడ కిన్నర యక్ష కామినులు గములై
నిరహపు గీతముల వింతతాళాల
పరిపరివిధములం బాడేరు రాగాల నిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా. IIవిన్నII

పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీపాదాలు చేరి
అంకెల నున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుఁడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా.IIవిన్నII ౬-౨౫

0 comments

Oct 25, 2008

పెరిగినాఁడు చూడరో పెద్దహనుమంతుఁడు

Get this widget | Track details | eSnips Social DNA


సాళంగనాట
పెరిగినాఁడు చూడరో పెద్దహనుమంతుఁడు
పరగి నానావిద్యల బలవంతుఁడు. IIపల్లవిII

రక్కసులపాలికి రణరంగశూరుఁడు
వెక్కసపుయేకాంగవీరుఁడు
దిక్కులకు సంజీవిదెచ్చిన ధీరుఁడు
అక్కజమైనట్టి యాకారుఁడు. IIపెరిగిII

లలిమీరినయట్టిలావుల భీముఁడు
బలుకపికులసార్వభౌముఁడు
నెలకొన్న లంకానిర్ధూమధాముఁడు
తలంపున రామునాత్మారాముఁడు. IIపెరిగిII

దేవకార్యముల దిక్కు వరేణ్యుఁడు
భావింపఁగఁ దపఃఫలపుణ్యుఁడు
శ్రీవేంకటేశ్వరు సేవాగ్రగణ్యుఁడు
సావధానుఁడు సర్వశరణ్యుఁడు. IIపెరిగిII

0 comments

Oct 24, 2008

ఇంకనేల వట్టిజోలి యిందులోనే వున్నది

మాళవిగౌళ
ఇంకనేల వట్టిజోలి యిందులోనే వున్నది
తెంకినే ఆపెకిన్నియుఁ దెలుపఁగరాదా. IIపల్లవిII

కన్నుచూపే(పులే)వాండ్లైతే కడునొడ్డించుకొనేది
వెన్నెలలే వేండ్లైతే విచారమేది
కన్నె నిన్నడుగుమనెఁ గరుణించి యిఁకను మా
విన్నపము వినాడకు విచ్చేయరాదా IIఇంకII

నవ్వులే నాములెక్కితే నయమైన మందులేవి
పువ్వులే పోటుకువస్తే బుద్ధులేవి
జవ్వనిట్టె ఆడుమనె సముకమే యిద్దరికి
దవ్వులేల యించుకంత దగ్గరి రారాదా IIఇంకII

చల్లగాలి పగలైతే సందిమాటలిఁక నేవి
వల్లెతాడు వలపైతే వద్దననేది
ఇల్లి దె శ్రీ వేంకటేశ యింతి నీకుఁ జెప్పించె
లొల్లిఁ గూడితివిఁకను లోననుండరాదా. IIఇంకII ౭-౩౯౯


వినాడకు=విని+ఆడకు

0 comments

Oct 17, 2008

ఒరయుచు నురమున నునిచితివీకె నీవు

వరాళి
ఒరయుచు నురమున నునిచితివీకె నీవు
అరయఁ గాంతారత్న మన్నిటాఁ గనక IIపల్లవిII

మాటలాడి చూచితేనే మంచి వైదూర్యూలు రాలీ
గాటపుఁ జూపుల మాణికాలు రాలీని
మూటగాఁగ నవ్వితే ముత్యాలు రాలీని
కూటువ నీసతి రత్నకోమలి గనక. IIఒరయుII

బడినడుగడుగుకుఁ బద్మరాగములు రాలీ
జడిసి పొలసినఁ బచ్చలు రాలీని
పడతి చేవిసరినఁ బగడాలు రాలీని
నడుమ నీసతి యంగనామణి గనక. IIఒరయుII

కుంకుమచెమటల గోమేధికాలు రాలీని
సంకుగోరికొన వజ్రాలు రాలీని
పొంకపుఁ బుష్యరాగాలు పొంగీ నీకూటమిని
ఇంక శ్రీవేంకటేశ నీయింతి రత్నాంగి గాన. IIఒరయుII ౭-౩౧౪

పరీక్షించి ఆపెను నీవు నీ వక్షస్థలమునందే ఉంచుకొన్నావు, ఎందుకంటే ఆబిడ అన్నిటా కాంతారత్నం కనక.
ఆమె మాట్లాడి చూస్తేనే మంచి వైఢూర్యాలు రాలేవి.ఆమె కంటిచూపుకే మాణిక్యాలు రాలేవి.ముద్దులు మూటకడుతూ ఆమె నవ్వితే మత్యాలే రాలేవి.ఎంచేతనంటే నీ సతి రత్నకోమలి కనక.
ఆమె నడబడితే అడుగడుక్కూ పద్మరాగాలే రాల్తాయి.ఆమె జడుపుతో సమీపిస్తే పచ్చలే రాల్తాయి.ఆవిడ చేయి విసరితేనే పగడాలు రాల్తాయి.ఎందుకంటే నీ సతి అంగనామణి కనక.
ఆవిడ ధరించిన కుంకుమచెమటలకు గోమేధికాలే రాల్తాయి.శంఖమువంటి ఆమె గోరికొన నుండి వజ్రాలే రాల్తాయి.నీతో పొందులో పుష్యరాగాలే పొంగుతున్నాయి.ఎంచేతంటే నీ యింతి రత్నాంగి కనక.

2 comments

అవధరించఁగదయ్య అన్ని రసములు నీవు

శంకరాభరణం
అవధరించఁగదయ్య అన్ని రసములు నీవు
తివురుచు నబ్బెనిదె తేనెమోవి రసము IIపల్లవిII

చెలియ చక్కఁదనాన శృంగార రసము
వెలయ బొమ జంకెనల వీర రసము
కలయు రతి కాంక్షలను కరుణా రసము
అలరు మై పులకలను అద్భుత రసంబు. IIఅవII

తరుణి సరసములను తగు హాస్యరసము
పరుషంపు విరహాన భయ రసంబు
బెరయు నిబ్బరములను బీభత్స రసము
గరిమ మరుయుద్ధాన ఘన రౌద్ర రసము. IIఅవII

వనిత ఆనందముల వడి శాంత రసము
ననుపుమంతనములను నవ రసములు
యెనలేని వేంకటేశ నీతోఁ గూడి
దినదిన వినోదాల తిరమాయ రసము. IIఅవII ౭-౪౨౩

0 comments

Oct 16, 2008

ఇందులోపలఁ దనకు నెందువారమె నేము

శంకరాభరణం
ఇందులోపలఁ దనకు నెందువారమె నేము
అందంబుగానతని నడుగరె చెలులు. IIపల్లవిII

తగులు గలిగినయడల తమకమింతయు నమరు
నగినయడలను మిగుల నటనలమరు
తెగువ గలిగినయడల తేఁకువలు గడునమరు
మొగమోట గలయెడల మోహంబులమరు. IIఇందుII

మనసులెనసినయెడల మాటలన్నియు నమరు
ననుపు గలిగినయడల నయములమరు
చనవు గలిగినయడల సరసమంతయు నమరు
పెనకువలు గలయడల ప్రియములును నమరు. IIఇందుII

కూడియుండెటియడల గుఱుతులిన్నియు నమరు
వాడికలు గలయడల వలపులమరు
యీడనే శ్రీవేంకటేశుఁడిటు ననుఁ గూడె
వేడుకలు యీయెడల వేవేలు నమరు. IIఇందుII ౭-౩౪


ఈ క్రింది చెప్పిన వారిలో,మేము-తనకు ఏరకానికి చెందినవారమో అందముగా అడగండే -అంటోంది అలమేలు
అభిలాష కలిగినచో ఇంత తమకమూ అమరుతుంది.నవ్వులు నవ్వినపుడు మిక్కిలియైన నటనలు అమరుతాయి.
తెగువ కలిగినపుడు ధైర్యములు వాటంతటవే అమరిపోతాయి.మొగమాటంతో నున్నపుడు మోహమెంతో అమరుతుంది.
--వీని లోపల మేము ఏ రకానికి చెందుతామో చెప్పమంటుంది.
మనసులు కలిసినవేళ మాటలన్నీ అమరుతాయట.అనురాగమున్నచోట స్నేహాలమరిపోతాయి.చనవున్నచోట సరసాలన్నీ అమరుతాయి.
కలయికలు గలచోట ప్రియములూ అమరుతాయి.--వీని లోపల మేము ఏ రకానికి చెందుతామో చెప్పమంటుంది.
కూడిఉన్నచోటులలో ఇన్ని గురుతులూ అమరుతాయట.వాడికలున్నచోట వలపులూ అమరుతాయి.ఇక్కడే శ్రీవేంకటేశ్వరుడు నన్ను కూడి ఉన్నాడు. యీవేళప్పుడు వేడుకలు వేనవేలుగా అమరుతాయి.--వీని లోపల మేము ఏ రకానికి చెందుతామో చెప్పమంటుంది.
అమరు--అనే మాట ఎన్నెన్ని రకాలుగా ఎంతందంగా ఈ కీర్తనలో అమరిందో చూడండి.

1 comments

Oct 15, 2008

భావమెరఁగనివారు పచ్చెందురుగాని గోరు

గుండక్రియ
భావమెరఁగనివారు పచ్చెందురుగాని గోరు
తావులెరిఁగితే సురతపుసొమ్ముగోరు. IIపల్లవిII

అలిగినవేళలనంటకుండాఁ జిమ్ము గోరు
వలపు నిలుపరాక వడిఁజాఁచేదొక గోరు
చలపట్టి వేరొకతె జగడము దీసే గోరు
బలిమి పంతాన కుపకరించేది గోరు. IIభావII

శిరసు వంపులలోని సిగ్గులు వాపేది గోరు
సరిఁ బరవశములెచ్చరించు గోరు
వొరసితే గురిసేసు నుబ్బుఁగవణపు గోరు
సరసమాడేవేళ చవిరేఁచు గోరు. IIభావII

సమ్మతించకుంటేఁ దాఁకి జంటకు లోఁజేసు గోరు
పమ్మి మనసుకుఁ జలివాపు గోరు
దిమ్ముల వయోమదము తెలియని సాక్షి గోరు
కొమ్మ శ్రీవేంకటేశుతోఁ గూడే యిక్కువ గోరు. IIభావII ౭-౧౫౭


గోరు యొక్క వివిధ ఉపయోగములను అందంగా చెప్పే సంకీర్తన యిది.
అర్ధం తెలియని వారు గోరును పచ్చంటారు(?) గాని ఉపయోగించే తెరవులు తెలిస్తే గోరు సురతానికి చక్కని సొమ్ము అని తెలుసుకుంటారు.
గోరు--ప్రియునిపై అలిగినవేళలో తననతడు అంటకుండా చిమ్మేది,వలపును నిలుపుకోలేని వేళలలో తొందరగా చాచేదీ,మాత్సర్యముతో నున్న వేరొకతె జగడము తీర్చేదీ,బలిమిని పంతమున కుపకరించేదీ,--గోరే.
అలాగే గోరు--శిరసు వంపులలోని సిగ్గులను పోగొట్టేదీ,పరవశమొంది నపుడు సరియైన సమయంలో హెచ్చరించేదీ,వొరసితే గురి సేసు నుబ్బుఁగవణము గోరు(దీనికి అర్ధము తెలియలేదు),సరసమాడే వేళల్లో రసాన్ని పెంచేదీ,-గోరు.
సమ్మతించకుండా ఉన్నపుడు తాకుట ద్వారా ఇద్దరూ జంటగా అయ్యేలా చేసేదీ,మనసుకు చలిని పోగొట్టేదీ,మత్తులో వయోమదము తెలియని సాక్షిగా వుండేదీ, పడతి శ్రీవేంకటేశుతో కూడే యిక్కువను కలిగించేదీ -గోరు. గోళ్ళ కింత కథ ఉందన్నమాట.

0 comments

Oct 13, 2008

చిత్తగించు మామాఁట శ్రీ నరసింహా

నాదరామ క్రియ
చిత్తగించు మామాఁట శ్రీ నరసింహా
చిత్తజ జనక వో శ్రీ నరసింహా. IIపల్లవిII

చెలరేఁగి వున్నాఁ డవు శ్రీ నరసింహా -నీకు
జెలులెల్లా మొక్కేరు శ్రీ నరసింహా
సెలవుల నవ్వేవిట్టే శ్రీ నరసింహా - నీకే
నెలవు మా వలపులు శ్రీ నరసింహా. IIచిత్తII

చిందీని మైఁ జెమటలు శ్రీ నరసింహా - నిన్ను
జెందినది కడు జాణ శ్రీ నరసింహా
చెందమ్మి రేకులగోళ్ళ శ్రీ నరసింహా - నీపై
చిందులెల్లాఁ బాడేము శ్రీ నరసింహా . IIచిత్తII

సిరి నెరకాఁ గిటి శ్రీ నరసింహా - మంచి
సిరుల నహోబలము శ్రీ నరసింహా
శిరసెత్తు శ్రీ వేంకట శ్రీ నరసింహా
చెరలాటాలిఁకనేల శ్రీ నరసింహా. IIచిత్తII ౭-౪౯౫

2 comments

Oct 11, 2008

చెలియకు విరహపు వేదన సేయని సింగారంబిది

నాదరామక్రియ
చెలియకు విరహపు వేదన సేయని సింగారంబిది
సొలవక వలపుల ముద్రల చొప్పులు మాపకుఁడీ. IIపల్లవిII


కిక్కిరిసిన చనుగుబ్బలు గీఁటిన బగిలెడి నయ్యో

పక్కనఁ గనుకలి దాఁకీఁ బయ్యెద దెరవకుఁడీ

వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరుఁగై తోఁచెడి

చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుఁడీ. IIచెలిII

అంగన మేనికిఁ బులకలు అడ్డము దోఁచెడి నయ్యో

బంగరు మొలకలవంటివి పైపైఁ దుడువకుఁడీ

తొంగలి రెప్పల కెలఁకుల తొరిగెడి కన్నుల మెరుఁగుల

ముంగిట వేసిన చూపుల మురిపెము మానుపుడీ. IIచెలిII


తిరువెంకటపతినింతికిఁ దెచ్చెదమనఁగా నయ్యో

కరుణించినవాఁడాతడె కళవళమందకుఁడీ

తరుణీమణి మా దేవునిఁ గౌఁగిట సౌఖ్యంబుల

పరవశమందినదేమో పలుమరుఁ బిలువకుఁడీ IIచెలిII ౫-౮౦

0 comments

Oct 4, 2008

తలఁచిన దేహము నిలువదు తాననుఁ దలఁచునొ తలఁచఁడొ

అమరసింధు
తలఁచిన దేహము నిలువదు తాననుఁ దలఁచునొ తలఁచఁడొ
వలనుగఁ జెలిమాటలు విని వచ్చీనో రాఁడో IIపల్లవిII

శిరసున నంటిన పునుఁగిటు చెక్కుల జారెడిననుచును
ఉరవడిఁ దివియుచుఁ గొనగోరూఁదిన చందములు
మురిపెపు మొలనూళులపై మొగపుల సొబగులు చూచుచు-
నరుదుగ గరమున నక్కడ నంటెడి యాసలును IIతలచిII


చెనకుల వీడెపురసమిదె సెలవులఁ జెదరెడి ననుచును

నునుపగు గోళుల వాతెర నొక్కిన చందములు

పెనగొను ముత్యపు సరముల పెక్కువ దీర్చెదననుచును

చనువునఁ జనుఁగవపైఁ జే చాఁచిన చందములు IIతలచిII

వుద్దపు నడపులలోపల నొయ్యన పాదము జారిన-
నొద్దికతో నునుఁగౌఁగిట నొరసిన చందములు

నిద్దపుఁ దిరువేంకటగిరినిలయుఁడు ననుఁ దనకౌఁగిట-

నద్దిన కస్తురిచెమటల నలమిన చందములు। IIతలచిII ౫-౩౬౦

ఎంత సొగసైన సంకీర్తన!
తను ఆయనను తలచుకుంటేనే తన దేహము పరవశిస్తుందట! తాను నన్ను తలుస్తున్నాడో లేడో!నేర్పుగా చెప్పే చెలి మాటలు విని,.. వస్తాడో!..రాడో!
తలమీద అంటిన పునుగు చెక్కిళ్ళమీదుగా జారుతుంటే వాటి వేగాన్నాకర్షిస్తూకొనగోటితో ప్రక్కకు ఊదిన విధములు,
మురిపాల మొలతాళ్ళపై ధరించిన హారాదుల ముఖభాగముల సొగసులు చూస్తూ ఆశ్చర్యంగా చేతితో అక్కడ తాకే అపేక్షలను-- తలచిన దేహము నిలువదు
బుగ్గలలో నిండిన తాంబూలరసము పెదవులనుండి జారునపుడు క్రింది పెదవిని నునుపైన గోళ్ళతో సుతారముగా నొక్కిన చందములు, వక్షస్థలముపై చిక్కుపడిన హారముల చిక్కులను వేరుపరచు నెపముతో చనువుగా చనుదోయిపై చేతిని చాచిన చందములు---తలచిన దేహము నిలువదు
తొందరపాటుతో నడచినపుడు ఒడుపుగా పాదము జారినపుడు, నేర్పుతో తన కౌగిట అదిమిన చందములు, స్నేహముతో తిరువేంకటనిలయుడు నన్ను తన కౌగిట చేర్చగా అద్దిన కస్తురి చెమటలతో అలమిన చందములు--- తలచిన దేహము నిలువదు.

2 comments

Sep 23, 2008

ఇట్టిముద్దులాఁడిబాలుఁ డేడవాఁడు వానిఁ

Get this widget | Track details | eSnips Social DNA



దేవగాంధారి
ఇట్టిముద్దులాఁడిబాలుఁ డేడవాఁడు వానిఁ
బట్టితెచ్చి పొట్టనిండఁ బాలు పోయరే IIపల్లవిII

గామిడై పారితెంచి కాఁగేటివెన్నలలోన
చేమపూవుకడియాలచేయి వెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిటఁ గన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే IIఇట్టిII

ముచ్చువలె వచ్చి తనముంగై మురువులచేయి
తచ్చేటిపెరుగులోనఁ దగఁ బెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరనెల్లఁ జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే IIఇట్టిII

యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టెలోన
చెప్పరానివుంగరాల చేయి వెట్టీ
అప్పఁ డైన వేంకటేశుఁ డాసపాలకుఁడు గాన
తప్పకుండ పెట్టె వానితల కెత్తరే IIఇట్టిII ౫-౧౪౮

1 comments

Sep 13, 2008

ఉగ్గు వెట్టరే వోయమ్మా చెయ్యొగ్గీనిదె

Get this widget | Track details | eSnips Social DNA


భైరవి
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె-
య్యొగ్గీనిదె శిశువోయమ్మా। IIపల్లవిII

కడుపులోని లోకమ్ములు గదలీ-
నొడలూఁచకురే వోయమ్మా
తొడికెడు సరుగనఁ దొలఁగఁదీయరే
వుడికెడి పాలివి వోయమ్మా IIఉగ్గుII

చప్పలు వట్టుక సన్నపు బాలుని-
నుప్పరమెత్తకురో యమ్మా
అప్పుడె సకలము నదిమీ నోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా IIఉగ్గుII

తొయ్యలులిటు చేతుల నలఁగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్యమాటలను కొండల తిమ్మని-
నొయ్యన తిట్టకురోరమ్మా. IIఉగ్గుII

1 comments

Sep 12, 2008

పలుకుఁ దేనియల నుపారమియ్యవే

ముఖారి
పలుకుఁ దేనియల నుపారమియ్యవే
అలరువాసనల నీ యధరబింబానకు. IIపల్లవిII

పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే
చక్కని నీవదనంపు చందమామకు
అక్కరొ నీవాలుగన్ను లారతిగా నెత్తవే
గక్కన నీచెక్కు తొలుకరి మెరుపులకు. IIపలుకుII

కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే
వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు
చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము
దిమ్మరి నీమురిపెపు తీగమేనికి. IIపలుకుII

పతి వేంకటేశుఁగూడి పరవశమియ్యవే
యితవైన నీమంచి హృదయానకు
అతనినే తలఁచగ నానతియ్యఁ గదవె

తతితోడ నీలోని తలపోఁతలకు. IIపలుకుII

2 comments

Sep 1, 2008

ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను

శ్రీమతి శోభారాజుగారి పాట ఇక్కడ వినండి

Get this widget | Track details | eSnips Social DNA

నాదరామక్రియ
ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా. IIపల్లవిII

కలికి చకోరాక్షికిఁ గడకన్నులుఁ గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువునఁ బ్రాణేశ్వరుపై నాఁటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా. IIఏమొII

పడఁతికి చనుఁగవ మెఱుఁగులు పైపైఁ బయ్యెద వెలుపల
కడు మించిన విధమేమో కనుఁగొనరే చెలులు
ఉడుగని వేడుకతోఁ బ్రియుఁ డొత్తిన నఖ శశి రేఖలు
వెడలఁగ వేసవికాలపు వెన్నెల గాదు గదా. IIఏమొII

ముద్దియ చెక్కుల కెలఁకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపుఁ జెమటల అందము గాదు గదా। IIఏమొII ౫-౮౨

ఈ సంకీర్తన నాకు చాలా బాగా నచ్చిన సంకీర్తనలలో ఒకటి।
ఏమొకొ(ఏమి+ఒకొ)=సందేహాస్పదమై,ఆశ్చర్యాన్నీ కలిగించే విషయాన్ని గురించి చెప్పేటప్పుడు వాడే పదబంధం।
చిగురువలె లేతదైన క్రింది పెదవిమీద అక్కడక్కడా కస్తూరి నిండెను (కస్తూరి అంటెను అనటం లేదు-నిండెను అంటున్నాడు) అంటే కస్తూరికా ముద్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట।ఆ కస్తూరికా ముద్రలు ఎలా ఉన్నాయటా? భామిని(దేవేరి) విభునకు(శ్రీవేంకటేశ్వరునకు) వ్రాసి పంపించిన ప్రేమలేఖ కాదు గదా అన్పించేట్టుగా ఉన్నాయటా కస్తూరికా ముద్రలు।
చకోరాక్షి యైన యీ కలికి కంటిచివరలు కెంపురంగులో ప్రకాశిస్తున్నాయట।దానికి కారణం ఏమైవుంటుందో వూహింపరె చెలులు। ఇలా అని చెలులు తమలోతాము అనుకొంటున్నట్లుగా చేసిన అందమైన ఊహ ఈ సంకీర్తనం।ప్రాణేశ్వరుని అంకసీమను ఒప్పిదముగా నాటిన దేవేరి యొక్కఆ కొనచూపులు(కంటి చివరిచూపులు) నిట్టనిలువునా పెరికివేయగా (వెనక్కు తీసుకోగా) ఆ చూపులకు అంటిన నెత్తురు కాదుగదా అనిపిస్తోందట।--ఎంత అందమైన ఊహ!
ఆ దేవేరికి చనుగవ మీద ప్రకాశించే చంద్రకాంతి మెఱుగులు పయ్యద వెలుపలికి కడుమించి కనుపిస్తున్న తీరు ఏవిధమైనదో, చెలులారా! కనుక్కోండే!...తొలగని లేక తక్కువకాని వేడుకతో ప్రియుడు చనుగవ మీద ఒత్తగా ఏర్పడిన చంద్రవంకల్లాంటి గోళ్ళ గుర్తులావిధంగా బయటకు ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయట।పైగా ఆ ప్రకాశం చూడగా చూడగా వేసనికాలపు వెన్నెల కాదుగదా అన్పిస్తోందట।--ఎంత అందమైన పోలిక?
ఆ ముద్దియ చెక్కిళ్లప్రక్కల చేర్చబడిన ముత్యాల జల్లుల అందములు ఎలా ఉన్నాయో ఊహించండే అని ఒకరు ఇంకొకరితో అంటున్నారట।ఆ ముత్యాల జల్లులు ఇంకోటీ ఇంకోటీ కాదట। శ్రీ వేంకటేశ్వరుడు కామిని ముఖపద్మం మీద అద్దిన రతికాలపు చెమటచుక్కల అందము కాదుగదా అని ఆశ్చర్యపడుతున్నారట।-- పరాకాష్ట.

1 comments

Aug 25, 2008

పురాణపురుషుఁడు భువి నవతరించెను

ప్రతాపనాట
పురాణపురుషుఁడు భువి నవతరించెను
సిరుల జయంతి నేఁడు సేయరో పండుగలూ IIపల్లవిII

శ్రావణబహుళాష్టమిఁ జందురుఁ డుదయించెను
ఆవేళ రోహిణిని అద్దమరాతిరికాడ
దేవకి కృష్ణునిఁ గాంచె దేవతలు నుతియించ
చేవ దేరెఁ బనులెల్లా సేయరో పండుగలూ IIపురాణII

నందుని మందకు నేఁగినాఁడే వసుదేవుఁడు
కందువఁ గృష్ణు నెశోదకడఁ బెట్టి మాయఁ దెచ్చి
యిందమని కంసుచేతి కిచ్చితే మాయాదేవి
చెంది విడిపించుకొనె సేయరో పండుగలూ IIపురాణII

చిన్నకృష్ణుఁడై పెరిగి చేరి కంసుఁ బొరిగొని
యెన్న శ్రీవేంకటేశుఁడై ఇందరిఁ గాచీ నిట్టె
వున్నది యలమేల్మంగ వురమున నితనికి
చెన్నుమీఱి దాసులెల్ల సేయరో పండుగలూ IIపురాణII ౧౨-౩౮౩

అన్నమయ్య శ్రీకృష్ణజయంతిని పురస్కరించుకొని పలికిన ఎన్నో సంకీర్తనలలో ఇది ఒకటి.ఈ సంకీర్తన భావం సులభంగానే అందరికీ అర్థమౌతుంది.ఈ రోజు రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్న జన్మాష్టమి సందర్భంగా దీనిని ఉదాహరించటం యుక్తియుక్తంగా ఉంటుందనిపించింది. ఈ సంకీర్తనతో నా మూడు బ్లాగులు కలిపి 100 పూర్తి కావడం నా భాగ్యం గా తలుస్తాను.

0 comments

Jul 30, 2008

నీ వంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా

సామంతం
నీ వంటి సతులతో నెయ్యమాతఁడు చూపఁగా
ఆవలి మోమై యుందానవారడింత గలదా IIపల్లవిII

సిగ్గున నుందానవో చింతతోనుందానవో
సిగ్గుకుఁ జింతకు సాక్షి చెక్కిటిచేయే
దగ్గరి నీరమణుఁడు తమకించి పిలువఁగ
అగ్గలమయ్యేవదేమే ఆఱడింత గలదా. IIనీవంటిII

మాయలు సేసేవో మంతనాననుందానవో
మాయకు మంతనానకు మంచమే సాక్షి
చేయివట్టి యాతఁడు నీచింతదీరఁ దియ్యగాను
ఆయాలు దాకఁ దొబ్బేవు ఆఱడింత గలదా IIనీవంటిII

కరుణ నీకుఁ బుట్టెనో కాఁకలు నీకు ముంచెనో
కరుణకుఁ గాఁకలకు కాఁగిలే సాక్షి
అరుదై శ్రీవేంకటేశుఁడట్టె నిన్నుఁ గలసెను
అగమగచేవు మేను ఆఱడింత గలదా. IIనీవంటిII


అన్నమయ్య కీర్తనలలో సొగసులు అంతకంతకూ ఇనుమడిస్తాయే కాని ఒకంతట తనివి తీరడవంటూ ఉండదు.

నీలాంటి ఇతర సతులతో ఆతడు స్నేహాన్ని చూపిస్తే ఆవలి దిక్కునకు మొఖము తిప్పుకున్నావేమే!ఇంత ఆరడెక్కడైనా వుందా?(ఉండదా మరి)
సిగ్గుతో నున్నావో చింతతో ఉన్నావో మాకు తెలియటం లేదు.సిగ్గుకూ చింతకూ కూడా చెక్కిటి మీదున్న నీ చెయ్యే సాక్షి.
నీ దగ్గరికి చేరి నీరమణుడు తమకంతో పిలువంగా ఇంత అగ్గలమయ్యేవదేమే!ఇంత ఆరడా?
మాయలు చేసేవో మంతనాన నుందానవో తెలియదు.మరి మాయకూ మంతనానికీ కూడా మంచమే సాక్షి.నీ చేయి పట్టుకొని ఆతడు నీ చింత తీరుద్దామని అనుకుంటూంటే మర్మాలు తాకేలా దొబ్బుతున్నావేటే!ఇంత ఆరడా?
నీకు కరుణే పుట్టిందో కాఁకలే(తాపాలే) నిన్ను ముంచాయో తెలియదు.కరుణకూ, కాఁకలకూ కూడా కాఁగిలే కదా సాక్షి.
అరుదై శ్రీ వేంకటేశుడిట్టె నిన్ను కలసేడు.శరీరాన్నే అరమరచి పోయావే!ఇంత ఆరడెక్కడన్నా వుందా?
ఎంత అందమయినదీ కీర్తన.ఇటువంటి అందచందాలు ఎన్నో ఎన్నెన్నో....

0 comments

Jul 29, 2008

ఓహో యంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి

బౌళి
ఓహో యంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపుగుణములచతురుఁడా యితఁడు. IIపల్లవిII

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జలనిధికన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నీఁది జలనిధి మథియించి
జలధి వెరించిన (వెరిఁజిన?) చలమరా యితడు. IIఓహోII

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణిభారము దించి
ధరణీధరుఁడైన దైవమా యితఁడు. IIఓహోII

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండవంటిదేవుడైనకోవిదుఁడా ఇతడు. IIఓహోII ౪-౩౯౩

చాలా సొగసైన సంకీర్తన.
ఓహో ఎంతటివాడే!మనవద్దనే వున్నవాడేనే యీ హరి! ఇతడు సాహసపు గుణములు కలిగిన చతురుడటే!
జలధి(సముద్రము)లో పవళించి(సృష్టి మొదటిలో),జలనిధిని(సముద్రాన్నే)బంధించి(రామావతారంలో),జలనిధికన్యక(లక్ష్మీ దేవి)ని తగ పెండ్లాడి,జలనిధిలో నీది(మత్స్యావతారం),జలనిధి మథియించి(కూర్మావతారం),జలధి వెరించిన(?)చలమరే యితడు.

ధరణికి మగడై(?),ధరణి కుంగగా ఎత్తిపట్టి(?),ధరణికూతుర్ని తానే పెండ్లాడి(రామావతారము),ధరణి పాదము మోపి(వామనావతారం?),ధరణి భారము దించి(పరశురామావతారం?),ధరణీధరుడైన(వరాహావతారం) దైవమా యితడు.
కొండ గొడుగుగా ఎత్తి(కృష్ణావతారం),కొండకు రంధ్రమయ్యేట్లుగా నేసి(?),కొండకింద కుదురుగా కూర్చుండి(కూర్మావతారం),శ్రీ వేంకటాద్రి కొండపై కోనేటిరాయడై కొండవలె అండగానుండే కోవిదుడా యితడు.

5 comments

తిరువీధుల మెరసీ దేవదేవుఁడు

శ్రీరాగం
తిరువీధుల మెరసీ దేవదేవుఁడు
గరిమల మించిన సింగారములతోడను. IIపల్లవిII

తిరుదండెలపైనేఁగీ దేవుఁడిదే తొలునాఁడు
సిరుల రెండవనాఁడు శేషునిమీఁద
మురిపేన మూఁడోనాఁడు ముత్యాలపందిరిక్రింద
పొరి నాలుగోనాఁడు పువ్వుఁగోవిలలోను. IIతిరుII

గక్కన నయిదవనాఁడు గరుడునిమీఁదను
యెక్కెను ఆరవనాఁడు యేనుగమీఁద
చొక్కమై యేడవనాఁడు సూర్యప్రభలోనను
యిక్కువఁ దేరును గుఱ్ఱమెనిమిదోనాఁడు. IIతిరుII

కనకపుటందలము కదిసి తొమ్మిదోనాఁడు
పెనచి పదోనాఁడు పెండ్లిపీఁట
యెనసి శ్రీ వేంకటేశుఁడింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీఁదను. IIతిరుII ౭-౧౯౨

అన్నమయ్య బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుడు తిరువీధులలో ఊరేగే క్రమాన్ని తెలియజేస్తున్నాడు.
గొప్పతనములతో మించిన సింగారాలతో దేవదేవుడు తిరువీధులలో తిరిగేడీ విధంగా.
మొదటి రోజు పల్లకీ బొంగులమీద దేవుడూరేగాడు.రెండవనాడు లక్షీదేవితో శేషునిమీద ఊరేగాడు.మురిపెంగా మూడోరోజు ముత్యాల పందిరిక్రింద ఊరేగాడు.క్రమముగా నాలుగవరోజు పుష్ప వాహనం మీద ఊరేగాడు.గక్కన ఐదవనాడు గరుడునిమీద ఊరేగాడు.ఆరవనాడు ఏనుగెక్కి ఊరేగాడు.ఏడవరోజు సూర్యప్రభ వాహనంలో అందంగా ఊరేగాడు.ఎనిమిదో రోజు అశ్వ వాహనంమీద ఊరేగాడు.బంగారు తేరుమీద తొమ్మిదోనాడు ఊరేగింపుగా వెళ్ళాడు.పదోరోజు పెండ్లిపీట మీద కూర్చున్నాడు.శ్రీవేంకటేశ్వరుడీవిధంగా పది రోజుల్లో పది వాహనాలమీద తిరువీధుల్లో యింతి అలమేల్మంగతో కలసి ఊరేగాడు.ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో నేటికీ ఈ ఊరేగింపులు ఆవిధంగానే జరుగుతూ వస్తున్నాయి.టివి ప్రత్యక్ష ప్రసారాల కారణంగా ఈ వైభవాన్ని మనం మన యిండ్లల్లో కూర్చునే చూడగలుగుతున్నాం.అంతే కాదు.ఈ ఊరేగింపులతో పాటుగా ప్రసారమయ్యే అన్నమయ్య అందమైన సంకీర్తనలను మధురమైన స్వరాలతో ప్రముఖ సంగీతకారులు గానం చేస్తుంటే ఆ ఉత్సవ సంబరాలను తిలకించటం అదో భాగ్యంగా అనిపిస్తుంది నామటుకు నాకు.

4 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks