ముఖారి
పలుకుఁ దేనియల నుపారమియ్యవే
అలరువాసనల నీ యధరబింబానకు. IIపల్లవిII
పుక్కిటి లేనగవు పొంగుఁబాలు చూపవే
చక్కని నీవదనంపు చందమామకు
అక్కరొ నీవాలుగన్ను లారతిగా నెత్తవే
గక్కన నీచెక్కు తొలుకరి మెరుపులకు. IIపలుకుII
కమ్మని నీమేని తావి కానుకగా నియ్యవే
వుమ్మగింత చల్లెడి నీవూరుపులకు
చిమ్ముల నీచెమటలఁ జేయవే మజ్జనము
దిమ్మరి నీమురిపెపు తీగమేనికి. IIపలుకుII
పతి వేంకటేశుఁగూడి పరవశమియ్యవే
యితవైన నీమంచి హృదయానకు
అతనినే తలఁచగ నానతియ్యఁ గదవె
తతితోడ నీలోని తలపోఁతలకు. IIపలుకుII
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
2 comments:
హరేకృష్ణ
హరే శ్రీనివాస!
Post a Comment