నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 21, 2010

మాతృభాషా దినోత్సవం - చుక్కగుర్తు పద్యాలు

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.--
చుక్క గుర్తు పద్యాలు
ఈరోజు మాతృభాషా దినోత్సవం. అందుకని చిన్నప్పుడు స్కూల్లో కంఠస్థం చేసిన చుక్కగుర్తు పద్యాలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నాను.

దుష్యంతుడు- శకుంతల ( శ్రీమదాంధ్ర మహా భారతము ) -నన్నయ
చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
క.
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
మధ్యాక్కర.
తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ
నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున.
చ.
విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాధ యీ పుత్త్రగా
త్త్రపరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూరసాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్ర జ్యోత్స్నయుం బుత్త్ర గా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.

గజేంద్ర మోక్షం - శ్రీమదాంధ్ర  భాగవతము -  బమ్మెర పోతన
ఉ.
ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వడు మూలకారణం
బెవ్వఁ డనాది మధ్య లయుఁ డెవ్వఁడు సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
క.
కలడందురు దీనులయెడఁ, గలఁ డందురు పరమయోగి గణములపాలం,
గలఁ డందు రన్ని దిశలను, గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో.
శా.
లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యెఁ , బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్ డస్సెన్ , శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెఱుఁగ, మన్నింపందగున్ దీనునిన్,
రావే యీశ్వర ! కావవే వరద ! సంరంక్షింపు భద్రాత్మకా !
మ.
అల వై కుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము " పాహి పాహి " యనఁ గు య్యాలించి సంరంభియై.
మ.
సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరఁ ఢభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి కాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
పరి చేలాంచన మైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహి యై.
మ.
తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వె
న్కను బక్షీంద్రుఁడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండుఁ దా వచ్చి రొ
య్యన వై కుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్
క.
అడి గెద నని కడువడిఁ జను, నడిగిన దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడఁబడ, నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.
వామనావతార ఘట్టం -- పోతన
క.
వెడ వెడ నడకలు నడచుచు, నెడ నెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడగన్
బుడి బుడి నొడువులు నొడువుచుఁ, జిడిముడి తడఁబడగ వడుగు సేరెన్ రాజున్.
ఉ.
స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు నుదారపద వ్యవహర్తకున్ మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు నిర్జరీ గళ
న్య స్త సువర్ణసూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్
మ.
వడుగా ! యెవ్వరివాఁడ వెవ్వఁడవు సంవాసస్థలం బెయ్య ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్
గడు ధన్యాత్ముఁడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నాకోరికల్
గడతేఱెన్ సుహుతంబు లయ్యె శిఖులుం గల్యాణ మి క్కాలమున్.
ఆ.
ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్లఁ
గోర్కెదీర బ్రహ్మ కూఁకటి ముట్టెద
దానకుతుకసాంద్ర ! ధానవేంద్ర !
క.
వ్యాప్తిం బొందక వగవక, ప్రాప్తం బగు లేశ మయినఁ బదివే లనుచున్
దృ ప్తిం జెందని మనుజుఁడు, సప్త ద్వీపముల నైనఁ జక్కం బడునే.
శా.
ఆశాపాశము దాఁ గడు న్నిడుపు లే దంతంబు రాజేంద్ర ! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా
మాశన్ బాయఁగనేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
ఆ.
వారిజాక్షులందు వైవాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగమందుఁ
జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప !
శా.
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బే రైనం గలదే శిబిప్రముఖలుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా !
శా.
ఆదిన్ శ్రీ సతి కొప్పుపైఁ దనువుపై నంసోత్త రీయంబుపైఁ
బాదాబ్జంబుల పైఁ గపోలతటిపైఁ బాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరం బుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.
ప్రహ్లాద చరిత్ర  -పోతన
క.
చదువనివాఁ డజ్జ్ఞుం డగుఁ, జదివిన స దస ద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ , జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ !
క.
అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్
తనయుల సంభాషణములు, జనకులకుం గర్ణ యుగళ స ద్భూషణముల్. 
సీ.
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకుఁ
బూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
తే.
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు
వినుతగుణశీల ! మాటలు వేయునేల ?
మ.
తను హృ ద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుఁ డై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా
సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
తే.
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభునీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
దండ్రి ! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
 
ఇంకా చాలా చాలా గుర్తుకొస్తున్నాయి. అన్నీ రాయాలంటే చాలా కష్టం . చివరగా మాతృ భాషా  దినోత్సవ సందర్భంగా నేను వ్రాసిన కవితతో దీన్ని ముగిద్దామనుకుంటున్నాను, చర్విత చర్వణమైనా గాని. అదిక్కడ చదవండి.
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

తెలుగు
లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్
తెలుగు మాట వినరండోయ్.

తెలుగే మన మాతృభాష
తెలుగే మన ఆంధ్రభాష.
తెలుగే మన జీవ శ్వాస
తెలుగే మన చేతి వ్రాత.

తెలుగే మన కంటి వెలుగు.
తెలుగే మన ఇంటి జోతి.

తెలుగే మన మూలధనం
తెలుగే మన ఆభరణం.

తెలుగును ప్రేమించుదాం
తెలుగును వినిపించుదాం
తెలుగును వ్యాపించుదాం.
తెలుగును రక్షించుదాం.

తెలుగుకు లేదోయ్ శాపం
తెలుంగు పలుకే మనదోయ్.

తెలుగన్నా, తెలుఁగన్నా,
తెనుగన్నా, తెనుఁగన్నా,
తెలియరొ అది తేనె వూట
తెలుపరొ ప్రతి పూట పూట.

తెలుగంటే నన్నయ్యా
తెలుగంటే తిక్కన్నే
తెలుగంటే పోతన్నా
తెలుగంటే శ్రీనాథుడు.

తెలుగంటే అల్లసాని
తెలుగంటే తెన్నాలే
తెలుగంటే సూరన్నే
తెలుగంటే రాయలెగా.

తెలుగంటే అన్నమయ్యా
తెలుగంటే త్యాగయ్యే
తెలుగంటే క్షేత్రయ్యా
తెలుగంటే రామదాసు.

తెలుగంటే ఎంకిపాట
తెలుగంటే జానపదం
తెలుగంటే బాపిరాజు
తెలుగంటే బ్రౌనుదొరా.

తెలుగంటే జంటకవులు
తెలుగంటే శ్రీశ్రీ శ్రీపాదే
తెలుగంటే పానుగంటి
తెలుగంటే విశ్వనాథ.

తెలుగంటే కందుకూరి
తెలుగంటే గురజాడ
తెలుగంటే గిడుగేరా
తెలుగంటే సీనారే.

తెలుగే పాపయ్యశాస్త్రి
తెలుగే గుఱ్ఱం జాషువ
తెలుగే వెంకటచలమూ
తెలుగేరా రావిశాస్త్రి
తెలుగే కాళీపట్నం.

తెలుగంటే మొక్కపాటి
తెలుగంటే ఆరుద్రా
తెలుగంటే ముళ్ళపూడి
తెలుగురమణ బాపుబొమ్మ.

తెలుగు మాట లొలుకు తేనె
తెలుగు సినిమ విశ్వనాథ
తెలుగు పాట కృష్ణశాస్త్రి
తెలుగు నోట ఘంటసాల.

తెలుగే శృంగార పదం
తెలుగే బంగారు రథం
తెలుగే శ్రీకృష్ణు మురళి
తెలుగే మన బాలమురళి.

అందుకే

తెలుగు లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్

9 comments:

అక్షర మోహనం said...

mee padyamaalika, telugutalli kanttana poolamaalika.

కామేశ్వరరావు said...

బావున్నాయండి. ఇవి మీకే కాదు తెలుగు పిల్లలందరూ కంఠస్థం చెయ్యాల్సిన చుక్క గుర్తు పద్యాలే!

Anonymous said...

వామనుడు పద్యాలు ఏదో తరగతిలో చదువుకున్నాము, అన్ని పద్యాలు బాగుంటాయి. గజేంద్రమోక్షంలో పద్యాలు మొదట విన్నవి ఆ తర్వాత బయట చదువుకున్నవి, మీరు ఉదహరించిన పద్యాలన్నీ బాగున్నాయి.

~సూర్యుడు

Nrahamthulla said...

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో ‘ఉపాధ్యాయులు’ వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. ‘ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు…చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష… భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది. – కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

చింతా రామ కృష్ణా రావు. said...

గృహాంతర వర్తినైయున్నందున నేను మాతృ భాషా దినోత్సవం సందర్భంగాఅభినందనలు తెలుప లేకపోయితిని.
మీరు మళ్ళీ మనం చదువుకొన్న పద్యాలన్నీ చక్కగా గుర్తింప జేసారు.
దానిపై అక్షయమోహనం గారు, శ్రీ కామేశ్వర రావుగారు, శ్రీ సూర్యుడు గారు, వారి ఆనందాన్ని తెలియ జేయగా శ్రీ నర్హన్తుల్లా గారు చేసిన వ్యాఖ్య అమోఘ్ం, అత్యద్భుతం.
వారి ఆవేదన కాదు కాదు మన అందరి ఆవేదనను వెలువరిస్తూ, సోదాహరణంగా తెలియఁజేసారు. మీకూ, వారికీ,నా హృదయ పూర్వక ధన్యవాదములు.

పరిమళం said...

మంచి పద్యాలు మననం చేసుకొనే అవకాశం కలిగింది .ధన్యవాదాలండీ !

Unknown said...

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు
నరసింహా రావు

మాలతి said...

మీబ్లాగులింకుకి ధన్యవాదాలు. అవునండి. ఇలా మనకి మనం గుర్తు చేసుకుంటున్నా మరికొందరికి ఇటు ఓ కన్ను పడొచ్చు. మీరు కొన్ని పద్యాలకయినా అర్థాలు ఇస్తే చదివి ఆనందించేవారు ఇంకా ఎక్కువ అవుతారు అనుకుంటాను.
-మాలతి

కొత్త పాళీ said...

మాస్తారూ, కవి సమ్మేళనానికి ఆహ్వానమూ, ప్రశ్నపత్రమూ మీకు పంపాను. దయచేసి ఒకసారి మెయిలు చూసుకుని అందకపోతే నాకు తెలియజెయ్యండి.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks