నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 13, 2010

జననియు జనకుఁడు వధువులుఁ దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్


రామాయణ రస గుళికలు ( శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము - వావిలికొలనుసుబ్బారావు గారు )
అయోధ్యాపుర జన వర్ణనము 
ఉ.
అందఱు హృష్టమానసులె యందలియందఱు ధర్మ వేదు లే
యందఱు శాస్త్రచింతనపరాయణులే మఱి స్వస్వతుష్టులే
యందఱుఁ ద్యాగశీలు రట నందఱు సత్యవచోభిభాషణా
మందులు భూరిసంచయు లమాస గవాశ్వ ధనాఢ్యు లందఱున్. ౨౬౫

అయోధ్యానగర వాసులందఱు నిష్టార్థములన్నియుఁ బ్రాప్తించుటచే సంతుష్టిగల మనస్సు గలవారే, అందఱు ధర్మము నెఱిగినవారే, అందఱు శాస్త్ర విషయమైన యాలోచనలు చేయుటయందు సమర్థులే, అందఱు తమకు భగవంతుఁ డిచ్చిన దానితోఁ దృప్తిపడి యుండువారే, అందఱు త్యాగము స్వభావముగా గలవారే, అందఱు నిజము చెప్పువారే, అందఱు కావలసినంత సంపాదించి యుంచుకొన్నవారే, అందఱు కొఱఁత లేక వారివారికిఁ గావలసినన్ని గోవులు - గుఱ్ఱములు - ధనములు కలవేరే.
కందము.
జననియు జనకుఁడు వధువులుఁ
దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్
దనివిగ నిండక యుండెడి
మనికి యొకండైనలేదు మందునకైనన్. ౨౫౭

' మాతాపితాస్ను షే పుత్రౌ పుత్రీ పత్న్యతిథి స్స్వయం
దశసంఖ్య కుటుంబీతి విష్ణునో క్తం ద్విజోత్తమ ' యని కుటుంబ లక్షణము. తల్లి తండ్రి తాను దనభార్య, ఇద్దఱు కొడుకులు, ఇద్దఱు కోడండ్రు, ఒక కూతురు, ఒక యతిథి - యీ పదుగురుండినఁ గుటుంబ మనబడును. ఇంతకుఁ దక్కువగల యి ల్లా నగరమున లేదు.( ఇప్పటి కుటుంబాలు  ముగ్గుఱు గాని నలుగుఱు గాని అంతే )
ఆటవెలది.
తన్ను ధర్మవిధులఁ దనయులఁ దనయలఁ తల్లిఁ దండ్రిఁ దనదు దార నన్న
దమ్ములను గదర్యతావశచిత్తుఁడై యేఁచువాఁడు లేఁడ యెచట నేని. ౨౫౮
ఈ పద్యమునఁ జెప్పఁబడిన వారిని కూడు నీళ్ళు పెట్టక కాని యితర విధములఁ గాని బాధించువాఁడు కదర్యుఁడు, వానిభావము కదర్యత, అత్యంతలోభియై యని భావము. 
' ఆత్మానం ధర్మకృత్యంచ, పుత్రందారాంశ్చ పీడయేత్, లోభాద్యః పితరం బ్రాతృన్ స కదర్య ఇతి స్మృతః ' అని కదర్య లక్షణము.
తాను దినక ధర్మము చేయక కొడుకులను భార్యను నెవఁడు కడుపునిండఁ గూడు పెట్టక బాధించునో యట్టి పరమ లోభి కదర్యుఁ డనబడును. అట్టివాఁ డొక్కఁ డైన నా పట్టనమందు లేఁడు.  
కందము.
పోఁడిమి గల తత్పురమున
లేఁడు ఖలుఁడు దుష్టకామి లేఁడు చదువులన్
వాఁడిమి మీఱనిపురుషుఁడు లేఁ
డట నాస్తికుఁడు నెందు లేఁడు వెదకినన్. ౨౫౯
పూర్వ మన్ని జాతులవారును విద్యనేర్చినవారే యని చెప్పుచున్నాఁడు. పూర్వము శూద్రులకు విద్య నిషేధింపఁ బడినదను దుర్వాదము దీనిచే ఖండితము. శూద్రులకు వేదము నిషేధింపఁ బడినది కాని కులవృత్తికిఁ గావలసిన విద్య లోనైనవి నిషేధింపబడలేదు. 
అందమైన యానగరమందు దుష్టుఁడు లేఁడు, పరస్త్రీల నాశించువాఁడు, తన భార్యతోనైనను నిషిద్ధదినంబుల నిషిద్ధసమయంబు లందుఁగాని క్రీడించువాఁడును, వేశ్యాలంపటుఁడును లేఁడు. చక్కగఁ జదువరానివాఁడును లేఁడు. దేవుఁడు, పరలోకము లేదనువాఁడు లేఁడు.
ఉ.
అందఱు ధర్మశీలరతులందఱు నిశ్చలసంయతాత్ము లే
యందఱు సత్స్వభావయుతులందఱు నిర్మలవృత్తశాలు రే
యందఱు సన్మహర్షినిభు లందఱు నిర్మలమానసాఢ్యు ల
య్యందఱు దారహారయుతు లందఱుఁ గుండలమండితశ్రవుల్. ౨౬౦
ఆ పురమం దందఱు ధర్మముతోఁ గూడిన శీలమందుఁ బ్రేమగలవారే, అందఱు నింద్రియనిగ్రహముగలవారే, అందఱు మంచి స్వభావముగలవారే, అందఱు దోషరహితమైన నడవడిగలవారే. అందఱు ఋషులతో సమానులే. అందఱు కలంకము లేని మనస్సుకలవారే, అందఱు ముత్యాలసరములు లోనైన యాభరణముల ధరించినవారే, అందఱు కుండలములచే నలంకరింపఁబడిన వీనులు గలవారే.
ఉ.
అందఱు సుందరుల్ మకుటు లందఱుఁ జందనలి ప్తదేహు లం
దందఱుఁ బూర్ణభోగయుతు లందఱు సంతతమృష్టభో క్త ల
య్యందఱు దానశీలరతు లందఱు భూషణభూషితాంగు ల
య్యందఱు నిష్కవంతు లట నందఱు నంగదదీప్త బాహువుల్. ౨౬౧
అందఱు చక్కదనము కలవారే, కురూపులు లేరు అందఱు మకుటములు ధరించినవారే, అందఱు చందనము పూసికొనియుండువారే, అందఱు కొఱఁత లేక భోగము లనుభవించువారే, అదఱు నిష్టమై పరిశుద్ధమైన యాహారము తీసుకొనువారే, అందఱు నన్నదాతలే, అందఱు నన్ని యవయవములయందు నలంకారములు ధరించినవారే, అందఱు నురోభూషణములు గలవారే, అందఱు బాహుపురులు గలవారే. 
ఉ.
అందఱు నిర్జితేంద్రియులు నందఱు యజ్వలు నాహితాగ్ను ల
య్యంద ఱటన్ స్వకర్మరతు లందఱు నిత్యము బ్రహ్మచింతనుల్ 
అందఱు సంతతాధ్యయనులందఱు సంయమితుల్యు లప్పురిం
జెందిన యట్టిలోకులు సుశీలరతుల్ కరుణాపరాయణుల్. ౨౬౨
ఆ పురమునందలి యందఱు నింద్రియముల జయించినవారే. అందఱు సోమయాగము చేసినవారే. అందఱు నగ్నిహోత్రములు కలవారే, అందఱు వారివారి వర్ణాశ్రమధర్మముల ననుసరించి కర్మములు చేయువారే, అందఱు ప్రతిదినము బ్రహ్మమును ధ్యానించువారే, అందఱు జపతపస్సంపన్నులే, అందఱు ఋషుల చర్యలు గలవారే్, అందఱు దయాళులే, అందఱు చక్కని నడవడి గలవారే. 
ఈ పద్యమునందలి పాదాంత సంధివిషయమును గుఱించి వాసుదాసుగారు చాలా విస్తృతమైన వివరణ యిచ్చారు. వారు ప్రతి పద్యానికి ప్రతిపదార్థాన్ని కూడా వ్రాసారు.
 


0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks