కల్యాణ ఖండము
సీతా రామ కల్యాణము
సీ.
ఒక పెద్ద కెరటము నొక పెద్ద కెరటము
గలసి యన్యోన్యంబుఁ గౌగిలించుఁ
నొక చిన్ని కెరటము నొకచిన్ని కెరటము
గలసిపోవును రెండుగాని యట్లు
ఒకచిన్ని కలువపూ వొకచిన్ని కలువపూ
వును గూడి యంచుల కొనలు ముట్టు
నొకరాజహంసమ్ము నొకరాజ హంసమ్ము
భువనోన్నతత్వంబు పుక్కిలించు
గీ.
దివిజభాగీరథీసరయువుల సంగ
మమ్ముపోలిక నై క్ష్వాకుమైథిలావ
నీశ్వరుల బెండ్లి వారికి నృపుని కనక
మయమహాసౌధముల సంగమమ్ము గలిగె. 66
గంగాసరయుల సంగమంగా భాసించినదట సీతారాముల కల్యాణము.
గీ.
తుమ్మిదలు పైని గ్రమ్మిన తమ్మిపూలు
నాల్గుతట్టలతోఁ దెచ్చినారు మేన
మామ లంతలోఁ జూడఁగా మథురలజ్జ
లుదయమైన రాకన్నెల వదనములుగ.77
ఎంత హృద్యమైన భావన. మన తెలుగిండ్లలో జరిగే పెళ్ళివేడుకలే.
గీ.
ఎదురు బళ్ళైన లజ్జచే నెత్తరాని
ఱెప్ప లవి యెత్తఁబడకుండఁ గ్రేవలందుఁ
బ్రక్క గూర్చున్న యప్పటి ప్రసరణంబు
ప్రసవబాణుండు నేర్చిన ప్రథమవిద్య. 79
క.
పరసుఖదశాపరీపా
కరామణీయక మెఱుంగుఁ గచసాన్నిధ్యా
త్తరమణఁ బ్రథమస్పర్శ
ప్రరూఢి మెడ వొలిచె సూత్రబంధన వేళన్. 80
గీ.
కరరుహంబులు చర్మంబు గాకపోయె
నవియుఁ బులకించునేమొ ప్రియగళాత్త
మైన స్పర్శసుఖా ప్తిఁ బ్రియాగళంబు
నంటి బాధించు వీని కేలా ! సుఖంబు.81
క.
తలఁబ్రాల వేళఁబడచును
నలఘుచ్చవి నెగురు ముత్తియంబులమిషచే
నలుకేళకూళులు వొలిచెను
నలుగురు దంపతులు మోహన స్తంభములై. 82
గీ.
నాలుగవ పాలుగా నింద్రనీలమణులు
మణులు కలియంగఁ బోసిరో యనఁగఁ బొలిచె
ముత్తెములు చతుర్దంపతి ముగ్ధతను స
మాత్త నీలర క్తచ్ఛవుల్ హత్తుకొనఁగ. 83
గీ.
అలుపములు రెండుమూఁడు ముత్యాలు నిలిచి
సీత పాపటలోఁ జిఱు చెమట పోసె
హత్తుకొని గంధపూఁత ముత్యాలు రెండు
రామచంద్రుని మేనఁ దారకలు పొలిచె. 84
మ.
పదిదోసిళ్ళకు నొక్కదోసిలి త్రపాపర్యంతమై సేసబ్రా
లొదిగించెన్ జనకాత్మజాత పతిపై నొయ్యారపున్ లజ్జ యన్
జదురౌ తొల్తటి మెట్టు డిగ్గుచుఁ డ్రపాశైథిల్య మార్గంబునన్
బోద రావేళకుఁ దీఱినట్టి కనులన్ వీక్షించుచున్ రాఘవున్. 85
సిగ్గుతో సీత పదిదోసిళ్ళకు ఒకదోసిలిగా తలఁబ్రాలు రాములవారిపై పోసినదట.
ఆ.
చంద్ర రేఖ పైని సన్నని తెలిమొయి
ళ్లాడినట్లు ముత్తియమ్ములాడెఁ
జల్లి మేనిపైని నల్లని యాకాశ
మట్లు రామచంద్రుఁ డందె యుండ. 86
ఉ.
అల్ల వివాహమండపమునై చనుచోటికిఁ జిత్రవిచిత్రముల్
కొల్లలుగాఁగ వచ్చె వెలుఁగుల్ వెసఁబెండిలివారలెల్ల ద్వా
ర్వేల్లిత దృష్టులై చినుకు వెక్కసమౌ చిఱుజల్లువానలో
ఫుల్ల విచిత్రవర్ణములు పూవులు చూచిరి లంబమాలలన్. 87
క.
ప్రతిచినుకులోనఁ బ్రతిబిం
బితములు జలజాప్తు వెలుఁగు పిండులు వలయా
కృతిమ న్మఘన ధనురలం
కృతులును గలిపించె గగనమెల్ల శబలమై. 88
క.
ప్రతి చైత్త్రశుద్ధ నవమికి
వితతంబుగఁ దెలుఁగునేల విరిసెడు జల్లుల్
సితముక్తాసదృశంబులు
ప్రతనులు తలఁబ్రాలవేళ వచ్చెఁ జిటపటల్. 89
ప్రతి సంవత్సరం శ్రీరామనవమినాడు జరిగే శ్రీ సీతారామకల్యాణం తలఁబ్రాల సమయానికి చిఱుజల్లులతో చిన్నపాటి వర్షం పడటం ఆనవాయితీగా జరుగుతూంటుంది.
ఈ సీతారామ కల్యాణంతో నా యీ నరసింహ బ్లాగులో 300 పోస్టులు పూర్తికావటం-- ఆ సీతారాములు నా మీద కురిపించిన అవ్యాజమైన దయావృష్టిగా అనిపిస్తున్నది నా మటుకు నాకు.
ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?
1 day ago
0 comments:
Post a Comment