అహల్యాఖండము
విశ్వామిత్రుఁడు దశరథునికడకు వచ్చుట
గీ.
అర్ఘ్య మర్ఘ్యమ్ము పాద్యమ్ము పాద్య
మవనిపతిఁ జెప్పఁబంపుడీ ! యవనిపతికిఁ
జెప్పఁబంపుడి ! ప్రభువు వశిష్ఠమునికిఁ
దెలియవలయు బ్రహ్మర్షికిఁ దెలియవలయు. ౨
విశ్వామిత్ర మహర్షి రాకను ఎంతగా తగిన రీతిలో హడావుడిని సృష్టించి మరీ చెప్పారో చూడండి. ఒక్కొక్క పదాన్నీ రెండేసి సార్లు పలకించారు చూడండి. ఇలా చేయటం వలన చెప్పాలనుకున్నదానికి మంచి ఊపు వస్తుంది. పాఠకులకు సంభ్రమం కలుగుతుంది. కూడా కూడా వస్తాడు పాఠకుడు.
సీ.
కక్ష్యాంతరములఁ జక్కఁగ ద్రోవ వదలుఁడా !
ద్వారపాలకుల మొత్తములవారు
ఇరువంకలను బరాబరులుగా నిలువుఁడా !
చాలు లై వెండిబెత్తాలవారు
రహిని గర్పూరనీరాజనం బెత్తుఁడా !
కంకణా లులియ హెగ్గళ్ళవారు
వింజామరములు వీవుఁడా వినయమ్ము !
కందళింపగఁ గంచుకాలవారు
గీ.
ఎవరయా ? ప్రతీహారు లా యెవరొగాని
యవనినాధునకును గబురందవలయు
నింక నిచ్చటనేయుండి రేమి మీరు ?
రాజఋషి బ్రహ్మఋషి గాధిరాజసుతులు. 3
హెగ్గళ్ళవారు=అంతఃపురపు కావలివారు
ఎంత బాగుందో చూడండి. ఆ మహాఋషికి తగిన స్వాగతం పలుకుతున్నట్లుంది. ఈ ఘట్టాన్ని ఇతర రామాయణాలలో ఇంత పకడ్బందీగా నిర్వహించి ఉండలేదనుకుంటాను.
శా.
అంతర్వంశికు లిట్లుగా గుడుసులై యంతంతఁ ద్రొక్కిళ్ళుగా
నింతంతం జని సౌవిదల్లకజనుల్ హెగ్గళ్ళు దౌవారికుల్
బంతుల్ దీరిచి కొల్వఁగాఁ బనిచి భూపాలున్ బ్రబోధింపఁగా
నంతఃపత్తన మేగి తెల్పఁగ నృపుం డావిర్భవద్భక్తి యై. 4
వ.
ఒక్కనిమేషంబులోన జాబాలి కశ్యప సుయజ్ఞ వశిష్ఠులరుగుదేర దశరథబండు సపురోథసుఁడై విశ్వామిత్రున కెదురుపోయి. 5
ఎంత వేగంగా పనులు జరిగినాయో చూడండి. ఒక్క నిమేషంబులోన అందరూ కూడుకున్నారట.
Jul 13, 2009
కక్ష్యాంతరములఁ జక్కఁగ ద్రోవ వదలుఁడా ! ద్వారపాలకుల మొత్తములవారు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Post a Comment