సీ.
మఱల ని దేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్ల నెల్ల వేళఁ
దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రదుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలఁచిన రామునే తలఁచెద నేనును
నా భక్తి రచనలు నావిగాన
గీ.
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందుఁ తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథాదృతిని మించి. 5
మళ్ళీ ఈ రామాయణం ఏంటయ్యా అనేవారికి విశ్వనాధ సత్యనారాయణ గారి జవాబు ఈ పై పద్యం. "నా భక్తి రచనలు నావి గాన". ఇదీ ఆయన జవాబు. కావ్యంలోని గొప్పతనం 90 పాళ్ళు కవి ప్రతిభలోనే ఉంటుందట. కథ కంటె కూడా రసము వేయి రెట్లు గొప్పది.
గురువులు భైరవభట్లవారూ, చింతా రామకృష్ణారావుగారు మొదలైన పెద్దవారంతా విశ్వనాథ వారి కల్పవృక్షం గుఱించి ఎంతో అందంగా వారి వారి బ్లాగుల్లో వ్రాస్తూనే వున్నారు కదయ్యా. మళ్ళీ నీవుకూడా ఆవిషయాలే రాస్తానంటున్నా వేమిటి అనే వారికి నా జవాబు "నాదైన యనుభూతి నాదిగాన"అనే. భైరవభట్ల వారు రామాయణ కల్పవృక్షం గుఱించి వారి బ్లాగులో వ్రాసినది చదివినప్పుడూ, విశ్వనాథ వారి సాహిత్యం సంపూర్ణంగా చదివి అర్థం చేసుకోవటానికి ఒక జన్మ పూర్తిగా సరిపోదేమో అని వారన్నప్పుడు నావద్ద శిధిలావస్థలో ఉన్న రామాయణ కల్పవృక్షం పుస్తకాలు గుర్తు కొచ్చినాయి. వాటిని తిరిగి బయటకుతీసి బైండు చేయించే కార్యక్రమం మాత్రం ఈమధ్యనే పూర్తి చేయగలిగాను. బాలకాండ తీసి చదువుతుంటే విశ్వనాథ వారి తెలుగు పలుకుబళ్ళు తెలుగు నానుడుల గురించి బ్లాగ్మిత్రులతో పంచుకోవాలనే ఆరాటం నన్ను నిలవనీయలేదు. అందుచేతనే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించేను. పిన్నలూ పెద్దలూ అందరూ నా యీ చిన్ని ప్రయత్నాన్ని సాదరంగా స్వీకరిస్తారని, ప్రోత్సహిస్తారనిన్నీనా ఆశా ఆకాంక్షాను.
ఇంకావిశ్వనాథవారు రఘురాముని కథ గొప్పదనం గుఱించి ఇలా అంటున్నారు.
ఉ.
పావు నెఱుంగు బ్రహ్మ సగపాలునుమాత్ర మెఱుంగుఁ బార్వతీ
దేవియు నీ వెఱుంగుదువు తెల్లము రామమహత్తు కృత్స్నమా
దేవున కేను నీ యనుమతింపబడి నంకిత మిత్తు జానకీ
దేవి మనోహరుండు రఘుదేవుని సాధుకథా ప్రపంచమున్. 4
రాముని మహత్తు పావు భాగం మాత్రం బ్రహ్మదేవు డెఱుగునట. సగపాలు వరకూ పార్వతీదేవికి తెలియునట. ఆ విశ్వేశ్వరునకు మాత్ర్రం పూర్తిగా తెలియునట. ఆ విశ్వేశ్వరునకు ఆయన అనుమతితో సీతా మనోహరు డైన రఘుదేవుని కథా ప్రపంచాన్ని అంకితం చేస్తున్నానని విశ్వనాథ వారంటారు వారి అవతారికా పద్యాలలో.
ఉ.
వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివం చనిపించుకో వృధా
యాసముగాక కట్టుకత లైహికమా ? పరమా ? యటంచుఁ దాఁ
జేసిన తండ్రియాజ్ఞ యును జీవుని వేదన రెండు నేకమై ----- 7
వ్రాసానంటారు విశ్వనాథ వారు అవతారికలో.
వారు వారి తండ్రిగారైన శోభనాద్రి గారి గురించి అవతారికలో ఇంకా ఇలా చెప్తున్నారు.
సీ.
నకనకలాడునట్టి కడుపులన్ వచ్చి
త్రేఁచుఁచుఁ బోయెడు తెరువరులును
చినిఁగిన గుడ్డలఁ జనుదెంచి నూతన
పరిధానములఁ దాల్చి యరుగు జనులు
పరిదీనవదను లై యరుదెంచి యుత్సాహ
కృత మందహాసు లై యేగువారు
సందేహ భాజనాస్యములతో వచ్చి యా
శ్చర్య సూచిముఖాలఁ జనెడువారుఁ
తే.
బొలుతు రన్నాతురులు యాచకులును నిత్య
కలిత బహుళ కార్యాంత రాగతులు విశ్వ
నాథ వంశాబ్ధిశశి శోభనాద్రియింట
నిరులు వదలి వెల్తురులు గొం చేగునట్లు. 9
గీ.
సప్త సంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతి యటన్న
నట్టి కృతిశత నిర్మాతనైన బిడ్డఁ
బడసె నా తండ్రి కృతిలోక పారిషదుఁడు. 13
ఇంకా వారు వారి తమ్ముళ్ళ నిద్దరి గుఱించీ ఏమంటున్నారో చూడండి.
ఉ.
తమ్ములు రామచంద్రునకుఁ దమ్ములు నూహ యెఱింగి చేయఁగాఁ
దమ్ములు ధర్మరాజునకుఁ దమ్ములు చెప్పిన యట్లు సేయ నా
తమ్ములు నట్టిరందుఁ జినతమ్ముఁడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వానికొక దైవముగాఁ గనిపింతు నెంతయున్. 15
ఉ.
పండిత కీర్తనీయుఁ డిరుబాసల దిట్ట రసజ్ఞమౌళి మా
రెండవవాఁడు సన్మతి ధురీణ కవిత్వకళోగ్రకార్తి కే
యుండును వేంకటేశ్వరులహో ! మఱి నా కవనం బిదెల్ల ధీ
శౌండుఁడు తత్పరీక్షఁ బడి సంకున బోసిన తీర్థమై చనున్. 16
శంఖున పోసిన తీర్థం అనే నానుడిని చక్కగా వాడుకున్నారిక్కడ. ఇటువంటి నానుడుల గుఱించి తెలుసుకోవాలనీ, తెలిసింది నలుగురితో పంచుకోవాలనే నా ప్రయత్నం. ఇటువంటి వాటి గురించి తెలుసుకుంటూ మనం కూడా మన సంభాషణల్లో వీటిని వాడటం మొదలు పెడితే మన తెలుగు భాష అజరామరంగా ఎప్పటికీ నిలిచే ఉంటుందనటం లో నా కెంతమాత్రం సందేహం లేదు.
విశ్వనాథవారు వారి గురువుగారి గురించీ అన్యాపదేశంగా నైనా వారిగురించీ చెప్పుకున్న పద్యాలు తరువాత కలసినప్పుడు తెలుసుకుందాం.
Jun 19, 2009
మఱల ని దేల రామాయణం బన్నచో
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
"ఎందెందున రఘురామకీర్తనం అందందున హనుమాను నర్తనం" అన్నట్టుగా ఎవరు విన్నా వినకపోయినా నేను వింటాను, మీరు కానీయండి.
"ధీ శౌండుడు" - ఇది విశ్వనాథ ముద్ర. మొదటిమూడు పాదాలు హాయిగా పండిత, రెండవ, కార్తికేయుండు అని తేలిక పదాలు ప్రాసలో వేసి చివరిపాదంలో యీ "శౌండుడు" అన్న ప్రౌఢ ప్రయోగం! అతని తమ్ముని పాండితీ గరిమని వ్యంగ్యంగా ధ్వనించేట్టు.
గురువుగారూ, మీ నుండి అందే ఈ చిన్ని ప్రోత్సాహం చాలు, మాబోటివారికి- కొండలెక్కి పిండికొట్టడానికి. ధన్యవాదాలు. అవును కల్లుతాగి మత్తు ఎక్కేవానిగా వ్రాయటంలో తన కవిత్వం లో ఆ కిక్ ఉందని అర్థం కూడా మనం తీసుకోవచ్చను కుంటున్నాను. నా అభిప్రాయం సరి యైనదేనా లేక మొన్నను నే చూచివచ్చిన కిక్ సినిమా ప్రభావంతో నా కలా అనిపిస్తుందో తెలియట్లేదు.
శౌండుడు అంటే మరీ కల్లు తాగినవాడు అని అర్థం చెప్పుకోడం కొంచెం కష్టంగా ఉంది. ధీశౌండుడు అంటే బుద్ధి అనే సురతో మదించినవాడు అని అర్థం చెప్పుకుంటే బావుంటుంది. మరొకటి, శౌండము అంటే ఏనుగు అనే అర్థం కూడా తీసుకోవచ్చు - శుండము కలది. అప్పుడది శ్రేష్ఠతా వాచకం అవుతుంది (దిగ్గజం అన్నట్టుగా) - గొప్ప బుద్ధి కలవాడు అని. ఏనుగు బుద్ధిశాలి అని అంటారుకాబట్టి ఇక్కడ ఏనుగుతో పోలికకూడా ఉచితంగా ఉంది.
మరో రెండు విషయాలు, ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పేనేమో:
"వ్రాసిన రామచంద్రు కథ..." పద్యంలో "కట్టు కతలు" అంటే కల్పనా కథలు అని సాధారణ అర్థం. కట్టిపడేసే (బంధించే) కథలు అని కూడా తీసుకోవచ్చు. అంటే రామాయణం తప్ప అన్ని కథలూ మనలని బంధించే కథలే అని, రామాయణం మాత్రం బంధాలని విముక్తి చేసే కథ అని వ్యాఖ్యానం.
"చేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై" - ఇది ఇక్కడ విశ్వనాథవారికి ఎంత వర్తిస్తుందో కల్పవృక్షంలో రాముడికీ అంతే వర్తిస్తుంది! రాముని విషయంలో కూడా తండ్రి ఆజ్ఞ, తనలోని జీవునివేదనా రెండూ కలిసి అతన్ని వనవాసానికి పురికొల్పాయి, రామాయణ కథని నడిపించాయి.
Post a Comment