నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Apr 2, 2009

వారు నుత్సహించి వలనొప్ప దీవించి సేస లిడిరి యువతి శిరమునందు

రుక్మిణీ కల్యాణము-౭
వ.
అని గౌరీ దేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపూపంబులును, దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలఁ బూజించిన,
ఆ.వె.
వారు నుత్సహించి వలనొప్ప దీవించి
సేస లిడిరి యువతి శిరమునందు
సేస లెల్ల దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని మగువ వెడలె.
వ.
ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవనర్తకుండెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడసూపిన మోహినీదేవత కైవడి, దేవ దానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివిలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘమ ఘుమా యిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాభాసమాన యై, యిందుధరసుందరీ మందిరంబు వెడలి, మానస కాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి, మందగమనంబునఁ గనకకలశయుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్య యై, రత్నముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు కై దండ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణ పత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబు లైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప, నధరబింబఫలారుణమరీచి మాలికలు వదన కుందకుట్మలంబుల కనురాగంబు సంపాదింప, మనోజాత కేతన సన్నిభం బైన పయ్యెద కొంగు దూఁగ, సువర్ణ మేఖలాఘటిత మణికిరణపటలంబు లకాల శక్రచాప జనకంబు లై మెఱయఁ, జెఱకు విలుతుం డొఱవెఱికి, వాఁడియిడి, ఝళిపించిన ధగద్ధగాయమానంబు లగు బాణంబులపగిది, సురుచిర విలోకననికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీరనినదంబులు చెవులపండువులు సేయఁ, బాదసంచారంబున హరి రాక కెదురు సూచుచు, వీర మోహిని యై చనుదెంచుచున్న సమయంబున,
మ.
అళినీలాలకఁ బూర్ణ చంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధరన్
గలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభకుంభస్తనిన్
బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్తన్ మహో
త్పలగంధిన్ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ము లై రందఱున్.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks