రుక్మిణీ కల్యాణము-౨
శ్రీకృష్ణుడా బ్రాహ్మణుని సాదరంగా గౌరవించి వచ్చిన పనిని వివరించమని కోరగా ఆ బ్రాహ్మణు డతనితో--
సీ.
ఏ నీ గుణంబులు కర్ణేంద్రింయబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు
తే.
నట్టి నీయందు నా చిత్త మనవరతము
నచ్చియున్నది నీ యాన నానలేదు
కరుణఁ జూడుము కంసారి ! ఖలవిదారి !
శ్రీయుతాకార ! మానినీ చిత్తచోర !
శా.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్ గోరరు ? కోరదే మును రమా కాంతాలలామంబు రా
జన్యానేకప సింహ ! నావలననే జన్మించెనే మోహముల్.
ఉ.
శ్రీయుతమూర్తి ! యో పురుషసింహమ ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చై ద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగ డద్భుతమైన భవత్ప్రతాపముల్.
మ.
వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్ హరి జగత్కల్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌ గాక ని
ర్జితు లై పోదురు గాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.
ఉ.
అంకిలి సెప్ప లేదు చతురంగ బలంబులదోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్య మే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
సీ.
లోపలి సౌధంబులోన వర్తింపంగఁ దేవచ్చునే నిన్నుఁ దెత్తునేనిఁ
గావలివారలఁ గల బంధువులఁ జంపి కాని తేరా దని కమలనయన!
భావించితేని నుపాయంబు చెప్పెద నాలింపు కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతు
తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమునకు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
మ.
ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలసింప నేని వ్రతచర్యన్ నీఱు జన్మంబులన్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!
సీ.
ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమి యేల
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని తనులతవలని సౌందర్య మేల
భువనమోహన! నినుఁ బొడగానఁగా లేని చక్షురింద్రియముల సత్త్వ మేల
దయిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల
ఆ.
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు.
వ.
అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాతి విశేషంబులును, బ్రాహ్మణుండు హరికి విన్నవించి, కర్తవ్యం బెద్దిసేయ నవధరింపుమని, సవరణగా నిట్లనియె.
సీ.
పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారు లూరు
లరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము
మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షు రుత్సవదాయి చన్నుదోయి
పరిహసి తార్ధేందు పటలంబు నిటలంబు జిత మత్తమధుకర శ్రేణి వేణి
ఆ.
భావజాశుగముల ప్రాపులు చూపులు
కుసుమశరుని వింటి కొమలు బొమలు
చిత్తతోషణములు చెలువభాషణములు
జలజనయనముఖము చంద్రసఖము.
ఉ.
ఆ యెలనాఁగ నీకుఁ దగు నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ దప్పదు జాడ్యము లేల నీవు నీ
తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము శత్రులన్ నుఱుము సేయుము సేయుము శోభనం బిలన్.
వ.
అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విధర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాది విశేషంబులును విని, యవధరించి, నిజకరంబున నతని కరంబుఁ బట్టి నగుచు, నయ్యాదవేంద్రుం డి ట్లనియె.
(ఇంకావుంది)
Mar 12, 2009
రుక్మిణీ కల్యాణము
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
రుక్మిణీదేవి ఎంత గడుసుదండి? "లోపలి సౌధంబులోన..." అని తనే ఉపాయం చెప్తోంది. అంత గడుగ్గాయి కూడా, "నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!" అని తన ప్రణయావేశాన్ని తెలిపింది.
పోతనామాత్యుడు దాదాపు ప్రతీ ముఖ్య ఘట్టములోనూ, "ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమి యేల" వంటి పద్యం ఒకటి వ్రాశాడు. (కమలాక్షునర్చించు కరములు కరములు...). ఐనా దేనికదే ముద్దు వస్తూ ఉంటుంది. "దయిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల" అంటూ శృంగారాన్ని వర్ణిస్తూ కూడా, చివరికి ఆ శృంగారం కూడా భక్తికి ఒక రూపమేనని ఋజువు చేస్తూ, "ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల యెన్ని జన్మములకు." అనడం గమనార్హం!
"కంబుసౌందర్య మంగళము గళము, మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు" ఆహా! ఛేకానుప్రాస ఎంత చక్కగా అమరింది? "భావజాశుగముల ప్రాపులు చూపులు", ఈ పద్యమంతా ఉపమాలంకారాలు అద్భుతంగా వ్రాశాడు పోతనామాత్యుడు. ఇవి చదవని తెలుగువాడు అసంపూర్ణంగా మిగిలిపోతాడేమో అనిపిస్తుంది. "తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి", ఇందులో యమకం ఎంత బాగుంది?
Post a Comment