జలక్రీడాభివర్ణనము
శుకయోగీంద్రునితో పరీక్షన్మహారాజు- వెన్నుడు ఇంద్రియస్ఖలనము సేయక శరత్కాలమున గోపికలతో రమించెననగా -ఇట్లా అన్నాడు.
మత్తకోకిలము.
ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైన స
త్కర్ముఁ డీశుఁడు ధర్మశిక్షయు ధర్మరక్షయుఁ జేయగా
నర్మిలిన్ ధరమీఁద బుట్టి పరాంగనాజనసంగ మే
ధర్మమంచుఁ దలంచి చేసె? సుదాత్తమానస! చెప్పుమా!
వ.అనిన శుకుండిట్లనియె.
ఆ.
సర్వభక్షుఁ డగ్ని సర్వంబు భక్షించి, దోషి గాని పగిది దోష మైనఁ
జేసి దోషపదముఁ జెందరు తేజస్వు, లగుటఁ జంద్రవాసవాదు లధిప!
క.
ఈశ్వరుఁడు గానివాఁడు న, రేశ్వర! పరకాంతఁ దలఁచి యెట్లు బ్రదుకు? గౌ
రీశ్వరుఁడు దక్క నన్యుఁడు, విశ్వభయదవిషము మ్రింగి వెలయం గలఁడే?
మ.
ఘనుడై యెవ్వని పాదపంకజపరాగ ధ్యాన సంప్రాప్త యో
గ నిరూఢత్వముచే మునీంద్రులు మహాకర్మంబులం బాసి బం
ధ నిరోధంబులు లేక విచ్చలవిడిన్ దర్పించు, రా దివ్య శో
భనుఁ డెట్లుండిన నుండెఁగాక! కలవే బంధంబు లుర్వీశ్వరా!
ఆ.
గోపజనములందు గోపికలందును, సకల జంతులందు సంచరించు
నా మహాత్మునకుఁ బరాంగన లెవ్వరు?, సర్వమయుఁడు లీల సలిపెఁ గాక?
Feb 6, 2009
ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైన స
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment