రాసక్రీడాభివర్ణనము
క.
రామలతోడను రాసము, రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రాములమీఁద వియచ్చర, రామలు ముర్ఛల్లి పడిరి రాజకులేంద్రా.
క.
తారాధిప నిభ వదనలు, తారాధిప వంశ్యుఁ గూడి తారు నటింపం
దారలతోడ సుధాంశుఁడు, దారును వీక్షింప రేయి దడవుగ జరిగెన్.
మ.
యమునా కంకణ చారియై వనజ పుష్పామోద సంచారియై
రమణీ ఘర్మ నివారియై మదవతీ రాస శ్రమోత్తారి యై
ప్రమదామానస నవ్య భవ్య సుఖసంప త్కారి యై చేరి యా
కమలాక్షుం డలరంగ గాలి విసరెం గళ్యాణభావంబునన్.
సీ.
చెలువ యొక్కతె చెక్కుఁ జెక్కుతో మోపిన విభుఁడు తాంబూలచర్వితము వెట్టె
నాడుచు వొకలేమ యలసినఁ బ్రాణేశుఁ డున్నత దో స్త్సంభ మూఁత సేసెఁ
జెమరించి యొకభామ చేరినఁ గడగోరఁ జతురుఁడు కుచఘర్మజలము వాపె
నలకంబు లొకయింతి కలిక చిత్రకరేఖ నంటినఁ బ్రియుఁడు పాయంగ దువ్వెఁ
ఆ.
బడఁతి యొకతె పాడిపాడి డస్సిన యధ
రామృతమున నాథుఁ డాదరించె
హారమొక్కసతికి నంసావృతం బైనఁ
గాంతుఁ డురముఁ జేర్చి కౌఁగిలించె.
క.
హాసంబులఁ గరతల వి, న్యాసంబుల దర్శనముల నాలాపములన్
రాస శ్రాంతల కా హరి, సేసెన్ మన్ననలు కరుణఁజేసి నరేంద్రా.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
14 hours ago
0 comments:
Post a Comment