నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 8, 2009

ఏమి నోముఫలమొ యింత ప్రొ ద్దొకవార్త

మనం ఇప్పుడు నంద గోకులానికి వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూద్దాం.కృష్ణుని జననం గురించి విన్న గోపికలు--
ఆ.
ఏమి నోముఫలమొ యింత ప్రొ ద్దొకవార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవానిఁ గనెనఁట
చూచి వత్తమమ్మ! సుదతులార!
అని ఒకరితో నొకరు చెప్పుకుంటూ అందరూ కలసి కృష్ణుని చూడబోతారు
.
ఉ.
వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ గుచోపరిహారరేఖ ల
ల్లాడఁ గపోలపాలికల హాటకపత్ర రుచుల్ వినోదనం
బాడఁ బటాంచలంబు లసియాడఁగ జేరి యశోదయింటికిన్
జేడియ లేగి చూచి రొగి జిష్ణుని విష్ణునిఁ జిన్ని కృష్ణునిన్.


అప్పుడు గోపికలు కృష్ణుని తొట్టిలో ఉంచి ఇలా పాడారట.

క.
జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందు వదన! జోజో యనుచున్.


క.
పలు తోయంబుల జగములఁ, బలు తోయములందు ముంచి భాసిల్లెడి యా
పలుతోయగాడు వల్లవ, లలనా కరతోయములఁ జెలంగుచుఁ దడియున్.


తోయగాఁడు=(తోయము+కాడు) విధముగలవాడు. తోయము అనేమాట 4సార్లు వాడేడాయన.

తరువాత పూతన అనే రాక్షసి ఓ సుందరి వేషంలో కృష్ణునికి చన్నుకుడుపవచ్చినదై--

క.
చను నీకుఁ గుడుపఁజాలెడి, చనువారలు లేరు నీవు చనవలె ననుచున్
చనుగుడిపి మీఁద నిలుకడఁ, జనుదాన ననంగ వేడ్కఁ జనుఁ జను గుడుపన్.


పూతన చనుబాలతో పాటు ప్రాణాన్నీ హరిస్తాడు బాలకృష్ణుడు. అప్పుడు పోతన గారంటారు.
క.
విషధరరిపు గమనునికిని, విషగళ సఖునికిని విమల విష శయనునికిన్
విషభవభవ జనకునికిని, విషకుచ చనువిషముఁ గొనుట విషమే తలపన్.


విషధరరిపుడు=విషాన్ని ధరించిన పాములకు శత్రువు-గరుత్మంతుడు (వాహనముగాగలవాడు విష్ణుమూర్తి )
విషగళ సఖుడు=విషాన్ని గళమందు ధరించిన శివునికి సఖుడు(అయిన విష్ణుమూర్తి)
విష శయనుడు=పాముపై నిద్రించే వాడు(విష్ణుమూర్తి)
విషభవభవ జనకుడు=
విషకుచ చనువిషము=పూతన యొక్క కుచములయందలి విషము

ఈ అధ్యాయం చివరలో పోతన గారంటారు--
క.
ఉరు సంసారపయోనిధి, తరణంబులు పాపపుంజ దళనంబులు శ్రీ
కరణంబులు ముక్తి సమా, చరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్.


ఎన్ని 'రణంబు'లో---
శకటాసుర భంజనం తర్వాత--బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి.
ఆ.
అలసితివి గదన్న! యాఁకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మానుమన్న!
చన్నుగుడువుమన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్ను గుడిపె నర్భకునకు.

2 comments:

durgeswara said...

jayasree krishna !

నేను said...

ధన్యవాదములు నరసింహ గారు.
ఔత్సహికులు ఎవరైనా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడ అయ్యప్ప దేవాలయం లో చేసిన భాగవత ప్రవచనం ఈ కింది లంకె లో వినవచ్చు..
http://surasa.net/music/purana/

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks