శంకరాభరణం
లేదు భయము మఱి కాదు భవము
ఆదియు నంత్యముఁ దెలిసిన హరియాజ్ఞేకాన. IIపల్లవిII
తలఁపులుగడుగక వొడ లటు తాఁ గడిగిన నేమి
వెలుపలికాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమఁ గలిగినయాతడు
చెలఁగుచు పనులైనా సేసిన మరి యేమి. IIలేదుII
పొంచినకోపము విడువక భోగము విడిచిన నేమి
పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
నించిన దైవము నమ్మిన నిర్భరుఁడయినయాతఁడు
యెంచుక యేమార్గంబుల నెట్టుండిన నేమి. IIలేదుII
వేగమె లోపల గడుగక వెలి గడిగిన నేమి
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి
యీగతి శ్రీ వేంకటపతి నెఱిఁగి సుఖించేటియాతఁడు
జాగుల ప్రపంచమందును సతమైనా నేమి. IIలేదుII ౨-౫౮
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
4 days ago
0 comments:
Post a Comment