నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Dec 15, 2008

వెఱ్ఱులాల మీకు వేడుక గలితేను

రామక్రియ
వెఱ్ఱులాల మీకు వేడుకగలితేను
అఱ్ఱువంచి తడు కల్లంగరాదా. IIపల్లవిII

ముడిచివేసినపువ్వు ముడువయోగ్యము గాదు
కుడిచివేసినపుల్లె కుడువఁగాఁ గాదు
బడి నొకరుచెప్పినఁ బ్రతి చెప్పఁబోతేను
అడరి శ్రీహరి కది అరుహము గాదు. IIవెఱ్ఱుII


గంపెఁ డుముక దినఁగా నొక్క వరిగింజ
తెంపునఁ గలసితే తెలియ నెట్టు వచ్చు
జంపులఁ బలవరించఁగ నొక మంచిమాట
ఇంపైతే హరి యందుకిచ్చునా వరము. IIవెఱ్ఱుII

వుమిసిన తమ్మలో నొకకొంత కప్రము
సమకూర్చి చవిగొని చప్పరించనేల
అమరఁగ ఛాయాపహారము సేసుక
తమమాట గూర్చితే దైవము నగఁడా. IIవెఱ్ఱుII

చిబికివేసినగింజ చేతఁ బట్టఁగనేల
గబుక కెంగిలిబూరెఁ గడుగఁగ మరి యేల
తొబుకకవిత్వాల దోషాలఁ దొరలితే
గిబుకార నవ్వడా దేవుఁడైనాను. IIవెఱ్ఱుII

మించుచద్దికూటిమీఁద నుమిసినట్టు
మంచి దొకటి చెప్పి మరిచెప్పనేరక
కంచుఁ బెంచు నొక్కగతి నదికితే ముట్టు-
పెంచువలెనే చూచు పెరుమాళ్ళు వాని. IIవెఱ్ఱుII

పుచ్చినట్టిపండుబూఁజి లోననే వుండు
బచ్చనకవితలు బాఁతిగావు యెందు
ముచ్చుఁ గన్నతల్లి మూల కొదిగినట్టు
ముచ్చిమి నుతులేల మొక్కరో హరికి. IIవెఱ్ఱుII

వుల్లిదిన్న కోమ టూరకవున్నట్టు
జల్లెడ నావాలు జారిపోయినట్టు
కల్లలు చెప్పి యాకథ కుత్తరము లీక
మెల్లనే వుండితే మెచ్చునా దైవము. IIవెఱ్ఱుII

నేతిబీరకాయ నేయి అందు లేదు
రాతివీరునికి బీరము ఇంచుకా లేదు
ఘాత బూరుగుఁబండుకడుపులోన దూది
యేతులనుడుగులు యెక్కునా హరికి. IIవెఱ్ఱుII

ఇరుగువా రెరఁగరు పొరుగువా రెరఁగరు
గొరబైనమాటలు గొణఁగుచు నుందురు
పరులఁ గాదందురు బాఁతిగారు తాము
విరసు లట్టివారి విడుచు దేవుఁడు. IIవెఱ్ఱుII

యెన్నఁగ శ్రీవేంకటేశుఁ దాళ్ళపాక
అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ-
నున్నతితోఁ బాడి రొకఁ డెవ్వఁడో తాను
సన్న నొరసునట సమ్మతా హరికి. IIవెఱ్ఱుII౨-౪౯౪



గలితేను=గలిగితేను
అఱ్ఱువంచి=కంఠమువంచి(?),తడుకు= తోట లోనగువాని చుట్టునేర్పడిచెడు వెలుగు
పుల్లె=విస్తరాకు
అరుహము=అర్హము
ఉముక=పొట్టు
జంపులఁ=ఆలస్యముగ(?)
ఛాయాపహారము=కాంతితగ్గుదల
చిబికి=చప్పరించిన
గబుక=?
తొబుక=సారము లేని
గిబుకార=?(మనసార?)
కంచుఁ బెంచు=?
ముట్టుపెంచు=?
బూఁజి=బూఁజు
బచ్చన=?
ముచ్చిమి=?
రాతివీరునికి=?
ఘాత=దెబ్బ
యేతులనుడుగులు=?
గొరబైన=?
బాఁతి=భ్రాంతి
సన్న నొరసునట=?

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks