పాడి
ఇంతటి నీ నోముఫలమేమి చెప్పేది(దే)
కాంతరో యిదె నిచ్చకల్యాణముగాదా। IIపల్లవిII
మాట జవదాఁటని మగవాఁడు గలిగితే
ఆఁటదాని భాగ్యమేమని చెప్పేదే
యీటుననాతఁడుఁదాను యేకచిత్తమైవుండితే
చాటువకెక్కిన జన్మసాఫల్యము గాదా IIఇంతటిII
వెంటవెంటఁ దిరిగేటి విభుఁడు గలిగితేను
యింటిలోనిల్లాలిపుణ్యమేమి చెప్పేదే
బంటువలెఁ బనిసేసి పాయకాతఁడుండితే
అంటి మనోరథఫలమబ్బుటది గాదా. IIఇంతటిII
పక్కవాయకుండేటి ప్రాణేశుఁడు గలిగితే
యెక్కువైన సతిసౌఖ్యమేమి చెప్పేదే
ఇక్కడ శ్రీవేంకటేశుఁడిటు నిన్నూ నన్నుఁ గూడె
తక్కక మనకుఁ దాఁ బ్రత్యక్షమవుతా। IIఇంతటిII ౭-౧౪౭
దీనిలో అన్నమయ్య ఎటువంటి భర్త కలిగితే భార్యకెక్కువ సౌఖ్యంగా వుంటుందో చెలికత్తె మాటలద్వారా చెపుతాడు।
ఓ ఇంతీ నీ నోముఫలమింతటిదని ఎలా చెప్పేదే! నీ కిది నిత్యకల్యాణమే కదే!
మాట జవదాటని మగవాడు గలిగితే ఆడదాని భాగ్యమేమని చెప్పేదే!
యీటున(?) అతనూ తనూ ఓకే చిత్తమై వుంటే అందరూ పొగడే తన జన్మ సాఫల్యము కాదా!
తన వెంటవెంట తిరిగే భర్త ఉంటే ఆ యింటిలోని యిల్లాలి పుణ్యమేమని చెప్పేదే!
సేవకునిలా తనకన్నిపనులు చేస్తూ విడిచిపెట్టకుండా ఆతడుండితే తన మనోరథం ఈడేరినట్టే కదవే!
తన పక్కవిడచిపెట్టకుండా ఉండే ప్రాణేశ్వరుడు గలిగితే ఆ సతి సౌఖ్యమింతింతని చెప్పాలా!
ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు నిన్నూ నన్నూకూడినాడు।తప్పక తాను మనకు పత్యక్షమవుతాడు గాదా.
Jul 12, 2008
ఇంతటి నీ నోముఫలమేమి చెప్పేది(దే)
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment