నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Apr 28, 2010

నిర్వచన రామాయణం

సంగ్రహ నిర్వచన రామాయణం - ఈ పుస్తకాన్ని ఎప్పుడు కొన్నానో గుర్తు లేదు. ఈ రోజే చదువుదామని మొదలు పెట్టాను. పుస్తకం క్రింద పెట్టకుండా చదివించింది. ఉదయం మొదలుపెట్టి సాయంకాలానికి పూర్తిచెయ్యగలిగాను. దీని రచయిత కీర్తి శేషులు దరిమడుగు మల్లయ్య గారు. కుల్లూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ప్రకాశకులు:దరిమడుగు మల్లికార్జునరావు,కర్నూలు రోడ్డు, ఒంగోలు - 2. టి.టి.డి. వారి ఆర్ధిక సహాయంతో ప్రచురించబడింది. మొదటి ముద్రణ ఏప్రియల్ 1988. వెల 27 రూపాయలు.

రామాయణ గాథను ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగా - పద్యకావ్యాల రూపంలో గాని, వచనకావ్యాలు గా గాని, ద్విపదలుగా గాని , వ్యాఖ్యాన సహిత మందరాలుగా గాని, కల్పవృక్షాలుగా గాని, ఆటవెలదుల రూపంలోగాని, గద్యపద్యాత్మకంగా గాని, నిర్వచన గ్రంథాలుగా గాని నాటక రూపంలో గాని - ఇలా ఎన్నెన్ని ప్రక్రియలు అందుబాటులో ఉంటే అన్నన్ని ప్రక్రియలలోనూ మన ఆంధ్రులు వ్రాసుకుని, చదువుకుని , పాడుకుని, ఆడుకుని ఆనందిస్తూ ఉన్నారు. ఇన్నిన్ని రకాలుగా ఇందరిందరు ఆదరిస్తున్నారంటే అది ఆ కథ కున్న గొప్పదనం, ఆదర్శ పురుషుడుగా రూపొందించబడ్డ ఆ  శ్రీరామావతారపు  గొప్పదనం. దానిని ఆదికవి వాల్మీకి తీరుగా మలచి మన కందించిన రామాయణ గ్రంథం గొప్పదనం.
దరిమడుగు మల్లయ్య గారి గ్రంథం లో ఉత్తరకాండ లేదు. వీరి రచన పూర్తి ద్రాక్షాపాకం. సులభమైన శైలి. నిఘంటువులు చూడాల్సిన అవసరం కలగదు. మంచి ధారతో సాగిపోతుంటాయి వీరి పద్యాలు. ఉదాహరణ ప్రాయంగా కొన్నింటిని ఇక్కడ ఉదాహరిస్తాను.
రామ కథను గుఱించి--
సీ.
పుడమి పాలకులకే పురుషోత్తముని రాజ్య
మాదర్శమై నేటి కలరుచుండు
ఏకపత్నీ వ్రతాస్తోక ధర్మమునకే
వాని వర్తన కొలబద్ద యయ్యె
ఎనలేని పితృభక్తి కే వీరుని చరిత్ర
తరతరాలకు మార్గదర్శి యయ్యె
పట్టాభిషేకంబు వనవాస గమనంబు
సమదృష్టి గై కొన్న శాంతు డెవడు
తే.
ఎవని సహధర్మచారిణి యిద్ధ చరిత
మఖిల లోకాల కాదర్శమై వెలింగె
అట్టి గుణనిధి శ్రీరాము డనవరతము
కీర్తనీయుండు గాదె యఖిల జనులకు.
తే.
అట్టి ఆదిపురుషుని యవతార మందు నాది
కావ్య మగుటను వేదాను కారి యగుట
భక్తి పారాయణ మొనర్చి వాంఛితార్థ
సిద్ధి గనుచుందురనుట ప్రసిద్ధమెగద !

శ్రీరాముని గుణగణాలను వర్ణిస్తూ --
చ.
అనుపమ రూప సద్గుణ గణాధికుడై జనకోటి చిత్త రం
జనుడయి సర్వమానవ విశాల సుదృక్పధుడై ప్రసన్నుడై
మనునిభుడై గురూత్తముల మాన్యుల ముందు వినమ్రుడై వివ
ర్ధను డగుచుండె చూపరకు ధన్యత గూర్చుచు రాము డెంతయున్.

అహల్యా వృత్తాంతంలో అహల్యను గుఱించి అంటారిలా --

తపసి సేవలందు దనియుదురే వయః
పరిణతాంగులైన భామలెందు.
గీ.
భూర్భువంబులందు బుట్టెడి జీవులు
కామ విజయమింత గాంచగలరే
గరళమాహరించు పరమేశ్వరుడు దక్క
నన్నమయ శరీరు లర్హులెట్లు. 
అంటారు.

చాలాచోట్ల సామెతలవంటి ప్రయోగాలు చాలా చేసారీయన తన రచనలో.

పాపపు ఫలమేల తప్పు బలియుర కైనన్.

వికసిత హృదయంబులు రెం
డొకటిగ నతుకుటయె పెండ్లి యువతీయువకుల్

ఆడుపులి గాదె వృద్ధాప్యమక్క టకట.

తలచిన పనులేలగావు ధరణీశులకున్

--------------------------స్వార్ధ పరులు
పరిగణింతురె సుంతైన పరులబాధ.

పతి సమీపము సతికెంత పరమ సుఖమొ.

పెక్కు ధనములున్న మక్కువ సుతులున్న
నాతి భర్త లే కనాథ గాదె! (లేక+అనాథ)

తాపసుల కెగ్గొనర్చిన
పాపాత్ములు సేమమందు వారలె యెందున్.

భువన భారంబు శేషుడే పూనవలయు
వానపాముల కలవియే వసుధ దాల్ప.

రవి యుదయింపకున్న తిమిరం బడగించెడి దీపమున్నదే.

------------------------------------------ అధోముఖంబుగా
పరగునె యగ్నికీలలెటు తిప్పిన నుత్పధగాములే గదా !

పతికి నెనయగు దైవంబు పత్ని కేది ?

దుష్టశిక్షణంబు శిష్టరక్షణంబు
సలుపలేని వాడు క్షత్రియుండె !

కుడిచి కూర్చుండ నేరక కొంపగూల్చు
కొనెడి తలసీలగల్గెనో కోయటంచు.

చేటుకాలమునకు చెడుబుద్ధులన్నట్లు

పరహితంబున నసువు లర్పణ మొనర్చు
జన్మమే జన్మమది భువి సార్ధకంబు.

ధనువిదేల నాకు తనువిదేల ?

యత్నమొనరించి జాడ దీయంగ వలయు
యత్నపరులకె దైవ సహాయ మొదవు.

---- సద్వర్తనులైన మానవులనే కీడుల్ వరించుం గదా !

కష్టపడియును ఫలితంబు గాంచనైతి.

చావు సహజంబు పుట్టిన జంతుతతికి
గాన రణరంగ మరణమే కాంక్షితంబు.

ప్రాణ మున్నంతకే గదా పగలు వగలు.

కాలచక్రమునకు గమనంబు నిల్చునే
క్షణము వెనుక క్షణము జరుగుచుండు.

దిక్కరి చావనైనను పతివ్రత మానము గోలుపోవునే.

కంతు జయంబు మర్త్యులకు గల్గిన మృత్యుజయంబు గల్గదే ?

పరశురామ ప్రీతి బరగజేసె.

ఇటువంటి అందమైన నుడులు నానుడులు ఎన్నెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.

ఇవేకాక కథాసందర్భంనుంచి విడిగా చెప్పుకోదగిన పద్యాలు కూడా చాలా ఉన్నాయి. మచ్చుకు ఒకటి రెండు..

స్నేహితుని గుఱించి -
తన శుభంబుల గాంచి సంత సిలువాడు
కడు దరిద్రంబు లోన రొక్కమిడువాడు
ఆపదల నాదు కొనగలయట్టి వాడు
జీవితంబున కొక్కడే స్నేహితుండు.

కర్మమునబుట్టు జంతువు
కర్మముననవృద్ధి బొందు కర్మమున జెడున్
కర్మమె దైవంబని తా
నిర్మల కర్మం బొనర్ప నేర్వగ వలయున్.

కనకపు గట్టెంకించెడి
ఘనతరమగు నాసజూపు కాలంబందే
ఎనలేని దుఃఖసముదయ
మునకు న్నిష్కరుణ ద్రోయు పో విధి యెందున్.

వృద్ధమగల ప్రార్ధనోక్తులు వలతురే
పడుచుదనము గల్గు భామలెందు
వేడుచున్నకొలది ద్వేషింతురే గాని
అసమ వయసు మతుల నతుకవశమె.

రాజ్యకాంక్ష జేసి రమణుల తనుజుల
నైన నమ్మకుందు రధిపులెందు
నమ్మినట్ల యుండి నమ్మమి యురవగు
నీతియండ్రు ధర్మనిపుణమతులు.

అయోధ్యా కాండం ప్రారంభంలోని అందమైన సీస పద్యాన్నోసారి గమనించండి.

మోముపై చర్మంబు ముడుతలు తఱుచగు
చూపుపై నరచేయి ప్రాపుగొనును
తరుణి దూరంబగు తలయెల్ల తెల్లనౌ
మిసమిసమీసాలు పసదొలంగు
తనువున బలసంపద తొలంగు దంతంబు
లను బంధులొక్కొక్కరవల దొలగు
భత్యమియ్యని భృత్యు కైవడి
యావదింద్రియములు నాజ్ఞమీరు

జరభరంబున కోర్వక శిరము వడకు
వార్థకపు భూషణంబగు వంకుకర్ర
యేమఱకయుండు ముదివగ్గు నేమిజెప్ప
నాడుపులిగాదె వృద్ధాప్య మక్కటకట.

ఆయువల్పమైన నాసయు నధికమై
చేతులుడుగుచుండ చింతలెదుగు
పడుచువారి చేష్టలుడికించు వృద్ధుల
ముసలితనముకంటె ముప్పుగలదె.

సీతారాములవివాహసమయంలో వారు ఒకర్నొకరు ఈ విధంగా చూసుకున్నారట.
సీ.
వరుని చూపులుతన్వి శిరముపై వ్రాలి మో
మునజేరి కన్నుల మున్గితేలి
చెక్కిళ్ళపైనుండి జక్కవ చనుదోయి
దూరి మధ్యంబు పై దొడరి పాద
తలమున జేరంగ తన్వి వీక్షణములు
వరుని పాదాబ్జంబులరసి పెరిగి
జానుయుగ్మకము విశాల వక్షస్థలి
నరసి సుందర వదనారవింద
మందుబ్రాకియు సిగ్గుచేనచటనుండి
మరలిస్వస్థానమునజేరు నిరువురిట్లు
ప్రియునపాంగ వీక్షణముగల
నూతనప్రేమవీక్షణోపేతులైరి.

ఇంకా ఇంకా చాలా చాలానే వ్రాయాలనుంది కాని చదువరులకు ఇబ్బంది కలగొచ్చునేమో అనిపించి యిక్కడితో ముగిస్తున్నాను. మీ మీ అభిప్రాయాలు తెలియపరిస్తే సంతోషించగలవాడను.



1 comments

Apr 27, 2010

త దేజతి తన్మైజతి, తద్దూరే తద్వ దంతికే

త దేజతి తన్మైజతి, తద్దూరే తద్వ దంతికే
తదంత రస్య సర్వస్య, తదు సర్వ స్యాస్య బాహ్యతః.
5

కం.
అది కదలును మఱి కదలదు
అదెవరి కందనిది గాని యందఱ కందున్
అది యన్నిటిలోపలఁ గల
దది యన్నిటి బయటఁ గూడ నగపడుచుండున్.


ఆయాత్మ కదులును, అది కదలదు, అది దూరముగ నున్నది. అట్లే దగ్గరగ నున్నది. అది యీ సర్వప్రపంచముయొక్క లోపల నున్నది. అది యీ సర్వప్రపంచముయొక్క వెలుపలను ఉన్నది.

0 comments

Apr 26, 2010

అనేజ దేకం మనసో జవీయో, నై నద్ధేవా ఆప్ను వన్ పూర్వమర్షత్

అనేజ దేకం మనసో జవీయో, నై నద్ధేవా ఆప్ను వన్ పూర్వమర్షత్
తధ్ధావతో2న్యా నత్యేతి తిష్ఠత్, తస్మిన్న పో మాతరిశ్వాదధాతి

"యచ్ఛాప్నోతి య దాదత్తే, యచ్ఛాత్తి విషయా నిహ

య చ్చాస్య సంతతో భావ, స్తస్మా దాత్మేతి కీ ర్త్యతే ".
4

మధు.
మెదల దొకటె యాత్మము, కాని మించు మనోజవంబు
గదియలేరు దేవులు దాని ; కాని ముందదియె పోవు
అది కదలకయె పరువెత్తు నన్నింటి దాటిపోవు
అదియె యుండఁగ వాయువు ప్రాణుల పనులు దిద్దు.


దేవులు - ద్యోతనస్వభావముగల నేత్రాది జ్ఞానేంద్రియములని శంకరులు. ఆత్మ ఆకాశమువలె సర్వవ్యాపియు నామరూపాదులు లేనిదియుఁ గాన కదలకయె యన్నిటిని దాటి యుండునని భావము.

ఆత్మ కలదు, ఒకటె. మనసుకంటె వేగము గలది. దీనిని దేవులు - (ఇంద్రియములు ) సమీపింపలేరు. అది ముందుగానే పోవును. అది కదలనిదై పరువెత్తుకొనిపోవునట్టి యితరేంద్రియములను అతిక్రమించి పోవును. ఆ యాత్మ యన్నపుడు వాయువు ప్రాణులకు చేష్టాదిశక్తులను విభజించుచున్నది. ఆత్మ పదమునకు వ్యుత్పత్తి యీ విధముగాఁ జెప్పబడినది.

అన్నిటిని వ్యాపించునది, అన్నిటిని దనయందు లయింపఁ జేయునది, విషయముల ననుభవించునది, త్రాటియందుఁ బాముగుణములవలె దీనియందు ప్రపంచరూపము లారోపింపఁబడునుగాన " ఆత్మ" అని వ్యుత్పత్తి.( చర్ల గణపతి శాస్త్రి గారి ఉపనిషత్సుధ నుండి )

0 comments

కుర్వ న్నే వేహ కర్మాణి, జిజీవిషే చ్ఛతం సమా:

కుర్వ న్నే వేహ కర్మాణి, జిజీవిషే చ్ఛతం సమా:
ఏవం త్వయి నాన్యథేతో2స్తి, న కర్మ లిప్యతే నరే .
కం.
ధరఁ గర్మలు చేయుచునే
నిరతము నూరేండ్లు బ్రతుక నెంచఁగ వలయున్
మఱొకగతి లేదు నీ కిఁక
నరసి యిటులు చేయఁ గర్మ లంటవు నరునిన్. 2

కర్మలు - అగ్నిహోత్రాది కర్మలని పూర్వులు, స్వస్వభావోచిత కర్మలని నవీనులు.

ఈ లోకమందు కర్మలు చేయుచునే నూరుసంవత్సరములు జీవింపఁ గోరవలయును. మఱియొక మార్గము లేదు. ఇట్లు జీవింపఁ గోరు నరుఁడవయిన నీకు అశుభకర్మములు అంటుకొనవు.

0 comments

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం , 1
కం.
భగవంతుడు భువి మాఱుచు
నగపడు నీ ప్రతిపదార్ధమందును నుండెన్
తగ నది త్యాగము చే నిపు
డె గాచికొను ; మిది యెవరి ధనంబౌ.
సంస్కృతమున "ఈశావాస్య" అని మొదలు పెట్టఁబడుటచే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చెను. అవిద్యను అజ్ఞానమును నశింపఁ జేయునదిగాన ఉపనిషత్తు అని వ్యుత్పత్తి.
జగతిసందు మార్పుచెందు నిది యంతయుఁ బరమేశ్వరునిచే నిండియుండెను. దానిని త్యాగముచే నిన్ను రక్షించుకొనుము. దేనిని గోరకుము. ఇది యెవరి ధనము ?

0 comments

ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్
ఆవాహన / నాందీ శ్లోకం:

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే

కం.
పూర్ణము బ్రహ్మము జగ మిది
పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్
పూర్ణం బగు నీజగతికిఁ
బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్.


ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది.


పైన వ్రాసిన విషయములు శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి ఉపనిషత్సుధ మొదటి భాగము -1 నుండి ఎత్తి వ్రాయబడినవి. 
వారు ఈ పుస్తకములో ఈశ కేన కఠ ప్రశ్నోపనిషత్తులను తెలుగు పద్యములుగా తెనిగించిరి.



      

0 comments

ముద్దులు మోమున ముంచఁగను

 
ముద్దులు మోమున ముంచఁగను
నిద్దపు కూరిమి నించీని II పల్లవిII

మొల చిరుఘంటలు మువ్వలు గజ్జలు
ఘలఘలమనఁగాఁ గదలఁగను
ఎలనవ్వులతో నీతఁడు వచ్చి
జలజపుచేతులు చాఁచీని IIముద్దుII

అచ్చపుఁ గుచ్చుముత్యాల హారములు
పచ్చల చంద్రాభరణములు
తచ్చిన చేతుల తానె దైవమని
అచ్చట నిచ్చట నాడీని IIముద్దుII

బాలుఁడు కృష్ణుఁడు పరమపురుషుఁడు
నేలకు నింగికి నెరిఁబొడవై
చాలించి ( చాల ?) వేంకటాచలపతి దానై
మేలిమి సేఁతల మించీని. IIముద్దుII  5-303
 

 
                           

0 comments

హరిదంభోరుహలోచన ల్గగగనరంగాభోగ రంగ త్తమో

వెయ్యేళ్ళ తెలుగు పద్యం.
మ.
హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో
భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్
వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా
హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్.


ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన.

వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం.

గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే నట్టువకత్తెకు వరుసగా ముందు మౌక్తిక పట్టము, తఱువాత నుదుటి భాగము ఆ తఱువాత నిండుముఖమూ కనిపించినట్లుగా మొదట ఒక వంకర రేక గాను తఱువాత సగ భాగముగాను తఱువాత పూర్ణబింబమూ గాను తూర్పున ఉదయిస్తూన్న ( లేడిని తనయందు గలిగి ఉన్న) చందమామ కనిపించినదట. ఎంత మనోహర వర్ణన !

0 comments

Apr 14, 2010

శ్రీ అన్నమాచార్య సంకీర్తనా గానం

విజయవాడ శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే శ్రీ అన్నమాచార్య సంకీర్తనా  గానం 

5 వ నంబరు గుంపు వారిచే గానం చేయబడు సంకీర్తనలు - వాటి వివరములు.
మొదటి సంకీర్తన - నానాటి బతుకు


    నానాటి బతుకు నాటకము
    కానక కన్నది కైవల్యము IIపల్లవిII

    పుట్టుటయు నిజము పోవుటయు నిజము
    నట్టనడిమి పని నాటకము
    యెట్ట నెదుట కల దీ ప్రపంచము
    కట్ట కడపటిది కైవల్యము. IIనానాII


    కుడిచే దన్నము కోక చుట్టెడిది
    నడు మంత్రపు పని నాటకము
    వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
    గడి దాటినపుడే కైవల్యము. II నానా II


    తెగదు పాపము తీరదు పుణ్యము
    నగి నగి కాలము నాటకము
    యెగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక
    గగనము మీదిది కైవల్యము. IIనానాII


    రెండవ సంకీర్తన - మర్ద మర్ద మమ బంధాని
    నాట


    మర్ద మర్ద మమ బంధాని
    దుర్దాంత మహాదురితాని IIపల్లవిII


    చక్రాయుధ రవిశతతేజోంచిత
    సక్రోధ సహస్ర ప్రముఖా
    విక్రమక్రమా విస్ఫులింగకణ
    నక్రహరణ హరినవ్యకరాంకా. II మర్దII


    కలితసుదర్శన కఠిన విదారణ
    కులిశ కోటిభవ ఘోషణా
    ప్రళయానల సంభ్రమవిభ్రమకర
    రళితదైత్యగళరక్తవికీరణా. II మర్ద II


    హితకర శ్రీ వేంకటేశ ప్రయుక్త
    సతత పరాక్రమజయంకర
    చతురో2హం తే శరణం గతో2స్మి
    యితరాన్ విభజ్య యిహ మాం రక్ష. II మర్ద II2-81


    మూడవ సంకీర్తన - రామ రామ రామకృష్ణ

    రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
    దీము వంటి బంటననే తేజమే నాది II పల్లవిII


    వారధి దాటి మెప్పించ వాయుజుడ నే గాను
    సారె చవుల మెప్పించ శబరి గాను
    బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండ గాను
    ఏ రీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో. II రామ II



    ఘనమై మోవి మెప్పించ గరుడుడ నే గాను
    కొన కామ సుఖమిచ్చు గోపిక గాను
    వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగి గాను
    నిన్నెట్లు మెప్పించు నన్ను గాచే దెట్లా. II రామ II


    నవ్వుచు పాడి మెప్పించ నారదుడ నే గాను
    అవ్వల ప్రాణమీయ జటాయువు గాను
    ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి
    అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా. II రామ II


    నాల్గవ సంకీర్తనవాఁడె వేంకటేశుఁడనే వాఁడే వీఁడు (భూపాళం పుస్తకం లోనిది) పాడాల్సినది (రసికరంజని)
     
     
     
    వాఁడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడు
    వాఁడి చుట్టుఁ గైదువవలచేతివాఁడు II పల్లవిII

    కారిమారసుతునిచక్కనిమాటలకుఁ జొక్కి 
    చూరగా వేదాలగుట్టు చూపినవాఁడు
    తీరని వేడుకతో తిరుమంగయాళువారి-
    ఆరడిముచ్చిమికూటి కాసపడ్డవాఁడు II వాఁడె II

    పెరియాళువారిబిడ్డ పిసికి పై వేసిన-
    విరులదండల మెడవేసినవాఁడు
    తరుణి చేయివేసిన దగ్గరి బుజము చాఁచి 
    పరవశమై చొక్కి పాయలేనివాఁడు II వాఁడె II

    పామరులఁ దనమీఁది పాటలెల్లాఁ బాడుమంటా
    భూమికెల్లా నోర నూరిఁపోసినవాఁడు
    మామ కూఁతురల మేలుమంగనాచారియుఁ దాను
    గీముగానే వేంకటగిరి నుండేవాఁడు. II వాఁడె II



    ఐదవ సంకీర్తన - ఎదుట నున్నాడు వీడె
    ఎదుట నున్నాడు వీడె ఈ బాలుడు
    మది తెలియమమ్మ ఏ మరులో కాని II పల్లవి II


    పరమ పురుషుడట పసుల గాచెనట
    సరవులెంచిన విన సంగతాయిది
    పరియె తానట ముద్దులందరికి జేసెనట
    ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని II ఎదుట II


    వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట
    నాదించి విన్నవారికి నమ్మికా యిది
    ఆదిమూల మీతడట ఆడికెల చాతలట
    కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని II ఎదుట II


    అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
    కొలదొకరికి చెప్పకూడునా యిది
    తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట
    కలదమ్మ తనకెంతో కరుణో కాని II ఎదుట II 




    ఆఱవ సంకీర్తన - జయ జయ రామ
    జయ జయ రామ సమర విజయ రామ
    భయహర నిజ భక్త పారీణ రామా II పల్లవి II


    జలధి బంధించిన సౌమిత్రి రామా
    సెలవిల్లు విరచిన సీతారామా
    అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
    కలిగి యజ్ఞము కాచె కౌసల్య రామా II జయ II


    అరి రావణాంతక ఆదిత్యకుల రామా
    గురు మౌనులను గాచే కోదండ రామా 
    ధర నహల్య పాలిటి దశరథ రామా
    హరురాణి నుతుల లోకాభి రామా II జయ II


    అతి ప్రతాపముల మాయామృగాంతక రామా
    సుత కుశలవ ప్రియ సుగుణ రామా
    వితత మహిమల శ్రీవేంకటాద్రి రామా
    మతిలోన బాయని మనువంశ రామా II జయ II



    ఏడవ సంకీర్తన - వెనకేదో ముందరేదో

    వెనకేదో ముందరేదో వెర్ఱి నేను, నా
    మనసు మరులు దేర మందే దొకో II పల్లవి II

    చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని
    ఏ రూపై పుట్టుదునో ఎఱగ నేను
    కోరి నిద్రించ పరచుకొన నుద్యోగింతు కాని
    సారె లేతునో లేవనో జాడ తెలియ ( నేను ) II వెన II

    తెల్లవారినపుడెల్లా తెలిసితి ననేకాని
    కల్ల యోదొ నిజమేదో కాన నేను
    వల్ల చూచి కామినుల వలపించే గాని
    మొల్లమై నా మేను ముదిసిన దెఱగ II వెన II
    పాపాలుచేసి మరచి బ్రదుకు చున్నాడగాని
    వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెఱగ
    ఏపున శ్రీవేంకటేశు నెక్కడో వెదకేగాని
    నాపాలి దైవమని నన్నుగాచు టెరగ II వెనII

    8 వ సంకీర్తన - రామచంద్రు డితడు
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలము లియ్యగలిగె నిందరికి II పల్లవిII
    గౌతము భార్యపాలిటి కామధేను వితడు
    ఘాతల కౌశికుపాలిటి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    ఈతడు దాసులపాలిటి ఇహపర దైవము II రామ II

    పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
    సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణు పాలి నిధానము ఈతడు
    గరిమ జనకు పాలి ఘనపారిజాతము. II రామ II

    తలప శబరి పాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారి పాలి కన్ను లెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభు డితడూ. II రామ II

     9 వ సంకీర్తన - ఆదిదేవ పరమాత్మా
    దేవగాంధారి ( పుస్తకములో నున్నది) పాడవలసినది (సింధు భైరవి )

    ఆదిదేవ పరమాతుమా
    వేదవేదాంతవేద్య నమో నమో II పల్లవి II
    పరాత్పరా భక్త భవభంజనా 
    చరాచరలోకజనక నమో నమో II ఆది II
    గదాధరా వేంకటగిరినిలయా
    సదానంద ప్రసన్న నమో నమో II ఆది II


    10 వ సంకీర్తన - శరణు శరణు 
    శరణు శరణు సురేంద్ర సన్నుత
    శరణు శ్రీ సతి వల్లభ
    శరణు రాక్షస గర్వ సంహర
    శరణు వేంకటనాయకా ii శరణు ii

    కమలధరుడును కమల మిత్రుడు 
    కమల శత్రుడు పుత్రుడు
    క్రమముతో మీ కొలువుకిప్పుడు
    కాచినా రెచ్చరికయా ii శరణు ii

    అనిమిషేంద్రులు మునులుదిక్పతు
    లమర కిన్నర సిద్ధులు
    ఘనతతో రంభాదికాంతలు
    కాచినా రెచ్చరికయా ii శరణు ii

    ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు 
    నిన్ను కొలువగ వచ్చిరి
    విన్నపము వినవయ్య తిరుపతి
    వేంకటాచల నాయకా. ii శరణు ii






     
     
     





































    5 comments

    Apr 9, 2010

    శ్రీరాముని సద్గుణాలు ( మందరం నుంచి )

    కైక కోరికపై వనవాసం చేయటానికి వెళ్తున్న శ్రీరామునకై యంతఃపురస్త్రీలు దుఃఖించుట
    కం.
    మ్రొక్కుచుఁ దల్లికిఁ దండ్రికి,నక్కరణిని రామచంద్రుఁ డరిగిన నాపై
    నొక్కమొగి నంతిపురమున, మిక్కుటమై యార్తరవము మింటికి నెగసెన్.
    ప్రస్తుతము శ్రీరామప్రజల వృత్తాంతము చెప్పుటచాలించి యీలోపల నంతఃపురమున జరిగిన వృత్తాంతమును గవి చెప్పుచున్నాడు.
    ముందు చెప్పిన విధముగా శ్రీరాముఁ డందఱు తల్లులకుఁ దండ్రికి నమస్కరించి రథమెక్కి పయనమై పోఁగా నంతఃపురమున మిక్కిలి యధికమైన యేడుపుధ్వని యాకాసమున కెగసెను.
    కం.
    గతి యెవ్వఁ డనాథులకున్, గతి యెవ్వఁడు దుర్బలులకుఁ గడుఁ దపసులకున్
    గతి యెవఁడు శరణ మెవఁడా, పతి గతిచెడి యెచటి కేగువాఁడో యకటా.
    పోతనగారి బాణీ స్పష్టంగానే కనిపిస్తున్నది.
    దిక్కులేనివారికిని బలములేనివారికిని నెవఁడు పొందఁదగివనవాఁడో తపస్సు చేసికొనువారికిఁ బ్రాపింపఁ దగినవాఁడు రక్షకుఁడు నెవఁడో యట్లందఱకు రక్షకుఁడు ప్రాప్యుఁడైనవాఁడు ప్రాపురక్షకుఁడు లేక యయ్యో యెక్కడఁ బోవుచున్నాఁడో.
    సీ.
    తనమీఁద నెవరైనఁ దంట లాడిన నైనఁ , గోపంబు చెందఁడే కొమ్మలార !
    యేమి చేసిన నది యెవరి నొప్పించునో, యని జంకుచుండునే యమ్మలార !
    యెవ్వరేనియుఁ గింక నొ వ్వొంద వారల, నూఱట లాడునే యువిదలార !
    పరసుఖదుఃఖముల్ స్వసుఖదుఃఖము లట్లు , పరికించు చుండునే తరుణులార !
    తే.
    కన్న తల్లిని గౌసల్యఁ గన్న పగిది
    మనల నందఱఁ జూచునే మగువలార !
    యట్టి పుణ్యాత్ముఁ డటువంటి యనఘు చరితుఁ
    డెచట నున్నాఁడొ కటకటా యెందు జనునొ. 1124 
    తనమీద నెవరైనను గొండెములు చెప్పినను గోపింపఁడు. తానుజేయు కార్య మెవరి మనమునకైన నొప్పి కలిగించునో యనిసందేహించి   యట్లెవరి మనసు నొవ్వని కార్యములే చేయుచుండును. తనమీఁద నెవరైన గోపించి నొప్పి చెందినను వారలను సమాధానపఱుచును. ఇతరుల సుఖము తనసుఖముగను ఇతరుల దుఃఖము తన దుఃఖముగను జూచుచుండును. కన్నతల్లిని గౌసల్య నేవిధముగఁ జూచునో యట్టులే మనలనందఱఁ జూచును. అటువంటి పుణ్యాత్ముఁడు అటువంటి నిర్దుష్ట చరిత్రుఁడు ఎందున్నాఁడో - యెందు బోవుఁచున్నాఁడో ,
    ఈలాంటి ఎన్నో అందమైన పద్యాలతోనూ, అర్థ తాత్పర్య వాఖ్యానాలతోనూ సాగిపోతుంటుంది వాసుదాసు ( వావిలికొలను సుబ్బారావు ) గారి సుందరమైన మందర వ్యాఖ్యానము. అందఱూ తప్పక చదవాల్సిన మంచి పుస్తకం.









    1 comments

    ధర్మో రక్షతి రక్షితః

    ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

    విషయసూచిక

    నాకిష్టమైనవి

    ప్రస్తుత వీక్షకులు

    నా ప్రపంచం

    అతిథి దేవో భవః

    స్వపరిచయం

     
    నరసింహ - Template By Blogger Clicks