నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 21, 2010

మాతృభాషా దినోత్సవం - చుక్కగుర్తు పద్యాలు

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.--
చుక్క గుర్తు పద్యాలు
ఈరోజు మాతృభాషా దినోత్సవం. అందుకని చిన్నప్పుడు స్కూల్లో కంఠస్థం చేసిన చుక్కగుర్తు పద్యాలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నాను.

దుష్యంతుడు- శకుంతల ( శ్రీమదాంధ్ర మహా భారతము ) -నన్నయ
చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
క.
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
మధ్యాక్కర.
తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ
నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున.
చ.
విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాధ యీ పుత్త్రగా
త్త్రపరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూరసాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్ర జ్యోత్స్నయుం బుత్త్ర గా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.

గజేంద్ర మోక్షం - శ్రీమదాంధ్ర  భాగవతము -  బమ్మెర పోతన
ఉ.
ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వడు మూలకారణం
బెవ్వఁ డనాది మధ్య లయుఁ డెవ్వఁడు సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
క.
కలడందురు దీనులయెడఁ, గలఁ డందురు పరమయోగి గణములపాలం,
గలఁ డందు రన్ని దిశలను, గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో.
శా.
లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యెఁ , బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చెఁ, దనువున్ డస్సెన్ , శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెఱుఁగ, మన్నింపందగున్ దీనునిన్,
రావే యీశ్వర ! కావవే వరద ! సంరంక్షింపు భద్రాత్మకా !
మ.
అల వై కుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము " పాహి పాహి " యనఁ గు య్యాలించి సంరంభియై.
మ.
సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరఁ ఢభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి కాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
పరి చేలాంచన మైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహి యై.
మ.
తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వె
న్కను బక్షీంద్రుఁడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండుఁ దా వచ్చి రొ
య్యన వై కుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్
క.
అడి గెద నని కడువడిఁ జను, నడిగిన దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడఁబడ, నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.
వామనావతార ఘట్టం -- పోతన
క.
వెడ వెడ నడకలు నడచుచు, నెడ నెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడగన్
బుడి బుడి నొడువులు నొడువుచుఁ, జిడిముడి తడఁబడగ వడుగు సేరెన్ రాజున్.
ఉ.
స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు నుదారపద వ్యవహర్తకున్ మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు నిర్జరీ గళ
న్య స్త సువర్ణసూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్
మ.
వడుగా ! యెవ్వరివాఁడ వెవ్వఁడవు సంవాసస్థలం బెయ్య ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్
గడు ధన్యాత్ముఁడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నాకోరికల్
గడతేఱెన్ సుహుతంబు లయ్యె శిఖులుం గల్యాణ మి క్కాలమున్.
ఆ.
ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్లఁ
గోర్కెదీర బ్రహ్మ కూఁకటి ముట్టెద
దానకుతుకసాంద్ర ! ధానవేంద్ర !
క.
వ్యాప్తిం బొందక వగవక, ప్రాప్తం బగు లేశ మయినఁ బదివే లనుచున్
దృ ప్తిం జెందని మనుజుఁడు, సప్త ద్వీపముల నైనఁ జక్కం బడునే.
శా.
ఆశాపాశము దాఁ గడు న్నిడుపు లే దంతంబు రాజేంద్ర ! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా
మాశన్ బాయఁగనేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
ఆ.
వారిజాక్షులందు వైవాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగమందుఁ
జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప !
శా.
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బే రైనం గలదే శిబిప్రముఖలుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా !
శా.
ఆదిన్ శ్రీ సతి కొప్పుపైఁ దనువుపై నంసోత్త రీయంబుపైఁ
బాదాబ్జంబుల పైఁ గపోలతటిపైఁ బాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరం బుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.
ప్రహ్లాద చరిత్ర  -పోతన
క.
చదువనివాఁ డజ్జ్ఞుం డగుఁ, జదివిన స దస ద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ , జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ !
క.
అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్
తనయుల సంభాషణములు, జనకులకుం గర్ణ యుగళ స ద్భూషణముల్. 
సీ.
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునే కుటజములకుఁ
బూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు
తే.
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు
వినుతగుణశీల ! మాటలు వేయునేల ?
మ.
తను హృ ద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుఁ డై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా
సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
తే.
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభునీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
దండ్రి ! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
 
ఇంకా చాలా చాలా గుర్తుకొస్తున్నాయి. అన్నీ రాయాలంటే చాలా కష్టం . చివరగా మాతృ భాషా  దినోత్సవ సందర్భంగా నేను వ్రాసిన కవితతో దీన్ని ముగిద్దామనుకుంటున్నాను, చర్విత చర్వణమైనా గాని. అదిక్కడ చదవండి.
మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

తెలుగు
లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్
తెలుగు మాట వినరండోయ్.

తెలుగే మన మాతృభాష
తెలుగే మన ఆంధ్రభాష.
తెలుగే మన జీవ శ్వాస
తెలుగే మన చేతి వ్రాత.

తెలుగే మన కంటి వెలుగు.
తెలుగే మన ఇంటి జోతి.

తెలుగే మన మూలధనం
తెలుగే మన ఆభరణం.

తెలుగును ప్రేమించుదాం
తెలుగును వినిపించుదాం
తెలుగును వ్యాపించుదాం.
తెలుగును రక్షించుదాం.

తెలుగుకు లేదోయ్ శాపం
తెలుంగు పలుకే మనదోయ్.

తెలుగన్నా, తెలుఁగన్నా,
తెనుగన్నా, తెనుఁగన్నా,
తెలియరొ అది తేనె వూట
తెలుపరొ ప్రతి పూట పూట.

తెలుగంటే నన్నయ్యా
తెలుగంటే తిక్కన్నే
తెలుగంటే పోతన్నా
తెలుగంటే శ్రీనాథుడు.

తెలుగంటే అల్లసాని
తెలుగంటే తెన్నాలే
తెలుగంటే సూరన్నే
తెలుగంటే రాయలెగా.

తెలుగంటే అన్నమయ్యా
తెలుగంటే త్యాగయ్యే
తెలుగంటే క్షేత్రయ్యా
తెలుగంటే రామదాసు.

తెలుగంటే ఎంకిపాట
తెలుగంటే జానపదం
తెలుగంటే బాపిరాజు
తెలుగంటే బ్రౌనుదొరా.

తెలుగంటే జంటకవులు
తెలుగంటే శ్రీశ్రీ శ్రీపాదే
తెలుగంటే పానుగంటి
తెలుగంటే విశ్వనాథ.

తెలుగంటే కందుకూరి
తెలుగంటే గురజాడ
తెలుగంటే గిడుగేరా
తెలుగంటే సీనారే.

తెలుగే పాపయ్యశాస్త్రి
తెలుగే గుఱ్ఱం జాషువ
తెలుగే వెంకటచలమూ
తెలుగేరా రావిశాస్త్రి
తెలుగే కాళీపట్నం.

తెలుగంటే మొక్కపాటి
తెలుగంటే ఆరుద్రా
తెలుగంటే ముళ్ళపూడి
తెలుగురమణ బాపుబొమ్మ.

తెలుగు మాట లొలుకు తేనె
తెలుగు సినిమ విశ్వనాథ
తెలుగు పాట కృష్ణశాస్త్రి
తెలుగు నోట ఘంటసాల.

తెలుగే శృంగార పదం
తెలుగే బంగారు రథం
తెలుగే శ్రీకృష్ణు మురళి
తెలుగే మన బాలమురళి.

అందుకే

తెలుగు లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్

9 comments

Feb 13, 2010

జననియు జనకుఁడు వధువులుఁ దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్


రామాయణ రస గుళికలు ( శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము - వావిలికొలనుసుబ్బారావు గారు )
అయోధ్యాపుర జన వర్ణనము 
ఉ.
అందఱు హృష్టమానసులె యందలియందఱు ధర్మ వేదు లే
యందఱు శాస్త్రచింతనపరాయణులే మఱి స్వస్వతుష్టులే
యందఱుఁ ద్యాగశీలు రట నందఱు సత్యవచోభిభాషణా
మందులు భూరిసంచయు లమాస గవాశ్వ ధనాఢ్యు లందఱున్. ౨౬౫

అయోధ్యానగర వాసులందఱు నిష్టార్థములన్నియుఁ బ్రాప్తించుటచే సంతుష్టిగల మనస్సు గలవారే, అందఱు ధర్మము నెఱిగినవారే, అందఱు శాస్త్ర విషయమైన యాలోచనలు చేయుటయందు సమర్థులే, అందఱు తమకు భగవంతుఁ డిచ్చిన దానితోఁ దృప్తిపడి యుండువారే, అందఱు త్యాగము స్వభావముగా గలవారే, అందఱు నిజము చెప్పువారే, అందఱు కావలసినంత సంపాదించి యుంచుకొన్నవారే, అందఱు కొఱఁత లేక వారివారికిఁ గావలసినన్ని గోవులు - గుఱ్ఱములు - ధనములు కలవేరే.
కందము.
జననియు జనకుఁడు వధువులుఁ
దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్
దనివిగ నిండక యుండెడి
మనికి యొకండైనలేదు మందునకైనన్. ౨౫౭

' మాతాపితాస్ను షే పుత్రౌ పుత్రీ పత్న్యతిథి స్స్వయం
దశసంఖ్య కుటుంబీతి విష్ణునో క్తం ద్విజోత్తమ ' యని కుటుంబ లక్షణము. తల్లి తండ్రి తాను దనభార్య, ఇద్దఱు కొడుకులు, ఇద్దఱు కోడండ్రు, ఒక కూతురు, ఒక యతిథి - యీ పదుగురుండినఁ గుటుంబ మనబడును. ఇంతకుఁ దక్కువగల యి ల్లా నగరమున లేదు.( ఇప్పటి కుటుంబాలు  ముగ్గుఱు గాని నలుగుఱు గాని అంతే )
ఆటవెలది.
తన్ను ధర్మవిధులఁ దనయులఁ దనయలఁ తల్లిఁ దండ్రిఁ దనదు దార నన్న
దమ్ములను గదర్యతావశచిత్తుఁడై యేఁచువాఁడు లేఁడ యెచట నేని. ౨౫౮
ఈ పద్యమునఁ జెప్పఁబడిన వారిని కూడు నీళ్ళు పెట్టక కాని యితర విధములఁ గాని బాధించువాఁడు కదర్యుఁడు, వానిభావము కదర్యత, అత్యంతలోభియై యని భావము. 
' ఆత్మానం ధర్మకృత్యంచ, పుత్రందారాంశ్చ పీడయేత్, లోభాద్యః పితరం బ్రాతృన్ స కదర్య ఇతి స్మృతః ' అని కదర్య లక్షణము.
తాను దినక ధర్మము చేయక కొడుకులను భార్యను నెవఁడు కడుపునిండఁ గూడు పెట్టక బాధించునో యట్టి పరమ లోభి కదర్యుఁ డనబడును. అట్టివాఁ డొక్కఁ డైన నా పట్టనమందు లేఁడు.  
కందము.
పోఁడిమి గల తత్పురమున
లేఁడు ఖలుఁడు దుష్టకామి లేఁడు చదువులన్
వాఁడిమి మీఱనిపురుషుఁడు లేఁ
డట నాస్తికుఁడు నెందు లేఁడు వెదకినన్. ౨౫౯
పూర్వ మన్ని జాతులవారును విద్యనేర్చినవారే యని చెప్పుచున్నాఁడు. పూర్వము శూద్రులకు విద్య నిషేధింపఁ బడినదను దుర్వాదము దీనిచే ఖండితము. శూద్రులకు వేదము నిషేధింపఁ బడినది కాని కులవృత్తికిఁ గావలసిన విద్య లోనైనవి నిషేధింపబడలేదు. 
అందమైన యానగరమందు దుష్టుఁడు లేఁడు, పరస్త్రీల నాశించువాఁడు, తన భార్యతోనైనను నిషిద్ధదినంబుల నిషిద్ధసమయంబు లందుఁగాని క్రీడించువాఁడును, వేశ్యాలంపటుఁడును లేఁడు. చక్కగఁ జదువరానివాఁడును లేఁడు. దేవుఁడు, పరలోకము లేదనువాఁడు లేఁడు.
ఉ.
అందఱు ధర్మశీలరతులందఱు నిశ్చలసంయతాత్ము లే
యందఱు సత్స్వభావయుతులందఱు నిర్మలవృత్తశాలు రే
యందఱు సన్మహర్షినిభు లందఱు నిర్మలమానసాఢ్యు ల
య్యందఱు దారహారయుతు లందఱుఁ గుండలమండితశ్రవుల్. ౨౬౦
ఆ పురమం దందఱు ధర్మముతోఁ గూడిన శీలమందుఁ బ్రేమగలవారే, అందఱు నింద్రియనిగ్రహముగలవారే, అందఱు మంచి స్వభావముగలవారే, అందఱు దోషరహితమైన నడవడిగలవారే. అందఱు ఋషులతో సమానులే. అందఱు కలంకము లేని మనస్సుకలవారే, అందఱు ముత్యాలసరములు లోనైన యాభరణముల ధరించినవారే, అందఱు కుండలములచే నలంకరింపఁబడిన వీనులు గలవారే.
ఉ.
అందఱు సుందరుల్ మకుటు లందఱుఁ జందనలి ప్తదేహు లం
దందఱుఁ బూర్ణభోగయుతు లందఱు సంతతమృష్టభో క్త ల
య్యందఱు దానశీలరతు లందఱు భూషణభూషితాంగు ల
య్యందఱు నిష్కవంతు లట నందఱు నంగదదీప్త బాహువుల్. ౨౬౧
అందఱు చక్కదనము కలవారే, కురూపులు లేరు అందఱు మకుటములు ధరించినవారే, అందఱు చందనము పూసికొనియుండువారే, అందఱు కొఱఁత లేక భోగము లనుభవించువారే, అదఱు నిష్టమై పరిశుద్ధమైన యాహారము తీసుకొనువారే, అందఱు నన్నదాతలే, అందఱు నన్ని యవయవములయందు నలంకారములు ధరించినవారే, అందఱు నురోభూషణములు గలవారే, అందఱు బాహుపురులు గలవారే. 
ఉ.
అందఱు నిర్జితేంద్రియులు నందఱు యజ్వలు నాహితాగ్ను ల
య్యంద ఱటన్ స్వకర్మరతు లందఱు నిత్యము బ్రహ్మచింతనుల్ 
అందఱు సంతతాధ్యయనులందఱు సంయమితుల్యు లప్పురిం
జెందిన యట్టిలోకులు సుశీలరతుల్ కరుణాపరాయణుల్. ౨౬౨
ఆ పురమునందలి యందఱు నింద్రియముల జయించినవారే. అందఱు సోమయాగము చేసినవారే. అందఱు నగ్నిహోత్రములు కలవారే, అందఱు వారివారి వర్ణాశ్రమధర్మముల ననుసరించి కర్మములు చేయువారే, అందఱు ప్రతిదినము బ్రహ్మమును ధ్యానించువారే, అందఱు జపతపస్సంపన్నులే, అందఱు ఋషుల చర్యలు గలవారే్, అందఱు దయాళులే, అందఱు చక్కని నడవడి గలవారే. 
ఈ పద్యమునందలి పాదాంత సంధివిషయమును గుఱించి వాసుదాసుగారు చాలా విస్తృతమైన వివరణ యిచ్చారు. వారు ప్రతి పద్యానికి ప్రతిపదార్థాన్ని కూడా వ్రాసారు.
 


0 comments

Jan 30, 2010

ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళఁ , జూపఱుల్

రామాయణ రస గుళికలు ( కీ.శే. శ్రీ వావిలికొలను సుబ్బారావు గారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము నుండి )
చం.
ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళఁ , జూపఱుల్
గబ గబ బైటఁ బెట్టుఁ డిఁకఁ గార్యము లే దనువేళఁ, గింకరు
ల్దబ దబఁ బ్రాణవాయువులు లాగెడివేళలఁ, నాలుఁ జుట్టముల్
లబ లబ లాడువేళలఁ దలంపఁగ శక్యమె రామనామమున్ ? 1-39

సీ.
దంతంబులూడునన్చింత పుట్టకమున్న, కనుదోయి మసకలు గొనకమున్న
ముడుతలచే మేను మిడుకులాడకమున్న, వడఁకునఁ గాల్దడఁ బడకమున్న
పెండ్లము కడుఁ గడగండ్లు పెట్టకమున్న, నందను ల్దనుఁ జూచి నగకమున్న
గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న, చెడురోగములఁ దెల్వి చెడకమున్న
గీ.
పూని వైద్యుండు చెప్పక పోకమున్న
కాలభటదర్శనంబును గాకమున్న
రామ శ్రీరామ శ్రీరామ రామ యనుచు
ధ్యాన మొనరించు వాఁడెపో ధన్యతముఁడు. 1-40
సీ.
భవ్య మై మౌని సంభావ్య మై సుజనాను, భావ్య మై నవరస భావ్య మగుచు
హృద్య మై భక్తి సంవేద్య మై కావ్యాళి, నాద్య మై సతతానవద్య మగుచు
శుద్ధ మై పద్య నిబద్ధ మై శాస్త్ర సంబద్ధ మై నిగమార్థ సిద్ధ మగుచుఁ
బూత మై కలిత సంగీత మై మౌని రాడ్జాత మై ధర్మ నికేత మగుచు
తే.
శ్రావ్య మై సర్వలోక సంస్తవ్య మగుచు, దివ్య మై పార్వతీశాజ సేవ్య మగుచు
నవ్య మై గుణమణిగణ, దీవ్యదర్థమయిన కావ్యంబు రచియింతు నాంధ్రభాష. 1-78
బాలకాండకు ఉపోద్ఘాతం లో వ్రాసిన పద్య రస గుళికలు

0 comments

Jan 28, 2010

మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి I

మృత్యుంజయ స్తోత్రము -- శ్రీ శంకరాచార్యులు

1.
మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి I

మృత్యుంజయా పాహి మృత్యుంజయా II         

2.
శంభో మహాదేవ శంభో మహాదేవ I

శంభో మహాదేవ గంగాధరా  II        

3.
ద్రీశ జాధీశ విద్రా నితామౌను
భద్రా కృతే పాహి మృత్యుంజయా II         II మృ II

4.
కాశ కేశా 2 మరాధీశ వంద్య
త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా II        II మృ II 

5.
ఇందూపలేందు ప్రభోత్ఫుల్ల కుందార
విందాకృతే పాహి మృత్యుంజయా II         II మృ II

6.
క్షాహతా నంగ దాక్షాయణీ నాధ
మోక్షా కృతే పాహి మృత్యుంజయా II        II మృ II

7.
క్షేశ సంచార యక్షేశ సన్మిత్ర
దక్షార్చితా పాహి మృత్యుంజయా            II మృ II

8.
హా పథాతీత మాహాత్మ్య సంయుక్త
మోహాంతకా పాహి మృత్యుంజయా          II మృ II

9.
ద్ధి ప్రదాశేష బుద్ధి ప్రచారజ్ఞ
సిద్ధేశ్వరా పాహి మృత్యుంజయాII       II మృ II

10.
పర్వతోత్తూంగ శృంగాగ్ర నంగాంగ
హేతో సదా పాహి మృత్యుంజయాII      II మృ II

11
ప్తాత్మ భక్తౌఘ సంఘాత సంఘాతు
కారిప్రహన్ పాహి మృత్యుంజయాII      II మృ II

12.
తీ కృతానేక పారాది కృత్యుత్త
రీయా ధునా పాహి మృత్యుంజయాII   II మృ II

13.
కాదశాకార రాకేందు సంకాశ

శోకాంతకా పాహి మృత్యుంజయాII     II మృ II

14.
శ్వర్య ధామార్క వైశ్వాన రాభాస
విశ్వాధికా పాహి మృత్యుంజయా II    II మృ II

15.
షధ్య ధీశాంశు భూషాది పాపౌఘ
మోక్షప్రదా పాహి మృత్యుంజయా II      II మృ II

16.    

ద్ధత్య హీన ప్రబుద్ధ ప్రభావ ప్ర

బుద్ధాఖిలా పాహి మృత్యుంజయా II     II మృ II

17.
అంబా సమాశ్లిష్ట లంబోదరాపత్య
బింబాధరా పాహి మృత్యుంజయా II       II మృ II

18.
అఃస్తోక కారుణ్య దుస్తార సంసార
విస్తారణా పాహి మృత్యుంజయాII       II మృ II

19.
ర్పూర గౌరోగ్ర సర్వాఢ్య కందర్ప
దర్పాపహా పాహి మృత్యుంజయాII      II మృ II

20.
ద్యోత నేత్రాగ్ని విద్యు ద్గ్రహాక్షాది
విద్యోదితా పాహి మృత్యుంజయా II       II మృ II
21.
గంధేభ చర్మాంగ సక్తాంగ సంసార
సింధు ప్లవా పాహి మృత్యుంజయా II       II మృ II
22.
ర్మాంశు సంకాశ ధర్మైక సంప్రాప్య
శర్మ ప్రదా పాహి మృత్యుంజయా II       II మృ II
23.
ఙొత్పత్తి బీజా ఖిలోత్పత్తి బీజామ
రాధీశ మాంపాహి మృత్యుంజయా II       II మృ II
24.
చంద్రార్ధ చూడా మరున్నేత్ర కాంచీన
గేంద్రాలయా పాహి మృత్యుంజయా II       II మృ II
25.
ఛంద శ్శిరోరత్న సందోహ సంవేద్య
మంద స్మితా పాహి మృత్యుంజయా II       II మృ II
26.
న్మ క్షయాతీత చిన్మాత్ర మూర్తేభ
వోన్మూలనా పాహి మృత్యుంజయా II       II మృ II
27.
వచ్చారు ఘంటా మణివ్రాత కాంచీ
గుణ శ్రోణికా పాహి మృత్యుంజయా II       II మృ II
28.
ణిత్యష్ట చింతా తరంగ ప్రమోదా 
టనానంద హృత్పాహి మృత్యుంజయా II     II మృ II
29.
టంకాతి టంకా మరున్నేత్ర భంగాంగ
నానంగతా పాహి మృత్యుంజయా II       II మృ II
30.
ఠాజీ మహా కాళి కేళీ తిరస్కార
కారాళనా పాహి మృత్యుంజయా II       II మృ II
31.
డోలాయ మానాంతరంగీ కృతానేక
లాస్యేశ మాంపాహి మృత్యుంజయా II     II మృ II
32.
క్కా ధ్వనిధ్వాన దాహ ధ్వనిభ్రాంత
శతృత్వమాం పాహి మృత్యుంజయా II       II మృ II
33.
ణాకార నేత్రాంత సంతోషి తాత్మశ్రి
తానంద మాంపాహి మృత్యుంజయా II       II మృ II
34.
తాపత్ర యాత్యుగ్ర దావానలా సాక్షి
రూపవ్యయా పాహి మృత్యుంజయా II       II మృ II
35.
స్థాణో మురారాతి బాణో ల్లసత్పంచ
బాణాంతకా పాహి మృత్యుంజయా II       II మృ II
36.
దీనా వనాద్యంత హీనాగమాంతైక
మానోదితా పాహి మృత్యుంజయా II       II మృ II
37.
ధాత్రీ ధరాధీశ పుత్రీ పరిష్వంగ
చిత్రా కృతే పాహి మృత్యుంజయా II       II మృ II
38.
నందీశ వాహార విందా సనారాధ్య
విందా కృతే పాహి మృత్యుంజయా II       II మృ II
39.
పాపాంధకార ప్రదీపా ద్వయానంద
రూపా ప్రభో పాహి మృత్యుంజయా II       II మృ II
40.
ఫాలాంబి కానంత నీలోజ్వల న్నేత్ర
శూలా యుధా పాహి మృత్యుంజయా II       II మృ II
41.
బాలార్క బిబాంశు భాస్వ జ్జటాజూటి
కాలంకృతా పాహి మృత్యుంజయా II          II మృ II
42.
భోగీశ్వరా కల్పయోగి ప్రియాభీష్ట
భోగ ప్రదా పాహి మృత్యుంజయా II           II మృ II
43.
మౌళి ద్యునద్యూర్శి మాలా జటాజూటి
కాళి ప్రి.యా పాహి మృత్యుంజయా II       II మృ II
44.
జ్ఞేశ్వ రాఖండ తద్జ్ఞానిధే దక్ష
యజ్ఞాంతకా పాహి మృత్యుంజయా II       II మృ II
45.
రాకేందు కోటి ప్రతీకాశ లోకాది
సృడ్వందితా పాహి మృత్యుంజయా II       II మృ II
46.
లంకేశ వంద్యాంఘ్రి పంకేరుహా శేష
శంకా వహా పాహి మృత్యుంజయా II       II మృ II
47.
వాణీశ తూణీర వందారు మందార
శౌరి ప్రియా పాహి మృత్యుంజయా II       II మృ II
48.
ర్వాభి లాధార సర్వజ్ఞ గీర్వాణ
గర్వా పహా పాహి మృత్యుంజయా II       II మృ II
49.
డ్వక్త్ర తాత త్రిషడ్గుణ్య లోకాది
సృడ్వందితా పాహి మృత్యుంజయా II       II మృ II
50.
సోమా వతంసాంతరంగే స్వయంథామ
సామ ప్రియా పాహి మృత్యుంజయా II       II మృ II
51.
హేలాని గీర్ణోగ్రహాలాహలా సహ్య
కాలాంతకా పాహి మృత్యుంజయా II       II మృ II
52.
ళాణీ ధరాధీశ బాణా సనాపాస్త
శోణా కృతే పాహి మృత్యుంజయా II       II మృ II
53.
క్షిత్యంబు తోజోమరుద్వ్యోమ సోమాత్మ
సత్యా కృతే పాహి మృత్యుంజయా II       II మృ II
54.
యీశార్చి తాంఘ్రే మహేశాఖిలావాస
కాళీపతే పాహి మృత్యుంజయా II       II మృ II
55.
శంభో మహాదేవ శంభో మహాదేవ
శంభో మహాదేవ గంగాధరా              II మృII
ఫలస్తుతి
మృత్యుంజయో ముక్తిదాతా అథ్యవోచ దితిశృతౌ
భవరోగనిమగ్నానాం భిషఙ్మణిరితేరితః


ఇతి శ్రీ మచ్ఛంకారాచార్య విరచితం
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణం.
శివమంత్ర ప్రభావము
ఓం
శివనామైక సంసార మహారోగైక శామకమ్ I

నాన్యత్సంసారరోగస్య శామకం దృశ్యతే మయా II

శివనామమొక్కటియే సంసారరోగమును శమింపజేయునదగును. సంసారరోగమును శమింపజేయునట్టి  మరెద్దియు నాచే గాంచబడలేదు.


ఈ మృత్యుంజయ స్తోత్రము లో మొదటి పాదం 12 అక్షరాలతోనూ రెండవ పాదం 10 అక్షరాలతోనూ ఉన్నది. రాగయుక్తంగా పాడుకోవటానికి చాలా అనువుగా ఉంది. ఈ శ్లోకం ఏ చందస్సులో ఉన్నదో పెద్దలెవరయినా తెలియజేస్తే కృతజ్ఞుడనై ఉంటాను.



0 comments

Jan 14, 2010

వినరయ్య నరసింహవిజయము జనులాల

నాట

వినరయ్య నరసింహవిజయము జనులాల
అనిశము సంపదలు నాయువు నొసఁగును . IIపల్లవిII

మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు
అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
అదిరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె .    IIవినరII

అంతటఁ బ్రహ్లాదుఁడు ' అన్నిటానున్నాఁ ' డనియె
పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
యెంతయుఁ గడఁకతోడ ' ఇందులోఁ జూపు ' మని
చెంతనున్న కంబము చేతఁగొని వేసె .     IIవినరII


అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
కుటిలభయంకరఘోషముతో
చిట చిట చిటమని పెట పెట పెటమని
పటపట మనుచును బగిలెఁ గంబము .    IIవినరII



కులగిరు లదరెను కుంభిని వడఁకెను
తలఁకిరి దైత్యులు తల్లడిలి
కలఁగెను జగములు కంపించె జగములు
ప్రళయకాలగతిఁ బాటిల్లె నపుడు .    IIవినరII


ఘననారసింహుఁ డదె కంబమునందు వెడలె
కనుపట్టె నదిగొ చక్రజ్వాలలు
మునుకొని వెడలెఁ గార్ముకముక్తశరములు
కనకకశిపునకుఁ గలఁగె గుండియలు .   IIవినరII



అడరె నద్దేవునికోపాగ్నులు బెడిదపు -
మిడుఁగురులతోడుత మిన్నులుముట్టి
పిడుగులురాలేటిభీకరనఖరములు
గడుసు రక్కసునికి గాలములై తగిలె .    IIవినరII



తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
కడుపు చించెను వానిగర్వమడఁగ
వెడలెఁ జిల్లున వానివేఁడి నెత్తురు నింగికి
పొడి వొడియాయ శత్రుభూషణములెల్లను .   IIవినరII



నెళ నెళన విరిచె నిక్క వానియెముకలు
పెళపెళ నారిచి పెచ్చు వెరిగె హరి
జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె
తళుకుఁగోరలు తళతళమని మెరిచె .     IIవినరII



పెటలించి నరములు పెరికి కుప్పలువేసి
గుటగుటమని రొప్పె గోవిందుఁడు
చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
కుటిలదానవుఁ జూచి ' ఖో ' యని యార్చెను .   IIవినరII



తెంచి శిరోజములు దిక్కులకు వాని -
పంచప్రాణములుగొనెఁ బరమాత్ముఁడు
అంచెల నీరీతిని ప్రహ్లాదునిపగ నీఁగె
మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి .    IIవినరII



అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె
వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు
చిప్పిల వరములిచ్చీ శ్రీవేంకటేశుఁడు . II వినర II 4-513




0 comments

Jan 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు

బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

2 comments

Nov 15, 2009

నని యలమేలుమంగాధీశు పేరః నినమండలాంతరాబితమూర్తి పేర-

అన్నమాచార్య చరిత్రము
అంకితము


నని యలమేలుమంగాధీశు పేరః
నినమండలాంతరాబితమూర్తి పేర-


హరి పేర దరచక్రహస్తుని పేర
ధర నెన్ను మా కులదైవంబు పేర-


నాలీలఁ దాళ్ళపాకన్నమాచార్యు-
నేలిన శ్రీవేంకటేశ్వరు పేర-


నంకితంబుగను శ్రీహరిభక్తపాద-
పంకజార్చక తాళ్ళపాన్నమార్య-

తనయ తిమ్మార్యనందన రత్న శుంభ-
దనుపమ శ్రీ వేంకటాధీశదత్త-


మకరకుండలయుగ్మ మండితకర్మ
సకలవైష్ణవపాద సంసేవకాబ్జ-


సదనా వధూలబ్ధ సరసకవుత్వ-
విదితమానస తిరువేంగళనాథ-


విరచిత సద్భక్తి విభవన్నమార్య-
చరితంబు జగదేకసన్నుతం బగుచు


నాచక్రశంఖాంక యశముతోఁగూడ
నాచంద్రతారార్కమై యుండుఁగాత .


0 comments

సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు- వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల

అన్నమాచార్య చరిత్రము
అన్నమాచార్య సంతతి


సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు-
వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల


నరసయాచార్యు నున్నతయశోధనునిఁ ,
దిరుమలాచార్యుని ధీవిశారదునిఁ 


గాంచి , వారును దనకరణి విద్యలను
గాంచనాంబరు భక్తి కలిమిఁ బెంపొంద

శౌరికథాసుధాసల్లాప గరిమ
ధారుణి నెంతయుఁ దనరారుచుండె ;

మనసునఁ గపటంబు మాని సద్భక్తి
ననఘమౌ నీ యన్నమాచార్యచరిత

వినిన వ్రాసినఁ బేరుకొనినఁ జదివిన
జనులకు నిష్టార్థ సౌఖ్యంబు లొదవు -

1 comments

Nov 14, 2009

యోగమార్గంబున నొకకొన్ని బుధులు రాగిల్ల శృంగార రసరీతిఁ గొన్ని

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్యుల రచనలు


యోగమార్గంబున నొకకొన్ని బుధులు 
రాగిల్ల శృంగార రసరీతిఁ గొన్ని

వైరాగ్యరచనతో వాసింపఁ గొన్ని
సారసనేత్రు పై సంకీర్తనములు


సరసత్వమునఁ దాళసముఖముల్ గాఁగ
పరమమంత్రములు ముప్పది రెండువేలు ,


ప్రవిమల ద్విపద ప్రబంధరూపమున
నవముగా రామాయణము , దివ్యభాష


నా వేంకటాద్రిమాహాత్మ్య మంతయును
గావించి , రుచుల శృంగారమంజరియు


శతకముల్ పదిరెండు సకలభాషలను
ప్రతిలేని నానా ప్రబంధముల్ చేసి ,

0 comments

Nov 13, 2009

గద్య పద్యముల డెబ్బది రెండుమంది- యాద్యులచేఁ గొనియాడించుకొన్న

అన్నమాచార్యుని చరిత్రము
అన్నమాచార్య పురందరదాసుల చెల్మి


గద్య పద్యముల డెబ్బది రెండుమంది-
యాద్యులచేఁ గొనియాడించుకొన్న


రసికుండు శ్రీ పండరంగవిఠ్ఠలుఁడు
కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-


నెనయ సంధ్యలకు నీళ్ళియ్యఁ జేకొనుచుఁ
దనరు పురందరసాహ్వయుండు


పరమ భాగవతుఁడై పరఁగుచు నంద-
వరకులాగ్రణియైన వైష్ణవోత్తముఁడు


సవరించు మురవైరి సంకీర్తనములు
కువలయంబునఁ బేరుకొన్న మాత్రమున


తలఁచిన భూత బేతాళ పిశాచ-
ములు పాఱిపోవ నిమ్ముల శుభం బెసఁగ


విని కనియును లోన వెఱఁగందికొనుచు
చని , తాళ్ళపాకశాసనుఁ డన్నమయ్య


వెన్నునిఁగానె భావించి కీర్తించి
సన్నుతిసేయ నాచార్యవర్యుండు


నతని విఠ్ఠలునిఁగా ననయంబు దలఁచి
ప్రతిలేని గతుల సంభావించె నపుడు ;-


నీ రీతి మహిమ లనేకముల్ వెలయ
వారక వరభాగవతులు గీర్తింప

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks