నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 23, 2013

మా పాఠశాలలో జరిగిన మా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం


చాలా కాలం తర్వాత ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. కారణం ఏమిటంటే మొన్నను ఆదివారం నాడు (20 

జనవరి,2013 తేదీన) ఉండ్రాజవరం (మా స్వగ్రామం) లోని మల్లిన వెంకట నర్సమ్మ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 

విద్యార్థులం (11 వ తరగతి 1963-1969 వరకు గల)  అందరం మా పాఠశాలలో చేరి ఒకరితో ఒకరం మా పాతకాలం 

నాటి తీపి గురుతులను నెమఱు వేసుకోవటం జరిగింది. కార్యక్రమం మొదటగా ఒక్కొక్కరు విడి విడిగా పాసుపోర్టు 

సైజు ఫొటో దిగటం(సావనీరు నిమిత్తం), అల్పాహారం పూర్తి చేసుకొని అందరూ అందరితో సరదాగా కబుర్లు

చెప్పుకోవటం, ప్రతి తరగతిలోని విద్యార్థులు అందరూ తరగతులవారీగా రంగస్థలం మీదకి వచ్చి తమ తమ

పరిచయాలను క్లుప్తంగా చెప్పటం, తరువాత మా పాఠశాల నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారి వారసులను

సముచితంగా సత్కరించుకోవటం, మా పూర్వ ఉపాధ్యాయులను రంగస్థలం మీద అపురూపంగా సత్కరించు

కోవటం, గానా బజానా కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు (పిల్లలతో) చేయించటం, చివరగా మిమిక్రీ

కార్యక్రమం అంతా చాలా అట్టహాసంగా జరిగింది.


ఈ కార్యక్రమం జరిగిన విధానాన్ని సావనీరు రూపంలో అచ్చొత్తించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాం. ఈ 

కార్యక్రమానికి కావలసిన నిధులను మా పూర్వ విద్యార్థులంతా కలసి సమకూర్చుకున్నారు.ఈ కార్యక్రమ 

నిర్వహణకు సహకరించిన సహ విద్యార్థులు ముఖ్యంగా మల్లిన శేషగిరి రావు, కుదప శివకేశవ రావు, గూడుపు 

సుబ్బారావు, చిట్టూరి సుబ్బారావు, బూరుగపల్లి చిన్నారావు, మొదలైన (అందరి పేర్లూ రాయనందుకు మీరంతా 

నన్ను క్షమించాలి) వారంతా ఎన్నో రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు. ఈ సందర్భంగా 

మొగ్గతొడిగిన ఇంకో ఆలోచన ఏమిటంటే గత 50 సంవత్సరాలుగా మా పాఠశాలలో చదివిన విద్యార్థులమంతా తిరిగి 

మళ్ళీ కలసి మా పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలను 50 గంటలపాటు నిరంతరాయంగా జరుపుకుంటే 

బాగుంటుందనేది. ఈ కార్యక్రమాన్నీ ఇదే ఇనుమడించిన ఉత్సాహంతో పూర్తి చేసుకోగలమని నమ్ముతున్నాను.

ఇంక ప్రస్తుతానికి శెలవు.  

2 comments

Dec 27, 2012

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ -2

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
     మా కన్నతల్లికీ మంగళారతులు

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
    చిఱునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలిపోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.  IIమా తెలుగుII

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక  IIమా తెలుగుII

అన్నమయ కీర్తనల అపురూప భావాల
నర్తించు అలమేలు మంగమ్మ నాట్యమ్ము
రామదాసు నిలదీయు శ్రీరామచంద్రుడి 
మొగమున చిప్పిల్లు చిఱునవ్వు మంత్రమ్ము IIమా తెలుగుII

కూచిపూడిని వెలయు భామాకలాపమ్ము
అందాల హరివిల్లు మన ఆంధ్రనాట్యమ్ము
నారాయణాచార్య నాట్య శివతాండవము
అలరించు మురిపించు మనసునే వెలిగించు IIమా తెలుగుII

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం-- నీ పాటలే పాడుతాం.IIమా తెలుగుII

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!

ఈ రోజు ఈనాడు పత్రికలో ప్రచురించబడిన "మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" డదివిన తర్వాత నాకు తోచిన రెండు చరణాలను చేర్చుదామనిపించి పై విధంగా వ్రాసాను. పెద్దలు నేను చేసినది సరైన పని కాదని అనుకుంటే వారిని క్షమించమని కోరుచున్నాను. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవం మఱియు నటరాజ రామకృష్ణ గారి ఆంధ్రనాట్యం కూడా వారి కాలానికి తరువాతివేమోనన్న శంక కూడా నాకు కలుగుతోంది. ఈ రెండూ వారి కాలంలోనివి కాకపోయినా కూడా వాటిని ఇక్కడ వ్రాయటం నాకు సమంజసం గా తోచి వ్రాసాను.తప్పైతే అంతా నన్ను క్షమించమని నా మనవి.

దీనితో పాటుగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ తరుణంలో నేను ఎప్పుడో బ్లాగిన "మా తెలుగు తల్లికీ మల్లె పూదండ"ను కూడా క్రింది లింకులో వీక్షించగలరని తలుస్తున్నాను.

1 comments

Dec 15, 2012

శివమానస పూజా స్తోత్రం

శివమానసపూజా స్తోత్రం


రత్నైః కల్పిత మాసనం హిమజలైః - స్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగమదా - మోదాంకితం చందనమ్

జాతీచంపకబిల్వపత్రరచితం - పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే - హృత్కల్పితం గృహ్యతామ్.

సౌవర్ణే నవరత్నఖండరచితే - పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం - రంభాఫలం పానకమ్

శాకానా మయుతం జలం రుచికరం - కర్పూరఖండోజ్జ్వలం

తాంబూలం మనసా మయా విరచితం - భక్త్యాప్రభో స్వీకురు.


ఛత్రం చామరయో ర్యుగం వ్యంజనకం - చాదర్శకం నిర్మలం

వీణాభేరి మృదంగకాహళకలా - గీతం చ నృత్యం తథా

సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా - హ్యేత త్సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో - పూజాం గృహాయ ప్రభో.


ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః - ప్రాణా శ్శరీరం గృహం

పూజా తే విషయోపభోగరచనా - నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః - స్త్రోత్రాణి సర్వా గిరో

య ద్యత్కర్మ కరోమి తత్త దఖిలం - శంభో తవారాధనమ్.


కరచరణకృతం వా కర్మవాక్కాయజయం వా 

శ్రవణ నయనజం వా మానసం వా 2 పరాధం

విహిత మవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.


ఇతి శివమానస పూజా స్త్రోత్రం 

శివ మానస పూజా స్త్రోత్రం



0 comments

May 18, 2012

                              గౌళ


వీదు లవీదులనేఁగే విట్ట(ట్ఠ)లేశా ! వట్టి-

వేదలెల్లాఁ బాసె నిఁక విట్టలేశా !                        11పల్లవి11


వేడుకకాఁడవై తివి విట్టలేశా ! నీకు

వీడె మందుకోవోయి  విట్టలేశా !

వీడుజోడునగవుల విట్టలేశా ! నీ పై

వేడెవె ట్టె మావలపు విట్టలేశా !                        11వీదు 11


వెలసె నీమోవి గడువిట్టలేశా ! నీకు

వెలుపలే లోనయ్య విట్టలేశా

వెలలేని మహిమలవిట్టలేశా ! పూవు -

విలుతునిఁ గన్నతండ్రి విట్టలేశా !                        11వీదు11


వెన్నెలతేటమాఁటల విట్టలేశా ! నా -

విన్నపానకే కూడితి విట్టలేశా !

వెన్నతో శ్రీవేంకటాద్రి విట్టలేశా ! నీవు 
        
వెన్నుఁడవు వెయినామాల విట్టలేశా !                   11వీదు11


                                                                                             20 - 449




0 comments

May 14, 2012

                       శృంగార నాట్య శిల్పము                                           
                                                  శ్రీరాగం



విరహము వలవదు రసికులు వినరో చాటుచుఁ జెప్పెద


తరితీపను చెఱకున నిత్తఱిఁ బండు వండె నిదివో                     11పల్లవి11


బగివాయఁగ రాదిక దంపతులకు నెక్కడ జూచిన

చిగురుకుఁ జేఁగలు వచ్చెను  చిత్తజు రాజ్యమున

తగిలి తగిలి కోవిల కూతలు మొగసాలల కెక్కెను

జగమున విరసపుఁ బవనుఁడు చల్లని వాఁడాయ              11విరహము11


పొసఁగంగ నెవ్వరికైనను పొందులె జరపఁగ వలసెను

పసిమొగ్గలు వాడెక్కెను వసంతకాలమున

ముసగస లాడెడు తుమ్మిదల మోతల చలములు చెల్లెను

సుసరము ననె పగరాజును చుట్టము వాఁడాయ               11విరహము11


కలయికలే కలకాలము కాణాచులుగాఁ బరగెను

ఇలలో శ్రీ వేంకటపతి యిచ్చిన సంపదను

యెలమిని పదారువేలకు ఇతఁడే మగడై నిలిచెను

కలగొని మనసనియెడి చెలికాడును దోడాయ.              11విరహము11


 (తాళ్ళపాక పదసాహిత్యము శృంగార సంకీర్తనలు -28 సంపుటం) 

                                                                              28-27


వలవదు = వద్దు

తరితీపు =a fool's paradise, lust, ఉద్ధృతి

నిత్తఱిఁ = this time, this opportunity

వండె= పండె

బగివాయఁగ= ఎడబాటు

చేఁగలు=చేవ, బలము

చిత్తజు = మన్మథుని


మొగసాలలునగరి తలవాకిట చావడి.


పొసఁగంగ=to bring to terms, to persuade

ముసగసలు=రహస్యసంభాషణములు(ఈ అర్థం నిఘంటువులలోనిది కాదు, నాకు తోచినది)

చలములు=మాత్సర్యములు

సుసరమునను= వెంటనే


పగరాజు=చంద్రుడు


కాణాచులు = చిరకాలవాస స్థానములు,  A hereditary right to enjoy a certain office or a piece of land.

పరగు=ప్రయుక్తమగు, ప్రసరించు, విహరించు

ఎలమిని = pleasantly, సంతోషము, వికాసము, తృప్తి

కలగొని=కలుగు, వ్యాపించు


ఇది అన్నమయ్య రసికుల కిచ్చిన సార్వకాలిక సందేశం ! రసికజీవన 
నాట్యశిల్పానికిది మూల సూత్రం !! శృంగార సంకీర్తనల రసాస్వాదనానికిది
మహాద్వారం !!! ఆ ద్వారంవద్ద, చూత కిసలయాలు తోరణాలుగా కట్టిన ఆమహాద్వారం వద్ద అన్నమయ్యయే స్వయంగా నిలబడి రసికులకు స్వాగతం పలుకుతున్నాడు. రసిక హృదయులను తన సంగీత సాహిత్య రస విభావరీ చర్వణానికి సమాహ్వానిస్తున్నాడు.


అయ్యా! ఇది రసికరాజ్యము ! ఇక్కడ యికమీదట 'విరహ' మనే మాటకు తావులేదు.ఎందుకంటే, చెఱకు విలుకాని పంట యిప్పుడు పండినది. దంపతుల కిక్కడ ఎడబాటు లేదు. విరహ మంతకంటే లేదు. సరికదా - ఒకరి ప్రక్క నొకరు, ఒకరివెంట నొకరు ఆసుపోసినట్లుగా తిరగవలసిందే ! ఈ మన్మథుని రాజ్యంలో చిగురుకు చేవ వచ్చింది. 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ' అన్నమాట సార్థకమైంది.కోవిల కూతలు యిండ్ల ముంగిళ్ళలోనికి అంటే యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియుల హృదయాలకు తగిలి తగిలి యింపెక్కాయి. అందాకా వేడిగాలులు వీచిన పవనుడు కాస్తా చల్లని వాడయ్యాడు. 


ఇటువంటి పరిస్థితుల్లో ప్రేయసీ ప్రియుల సమాగమం తప్పదు. ఈ వసంతకాలంలో పసిమొగ్గలు సైతం వాడి యెక్కాయి. అనగా పుష్పబాణుడైన మన్మథుడు తన పంచబాణాలను వాడిగా యెక్కుపెట్టాడు. అవ్యక్త మధురంగా ముసగసలాడే తుమ్మెదల మోతల సాధింపులకు కాలం చెల్లింది. చాల సులభంగానే, ఒకప్పుడు విరహకాలంలో పగబూనిని చంద్రుడు దగ్గరి చుట్టమయ్యాడు.


ప్రేయసీ ప్రియులైన దంపతుల కలయికయే యిప్పుడు కాణాచిగా గుర్తింపబడింది. పదారువేల గోపస్త్రీలకు తా నొక్కడే మగడై శ్రీ వేంకటపతి ఈ భూమిపై నిలచి సంపదతో వెలుగుతున్నాడు. ఇక రసికులకు వారి మనస్సనే చెలికాడు తోడైవున్నాడు. రసికులకు విరహవ్యధ యిక ముమ్మాటికీ లేదని అన్నమయ్య ఘంటాపథంగా చాటి చెప్పిన కీర్త యిది.


(ఇక్కడ వ్రాసిన వాక్యాలు పరిష్కర్త శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారివి కాని  ఈ సంపుటానికి పీఠిక వ్రాసిన వారివి కాని కావచ్చును.వారి పేరు గ్రంథంలో ఉదాహరింపబడలేదు. గమనించగలరు.)




      

4 comments

May 12, 2012

                          లలిత
కోరికలు కొనసాగె గోవిందరాజ

మేరమీరి ఇట్లానే మెరసితివా               11పల్లవి11


బాలుఁడవై రేపల్లెలోఁ బాలు దాగేవేళ

యీలీలనే పవళించి యిరవైతివా

గోలవై తొట్టెలలోన గొల్లెత లూఁచి పాడఁగా

ఆలకించి విని వాట లవధరించితివా     11కోరి11


కొంచక మధురలోనఁ గుబ్జఇంట నీ లాగుల

మంచాలపైఁ బవళించి మరగితివా

చంచులద్వారకలోన సత్యభామతొడమీఁద

ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా   11కోరి11


పదియారువేలింతుల పాలిండ్లు తలగడలై

పొదల నిటువలెనే భోగించితివా

యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన

నిదిరించక శ్రీభూమినీళలఁ గూడితివా         11కోరి11


                                                                                               25-285

ఇరవు = స్థానము, చోటు, స్థిరము

గోల = an artless innocent woman, ముగ్ధ, ముగ్ధుడు

లాగుల =పెనగులాట

మరగు=అలవాటుపడు

చంచుల=ఆముదపు చెట్లు ఎక్కువగాగల(?), పక్షిముక్కు ఆకారంలో 

ముంచి=మునుగజేయు, to sbmerge

పొదల=వర్ధిల్లు, ప్రకాశించు, పొదలలో అనికూడ అర్ధం చెప్పుకోవచ్చును

 

0 comments

May 10, 2012

నాగ వరాళి


దైవము నెరఁగము తత్వము దలఁచము

చేవై హరి రక్షించీ నిదివో                 11పల్లవి11


పాపముఁబుణ్యముఁ బైకొను దేహము

కోపము శాంతపుగుణములది

వోపిక వోపము లుదుటు చూపెడిది(వి?)

చే పట్టుక యిటు చెలఁగే మిదివో         11దైవ11


వెలికిని లోనికి విడిసేటి ప్రాణము

చలువలు వేండ్లు చల్లెడిది

తెలివికి నిదురకుఁ దేపై యున్నది

బలిమిఁ జే పట్టుక బ్రదికే మిదివో         11దైవ11



పరమును నిహమునుఁ బట్టిన జీవుఁడ

పొరుగుకు నింటికిఁ బొత్తైతి

గరిమల శ్రీ వేంకటపతి శరణని

నిరతపు మహిమల నెగడే మిదివో      11దైవ11        4-294 

0 comments

Sep 10, 2011

శివతాండవం - 3

ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి. అయితే ఏంటి? అంటారా? ఏమీలేదండీ బాబూ , నేను ఈరోజే పుట్టానట. అదీ సంగతి. పుట్టిన రోజు నాడు ఆనందంగా గడపాలిట కదా!
అందుకే

ఏమానందము భూమీతలమున-----


అని శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవాన్ని ఓసారి తలచుకొంటే బాగుంటుందనిపిస్తున్నది. శివతాండవం - 1 అయింది. శివతాండవం - 2 నంది నాంది అనేది. ఇది పూర్తిగా సంస్కృతంలో ఉంది. అర్థం చేసుకున్న తఱువాత పోస్టు చేస్తే బాగుంటుంది. ఇక శివతాండవం - 3ను ఇక్కడ ఉంచుదామని ప్రయత్నం.

శివతాండవం -3

తలపైని చదలేటి యలలు దాండవమాడ

నలలఁ ద్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడఁ

మొనసి ఫాలము పైన ముంగుఱులు చెఱలాడ

కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ

కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప

కనుచూపులను తరుణకౌతుకము చుంబింప

కడఁగి మూఁడవకంటఁ గటిక నిప్పులు రాల

కడుఁ బేర్చి పెదవి పైఁ గటిక నవ్వులు వ్రేల

ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూఁగ

అమిత సంరంభ హా హా కారములు రేగ

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          1



కిసలయ జటాచ్ఛటలు ముసురుకొని వ్రేలాడ

బుసలుగొనిఁ దలచుట్టు భుజగములుఁ బారాడ

మకర కుండల చకాచకలు చెక్కులఁ బూయ

అకలంక కంఠహారాళి నృత్యము సేయ

ముకు జెఱమలో శ్వాసములు దందడింపంగఁ

బ్రకట భూతి ప్రభావ్రజ మావరింపంగ

నిటల తటమున చెమట నిండి వెల్లువ గట్ట

కటయుగమ్మున నాట్యకలనంబుఁ జూపట్ట

తకఝణుత ఝణుత యను తాళమానము తోడ

వికచ నేత్రస్యంది విమల దృష్టుల తోడ

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          2



భుగ భుగ మటంచు నిప్పులు గ్రుమ్మ నూరువులు

ధగ ధగిత కాంతి తంద్రములుగాఁ గకుభములు

దంతకాంతులు దిశాంతములఁ బాఱలు వాఱ

కాంత వాసుకి హస్త కటకంబు డిగజాఱ

భావోన్నతికిని దాపటిమేను వలపూఱ

భావావృతంబు వల్పలిమేను గరుపాఱ

గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ

నజుఁడు గేల్గవ మోడ్చి "హర హరా" యని వేడ

ఝణుత తధిఝణుత తదిగిణతో యను మద్దెలల

రణనంబు మేఘ గర్భముల దూసుక పోవ

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          3



ఎగుభుజమ్ములు దాచి నగుమొగమ్మున జూచి

వగ లురమ్మునఁ దూచి భావాభిరతి నేచి

తరళ తంద్రమ్ము మధ్యమ్ము కిట కిట లాడ

వరసాంధ్య కిమ్మీర ప్రభలుఁ దనువునఁ గూడ

కుణియునెడ వలయంపు మణులు చిందఱలాఁడ

కిణు కిణు మటంచుఁ బదకింకిణులు బిరుదాఁడ

శృంఖలారుండములు చెలఁగి తాండవమాఁడ

శంఖావదాత లోచనదీప్తి గుమి గూడ

వలగొన్న యెముకపేరులు మర్మరము సేయ

పులకింపఁగా నొడలు మురజంబులను మ్రోయ

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          4


మొలక మీసపుఁ గట్టు, ముద్దు చందురు బొట్టు

పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు

నెన్నడుమునకు చుట్టు, క్రొన్నాగు మొలకట్టు

క్రొన్నాగు మొలకట్టు, గురియు మంటల రట్టు

సికపై ననల్ప కల్పక పుష్పజాతి, క

ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధుర వాసనలు

బింబారుణము కదంబించు దాంబూలంబు

తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ

గనుల పండువు సేయ, మనసు నిండుగఁ బూయ

ధణ ధణ ధ్వని దిశాతతి బిచ్చలింపంగ

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          5



సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు

సకల వాఙ్మయము వాచికంబు గాఁగ మృడుండు

సకల నక్షత్రంబులు కలాపములు గాఁగ

సకలంబు దనయెడద సాత్త్వికంబును గాఁగ

గణనఁ జతుర్విధా భినయాభిరతిఁ దేల్చి

తన నాట్య గరిమంబుఁ దనలోనె తా వలచి

నృత్యంబు వెలయించి నృత్తంబు ఝుళిపించి

నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి

లాస్య తాండవ భేది రచనాగతులు మీఱ

వశ్యులై సర్వ దిక్పాలకులు దరిఁ జేర

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          6



అంగములు గదురఁ బ్రత్యంగములును చెదర

హంగునకు సరిగా నుపాంగములునుఁ గుదుర

తత సమత్వాదు లంతః ప్రాణ దశకంబు

అతి శస్తములగు బాహ్యప్రాణ సప్తకము

ఘంటాస దృక్కంఠ కర్పరము గానంబు,

కంఠగాన సమాన కరయుగాభినయమ్ము

కరయుగము కనువైన కనులలో భావమ్ము

చరణములు తాళమ్ము చక్షు స్సదృక్షమ్ము

ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగ

పరవశత్వమున శ్రీపతియున్ జెమర్పంగ

            ఆడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          7




కరముద్రికల తోనె గనుల చూపులు దిరుగ

తిరుగు చూపులతోనె బరుగెత్తె హృదయమ్ము

హృదయమ్ము వెనువెంట కదిసికొన భావమ్ము

కుదిసి భావముతోనె కుదురుకోగ రసమ్ము

శిరము గ్రీవమ్ము పేరురము హస్తయుగమ్ము

సరిగాగ మలచి గండరువు నిల్పిన యట్లు

తారకలు జలియింప తారకలు నటియింప

కోరకములై గుబురు గొన్న జూటము నందు

సురగాలి నలిరేఁగి చొక్కి వీచినఁ యట్లు

పరపులై పడఁ గల్పపాదపంబులఁ బూవు

             లాడెనమ్మా ! శివుఁడు

            పాడెనమ్మా ! భవుఁడు          8



(ఇంకా వుంది)














  








3 comments

Sep 2, 2011

శివతాండవం -1

కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి

శివతాండవం -1

ఓం

ఆఙ్గికం భువనం యస్య

          వాచికం సర్వ వాఙ్మయం
    
ఆహార్యం చన్ద్ర తారాది

          తం నమ స్సాత్వికం శివమ్.


ఏ మానందము 

భూమీ తలమున 

శివ తాండవ మట !

శివ లాస్యం బట !    1


అలలై ; బంగరు 

కలలై , పగడపుఁ

బులుఁగుల వలె మ

బ్బులు విరిసినయవి

శివ తాండవ మట !

శివ లాస్యం బట !     2


వచ్చిరొ యేమొ ! వి

యచ్చర కాంతలు

జలదాంగన లై

విలోకించుటకు

శివ లాస్యం బట !     3


యే మానందము

భూమీ తలమున !

పలికెడు నవె ప

క్షులుఁ బ్రాఁ బలుకులొ !

కల హైమవతీ

విలస న్నూపుర

నినాదముల కు

న్నను కరణంబులొ !   4


కొమ్మల కానం

దోత్సాహమ్ములు

ముమ్మరముగ మన

ములఁ గదలించెనొ !

తల నూచుచు గు

త్తులు గుత్తులుగా

నిల రాల్చును బూ

వుల నికరమ్ములు.     5


రాలెడు ప్రతి సుమ

మేలా నవ్వును !

హైమవతీ కుసు

మా లంకారము

లందునఁ దా నొక 

టౌదు నటంచునొ !     6


లలితా మృదు మం

జుల మగు కాయముఁ

బూవుల తాకుల

తో వసివాడదొ !    7


భారతి యట పా

ర్వతికి నలంకా

రముఁ దీర్చెడునది ! 

రమణీయ స్మిత

ములఁ గావించునొ

యలరుల మృదువులు !   8


చతురాననుఁ డే

సవదరించు నట

శర్వున కుత్తమ

సర్ప విభూషలు ! 

వీచె  విశబ్దిత

కీచకములు మృదు

వీచులుగాఁ ద

ర్పిత లోకమ్ములు

మారుతములు గో

టీ రితా బ్జుఁ డగు

శివునకు సేసలు

జెల్లించుటకై         9


తకఝుం తకఝుం

తక దిరికిట నా

దమ్ములతో లో

కమ్ముల వేలుపు

నెమ్మిగ నిలఁబడి

నృత్యమాడు నెడ

లయానుగతిఁ గ

మ్రముగా శ్రుతిఁ బ

ట్టుటకో ! గొంతులు

నవదరించు ను

త్కట భృంగమ్ములు.   10


ఈ సెల కన్నెల

కెవ్వరు జెప్పిరొ !

యీ సర్వేశ్వరు

నభినయ మహమును

కుచ్చెళు లెల్లడ

విచ్చల విడిగా

దుసికిళ్ళాడఁ గ

నసమునఁ బరుగిడు -    11


ఓ హో హో హో !

యూహాతీతం

బీ యానందం

బిలా తలంబున !        12


సంధ్యాసతి ! యీ

సంభ్రమ మేమిటె !

నవ కుసుంభరా

గవసన మేమిటె !

అకుంచిత తి

ర్య క్ప్ర సారి ల

జ్జా మధుర కటా

క్ష పాత మేమిటె !      14


విలాస వక్రిత

విచల న్మధ్యం

బున హ్రీమతి ! నీ

వును వలెనే జిఱు

పలకని మేఖల

వాలక మేమిటె !       15


యెవ్వరి కోసర

మీ బిబ్బోకము ! 

శివపూజకొ ! యో

చెలువా ! యీ కథ

లెవ్వరు జెప్పిరె ?

యిలా తలంబే

ఆడెడు నట నా

ర్యా ప్రాణేశ్వరుఁ

డో దినమణి ! నిలు

రా ! దినమంతయుఁ

బడమటి దేశపు

వారల కీ కథ

నెఱిగించుటకై

బరుగెత్తెదవో !       16


అల మృగములుఁ గ

న్నుల బాష్పమ్ములు

విడిచెడు నెందుకు !

విశ్వేశ్వరునకు

నడుగులు గడగుట

కై పాద్యంబో !       17


గుసగుసమని యీ

కిసలయములు స

మ్మద పూరముగా

మాటలాడు నెదొ !!

యేమున్నది ! లో

కేశ్వరు నాట్యమె !        18


ఓ హో హో హో !

యూహా 2 తీతం

బీ యానందం

బిలా తలంబున . 19

( తెలియని లేక సందేహాస్పదంగా అనిపించిన పదాలకు అర్థాలు తెలుసుకోవటానికి ఇదే బ్లాగులో ఉన్న ఆంధ్ర నిఘంటువును పాఠకులు ఉపయోగించెదరు గాక !) 


  


        


1 comments

Jun 1, 2011

అరుదైన భవదూరుఁడగు నీతఁడు

నా బ్లాగు మిత్రులందరికీ నా బ్లాగుకి నా పునరాగమన సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంతకాలం బ్లాగుకు దూరంగా ఉన్నాను. కాని ఈ రోజెందుకో బ్లాగు ద్వారా మిమ్మల్నందఱినీ పలకరించా లనిపించింది. ఈ బ్లాగులో అన్నమాచార్యులవారి దశావతారాల సంకీర్తన నొకదానిని మీ అందరితో పంచుకోవాలనిపించి ఈ ప్రయత్నం.

20 రేకు లలిత(అవతారాలు)
అరుదైన భవదూరుఁడగు నీతఁడు
అరిది భవములందునతఁడు వో యితఁడు II పల్లవి II

కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద
కొడుకు కొరకుఁగా గోరపడి
కొడుకువైరి భక్తిఁ గూడిన యాతని
నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు IIఅరుII మత్స్యావతారము?

ఆలితమ్ముని రాకకలరి మెచ్చెడిచోట
ఆలుఁ దానును నుండి యందులోన
ఆలిచంటికింద నడ్డమువడుకున్న
ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు IIఅరుII కూర్మావతారము?

సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి
సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా
సవతులేనిపంటఁ జప్పరించివేసి
ఆవల యివల సేసి నతఁడు వో యితఁడు IIఅరుII వరాహావతారము?

తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ(?)
దొలఁ (డ?)గి తోలాడెడి దొడ్డవాని
తొడమీఁద నిడి వానికడుపులో తొడవులే
యడియాలమగు మేని యతఁడు వో యితఁడు IIఅరుII నరసింహావతారము?

పదము దానొసఁగుచుఁ బదమడుగగఁ బోయి
పదము వదము మోవఁ బరగఁ జేసి
పదముననె దివ్యపదమిచ్చి మనుమని
నదిమి కాచినయట్టి అతఁడు వో యితఁడు IIఅరుII వామనావతారము

అత్తకొడుకుపేరి యాతనిఁ దనకూర్మి
యత్తయింటిలోన నధికుఁ జేసి
మత్తిల్లు తనతోడ మలసిన యాతని
నత్తలిత్తల సేసినతఁడు వో యితఁడు. IIఅరుII పరశురామావతారము?

పాముతోడుతఁ బోరి పంతముగొనువాని
పాముకుఁ బ్రాణమై పరగువాని
ప్రేమపుఁ దనయుని బిరుదుగా నేలిన
ఆమాటనిజముల అతఁడు వో యితఁడు. IIఅరుII కృష్ణావతారము?

ఎత్తుక వురవడినేఁగెడి దనుజుని
యెత్తుకలుగు మద మిగుర మోఁది
మత్తిల్లు చదువుల మౌనిఁ జం..........
అత్తలేని యల్లుఁడతఁడు వో యితఁడు. IIఅరుII రామావతారము

బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
పగలుగాఁగ రేయివగలు సేసి
జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల
అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు. IIఅరుII బలరామావతారము?

మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
పెట్టెడిరాయ....................
కట్టెడికాలము కడపట నదయుల(?)
నట్టులాడించిన అతఁడు వో యితఁడు. IIఅరుII కల్క్యావతారము

తలఁకకిన్నియు జేసి తనుఁగాని యాతని
వలెనె నేఁడు వచ్చి వసుధలోన
వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు. IIఅరుII వేంటేశ్వరస్వామి 4-8 ( నిడురేకులలోని 77 సంకీర్తలలో 8వ సంకీర్తన యిది)
ఇది దశావతారాల కీర్తన. అందుచేత మనం వరుసగా మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ,బలరామ, రామ,కృష్ణ, కల్క్యావతారాలు గుర్తులో ఉంచుకుని ఈ కీర్తనని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి. అన్నమయ్య మన తెలివితేటలకి జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టినట్లుగా ఉన్నది ఈ సంకీర్తన. నాకు అర్థం పూర్తిగా తెలియటం లేదు. ఎవరైనా పెద్దలు గాని, పిన్నలుగానీ ఈ సమస్యను విపులీకరించి నాకు సుబోధకమయ్యేలా విడమరిచి చెప్తే వారికి నేను కృతజ్ఞుడనై ఉంటాను.
అత్తలేని అల్లుడు అంటే రామావతారము అనుకొన్నాను.సీతాదేవి అయోనిజ కాబట్టి. పదమడుగబోయి అంటే వామనావతారము బలిని దానమడిగిన విధానం మూడు అడుగులు( పదములు) కాబట్టి.కట్టెడి కాలము కడపట అంటే చివరలో వచ్చే కల్క్యావతార మనిపించింది.

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks