నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label అన్నమాచార్య చరిత్రము (చిన్నన్న). Show all posts
Showing posts with label అన్నమాచార్య చరిత్రము (చిన్నన్న). Show all posts

Aug 18, 2009

నితరు లెవ్వరి యాత్మ లెఱుఁగనియట్టి- యతని యాఁకలి జగదంబ తా నెఱిఁగి

అన్నమాచార్య చరిత్ర

అన్నమయకు దేవి ప్రత్యక్షమగుట

నితరు లెవ్వరి యాత్మ లెఱుఁగనియట్టి-
యతని యాఁకలి జగదంబ తా నెఱిఁగి

యలమేలుమంగ తియ్యము నెయ్య మెసఁగ
బలుచన్నుఁగవ తుదఁ బాలు చిప్పిలఁగ

మినుకారు క్రొక్కారు మెఱుఁగుచందమున
ఘనపయోధరములఁ గడుఁజూడఁ గలిగి

దినుసైన లేఁబువ్వుఁదీగె కైవడిని
మొనసిన బలుమొల్లమొగడలఁ దనరి

పనుపైన రాచిల్కభాతిఁ జక్కెరలు-
గొసరెడు పల్కుల గొనబు చూపుచును

విరివంటివాని చే వెడవింటి నారి
దొరసి నిక్కిన కొప్పుతో నొప్పుమీఁఱి

కమనీయమగు చంద్రకళ సోయగమున
నమృతాధరస్ధలి నలరి చూపట్టి

కులుకుఁదావుల తమ్మికొలని భావమునఁ
బొలుచు హంసక నాదములు బిడారించ

పెద్దముత్తైదువ పేర్మితో బాలు
నొద్దకు నేతెంచి యూఱడింపుచును

పడుచ! యేమిటి కిటఁ బడియున్నవాఁడ-
వద(డ?)లక లేచి రమ్మన్న, నా శిశువు

పైకొన్న యాఁకలి బలుదవ్వు నడచి
రాకఁ గన్నులు గానరావు మాయమ్మ!

అందులకొక యుపాయముఁ జెప్పి నాకుఁ
గందర్పజనకునిఁ గనజేయుమమ్మ!

యనవుడు కమలమహాదేవి శిశువుఁ
దన కృపామృతధారఁ దనివి నొందించి

బాలక! యీ మహాపర్వతేంద్రంబు
లాలిత సకల సాలగ్రామమయము

ఘనులకు నిది చెప్పుఁగాళ్ళ నెక్కంగఁ
జనదు నీ చెప్పులు సడలించి వైచి

కనుఁగొను కన్నులఁ గనవచ్చు ననిన,
విని బాలుఁ డట్ల కావింతు నే ననుచు

గ్రక్కునఁ బాదరక్షలు దీసివైచి
యక్కొండఁ గనుఁగొనునపుడు, గన్నులకు

వనమాలికలచే సువర్ణరేఖలను
గనుపట్టు గొనవెండ్రుకల కురంగముల

వేణు బాణాసన వితతచక్రముల
రాణించి ధరణీవరాహవైఖరుల-

నా రమానారాయణాకృతి గలిగి
శ్రీరామకృష్ణ లక్ష్మీనృసింహాది

మూర్తులన్నియు నొక్క మొత్తమైనట్లు
వర్తింపుచున్న నా వడువు వీక్షించి

మహిత సాలగ్రామమయమౌ నటంచు
బహువిస్మయము నొంది ప్రణతు లొనర్చి

యా జగజ్జననికి నభివాదనంబు-
లోజఁ గావింప నయ్యువతీలలామ

శౌరియుఁ దాను నిచ్చలు పొత్తుగలసి
యారగించిన ప్రసాదాన్నముల్ దెచ్చి

పరిపరిరుచుల నేర్పడ సేదదేర
పెరిమతో భుజియింపఁబెట్టి యూరార్చి

తిరుమలప్పని దేవదేవునిఁ గొలువ-
నరుగుమటంచు నయ్యరవిందసదన

తొల్లింటికరణి కౌస్తుభరత్నహారు-
నుల్లంబుమీఁదట నుండె నుండుటయు,

శ్రీమూర్తులందుల చిహ్నంబు లిపుడు-
నా మహాచలశిలలందు నింపొందు-

1 comments

Aug 15, 2009

నింటివారలు పిల్చి యేమి చెప్పినను గెంటనాడక పరికించి సేయుచును

అన్నమాచార్య చరిత్ర

అన్నమయ్య తిరుమలయాత్ర

నింటివారలు పిల్చి యేమి చెప్పినను
గెంటనాడక పరికించి సేయుచును

జననియు నన్నయు జనకుండు వదినె
యును గొన్నిపనులు సేయుచుఁ దన్నుఁ బిలిచి

పసులకు కసవుఁ దేఁబనుప బాలుండు
వెస నేఁగి వాఁడి లవిత్రంబు పూని

మరకతాంకూరకోమల భర్మరుచులఁ
గరమొప్ప పచ్చని గఱిక వీక్షించి

పాపవల్లరుల శ్రీపతినామ హేతి
నేపారఁ దఱుగు యోగీంద్రుచందమున

కెసిమస నొక పిడికెఁడు గోసి మఱియుఁ
గసవు గోయఁగఁబోయి కడవ్రేలు సోఁకి

వడియు నెత్తురు సూచి వాక్రుచ్చి శౌరి-
యడుగులు దలఁచి శ్రీహరి హరీ ! యనుచు

నీ కోఁతకొలఁది నాదెఱిఁగిన వదినె
చేకోఁత పడఁగాదు చీ రోఁత యనుచు

హరి చరాచరదేహి యని పెద్ద లనఁగ
నిరవొంద నెఱిఁగియు నిటు సేయఁదగునె

చిడిముడి నేమి చేసెదనంచు చేతి-
కొడవలి నేల గ్రక్కునఁ బాఱవైచె;-

నెన్నటి చుట్టంబు లిటువంటివార-
లెన్నటి బంధుండ నేను వారలకు-

నీ వట్టివెఱ్ఱి నాకేల కావింప
భావింప నాలోనఁ బాయ కెల్లపుడు

తల్లియుఁ దండ్రియు దైవంబు గురువు-
నెల్లసంపదలునై యెల్లచందముల

ననుఁబ్రోచు శేషాద్రినాథునిఁ గొలిచి
మనియెద ననుచు నెమ్మది పాదుపఱిచి

నలుదెసల్ పరికించి నానావిధముల
విలసిల్లు శ్రీరాగవెల్లువల్ వోలె

దండెలు శ్రుతిగూడి తాళసంగతుల
దండిమద్దెలలు బిత్తరముగా ముట్ట

నానందబాష్పము లడర నాగతుల-
నా నందనందను నంకించి పాడి

తన్మయులగుచుఁ జిత్రపునాట్యగతులఁ
జిన్మయునందునే చిక్కి చొక్కుచును

సనకాదులను పేరఁ జనుదెంచువారి-
ననుపదంబు నిది మహర్లోకమనుచు

గోవింద గోవింద గోవింద యనుచు-
నా వరుసనె నరహరి హరీ యనుచు

తిరుమలప్పను నాదు దీరకమున్న
వరములప్పని మ్రొక్కి వర్ణించువారి

నెఱులందు రంగువన్నెలు పిసాళించు-
నొఱపైన నిడుద మయూరకంఠములు

నటియించు కృష్ణాజినపుఁగిరీటములు
బటువైన బేగడ పాఱుటాకులును

పీలికుచ్చుల నెక్కు పెట్టిన దిండ్లు
ఫాలరేఖల నిండు పట్టెనామములు

ఘనమైన శంఖచక్రముల ముద్రికలు
పనుపడ దేవరబాణముల్ పూని,

కోనేటిరాయఁడె కొండలవాఁడె
కానికరూకలఁ గనఁజాలువాఁడె

వరుస బంగరుమేడవాఁడె తిమ్మప్ప
వరముల రాయఁడె వాఁడె తిమ్మప్ప

గొడ్డురాలికినైనఁ గొమరుల నొసఁగి
వడ్డికాసులఁ గొనువాఁడె తిమ్మప్ప

అనుచుఁ బేరమువారి యడుగుల నిడిన
దిను సైన కంచుటందియలు సారెకును

ఘల్లుఘల్లునఁ బాతకముల గుండియలు
ఝల్లుఝల్లను విలాసములును మెఱయఁ

గరముల బొణిగెలఁ గడురమ్యముగను
పరిషజ్జనంబుల పజ్జ నేఁగుచును,

ముక్తిదాయక పురములు నేడు చూడ
యుక్తి వేంకటగిరి యొద్ద నున్నట్టి-

పల్లెలో గొల్లలపాలింటి శక్తి-
యల్లారునని మును లనిశంబుఁ బొగడ

గనుపట్టునట్టి యా గ్రామంపు శక్తిఁ
గనుఁగొని బహు నమస్కారముల్ జేసి

అళిపుళిసింగరి నర్చించి మ్రొక్కి
తలి(ల?)యేఱుగుండు సందర్శించి కదలి

పెద్ద లెక్కుడుగాఁగఁ బేర్కొనుచుండు-
పెద్దయెక్కుడుఁ గూర్మి పెనఁగొన నెక్కి

కపురంపుఁదావులు గడునూలుకొలుపుఁ-
గపురంపుఁగాలువఁ గడచి యంతంత-

నా మహాచలవీథి నలరారు పుణ్య-
భూమిజంబులఁ బుణ్యభూముల జనులఁ

బావననదుల శోభన వస్తుతతుల
సేవించికొనుచు మచ్చిక వచ్చి వచ్చి

వేకువజామున వెడలి జామెక్కు-
దాఁక మిక్కిలి యెండదాఁకంగ నడిచి

యెన్నఁడు తల్లిపక్కెడసి యొండెడల-
నున్నట్టివాఁడు కాకుండుటవలన

కడపవాకిలి దాఁటి కడయిండ్లకడకు
నడచుట మునుపు నెన్నఁడు లేదు గనుక

నాఁకట నసురుసురై బాలకుండు
మోఁకాళ్ళ ముడుపు నిమ్ములఁ జేర వచ్చి

కమ్మని గణుపుచెంగట వాటమైన-
తుమ్మెదతొలుల సందుల చల్లగాలి

రాణ దూఱఁగ వింతరాగంబు పొలఁగ
వేణునాదము సేయు వెన్నుఁడో యనఁగ

పరువంపుఁ దలిరుజొంపములఁ బెంపొలయు
మరకతశ్యామ నిర్మల నిజాకృతుల-

నెదురు చల్లనితావు లెసఁగించు వెదురు-
పొదక్రిందఁ గూర్చుండి పొలయు లేఁజెమటఁ

దొడిగిన చెప్పులతోడనే మిగుల
బడలిక నొకరాతిపై శయనింప,

0 comments

Aug 14, 2009

నింతయై యంతయై యీడేఱి బుద్ధి- మంతుఁడై పంచసమంబు లైనంత

అన్నమాచార్య చరిత్రము

అన్నమయ్య విద్యలు

నింతయై యంతయై యీడేఱి బుద్ధి-
మంతుఁడై పంచసమంబు లైనంత

నియతిమై గురుఁ డుపనీతుఁ గావించి
నయవేది నధ్యనంబు సేయించె;

నన్నమాచార్యున కహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్యలన్నియును

నమితంబులగుచు జిహ్వరంగసీమ
తముఁదామె సొచ్చి నర్తన మాడఁదొడఁగె;-

నా పిన్న ప్రాయంబునందు నా మేటి
యేపారఁ దనమది కిచ్చయైనట్లు

ఆడినమాటెల్ల నమృతకావ్యముగ
పాడిన పాటెల్లఁ బరమగానముగ

తన కవిత్వమునకుఁ దన గానమునకుఁ
గనుఁగొని సకల లోకములుఁ గీర్తింప

వేంకటపతిమీఁద వింతవింతలుగ
సంకీర్తనంబులు సవరించు నిచ్చ

అసమాన నిజరేఖ యాత్మఁ గీలించి
వసుధ నటించు సంవర్తుభావమున.

0 comments

Aug 11, 2009

అన్నయ్య అన్నప్ప అన్నమాచార్య అన్న రమ్మనుచు ముద్దాడుచునుండ

అన్నమాచార్య చరిత్రము

అన్నమయ్య బాల్యము

పన్నినభక్తి నా పసిబిడ్డఁ జూచి

అన్నయ్య అన్నప్ప అన్నమాచార్య
అన్న రమ్మనుచు ముద్దాడుచునుండ

హరినందకాంశజుం డగుట డెందమున
పరమసుజ్ఞానసంపద పొదలంగఁ

బుట్టుచు నతఁడు నేర్పునఁ దల్లి జిడ్డు
పెట్ట రమ్మని యుగ్గు పెట్టఁబోయినను

పనిఁబూని తిరుమలప్పని ప్రసాదంబు
గొనుమని యనక లోఁగొనఁడు కేరుచును;

నెడపక తొట్టెలో నిడి యెంతపాటు-
పడి యెంతవడి జోలఁ బాడెనేనియును

వేంకటపతిపేరు వివరించి పాట
పొంకించకుండినఁ బోరూఱడిలఁడు;

కొండలప్పనికి మ్రొక్కుమటంచు ననక
యొండులాగుల జతు లొనరించఁ డతఁడు

ఈలీల శేషశైలేంద్రునిమీఁద
బాళినే పడియుండుఁ బసిబిడ్డఁడయ్యు-

0 comments

Aug 10, 2009

రాజీవనయను వరప్రసాదమునఁ దేజంబు మతియు నెంతే విస్తరిల్ల

అన్నమాచార్య చరిత్రము
అన్నమయ్య జననము

రాజీవనయను వరప్రసాదమునఁ
దేజంబు మతియు నెంతే విస్తరిల్ల

లక్కమాంబకుఁ బుణ్యలావణ్యనిధికిఁ
జక్కని గ్రహము లుచ్చమున మూఁడలర

ననుపమ లగ్నంబునందు వైశాఖ-
మున విశాఖను జగంబున నుల్లసిల్ల

జనియించె నన్నమాచార్యుండు శక్తి-
మునికిఁ బరాశరముని పుట్టినటులు;

జనకుఁడు కారణజన్ముఁడైనట్టి
తనయున కాగమోక్తప్రకారమున

జాతకర్మము చేసి సకలవేదాంత-
జాతచోదితమునై జలజోదరునకు

నామమై వినఁబరిణామమై మున్ను
హేమాంబరుం డానతిచ్చినయట్టి-

అన్నమయ్యాహ్వం బతనికి నొసగె;

0 comments

Aug 9, 2009

ఆతఁడు గనియె నారాయణసూరి నాతత సకలవిద్యాదురంధరుని

అన్నమాచార్య చరిత్రము
నారాయణసూరి

ఆతఁడు గనియె నారాయణసూరి
నాతత సకలవిద్యాదురంధరుని;

నా మహాత్ముఁడు లక్కమాంబను పేరి
భామినీరత్నంబుఁ బరిణయమయ్యె;

ఆ కల్పకములాకయగు తాళ్ళపాక
యాకడఁ గడలేని యభినవశ్రీల

మాడుపూరను నూర మాధవమూర్తి
తోడునీడై యాపెతో మాటలాడు;-

నా లక్కమాంబతో నా సూరివరుఁడు,
మేలిసంపదల నర్మిలిఁ దెప్పదేలి

కడపట వేవురు గలుగంగ నేమి
కొడు కొక్కరుండైనఁ గుల ముద్ధరించు

తలయుండు గల్గినఁదనపుట్టుటెల్ల
ననయంబు సఫలమౌనని యిటువంటి

తనయులు లేమి నెంతయుఁ జింతనొంది
మన మింక నే వేల్పుమఱుఁగుఁ జొచ్చెదము

అడిగినయపుడె యిష్టార్థంబులెల్ల
నెడపక చేసేత నియనోపు వేల్పు

గలఁడె లోకమున వేంకటభర్తదక్క
నల మేలు బలువేలుపై యుండు మనకు

మనకేల వలవని మనికితంబనుచు
చనుదెంచి వేంకటస్వామిసన్నిధికి

దండియై గారుడ స్తంభంబు దండ
దండంబు లిడుచు సంతానంబువేఁడ

వరదుఁడై వేంకటేశ్వరుఁడు తాఁబూను-
బిరుదుగజ్జియల ముప్పిడి కఠారంబు

కలలోన నొసఁగ నక్కజమంది తపము
ఫలియించె ననుచు దంపతు లేఁగి; రంత

0 comments

అక్కొమరుండు నారాయణాహ్వయుఁడు చక్కఁగాఁ దనవద్దఁ జదువకయున్న

అన్నమాచార్య చరిత్రము

నారాయణుఁడు

అక్కొమరుండు నారాయణాహ్వయుఁడు
చక్కఁగాఁ దనవద్దఁ జదువకయున్న

నూటుకూరను పొరుగూరఁ జుట్టముల-
చాటునఁ గొనిపోయి చదువఁబెట్టుటయు,

ఆ చుట్టములు వేడ్క నయగారియొద్ద-
నా చిన్న పాపని నమరించి నిలుపఁ

గొదుకుచు గురుడుఁను గొన్నాళ్ళు తోడఁ-
జదివెడు పడుచులచందంబు చూపి

సామంబుచేతనె చదివించి చూచి
యామీఁదఁ గొన్నినా ళ్ళదలించి చూచి

మఱి కొన్నిదినములు మైనొత్తి చెప్పి
వెఱపారఁ దఱటున వేయించి చూచి

నూఱుమాటలు చెప్పి నులిపెట్టి చెక్కు
నూఱిపోసినఁగాని నుడుగు నోరికిని

రాకున్న నిదియెట్టురా గొంటు వీని
పోకలఁ జూడ నబ్బురమయ్యె నాకు

నని యొక్కనాఁడు బిట్టదలించి తిట్టి
మొనసిన కోదండమున వ్రేలవేసి

కోలగగ్గెరఁ ద్రోసి గుంజిళ్ళఁ బెట్టి
పైలావు దొరుఁగంగ బడిపెట్టు పెట్టి

యీ లాగు గాసింప నెదురుమాటాడఁ
జాలక కన్నీరు జాఱ బాలకుఁడు,

ఒంటు సేసెదనని యొకకొంతసేపు
నింటివారలఁ జూచి యొక కొంతసేపు

గడుపుచు నందును గడతేరకున్న
బడిబడి పెట్లను బడి చాల బడలి

ఆ యూర నొక చింతలమ్మను శక్తి-
పాయనిగుడిఁ ద్రాఁచుఁబాముండు ననుచు

జనులెల్లఁ జెప్పి యాశ్చర్యంబు నొంద
వెనుకకుఁ దా నది వినియుండెఁ గనుక

కఱవనీ నా బాధకంటె నా పాము
కఱచిన నెగులెల్లఁ గడకేఁగు ననుచు

కోపంబుతోడ నా గుడిలోని కరిగి
ఆ పుట్టలోఁ దనహస్తంబు నిడిన,

దేవి త్రికాలవేదిని గాన శిశువు
భావించి తోడ రూపమున నేతెంచి

బాలక కాలసర్పముసొచ్చు పుట్ట-
నేల కేలిడితి విందేల వచ్చితివి

అనుడు నారాయణుఁడను బాలకుండు
కనుదోయి కన్నీరు గదుర నిట్లనియె;

అడిముఱిఁ జదువురాదని యయ్యవారు
పఱచు నా పాటులఁ బడనోప కేను

అలసివచ్చితి నిట కన్న నద్దేవి
వలవదు నీకేల వగపు నా తండ్రి !

గొనబుమీఱిన పలుకులజోటి మామ
జనమేజయునకుఁ బ్రసన్నుఁడైనాఁడు

ఆ శంకరాదులు నతని వేడుదురు
కేశవుం డాశ్రితక్లేశనాశఁకుడు

మీ తాళ్ళపాకలో మెఱయుచునుండు-
నా తామరసనేత్రు నాలయంబునకు

వలసుట్టి మ్రొక్కు మవ్వల వాని కరుణ-
నలరుచు సకలవిద్యలు నీకు వచ్చు;

అదియునుఁగాక మూఁడవ తరంబునను
వదలని కీర్తి మీ వంశంబునందు

పరమభాగవతుఁడు ప్రభవించు శౌరి-
వరమున జగదేకవల్లభుండగుచు;

అనుచు నంతర్హితయైన నా పాపఁ-
డనయంబు హర్షించి యరుదందికొనుచు

ఆ తాళ్ళపాకకు నరిగి వేవేగ
జాతరూపాంశుఁ గేశవు గాంచి మ్రొక్క(క్కి?)

స్వామి గేహములకు వలచుట్టి కేలు-
దామరల్ మొగిచి యత్తఱి శరణొంది

స్వామి ! కేశవ ! సరస్వతి మామ ! విద్య
తామసింపక నాకు దయ సేయు మనుడు,

ఆ మాధవునికృప నంబుజాసనుని-
భామ యాతనిజిహ్వపైఁ బాదుకొనియె;

సరగున మఱునాఁడు సని యర్భకుండు
గురునకు మ్రొక్కి మక్కువఁ దనతోడఁ

జదివెడుపడుచు లాచార్యుండు శాస్త్ర-
విదులును జూచి నివ్వెఱఁగంది పొగడ

పంచినచోటెల్లఁ బదమును గ్రమము
కొంచించ కతఁడు గ్రక్కునఁ జెప్పి మఱియు

క్రమ శిఖ జటయు వర్ణక్రమసరణి
బ్రమయక నిజవేదపాఠంబు సలిపి

కడమవిద్యలయందుఁ గడునేర్పు గలిగి
కడఁక వారల మెచ్చు గైకొని వచ్చి

జగతి నందఱుఁ జూచి సర్వజ్ఞుఁ డనఁగ
మిగుల వాక్ప్రౌఢిమ మెఱయుచు నుండె;

0 comments

Aug 7, 2009

అందులో నొక్క ధరామరేంద్రుండు నందవరాన్వయార్ణవ సుధాకరుఁడు

అన్నమాచార్య చరిత్రము
కాని, దుర్విషయసంగతి కలలోన-
అన్నమాచార్య వంశ్యులు
నైనఁ జేయగ నొల్ల రమ్మహామహులు;

అందులో నొక్క ధరామరేంద్రుండు
నందవరాన్వయార్ణవ సుధాకరుఁడు

గురు భరద్వాజసగోత్రుండు పాప-
హరబుద్ది యాశ్వలాయన సూత్రశాలి

నారాయణుండను నయవేదివేద
పారాయణుఁడు విష్ణుపదభక్తిరతుఁడు

అనఘుని విట్ఠలాహ్వయుఁ గాంచె; నతఁడు
కనియె నారాయణు ఘనయశోనిధిని

నతఁడు విట్ఠలుఁ గాంచె; నతఁడు లోకైక-
నుతుఁడైన నారాయణుని తండ్రియయ్యె;

0 comments

Aug 6, 2009

అట్టి పొత్తపినాటి యౌఁదల సిరుల పట్టుఁగొమ్మై తాళ్ళపాక చెన్నొందు.

అన్నమాచార్య చరిత్రము

తాళ్ళపాక

అట్టి పొత్తపినాటి యౌఁదల సిరుల
పట్టుఁగొమ్మై తాళ్ళపాక చెన్నొందు.

ఆ పురిఁ గేశవుండను రమావిభుఁడు
చేపట్టి జనుల రక్షింపుచునుండ

1పరికించి యచ్చటి ప్రజలెల్ల మిగుల
నరుదంద మున్నూటయఱువది నాళ్ళు

ఫలముల చక్కెర పస పెర్గు రేఁగు
చెలరేఁగు నా వేల్పుచెంత నెంతయును;

అఖిలదేవతలకు నది యాటపట్టు
నిఖిల సన్మునులకు నిజ నివాసంబు;

సిరిగొల్చు నవనాథసిద్ధులు మున్ను
పరుసంబు రససిద్ధిఁ బడసినచోటు;

నళినాళి తులసీవనములు వైష్ణవులు
వెలయుదు రెచ్చోట విష్ణుఁ డచ్చోట

సన్నిధిసేయు నిచ్చలు నండ్రు మౌను;-
లన్నియు నచ్చోట ననిశంబు నుండు;

నందు వశించు నయ్యఖిలభూసురులు
నిందిరారమణపదైక మానసులు

అతులిత వేదవేదాంగ పారగులు
జితసర్వకరణు లంచిత తపోధనులు

కనుట గోవిందు మంగళవిగ్రహంబె
వినుట నారాయణ వృత్తాంతచయమె

చేయుట కౌస్తుభాంచితపూజె, తలఁపు-
సేయుట మాధవ శ్రీపాదయుగమె

కుడుచుట వనమాలి గొను ప్రసాదంబె
నడచుట నందనందను నగరికినె

కాని, దుర్విషయసంగతి కలలోన-


1 'పరికించి అచ్చఫలముల చక్కెరపస పెర్గురేఁగు' అని మాతృక. ఇది దూషితపాఠము

0 comments

అనయము నయము సొంపారు క్రొవ్విరులు గొనబైన చెంగల్వకొలఁకులు చుట్టి

అన్నమాచార్య చరిత్రము
పొత్తపినాడు

అనయము నయము సొంపారు క్రొవ్విరులు
గొనబైన చెంగల్వకొలఁకులు చుట్టి

పొదలు గొజ్జంగపూఁబొదలు క్రిక్కిఱిసి

వదలక వెలుఁగుకైవడి వెలుఁగొందు-


తెరువరుల్ త్రోవ నేతెంచి యేతెంచి

పొరిపొరిఁ గణ్పు గణ్పునఁ బాలుగారు-


రసదాళిచెఱకు తోరపుఁదుంట లంది

మిసిమైన ముంతమామిడిపండ్లు వైవ-


నా రసంబులచేత నచటి రాజనపుఁ

బైరులు ముక్కారుఁ బండు; నెయ్యెడలఁ


బాలనే పెరిగిన పసిఁడిటెంకాయ

పాళెల నెడనీరు పట్టి పెట్టినను


అనఁటిపండులు మేసి యలసి పై దప్పి-

గొనివచ్చి కోవెలల్ గ్రోలు నచ్చటను;


నరిమీఱు నా మేటినాటి నానాఁటి-

సిరు లింక నే మని చెప్పంగవచ్చు.

0 comments

Aug 5, 2009

శ్రీ యలమేల్మంగఁ జిరకృపాపాంగఁ గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,

శ్రీః
అన్నమాచార్య చరిత్రము
రచయిత: తాళ్ళపాక చిన తిరువేంగళనాథుఁడు(చిన్నన్న)

అవతరణిక

శ్రీ యలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుఁ గనతల్లిఁ గాంతామతల్లి,

శ్రీవేంకటేశుఁ బోషితపద్మ కోశు
సేవకపరతంత్రు జితదైత్యతంత్రు,

దనుజకర్శనము మాధవ సుదర్శనము,
నినకోటితేజంబు హేతిరాజంబు,

నరహరిసంకీర్తి నవవిధు లొసఁగు-
పరమోపకృతిఁ దాళ్ళపాకాన్నయార్యు-

నాచారవిజితామరాచార్యుఁ దిరుమ-
లాచార్యు ఘను మదీయాచార్యుఁ గొలిచి

యార్యులు విని యన్నమాచార్యవర్యు-
చర్యకు మిగుల నాశ్చర్యంబుఁ జెంద,

జలజాతవాసిని చనుఁబాలపుష్టిఁ
బలికెద నా నేర్చుపరిపాటి నిపుడు,


జనపరంపరా శతసహస్రముల
వెనుకకు మేము దుర్విషయానురక్తిఁ

గుక్షింభరులమైన కొదవెల్లఁ దీఱ
రక్షించి, మా యపరాధము ల్మఱచి

యేపుట్టువున మిమ్ము నెఱుఁగంగఁజేసి
నీ పాలివారిఁగా నియమించి మమ్ము

హరి! మిమ్మునే కొనియాడు మా జిహ్వ
నొరులను గొనియాడకుండంగఁజేసి

కంటులేనట్టి లక్ష్మణగురు మతము-
వంటి సన్మతము మీవంటి దైవతము

తనవంటి గురుని నందఱలోనఁ దెచ్చి
వనజాక్ష! నేఁడు మావంటివారలకుఁ

గరతలామలకంబుఁ గావించెఁ గనుక,
అరయఁగఁ దాళ్ళపాకాన్నయాచార్యు-

పరమోపకార మెప్పటికి డెందమున
నరయుచుఁ గొనియాడు టది యొప్పుఁగనుక,-

నాయనఁ జూచి మాయపరాధకోటు-
లేయెడఁ దలఁచక యెడఁబాయ కెపుడు-

నే యాపదలు మమ్ము నెనయక యుండ
మా యిలవేల్పవై మన్నించుకతన,

నందను సద్వర్తనము తండ్రి ప్రియము-
నొందఁ గీర్తించుట యుచితంబు గనుక,

అఱలేక యీ యన్నమాచార్యచరిత
వెఱవక నీకు నే విన్నవించెదను;

మన్నించి యలమేలుమంగతో నీవు
నిన్నుఁ బాయని భక్తనికరంబుతోడ

నవధారు శ్రీవేంకటాచలాధీశ!
అవధరింపుఁడు గురుహరిభక్తులార !

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks