నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Nov 9, 2014

నా తప్పటడుగులు లేక తప్పు టడుగులు


నేను అప్పుడప్పుడూ వ్రాసిన కొన్ని కంద పద్యాలూ మరియు ఓ ధృవకోకిలా వృత్తం.

కష్టం ముదిమియె కృష్ణా 
కష్టం మరి జీవనమ్ము కాసులు లేకన్ 
కష్టతరం సుతు మరణం 
కష్టం కష్టముల కెల్ల కాంచగ క్షుథయే! 

ఇది ఓ సంస్కృత శ్లోకానికి అనువాదం.
నా ఇతర కందాలు.

కందం వ్రాసిన 'కవి' యేి 
అందురు అందరును; కాని అందులొ అందం 
చిందే పదాల పొందను 
విందునుఁ గూర్చక కవగున? విమలేందు ముఖీ. 

కవి నేను కానె కానూ 
కవి కోకిల నాగఫణిని కవితతొ కొల్తున్ 
కవి మాడగుల కు నేనిదె 
సవినయముగ నంజలింతు సభలో కన్నా. 

ధారణ నిలుపగ జేసెడి
భారము నీ పైన నిలిపి పద్యాల్ చెబుతా 
భారతి నా పై కరుణతొ 
నర్తించుము నీవు నాదు నాలుక చివరన్. 

సంపాదనొకటె ముఖ్యము
నింపాదిగ నలుపు తెలుపు సేయగ వచ్చున్ 
సంపాదించను లేకే 
యింపుగ వల్లించు నీతు లసమర్థుడు తాన్. 

ఇది నా అభిప్రాయం కాదు, కాని ప్రస్తుతం నడుస్తున్న లోక రివాజు.

పెద్దలు చెప్పిన సుద్దులు 
బుద్ధులు విద్దెలును యెంతొ ముద్దుగ నుండున్ 
పెద్దలు వద్దని చెప్పిన 
పద్ధతి యేపొద్దు వద్దు వద్దని యనరే. 

స్నేహితులందరి లోనను
నీ హితమే కోరువారు నీ వారగుదుర్ 
ఆ హితులకు మేల్గూర్చే
స్నేహితునిగ శుభము కూర్చు స్నేహము తోడన్. 

విద్యా గురు శుశ్రూష నె, 
విద్యాధన మిచ్చి, లేక విద్యను యొసగీ, 
విద్యను నేర్వగ వలయున్
విద్యను పొందగ మరియొక విధమే లేదే.

ఇంకా పూర్వం N.T.R గారు liquor policy ని ప్రకటించి నప్పుడెప్పుడో వ్రాసిన పద్యాల కొన్ని:

ప్రజలను మత్తున ముంచీ 
ప్రజ ధనమును ప్రభు ధనముగ రయమున పెంచీ 
ప్రజ లారోగ్యము త్రుంచీ 
ప్రజలను నిర్వీర్యు జేయు ప్రతిమల వోలెన్. 

వారుణి వాహిని పేరున 
దారుణముగ రేట్లు పెంచి త్రాగెడు వారే 
భారముగా బ్రతుకీడ్వగ 
ఏరులు యేరులుగ సార వీథుల పారెన్. 

ప్రజలకు జరిగే హానిన్ 
ప్రజలే గుర్తించి వారె ప్రతిఘటనలతో 
హజముతొ ధర్నాల్ చేయన్
ప్రజ ఓట్ల కొఱకు చివరకు ప్రభుతయె దిగిరాన్. 

సారాను 'బాను' చేసిరి
బీరున్ స్కాచ్ విస్కి బ్రాంది బేరరు లీయన్ 
యేరై పారగ సాగెను 
సారా అయ్యమ్మెఫల్గ నాకృతి దాల్చెన్. 

ఇంతలొ యెన్నిక లొచ్చెను 
పంతముతో రామరావు ప్రతినను చేసెన్ 
అంతము చేసెద గంటలొ 
సాంతముగా విస్కి బీరు సారా బ్రాందీల్. 

ధృవకోకిల:
అతని మాటలు నమ్మి చేసిరి యాంధ్రు లాతని రాజు గాన్ 
అతడు కూడను వారి ఆశలు వమ్ము సేయక గంటలోన్ 
ప్రతిన చేసిన యట్టులే పరిపూర్ణ మద్య నిషేధమున్ 
అతివ లందరు మెచ్చగా యనుశాసనమ్మును తెచ్చెగా. 

చివరి పద్యం మూడో పాదంలో యతి కురలేదు.

నెలలెనిమిది గడచిన విటు-------

ఇంక ఇక్కడినుండి కలం ముందుకు సాగలేదు.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks