నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 9, 2009

వేసవి డగ్గరాయె, మిము వీడుటకున్ మనసొగ్గదాయె, మావాసము దూరమాయె,

తిరుపతి వేంకటకవులు
చాటు పద్యాలంటే--- చిన్నప్పుడు, చాటుగా చుదువుకోవాల్సిన పద్యాలేమోననే అభిప్రాయం నాకుండేది. తరువాత ప్రొ.జి. లలిత గారి తెలుగులో చాటుకవిత్వము అనే సిద్ధాంత వ్యాసం, పుస్తకం గా వచ్చింది, చదివాక చాటువంటే ప్రియమైన మాట అని అర్థం తెలిసింది. ఇందులో ఆ మాటకు ఇంకా చాలా చాలా అర్థాలు చెప్పారనుకోండి.
తిరుపతి వేంకట కవుల (దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి) చాటు రచనలు "నానా రాజ సందర్శనము , శతావధాన సారము". ఈ జంట కవుల విజయ యాత్రలలో "నానా రాజ సందర్శనము" ఒక ప్రత్యేక ఘట్టం. వారు లబ్ధ ప్రతిష్టులైన తరువాత ఎందరో రాజులు వారిని ఘనంగా సమ్మానించారు. పేరు ప్రతిష్టలు రాక పూర్వం వారు కొన్ని చిక్కులు పడ్డారు. నానారాజసందర్శనంలోని చాటువుల వల్ల ఈ కవుల ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి, ఉదాత్త ప్రకృతి వెల్లడవుతాయి. " కవితామ తల్లికి ధనము ప్రధానమా రసికతాసుఖతల్ ప్రధానమా "అని మొగల్తుర్తి రాజుగారితో విన్నవించటం వారి స్వాతంత్య్రానికి నిదర్శనం.

పరదేశ సంపాదన రతి మీకు నరేంద్ర
పరదేశ సంపాదన రతి మాకు
...........................................

మీకు రాజపదము మాకును గవిరాజ
పదము కలది కెందుఁ గొదవ లేదు
కాన సామ్యమిచ్చి మానించుటొప్పదే
ముద్దు కృష్ణయాచ భూవరేణ్య.

అని వేంకటగిరి రాజుతో చెప్పిన చాటువు వారి ధైర్యాన్ని సూచిస్తుంది. వనపర్తిలో విజయాన్ని సాధింప అవకాశమీయని ప్రభువు సమక్షంలో అవమానకరంగా చాటువులు చెప్పి రాగలగటమే వారి మహత్త్వాన్ని వెల్లడిస్తుంది. వనపర్తిలో లాగే విశాఖ పట్టణంలో శ్రీ గోడె గజపతిరావు గారు కవుల్ని సరిగా సత్కరించలేదు. రాజా వారికి కవులు పెట్టుకున్న అర్జీ పైకి వినయాన్ని, అంతరంలో ధూర్తత్వాన్నీ ప్రదర్శిస్తుంది.

ఉ.
సంగర శక్తిలేదు, వ్యవసాయము సేయుట సున్న, సంతలో
నంగడివైచి, యమ్ముటది యంతకుమున్నె హుళక్కి, ముష్టికిం
గొంగు బుజాన వైచుకొని పోయెద మెచ్చటికేని ముష్టి చెం
బుం గొనిపెట్టుమొక్కటి యమోఘ మిదేకద దంతిరాణ్ణృపా!

ఆత్మకూరు ప్రభుని దగ్గఱ వారిలా సెలవు తీసుకున్నారు.
ఉ.
వేసవి డగ్గరాయె, మిము వీడుటకున్ మనసొగ్గదాయె, మా
వాసము దూరమాయె, బరవాస మొనర్చుట భారమాయె, మా
కోసము తల్లి దండ్రు లిదిగో నదిగో నని చూచుటాయె, వి
శ్వాస మెలర్పవే సెల వొసంగినఁబోయెదమయ్య భూవరా!

"ఏనుఁగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము" అని ధిషణాహంకారం చూపినా

"దోసమటం చెఱింగియును దుందుడు కొప్పఁగఁ బెంచినార మీ
మీసము రెండుభాషలకు మేమె కవీంద్రులమంచుఁ దెల్పఁగా
రోసము గల్గినన్ గవివరుల్ మము గెల్వుఁడు గెల్చిరేని యీ
మీసము దీసి మీపదసమీపములం దలలుంచి మ్రొక్కమే."

అని అతిశయాన్ని వలకబోసినా అది వారికే చెల్లింది.

వారి గొప్పదనం వారి శిష్యుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కొప్పరపుసోదరకవులకు వ్రాసిన ఈ క్రంది పద్యాలవలన బాగా తెలియవస్తుంది. కొప్పరపు కవులు తిరుపతి వేంటకవులతో పోటీకి దిగినప్పుడు వారిని ముందుగా తనతో పోటీపడమని ఛాలెంజ్ చేస్తూ కవిరాజు గారు చెప్పిన పద్యాలివి.
సీ.
అఱవ దేశంబున నవధానమొనరించు,
టోకాద ! యిదియు గుంటూరు సీమ.
పల్నాటి సీమలోఁ బద్యంబులను జెప్పు-
టోకాద ! యిదియు గుంటూరు సీమ.
ఆ యూర నాయూర నాశుకవిత సెప్పు-
టోకాద ! యిదియు గుంటూరు సీమ.
గుడివాడ సీమలోఁ గొన్ని యూళ్ళను జెప్పు-
టోకాద ! యిదియు గుంటూరు సీమ.

యెట్లు దక్కించుకొందురో యిప్పుడు మీరు,
నిండు కొల్వున మీకున్న దండి బిరుదు
లూరకేపోవు పూజ్యులఁ గాఱులఱవ
నాశుకవిసింహ కుండిన హంసలార

సీ.
శతఘంట కవనంబు సల్పుదుమన్న
మీశక్తి యడంపనేఁ జాలనొక్కొ,
అశ్టావధానంబు నాచరింతు మన
మీశక్తి యడంపనేఁ జాలనొక్కొ,
ఆశుకవిత్వంబు నాచరింతు మన
మీశక్తి యడంపనేఁ జాలనొక్కొ,
సద్గ్రంథ రచనంబు జరుపుదుమన్న
మీశక్తి యడంపనేఁ జాలనొక్కొ,

ఇంగిలీషున వత్తురో యెఱిఁగి యడపఁ
గరమునేఁ జాలనొక్కొ మా గురువులేల,
రండు వేగమీ బిరుదులు దెండుపెట్టి
పొండు, నిండుసభను గొప్రపుఁగవులార !
(కవిరాజు జీవితం-సాహిత్యం పుట ౧౫౨-౧౫౩)

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks