శ్రీమద్రామాయణ కల్పవృక్షము
అభిషేక ఖండము
గీ.
గోళకాంతిచ్ఛటల్ పెఱగోళములకుఁ
బయనంముంజేయ నబ్దముల్ పట్టునట్లు
రాచ దేవిడీలందు వార్తలును జేరఁ
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు పట్టు. 3
ఒకగోళమునుండి కాంతిప్రసారం బయలుదేరి ఇంకో గోళానికి చేరటానికి కొన్నిసంవత్సరాల కాలం పడుతుంది. అలాగే రాచ దేవిడీలలో కూడా వార్తలు ఒక ప్రభువు నుండి ఇంకో ప్రభువుని చేరటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందట. రాముని మనస్సులో పెండ్లి అయి భార్యతో ఆనందంగా గడపాల్సిన సమయంలో కలిగిన వైరాగ్యభావమును గురించిన వార్త దశరథ మహారాజునకు చేరటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందట.
ఉ.
రామున కాత్మలో నొక విరాగము కల్గినమాట, యా విరా
గామితతీప్రతల్ చెడి తనంతన శాంతివహించు పిమ్మటన్,
దా ముదిఱేనికిన్ దశరథక్షితిజాని కెఱుంగనయ్యెఁబోఁ
బ్రామిన భీతియున్ దరతరై మనుజేశుఁడు దందడించుచున్. 4
ఆ విషయం తెలిసిన తర్వాత దశరథుఁడు మరింక ఆలస్యం చేయలేదు. ఎందుచేతనంటే
గీ.
బ్రహ్మచారి సుతుండు విరాగియైన
జనకుఁ డూహించు సుతు గృహస్థునిఁ బొనర్పఁ
దా గృహస్థుండె సుతుఁడు విరాగియైనఁ
దండ్రి వ్యవహార మతనిని దాల్పఁ జేయు. 5
బ్రహ్మచారిగా నున్నకొడుకు విరాగి గా నైతే తండ్రి అతనికి పెళ్ళి చేస్తే బాగుపడతా డనుకుంటాడట. పెళ్ళైన కొడుకు విరాగిగా నైతే తండ్రి అతనిని వ్యవహారం లోనికి దింపాలని అనుకుంటాడట. అందుచేత అతనికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తాడు దశరథుడు.
ఈ భావన అంతా విశ్వనాథ వారి అందమైన స్వకపోల కల్పనే. మూలంలో రామునిలో విరాగభావం కలిగినట్లుగా లేదు. గోపీనాథ గామాయణంలో అలా వ్రాసిలేదు. సంస్కృత రామాయణం విషయంలో ఎలా వుందో పెద్దలే చెప్పాలి.
Aug 26, 2009
గోళకాంతిచ్ఛటల్ పెఱగోళములకుఁ బయనంముంజేయ నబ్దముల్ పట్టునట్లు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment