శా.
తానో 'లాములు' తండ్రి పేరెవరయా ? 'దాచాతమాలాలు' నౌ
లే ! నాపే' రన 'నమ్మగాల' నఁగ నోలిందల్లి 'కౌసల్య తం
డ్రీ !' నాఁగా ననఁబోయి రాక కనులన్ నీర్వెట్టఁ 'గౌసల్య నౌఁ
గానే కానులె యమ్మనే' యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్. 334
కౌసల్య తన చిన్ని రామునితో ఆడుతున్నప్పుడు సంభాషణా పూర్వకంగా నడిచిన ఘట్టమిది.
కౌసల్య బాలరాముణ్ని తన పేరేమిటో చెప్పమంది. 'రాముడు' తన పేరులోని 'రా' అనే అక్షరం , 'డు' అనే అక్షరం సరిగా పలక చేతరాక 'లాములు' అని అంటాడు.
నాన్నపేరేమిటీ అని అడుగుతుంది వెంటనే, ఏం చెపుతాడో ఎలా చెపులాడో వినాలనే సహజమైన కుతూహలంతో.
'దశరథమహారాజు' అనే పదాల్ని పలక రాక 'దాచాతమాలాలు ' అంటాడు.
కొడుకు నుండి సరియైన సమాధానం వచ్చేసరికి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో 'మరి నా పేరో' అంటుంది. చెప్పగలడేమో ననే ఆశతో. కాని చిన్నపిల్లలకి అమ్మ పేరుతో పనేంటి. అమ్మ అమ్మే కదా.
అందుకని 'అమ్మగారు' అనబోయి నోరు తిరక్క 'అమ్మగాల' అంటాడు. అతడ్ని సరిచేద్దామని 'కౌసల్య తండ్రీ' అని చెప్పుతుంది. కాని చిన్నపిల్లాడికి నోరు తిరగొద్దూ. అంచేత అలా అనటానికి ప్రయత్నించిన వాడై చేతకాక, చెప్పలేక పాపం కన్నులకు నీరు తెచ్చుకున్నాట్ట ఆ పసిబిడ్డడు. వెంటనే ఊరడించాలిగా ఏడవబోతున్న బిడ్డని తల్లి , అందుచేత 'కౌసల్యను కానులే', 'అమ్మనే' అంటూ బాబుని ఊరడించి మనకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రులవారిని కౌసల్యాదేవి ముద్దాడిందట.
తల్లులు తమ పిల్లలతో వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పించుకొనే ఈ ఘట్టాన్ని అత్యంత రమణీయంగా సహజసుందరంగా తీర్చి దిద్దిన విశ్వనాథ వారికి ఏం చేసి ఈ జాతి తన ఋణం తీర్చుకోగలుగుతుంది ? వారి గ్రంధాలు చదివి ఆనందించడం తప్పించి.
Jul 9, 2009
తానో 'లాములు' తండ్రి పేరెవరయా ? 'దాచాతమాలాలు' నౌ
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
వేదుల వారికి ప్రణామాలు!
ఎంత రమణీయమైన ఘట్టాన్ని గుర్తుకు తెచ్చారు!
పద్యానికి మీ వ్యాఖ్య " అరటి పండు ఒలిచినంత " సరళ సుందరంగా సాగి, అమృత పానం చేసిన అనుభూతిని కలిగించారు. మీకు నా హార్దికాభినందన!
మీ రన్నది నిజమే! విశ్వనాథ వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ? _ ఈలాంటి రమణీయ ఘట్టాలను నెమరు వేసుకొంటూ, ఆ మహా కవికి మనస్సులోనే నమస్సులు సమర్పించుకోవడం తప్ప!
చక్కటి పద్యానికి చిక్కటి వ్యాఖ్య. బాల రాముడికి లాగే నాకూ కన్నీళ్లొచ్చాయి..ధన్యవాదాలు
చక్కనైన వివరణ… ధన్యవాదములతో… పద్యంలో నోలిందల్లి, నాగా అన్న మాటలకు కాస్త విడమరచిన అర్థం చెప్పగలరార్యా…🙏🙏🙏
Post a Comment