నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 18, 2009

రుక్మిణీ కల్యాణము-5

రుక్మిణీ కల్యాణము-5
వ.
అంత రామకృష్ణులు తమ కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్య ఘోషణంబులతో నెదుర్కొని, విధ్యుక్త ప్రకారంబునఁ బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజన సేనాసమేతులైన వారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబు లైన నివేశంబులు గల్పించి, విడియించె.ఇట్లు కూడిన రాజులకెల్లను వయో వీర్య బలవిత్తంబు లెట్ల ట్ల కోరిన పదార్ధంబు లెల్ల నిప్పించి, పూజించె. అంత విదర్భపురము ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాంజలులం దదీయ వదనకమల మధుపానంబు సేయుచు.
మ.
తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి యై
మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.
వ.
అని వలికిరి. ఆ సమయంబున.
సీ.
సన్నద్ధు లై బహు శస్త్రసమేతు లై బలసి చుట్టును వీరభటులు గొలువ
ముందఱ నుపహారములు కానుకలుఁ గొంచు వర్గంబు లై వారవనిత లేగఁ
బుష్ప గంధాంబర భూషణ కలిత లై పాడుచు భూసుర భార్య లరుగఁ
బణవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీ ధ్వనులు మిన్ను పిక్కటిలఁగఁ
ఆ.వె.
దగిలి సఖులు గొల్వఁ దల్లులు బాంధవ
సతులు దోడ రాఁగ సవినయముగ
నగరువెడల నడచె నగజాతకును మ్రొక్క
బాల చికుర విహిత ఫాల యగుచు.
వ.
మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుం జనుదేర, మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలంచుచు, నిందుధరసుందరీ మందిరంబు చేరి, సలిల ధారా ధౌత చరణ కరారవింద యై, వార్చి, శుచి యై, గౌరీసమీపంబునకుం జనియె. అంత ముత్తైదువు లగు భూసురోత్తముల భార్యలు భవసహిత యైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షతంబు లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి, ధూప దీపంబు లొసంగి, నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీప మాలికల నివాళించి, రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు,
ఉ.
నమ్మితి నా మనంబున సనాతను లై న యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ ! నిన్
నమ్మిన వారి కెన్నఁటికి నాశము లేదు గదమ్మ ! యీశ్వరీ !
వ.
అని గౌరీదేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణాపూపంబులును,దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలఁ బూజించిన,
ఆ.వె.
వారు నుత్సహించి వలనొప్ప దీవించి
సేసలిడిరి యువతి శిరమునందు
సేస లెల్ల దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని మగువ వెడలె.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks