నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Feb 9, 2009

గురజాడ--వందేళ్ళ అడుగుజాడ

గురజాడ--దేశభక్తి గేయం--దేశమును ప్రేమించుమన్నా

దేశమును ప్రేమించు మన్నా,
మంచి అన్నది పెంచు మన్నా,
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్!
గట్టిమేల్ తల పెట్టవోయ్!

పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయ్;
తిండి కలిగితె కండకలదోయ్
కండగలవాడేను మనిషోయ్!

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశిసరకులు నించవోయ్!

అన్నిదేశాల్ క్రమ్మవలెనోయ్
దేశిసరకుల నమ్మవలెనోయ్!
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తిసంపద లబ్బవోయ్!

వెనక చూసిన కార్యమేమోయ్?
మంచిగతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనక పడితే వెనకెనోయ్!

పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్,
కత్తివైరం కాల్చవోయ్!

దేశాభిమానం నాకు కద్దని
వట్టిగొప్పలు చెప్పుకోకోయ్,
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్!

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్!
ఒరులమేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్!

పరులకలిమికి పొర్లి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరిమేల్ తనమేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్!

స్వంత లాభం కొంతమానుకు
పొరుగు వాడికి తోడుపడవోయ్!
దేశమంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్!

చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్,
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్!

మతం వేరైతేను యేమోయ్?
మనసు లొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగీ
లోకమున రాణించునోయ్!

దేశమనియెడు దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్,
నరుల చెమటను తడిసిమూలం
ధనంపంటలు పండవలెనోయ్!

ఆకులందున అణగి మణగీ
కవితకోవిల పలకవలెనోయ్,
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్తవలెనోయ్! ౧౯౧౦

గురజాడ అప్పారావు గారి 'దేశమును ప్రేమించుమన్నా' దేశభక్తి గేయానికి వందేళ్ళ పండగ! వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిగా ఆ గేయాన్ని ఆలపించాల్సిన సమయం వచ్చింది.

ఆచరణకు అధిక ప్రాధాన్యాన్నిచ్చిన దేశభక్తి గేయం ఇది. వందే మాతరం కంటే , జనగణమన కంటే కూడా అధిక ప్రభావాన్ని కలిగించగలిగినది మన గురజాడ అడుగుజాడ- ఈ దేశభక్తి గీతం. మతం గురించి గురజాడవారు చెప్పినది సర్వథా ఎప్పటికీ ఆచరించ వలసినదే. మన అడుగుజాడ గురజాడది అని అనుకోవటం మాత్రమే కాక మనమందరం కలసి నడవాల్సిన తరుణం ఆసన్నమయినది. కలసి పాడుకుందాం. కలసి నడుద్దాం. జైహింద్.

3 comments:

సూర్యుడు said...

ప్రచురించినందుకు ధన్యవాదాలు

Anonymous said...

ఈనాడు లో ఇది చూసినప్పుడు నా బ్లాగులో పెడదామనుకున్నాను. అంతర్జాలం మొండికెసింది. మంచిపని చేశారు.

పరిమళం said...

ఈనాడు లో చూశాను.ప్రచురించినందుకు ధన్యవాదాలు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks