గౌళ
నీగుణమే ఆతని నిలువెల్లాను
చేగదేరె పనులెల్లా చిత్తగించు మికను IIపల్లవిII
కాటుక కన్నుల తోడి కలికి నీ చూపులు
నాటఁగా నాతని మేను నల్లనాయను
తేటల నీ యధరపు తేనె లిచ్చినయందుకు
యీటులేకాతనిమోవి యెఱ్ఱనాయను. IIనీగుII
చేరి నీవు నవ్వఁ గాను చెమట ముత్తేలు రేఁగి
తేరి యాతని భావము తెల్లనాయను
వూరట నీ మేని పస పొరయఁగా నాతని
గౌరవపుఁ బచ్చడము కడుఁ బసిమాయను. IIనీగుII
కోకొమ్మని నీవు నీ కొప్పుదవన మాతని-
కాకడ ముడువఁ గా నంటి పచ్చాయ
యీకడ వేంకటేశు కీమంజిష్టి నీ పయ్యద
పైకొని కప్పి కూడఁ గాపంచెవన్నె నాయను. IIనీగుII 27-213
చెలికత్తె యలమేలుమంగతో:
ఆతని వంటిమీద నిలువెల్లా నీ గుణాలే , పనులెల్లా చేవదేరినవి ఇక ఇవి చూడవమ్మా.
కాటుక కన్నులతో నీవతనిని చూడగానే నీ చూపులు అతని శరీరం మీద నాటడం వల్ల అతను నీలవర్ణుడయ్యాడు.
నీవిచ్చిన పెదవుల తేనె వ్యర్ధం కాకుండా వుండేందుగ్గాను ఆతని మోవి యెఱ్ఱబడింది.
నీవాతని చేరి నవ్వేటప్పటి చెమట ముత్యాల కారణంగా ఆతని భావము వాటివలె తెల్లబడింది.
నీ శరీర కాంతి నొంది ఆతని వస్త్రము పచ్చనై పీతాంబరుడైనాడు.
నీవు తీసుకొమ్మని యిచ్చిన నీ కొప్పులోని దవనము అక్కడాతనికి అంటి పచ్చగా అయింది.
వేంకటేశుని పై నీ యెఱ్ఱని పయ్యద కప్పి ఆతని కూడుటవల్ల పంచవన్నెలాయను.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
5 comments:
Beautiful
దవనము అన్నమాట విని ఎన్ని ఏళ్లు అయింది మాష్టారు.
బొల్లోజు బాబా
ఎంతో మనోహరమైన సంకీర్తనను అర్థ సహితముగా పోస్టు చేసినందులకు ధన్యవాదములు. ఈ విధముగానే కొనసాగించమని కోరుచున్నాను.
@కొత్త పాళీ గారూ
నెనరులు.
@బాబా గారూ
మీ క్కూడా.
ఎన్డీయే గారూ
నెనరులు. నా శక్తి వంచన లేకుండా కృషి చేసి మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని--
ఎన్డీయే గారూ
ఇంతవరకూ వివరించిన కీర్తనలను ఈ క్రింది బ్లాగులలో వీలైతే చూడండి.(old posts తో కూడా)
http://kastuuritilakam.blogspot.com
http://kasstuuritilakam.blogspot.com
http://mutyalasaraalu.blogspot.com
Post a Comment