ఈ కీర్తనలో ఆగ్నేయాస్త్రము,వరుణాస్త్రము,వాయవ్యాస్త్రము,శైలాస్త్రము,సమ్మోహనాస్త్రము,నారాయణాస్త్రము,
వీటిని ఉపయోగించిన తీరు హృద్యంగా ఉండి మనసుని అలరిస్తుంది.
శ్రీరాగం
చిత్తజు వేడుకొనరే చెలియలాల
తత్తరించి పతిమీఁది తలపోఁతనున్నది IIపల్లవిII
అతివపై మదనుడు అనిలాస్త్రమేయఁబోలు
కతలుగ విరహాగ్నిఁ గాఁగీనదే
యితవుగా వరుణాస్త్రమేయఁబోలునప్పటిని
తతిఁ జెమటవానలఁ దడియుచున్నది. IIచిత్తII
అమరగ నంతలో వాయవ్యాస్త్రమేయఁబోలు
వుమరఁబడి నిట్టూర్పులొగి రేఁగెను
జమళిఁ గూడఁగ నట్టె శైలాస్త్రమేయఁబోలు
భ్రమసి చనుఁగొండలు బాయిటఁ గాన్పించెను.IIచిత్తII
మునుకొని పంతాన సమ్మోహనాస్త్రమేయఁబోలు
మనసు పరవశాన మరపందెను
అనిశము రక్షగా నారాయణాస్త్రమేయఁబోలు
ఘన శ్రీవెంకటేశుఁడు కాఁగిటిలోఁ గూడెను.IIచిత్తII
ఈ సంకీర్తనలో అన్నమయ్య ఆగ్నేయాస్త్రము, వరుణాస్త్రము, వాయవ్యాస్త్రము, శైలాస్త్రము, సమ్మోహనాస్త్రము,
నారాయణాస్త్రము-వీటిని మదనుడు అలమేల్మంగపై ప్రయోగించగా వాటి ప్రభావం ఆమె మీద ఏవిధంగా
పనిచేసినదీ అందంగా వర్ణిస్తాడు.
ఓ చెలికత్తె విగిలిన చెలికత్తెలతో అంటున్నది.
మదనుని వేడుకొనరే చెలియల్లారా,ఆమె సంభ్రమించి పతి మీద తలపోతతో ఉన్నది.
ఆమెపై మదనుడు అనిలాస్త్ర మేసి ఉండొచ్చు,కథల్లోలా ఆమె విరహాగ్నితో కాగిపోతున్నది.
అందుకని హితవు కూర్చటం కోసమై వరుణాస్త్ర ప్రయోగం చేసాడు,దాంతో ఆమె చెమటలవానలో తడిసి ముద్దయింది.
దానికి తగినట్లుగా చెమటలు ఆరడం కోసమని వాయవ్యాస్త్రం ప్రయోగించి నట్లున్నాడు,ఆపైన నిట్టూర్పులూరికే వచ్చేస్తున్నాయి.
వాటితో కలసి ఉండటానికా అన్నట్లు అట్టే శైలాస్త్రాన్ని ప్రయోగించి వట్లున్నాడు,తిరిగి కొండల్లాంటి స్థనద్వయం బయటకు కన్పించసాగాయి.
ముందుగా పంతంతో సమ్మోహనాస్త్రం కూడా ప్రయోగించి నట్లున్నాడు,ఆమె మనస్సు పరవశంతో వశం తప్పి పోయింది.
అందుచేత ఎల్లప్పుడూ రక్షగా ఉండేందుకని నారాయణాస్త్ర ప్రయోగం చేసినట్లున్నాడు.ఘనమైన శ్రీవంకటేశ్వరుడు
ఆమె కౌగిటిలో కూడి ఉన్నాడు.
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
3 days ago