నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 9, 2010

కుచేలోపాఖ్యానము

కుచేలోపాఖ్యానము
మొన్నను  ఆదివారం కావటం మూలాన మా నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి చూచి వద్దామని పెద్దాపురం నుంచి మా స్వగ్రామం ఉండ్రాజవరం ప్రయాణం కట్టాను. నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం నాలుగైంది. అప్పటికి మా నాన్నగారు మా ఊళ్ళోని వృద్ధాశ్రమానికి కాలక్షేపం కోసం వెళ్ళారని తెలిసి అక్కడికే వెళ్ళాను. మా మాష్టారు శ్రీ కుదప సత్యనారాయణగారి నిర్వహణలో నడుస్తుంది ఆ వృద్ధాశ్రమం. ఆ ఆశ్రమానికి కావల్సిన ఆర్ధిక వనరుల సేకరణలో మా నాన్నగారు కూడా భాగస్వామ్యం వహిస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తరువాత తిరిగి పెద్దాపురం బయలుదేరుదామనుకుంటుంటే - మా ఊర్లో సాయంకాలం 6.30 నుండి 8.30 గంటలవరకూ మంచి పురాణ కాలక్షేపం జరుగుతుందనీ అది చూచి వెళితే బాగుంటుంది కదా అని మా మాష్టారు అన్నారు. అందుకని ఉండిపోయి ఆ కార్యక్రమం చూద్దామని అక్కడకు వెళ్ళాను. ఆరోజు కార్యక్రమం   == కుచేలోపాఖ్యానం. ప్రవచించినవారు శ్రీ శ్రీమన్నారాయణ గారు. వారిది మంచి కంఠస్వరం. పోతన భాగవతం నుంచి కుచేలోపాఖ్యానం గానం చేసారు. అందరూ చాలా బాగా ఆనందించారా కార్యక్రమాన్ని. మన బ్లాగ్మిత్రులకోసం ఆ పద్యాలను బ్లాగులో అందిస్తే బాగుంటుందని అనిపించి ఈ బ్లాగు పోస్టింగు మొదలుపెట్టాను.

కుచేలుని భార్య - అతనికుటుంబం దుర్భర దారిద్ద్ర్యంతో బాధపడుతూ వారి 32 మంది సంతానానికి ఆహారాన్నికూడా అందివ్వలేని తరుణంలో భర్తతో ఇలా అంటుంది.
తే.

బాల సఖుఁ డైన యప్పద్మపత్రనేత్రుఁ
గాన నేఁగి దరిద్రాంధకార మగ్ను
లయిన మము నుద్ధరింపుము హరి కృపాక
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ  ! నీవు.

నీ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ఠుని దగ్గఱకు వెళ్ళి రండి . ఆయన కృపాకటాక్షం మనమీద ప్రసరిస్తుంది. దాని వలన మనకు మన దారిద్ర్యబాధ నుండి  ఉపశమనం లభిస్తుంది .
అంతే కాదు , ఆయన
చ.
వరదుఁడు సాధుభక్త జన వత్సలుఁ డార్త శరణ్యు డిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడుఁ దాఁ గుశస్థలీ
పురమున యాదవప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁడు నీ
వరిగిన మిమ్ముఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్.

అనూన సంపదల్ - కాదు అనూహ్య సంపదల్ - అని చదువుకోవాలని ఒకరు అన్నారట.
మ.
కలలోనం దను ము న్నెఱుంగని మహాకష్టాత్ముఁ డై నట్టి దు
ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోన్
దలఁప న్నంతనె మెచ్చి యార్తిహరుఁ డై తన్నైన నిచ్చున్ సుని
శ్చలభక్తిన్ భజియించువారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్.
 
ఆర్తిహరులైనవారు మనస్సులో తలచినంత మాత్రాన్నే ఆర్తి హరుడగుట వలన వారికి తననే ఇచ్చేసుకుంటాడు, అందుచేత భక్తితో ప్రార్ధించేవారికి సకల సంపదలనూ తప్పక ఇస్తాడు వెళ్ళిరండి అని పంపిస్తుంది అతని భార్య కుచేలుడిని శ్రీకృష్ణుని దగ్గఱకు.
కుచేలుడు శ్రీకృష్ణ దర్శనం ఇహపరసాధనం అని మనస్సులో అనుకొని,
తే.
నీవు చెప్పినయట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమశోభన మా చక్రపాణి కిపుడు
కాను కేమైన గొంపోవఁ గలదె మనకు.
 
ఆయన నువ్వన్నట్లుగా సాక్షాత్ భగవంతుడు. భగవంతుని దర్శనానికి ఉత్తచేతులతో వెళ్ళకూడదు కదా ? మరి నేనేం కానుక పట్టుకెళ్ళనూ అంటాడు కుచేలుడు.
తే.
అనిన న య్యింతి యౌఁ గాక యనుచు విభుని 
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.

పాపం కొన్ని అటుకులను అతని శిథిల వస్త్రంలో మూటకట్టి ఇచ్చిందటా యిల్లాలు. అవి తీసుకుని శ్రీకృష్ణుని చూడటానికి బయలుదేరి వెళ్ళాడు కుచేలుడు.
వ. అట్లు చనుచుం దన మనంబున.
సీ.
ద్వారకానగరంబు నేరీతిఁ జొత్తును భాసురాంతఃపురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నె భ్భంగి దర్శింపఁగలను దద్ద్వారపాలు
రెక్కడి విప్రుండ విం దేలవచ్చెద వని యడ్డపెట్టిరే నపుడు వారి
కేమైనఁ బరిదానఁ మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్థశూన్యుండ నేను
తే.
నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండుఁ గలదె యాతఁ
డేల నన్ను నుపేక్షించు నేటిమాట
లనుచు నా ద్వారకాపుర మపుడు సొచ్చి.

పరిదానము అంటే బహుమతి లేక లంచము, అంటే ఆ రోజుల్లోకూడా లంచాలు గట్రా ఉన్నాయన్నమాట.

వ. అట్లు ప్రవేశించి, రాజమార్గంబునం చని, కక్ష్యాంతరంబు గడచి, చని ముందట.
సీ.
విశదమై యొప్పు షోడశ సహస్రాంగనా కలిత విశాల సంగతిఁ దనర్చి
మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధహర్మ్యములఁ జూచి
మనము బ్రహ్మానందమును బొందఁగడు నుబ్బి సంతోషబాష్పముల్ జడిగొనంగఁ
బ్రకట మై విలసిల్లు నొక వధూమణి మందిరమున నింతులు చామరములు వీవఁ
తే.
దనరు మృదు హంసతూలికా తల్పమందుఁ
దానుఁ బ్రియయును బహువినోదములఁ దనరి
మహిత లావణ్య మన్మథమన్మథుండు
ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు.

మన్మథమన్మథుండు అట ఎంతమంచి విశేషణమో చూడండి. రుక్మిణీ దేవి అంతఃపురం వరకూ సరాసరి రాగలిగాడన్నమాట . ఎంత కృపావిశేషమో.
సీ.
ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ గరుణాలవాలు భాసురకపోలుఁ
గౌస్తుభాలంకారుఁ గామితమందారు సురుచిరలావణ్యు సురశరణ్యు
హర్యక్షనిభ మధ్యు నఖిలలోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు
ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ బన్నగ శయను నబ్జాతనయను
తే.
మకరకుండల సద్భూషు మంజుభాషు
నిరుపమాకారు దుగ్ధసాగర విహారు
భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు. 

స్పష్టమైన పోతన గారి ముద్రగల పద్యాలు . ఇటువంటి పద్యాలు వచ్చినప్పుడు మనల్ని మనమే మఱచిపోతూ తన్మయత్వం చెందుతుంటాం.

మ.
కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డ ప్పేదవి
ప్రుని నశ్రాంత దరిద్రపీడుతుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘన తృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండో త్తరీయున్ గుచే
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుం డై దిగెన్ దల్పమున్.
క.
కర మర్థి నెదురుగాఁ జని, పరిరంభణ మాచరించి బంధుస్నేహ
స్ఫురణన్ దో డ్తెచ్చి సమా, దరమునఁ గూర్చుండఁ బెట్టెఁ దన తల్పమునన్. 

తన తల్పముమీదే కూర్చుండబెట్టుకొన్నాడట , చూడండి ! స్నేహానికెంత విలువనిచ్చాడో !
తే.
అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ
దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి
లలిత మృగమద ఘనసార మిళితమైన.
తే.
మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత
శ్రమము వాయంగఁ దాళవృంతముల విసరి
బంధు రామోద కలిత ధూపంబు లొసఁగి
మించు మణిదీపముల నివాళించి మఱియు.
వ.
సురభి కుసుమమాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు లిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన, నప్పు డ వ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప, నానందబాష్ప జలబిందు సందోహుండయ్యె. అట్టి యెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణంబులు మెఱయఁ జామరములు వీవం, దజ్జాత వాతంబు ఘర్మసలిలంబు నివారింపుచుండం జూచి, శుద్ధాంత కాంతాజనంబులు మనంబున నద్భుతం బంది, యి ట్లనిరి.
ఉ.
ఏమితపంబు సేసెనొకొ యీ ధరణీదివిజో త్తముండు దొల్
బామున యోగివిస్ఫుర దుపాస్యకుఁ డై తనరారు నీ జగత్
స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్.
వ. అదియునుంగాక.
చ.
తన పరియంకమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదమున్
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలన్ బరితుష్టుఁ జేయుచున్
వినయమునన్ భజించె ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుఁడో.
వ. అయ్యవసరంబున
క.
మురసంహరుఁడు కుచేలుని, కరము గరంబునఁ దెమల్చి కడక న్మన మా
గురు గృహమున వర్తించిన, చరితము లని కొన్ని తడవి చతురత మఱియున్-
సీ.
బ్రాహ్మణోత్తమ ! వేదపాఠన లబ్ధ దక్షతఁ గల చారు వంశంబువలనఁ
బరిణయం బై నట్టి భార్య సుశీల వర్తనములఁ దగ భవత్ సదృశ యగునె
తలఁప గృహక్షేత్ర ధన దార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట
దోఁచుచున్నది యేనుఁ దుది లోకసంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు
తే.
గతి మనంబునఁ గామమోహితులు గాక
యర్థిమై విహితకర్మంబు లాచరించి
ప్రకృతి సంబంధములు నన్ను భవ్యనిష్ఠఁ
దగిలి యుందురు గొంద ఱు త్తములు భువిని.
వ. అని మఱియు ని ట్లనియె.
క.
ఎఱుఁగుదె గురుమందిరమున, వెఱ వొప్పఁగ మనకు నతఁడు వెలయఁగ దెలుప
న్నెఱుఁగఁగ వలసిన యర్థము, లెఱిఁగి పరిజ్ఞాన మహిమ లెఱుఁగుట లెల్లన్.
వ. అని మఱియు, గురుప్రశంస సేయం దలంచి, యి ట్లనియె.
తే.
తివిరి యజ్ఞాన తిమిర ప్రదీప మగుచు
నవ్యం బైన బ్రహ్మంబు ననుభవించు
భరిత సత్త్వుండు సత్కర్మ నిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డనఘుండు బుధనుతుండు.

వ. అ మ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు, గురుభజనంబు పరమ ధర్మం బని యాచరించితి. అది గావున,
క.
భూసురుల కెల్ల ముఖ్యుఁడ, నై సకల కులాశ్రమంబులందుల నెపుడున్
ధీ సుజ్ఞానప్రదుఁ డన, దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లడలన్.
తే.
అట్టి వర్ణాశ్రంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలై క గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు. 

వ.
అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను తపో వ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను. గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు. అని చెప్పి మఱియును, మనము గురుమందిరంబున నున్నయెడ గురుపత్నీ నియుక్తుల మై, యొక్కనాఁ డింధనార్థం బడవికిం జనిన యవసరంబున,
వారిద్దరూ అడవికి వెళ్ళి వానలో తుఫానులో చిక్కుబడి తెల్లవారువరకూ తిరిగి రాలేకపోవటం వారిని వెదుక్కుంటూ వారి గురువైన సాందీపులవారు రావటం వారిని అక్కున చేర్చుకొని ఆశీర్వదించటం వగైరా కథ నంతటినీ గుర్తుచేస్తాడు.అప్పుడు గురువుగారు వారితో
చ.
కటకట ! యిట్లు మా కొఱకుఁ గా జనుదెంచి మహాటవిన్ సము
త్కట పరిపీడ నొందితిరి గావున శిష్యులు మా ఋణంబు నీఁ
గుట కిది కారణంబు సమకూరెడిఁ బో యిటమీఁద మీకు వి
స్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్.
క.
అని గారవించి యాయన, మనలన్ దోడ్కొనుచు నాత్మమందిరమునకున్
జనుదెంచుట లెల్లను నీ, మనమునఁ దలఁతేయటంచు మఱియును బలికెన్.

వ. అనఘా ! మన మధ్యయనంబు సేయుచు, నన్యోన్య స్నేహవాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱువవు గదా ! అని యవి యెల్లనుం దలంచి యాడు మాధవు మాటలు విని , యతనిం గనుంగొని, కుచేలుం డిట్లనియె.
క.
వనజోదర ! గురుమందిర,మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం
పని పను లెవ్వియుఁ గలవే, విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా !
క.
గురుమతిఁ దలపఁగఁ ద్రిజగ,ద్గురుఁడ వనందగిన నీకు గురుఁ డనఁగా నొం
డొరుఁ డెవ్వఁ డింతయును నీ, కరయంగ విడంబనంబ యగుఁగాదె హరీ ! 
విడంబనంబ = లీల
వ.
అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని, సమస్త భావాభిజ్ఞుం డైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుండగుచు, నతని జూచి, నీ విచ్చటికి వచ్చినపుడు నాయందుల భక్తిం జేసి, నాకు నుపాయనంబుగా నేమి పదార్థంబు దెచ్చితివి , అ ప్పదార్థంబు లేశమాత్రం బైనఁ బదివేలుగా నంగీకరింతు, అట్లుంగాక, నీచవర్తనుండై, మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన, నదియును నా మనంబునకు సమ్మతంబు గాదు. కావున,
క.
దళమైన పుష్పమైనను, ఫలమైనను సలిలమైనఁ బాయనిభక్తిన్
గొలిచిన జను లర్పించిన, నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్

చూడండి. గీతలోనూ భగవానుడీ విషయాన్నే సుమారుగా ఇవే మాటలలో చెప్తాడు.
అ.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృత
మశ్నామి ప్రయతాత్మనః|| 9-26 ||
కందము.
పత్ర ఫల పుష్ప తోయము
లాత్రముతో భక్త తతి సమర్పించిన , యా
పత్ర ఫల పుష్ప తోయము
లాత్రముతో స్వీకరింతు, నర్జున ! ప్రీతిన్ . ౨౪ ( శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి గారి అనువాదం )

క.
అని పద్మోదరుఁ డాడిన, వినయోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె
చ్చిన యటుకులు దగ నర్పిం, పనునేరక మోమువాంచి పలుకక యున్నన్.
వ.
అ వ్విప్రుండు చనుదెంచిన కార్యంబు దన దివ్యచిత్తంబున నెఱింగి, యితఁడు పూర్వభవంబున నై శ్వర్యకాముం డై, నన్ను సేవింపఁడు. ఐనను, ని క్కుచేలుండు నిజకాంతా ముఖోల్లాసంబు కొఱకు నాయొద్దకుం జనుదెంచినవాఁడు. ఇతనికి నింద్రాదులకుం బడయరాని బహు ప్రకారంబు లైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు, అని తలంచి, యతండు జీర్ణవస్త్రంబు కొన ముడిచి తెచ్చిన య య్యటుకులముడియఁ గని , యిది యేమి యని యొయ్యన న మ్ముడియఁ దన కరకమలంబున విడిచి, య య్యటుకులు గొన్ని పుచ్చికొని, యివియ సకలలోకంబులను నన్నుఁ బరితృప్తిం బొందింపజాలు, అని యప్పుడు,
క.
మురహరుఁడు పిడికెఁ డటుకులు, గర మొప్పఁగ నారగించి కౌతుకమతి యై
మఱియును పిడికెఁడు గొనఁ , దత్కర మప్పుడు వట్టెఁ గమల కరకమలములన్.

కమల కరకమలములన్= చూడండి యెంత అందంగా ప్రయోగించాడో. 

క.
సొంపారఁగ నితనికి బహు, సంపద లందింప నవియ చాలును నిఁక భ
క్షింపఁగ వలవదు త్రిజగ, త్సంపత్కర ! దేవదేవ ! సర్వాత్మ  ! హరీ !  

ఇటువంటి అనేక ఘట్టాలను .. పోతన భాగవతం లోనివి...  యెన్నిసార్లు చదివినా విన్నా  బ్లాగినా కూడా తనివితీరదు కదా. ఇప్పటి కిక్కడితో ముగిస్తాను.




6 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks