భూపాళం
శిర సెత్తఁగదవయ్య శ్రీనారసింహ నీ
సిరులెల్లా నేనే కానా శ్రీనారసింహ। IIపల్లవిII
చెలుల నంపితి వేల శ్రీనారసింహ నాకు
సెలవుల నవ్వు వచ్చె శ్రీనారసింహ
చెలువపు నిన్నుఁ జూచి శ్రీనారసింహ నీపై
చిలికితి మోహమెల్ల శ్రీనారసింహ। IIశిరII
చిత్తాన నిన్నుఁ దలచి శ్రీనారసింహ నే
చిత్తరు ప్రతిమ నైతి శ్రీనారసింహ
చిత్తవాన చెమటల శ్రీనారసింహ యేల
చిత్తిణి గుణము నీకు శ్రీనారసింహ। IIశిరII
శ్రీసతి నీ తొడ యెక్కె శ్రీనారసింహ నీవు
సేసవెట్టితి వాపెపై శ్రీనారసింహ
చేసన్న శ్రీవేంకటాద్రి శ్రీనారసింహ యింత
సేసి నన్నుఁ గూడితివి శ్రీనారసింహ। IIశిరII౧౫-౨౫౪
Dec 1, 2008
శిర సెత్తఁగదవయ్య శ్రీనారసింహా నీ
అల్లనాఁడే కంటి వింటి నథోక్షజా
మాళవి
పోకు పోకు మంత నీవు పురుషోత్తమా వట్టి
బంగాళం
పోకు పోకు మంత నీవు పురుషోత్తమా వట్టి
బూకలు మే మెఱుఁగమా పురుషోత్తమా। IIపల్లవిII
పొలసులాడకు నీవు పురుషోత్తమా నీ
పొల జాణతనాలు పురుషోత్తమా
పులుసు వేసి నీ చెంత పురుషోత్తమా నేము
పులు గరసితి మింత పురుషోత్తమా। IIపోకుII
పొడవాటి సటకాఁడ పురుషోత్తమా
పొడమె నీ మోవి నవ్వు పురుషోత్తమా
పుడిశెఁడే నీ సిగ్గు పురుషోత్తమా
పొడిరాలి రతులలో పురుషోత్తమా। IIపోకుII
పొద్దువొద్దు కొత్త లేల పురుషోత్తమా నీవు
బుద్దెఱింగినప్పు డయ్యీ పురుషోత్తమా
అద్దుకొని శ్రీవేంకటాద్రి పురుషోత్తమా నీది
బొద్దువంటి యుంగరము పురుషోత్తమా। IIపోకుII౧౫-౨౫౨
Nov 30, 2008
అంతా నీకు లోనే అనిరుద్ధా మన
నాట
అంతా నీకు లోనే అనిరుద్ధా మన
యంతరంగ మొక్క టాయె ననిరుద్ధా । IIపల్లవిII
అడ్డమాడఁ జాలము నీ కనిరుద్ధా
అడ్డెఁ డమ్మీనాఁడు బోడి యనిరుద్ధా
అడ్డివెట్ట నింక నేల యనిరుద్ధా
అడ్డాఁక లెంచకుమీ యనిరుద్ధా। IIఅంతాII
అప్పటి వేఁడుకొనేవా అనిరుద్ధ నీకు
నప్పణ నే నిచ్చేనా యనిరుద్ధా
అప్పుడే విన్న వించనా అనిరుద్ధ వొద్ద
నప్పసమై వున్నదాన ననిరుద్ధా। IIఅంతాII
ఆయమెఱుఁగుదువోయి అనిరుద్ధా
ఆయెడనుండి వచ్చితి వనిరుద్ధా
ఆయితమై కూడితివి అనిరుద్ధా
ఆయనాయ శ్రీవేంకట యనిరుద్ధా। IIఅంతాII ౧౫-౨౫
పంతము దప్పదు నీకు ప్రద్యుమ్నా
సాళంగనాట
పంతము దప్పదు నీకు ప్రద్యుమ్నా వొక్క
బంతిఁ గూడేవు సతుల ప్రద్యుమ్నా। IIపల్లవిII
బలబలఁ దెల్లవారె ప్రద్యుమ్నా యింక
బలిమి సేయ వచ్చేవు ప్రద్యుమ్నా
పలచనాయె సిగ్గులు ప్రద్యుమ్నా నీ
పలుసోకుల వలెనే ప్రద్యుమ్నా। IIపంతముII
పచ్చలాయె కట్టేవు ప్రద్యుమ్నా
బచ్చెన ప్రియాలు చూపి ప్రద్యుమ్నా
బచ్చుబేరాలసటల ప్రద్యుమ్నా నీ
పచ్చడ మంటించేవు ప్రద్యుమ్నా। IIపంతముII
పదరకు మింక నీవు ప్రద్యుమ్నా మా
బదుకు నీ చేతిది ప్రద్యుమ్నా
పదనై శ్రీవేంకటాద్రి ప్రద్యుమ్నా నన్నుఁ
బదిమారులు గూడితి ప్రద్యుమ్నా। IIపంతముII ౧౫-౨౫౦
వాడిక లాయె నీ పొందు వాసుదేవుఁడా
గైళ
వాడిక లాయె నీ పొందు వాసుదేవుఁడా
వాడుదేరెఁ గెమ్మోవి వాసుదేవుఁడా। IIపల్లవిII
వాలుక చూపులు మావి వాసుదేవుఁడా మమ్ము
వాలాయించితివి నీవు వాసుదేవుఁడా
వాలారుగోళ్ళ నొత్తకు వాసుదేవుఁడా నీకు
వైళమె నవ్వు వచ్చును వాసుదేవుఁడా। IIవాడికII
వలపెల్లా మా సొమ్ము వాసుదేవుఁడా యింత
వలెనా మా తోడి రట్టు వాసుదేవుఁడా
వలుములు చన్నులంటా వాసుదేవుఁడా వట్టి
వళుకులఁ బెట్టకుమీ వాసుదేవుఁడా। IIవాడికII
వడదేరె శ్రీవేంకట వాసుదేవుఁడా యేల
వడిసేవు తరితీపు వాసుదేవుఁడా
వడిగొనఁ గూడితివి వాసుదేవుఁడా మన
వడు వెవ్వరికిఁ గద్దు వాసుదేవుఁడా। IIవాడికII ౧౫-౨౪౯
తప్పని బొంకని యట్టి దామోదరా నాకు
భైరవి
తప్పని బొంకని యట్టి దామోదరా నాకు
దప్పిదేర మో వియ్యవో దామోదరా। IIపల్లవిII
తరితీపుమాట లెల్ల దామోదరా నీకు
తరుణులు నేరిపిరా దామోదరా
దరిచేరె సంకు నీచే దామోదరా నీవు
తరగరివె తగు దామోదరా। IIతప్పనిII
తగులు వీరి పందేల దామోదరా నీ
తగవు లేల చెప్పేవు దామోదరా
దగదొట్టి పలికేవు దామోదరా వెను
తగిలితి విందాఁక దామోదరా। IIతప్పనిII
తల యెత్తు మా ముందర దామోదరా నీ
తళుకుమోవి చూచి దామోదరా
తలకొని కూడితివి దామోదరా యింక
తలఁగకు శ్రీవేంకటదామోదరా। IIతప్పనిII ౧౫-౨౪౮
బందుగుఁడ వన్నిటాను పదుమనాభ వట్టి
శంకరాభరణం
బందుగుఁడ వన్నిటాను పదుమనాభ వట్టి
బందెలు గట్టకు మమ్ము పదుమనాభ। IIపల్లవిII
పట్టిన చలపాదివి పదుమనాభ మమ్ము
బట్టబయలీఁదించేవు పదుమనాభ
పట్టితి బలిమి నన్నుఁ పదుమనాభ యింకా
బట్టము గట్టుకొనేవు పదుమనాభ। IIబందుII
పాటలు వాడేవు యీడ పదుమనాభ ఆ
పాటివారమా విన పదుమనాభ
పాటిగంప నీళ్ళు నించేవు పదుమనాభ బండి
బాటలాయె నీ గుట్టు పదుమనాభ। IIబందుII
పలికినట్టే యాయె పదుమనాభ
బలవంతుఁడవు నీవు పదుమనాభ
పలుమారుఁ గూడితివి పదుమనాభ యిదె
ఫలమా శ్రీవేంకట పదుమనాభ। IIబందుII ౧౫-౨౪౭
ఇద్దరము నిద్దరమె హృషీకేశ
సామంతం
ఇద్దరము నిద్దరమె హృషీకేశ
యిద్దె సనకాన వచ్చె హృషీకేశ। IIపల్లవిII
ఏఁటికోయి మాతో హృషీకేశ
యీటు వెట్టేవు సతుల హృషీకేశ
యీటారదు మా పొందు హృషీకేశ నీపై
యేటి దియ్యమింక నేము హృషీకేశ। IIఇద్దII
ఇచ్చకు రాలను నేను హృషీకేశ నిన్ను
నెచ్చుకుందులాడఁ జాల హృషీకేశ
ఇచ్చితి వింత చనవు హృషీకేశ నీకు
నెచ్చరించే మరవకు హృషీకేశ। IIఇద్దII
యేల నీకు మఱుఁగులు హృషీకేశ
నీలాగునఁ గూడితివి హృషీకేశ
యేలితి శ్రీవేంకటాద్రి హృషీకేశ
యీ లీలనే వుండుమీ హృషీకేశ। IIఇద్దII ౧౫-౨౪౬
చెప్పరాని మహిమల శ్రీధరా నీవు
శ్రీరాగం
చెప్పరాని మహిమల శ్రీధరా నీవు
చెప్పినట్టు చేసేము శ్రీధరా. IIపల్లవిII
చేరఁ దీసి నా కన్నుల శ్రీధరా నీ
జీరల మేను చూచితి శ్రీధరా
చేరువ సంతోష మబ్బె శ్రీధరా
చీరుమూరాడీఁ (?) దమి శ్రీధరా. IIచేరII
చెల్లు నన్నియును నీకు శ్రీధరా నీ
చిల్లర సతులు వారే శ్రీధరా
చెల్లఁబో ఆ సుద్ది విని శ్రీధరా నాకు
చిల్లులాయె వీనులెల్లా శ్రీధరా. IIచేరII
సేవలు సేసేము నీకు శ్రీధరా మమ్ముఁ
జేవదేరఁ గూడితివి శ్రీధరా
చేవల్లకు రావోయి శ్రీధరా
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీధరా। IIచేరII౧౫-౨౪౫
వద్దు వద్దు సటలింక వామనా
పాడి
వద్దు వద్దు సట లింక వామనా
వద్దనే వున్నార మిదె వామనా। IIపల్లవిII
వరుసలు వెదకేవు వామనా నీవు
వరుఁడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాఁడవు వామనా . IIవద్దుII
వనము కోగిల వైతి వామనా నీకు
వనితలు బాఁతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
వను వేళ చూచూకోమీ వామనా . IIవద్దుII
వాడవారు మొక్కేరు వామనా నీకు
వాదుదేరె కెమ్మోవి వామనా
వాదికె శ్రీవేంకటాద్రి వామనా
వాడేచెలమవు నీవు వామనా . IIవద్దుII౧౫-౨౪౪
వేగిరించ కంతేసి త్రివిక్రము
ముఖారి
వేగిరించ కంతేసి త్రివిక్రము
సేగుఁ జుక్క రానీ త్రివిక్రమ। IIపల్లవిII
వేసరించఁ జుమ్మీ త్రివిక్రమ నిన్ను
వీసమంత పనికే త్రివిక్రమ
వేసేవు పూవులను త్రివిక్రమా మేని
వేసురుఁ జెమటల త్రివిక్రమ। IIవేగిII
వెన్నెలలో నవ్వకు త్రివిక్రమా కన్న
విన్న వారేమందురో త్రివిక్రమా
విన్నాణపు చేఁతల త్రివిక్రమా
వెన్నగారీ నీ మోవి త్రివిక్రమా।IIవేగిII
వెడజారెఁ దురుము త్రివిక్రమా నన్ను
విడిదిలోఁ గూడితి త్రివిక్రమా
విడువ శ్రీవేంకటత్రివిక్రమా నీ
విడిముడి మెట్టితి త్రివిక్రమా। IIవేగిII ౧౫-౨౪౩
మానరాని చుట్టమవు మధుసూధనా నీ
రామక్రియ
మానరాని చుట్టమవు మధుసూదనా నీ
మానినిఁ జుమ్మీ నేను మధుసూదన। IIపల్లవిII
మఱువకుమీ మా పొందు మధుసూదనా యింకా
మఱుఁగులేని మనకు మధుసూదనా
మఱి యేమి చెప్పేవు మధుసూదనా యే
మఱక మ మ్మేలుమీ మధుసూదనా। IIమానII
మడచి యా కిచ్చె నింద మధుసూదనా మేన
మడుగులాయె చెమట మధుసూదనా
మడిదొసకులు గావు మధుసూదనా నాకు
మడుక పన్నాయె మేలు మధుసూదనా। IIమానII
మందెమేళ మాయె రతి మధుసూదనా గొల్ల
మంద లెల్ల నీ సుద్దులే మధుసూదనా
మందు చల్లి కూడితివి మధుసూదనా మా
మందిరము శ్రీవేంకట మధుసూదనా। IIమానII ౧౫-౨౪౨
మడిదొసకులు=?
మడుక పన్నాయె=?
చతురుఁడ వన్నిటాను జనార్దనా మమ్ము
వరాళి
చతురుఁడ వన్నిటాను జనార్దనా మమ్ము
సతముగా నేలితివి జనార్దనా। IIపల్లవిII
సమ మోహాలు మనవి జనార్దనా యిట్టె
జమళి నున్నార మిదె జనార్దనా
సమకూడెఁగా లెస్స జనార్దనా నీ
సముక మెవ్వరి కబ్బు జనార్దనా। IIచతుII
చవులాయ సరసాలు జనార్దనా పెండ్లి
చవికెలో మనకు జనార్దనా
సవరని వాఁడవు జనార్దనా మరి
సవతు లేరు నీకు జనార్దనా।IIచతుII
సంకె దీరఁ గూడితివి జనార్దనా నీకు
చంక లెత్తి మొక్కేము జనార్దనా
జంకించకు శ్రవేంకట జనార్దనా
శంకుఁ జక్రములచేతి జనార్దనా।IIచతుII ౧౫-౨౩౯
ఆసలు చెరుచకుమీ యచ్యుత
లలిత
ఆసలు చెరుచకుమీ యచ్యుత
ఆ సుద్దులె యీ సుద్దులు అచ్యుతా।
అలవాటే తొల్లే నీకు నచ్యుతా
అలుగము ఇంక నీతో నచ్యుతా
అలయకు మింక నీవు అచ్యుతా నిన్ను
నలమి పట్టెఁగాని యచ్యుతా। IIఆసలుII
ఆలసించఁ బనిలేదు అచ్యుతా
ఆలిమగనిసంధి నచ్యుతా
ఔలే నీ విట్టే యచ్యుతా
ఆలించి మమ్మేలితివి అచ్యుతా। IIఆసలుII
అసము దించకు మింక నచ్యుతా
అసురుసురై చిక్కితి మచ్యుతా
అసలు చెమటఁ గూడి యచ్యుతా రతి
యసుదా శ్రీవేంకటాద్రి యచ్యుతా। IIఆసలుII ౧౫-౨౩౮
మా యింటికి రావోయి మాధవా
ఆహిరి
మా యింటికి రావోయి మాధవా
మాయలెల్లాఁ గంటి మిదె మాధవా। IIపల్లవిII
మచ్చు చల్లేవు వలపు మాధవా నేను
మచ్చిక లెల్లాఁ జేసితి మాధవా
మచ్చెము నీపై నిదె మాధవా యింక
మచ్చరపు చూపు నలో మాధవా। IIమా యింII
మఱుఁ గేల యింక నీకు మాధవా
మఱి నాకు దక్కితివి మాధవా
మఱచేవానిచేఁతలు మాధవా మాతో
మఱచు మాటే మనేవు మాధవా। IIమా యింII
మట్టులేని శ్రీవేంకట మాధవా కట్టు
మట్టుతో మమ్ముఁ గూడితి మాధవా
మట్టేవు మా కాళ్ళప్పటి మాధవా
మట్టె లియ్యఁ గదవోయి మాధవా। IIమా యింII ౧౫-౨౩౬
కిందుపడి మొక్కకుమీ కేశవా
బౌళి
కిందుపడి మొక్కకుమీ కేశవా
కెందమ్మి రేకుఁ గన్నుల కేశవా. IIపల్లవిII
కేలు చాఁచే వింతలోనే కేశవా రతి
కేలికి మాయాడకే రా కేశవా
గేలి సేసేవేల మమ్ము కేశవా నీ
కేలు నా చేత నున్నది కేశవా। IIకిందుII
గెరసు దాఁటకు వోయి కేశవా మంకుఁ
గెరలించేవు వలపు కేశవా
గిరికుచము లివిగో కేశవా నీకు
గిరపు వెట్టు కున్నదాన కేశవా। IIకిందుII
కిలకిల నవ్వనేల కేశవా నీకు
కెలని వారమా నేము కేశవా
గిలిగించి కూడితివి కేశవా నాతోఁ
గెలసేవు శ్రీవేంకటకేశవా। IIకిందుII ౧౫-౨౩౩
Nov 21, 2008
వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో
|
శ్రీరాగం
వెట్టి వలపు చల్లకు విష్ణు మూరితి నాతో
వెట్టి దేర మాటాడు విష్ణు మూరితి. IIపల్లవిII
వినయము సేసేవు విష్ణు మూరితిఁ నీవు
వెనకటివాఁడవే కా విష్ణు మూరితి
వినవయ్య మా మాఁట విష్ణు మూరితి మమ్ము
వెనుకొని పట్టకుమీ విష్ణు మూరితి. IIవెట్టిII
వెరవు గలవాఁడవు విష్ణు మూరితి నేఁడు
వెరగైతి నిన్నుఁ జూచి విష్ణు మూరితి
విరివాయ నీ మాయలు విష్ణు మూరితి నాకు
విరు లిచ్చేవప్పటిని విష్ణు మూరితి. IIవెట్టిII
వెలసె నీ చేతలెల్లా విష్ణు మూరితి మా
వెలుపల లోన నీవె విష్ణు మూరితి
వెలలేని శ్రీవేంకట విష్ణు మూరితి కూడి
విలసిల్లితివి నాతో విష్ణు మూరితి. IIవెట్టిII ౧౫-౨౪౧