నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label పోతనభాగవతము-దశమస్కంధము. Show all posts
Showing posts with label పోతనభాగవతము-దశమస్కంధము. Show all posts

Mar 9, 2010

కుచేలోపాఖ్యానము

కుచేలోపాఖ్యానము
మొన్నను  ఆదివారం కావటం మూలాన మా నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి చూచి వద్దామని పెద్దాపురం నుంచి మా స్వగ్రామం ఉండ్రాజవరం ప్రయాణం కట్టాను. నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం నాలుగైంది. అప్పటికి మా నాన్నగారు మా ఊళ్ళోని వృద్ధాశ్రమానికి కాలక్షేపం కోసం వెళ్ళారని తెలిసి అక్కడికే వెళ్ళాను. మా మాష్టారు శ్రీ కుదప సత్యనారాయణగారి నిర్వహణలో నడుస్తుంది ఆ వృద్ధాశ్రమం. ఆ ఆశ్రమానికి కావల్సిన ఆర్ధిక వనరుల సేకరణలో మా నాన్నగారు కూడా భాగస్వామ్యం వహిస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తరువాత తిరిగి పెద్దాపురం బయలుదేరుదామనుకుంటుంటే - మా ఊర్లో సాయంకాలం 6.30 నుండి 8.30 గంటలవరకూ మంచి పురాణ కాలక్షేపం జరుగుతుందనీ అది చూచి వెళితే బాగుంటుంది కదా అని మా మాష్టారు అన్నారు. అందుకని ఉండిపోయి ఆ కార్యక్రమం చూద్దామని అక్కడకు వెళ్ళాను. ఆరోజు కార్యక్రమం   == కుచేలోపాఖ్యానం. ప్రవచించినవారు శ్రీ శ్రీమన్నారాయణ గారు. వారిది మంచి కంఠస్వరం. పోతన భాగవతం నుంచి కుచేలోపాఖ్యానం గానం చేసారు. అందరూ చాలా బాగా ఆనందించారా కార్యక్రమాన్ని. మన బ్లాగ్మిత్రులకోసం ఆ పద్యాలను బ్లాగులో అందిస్తే బాగుంటుందని అనిపించి ఈ బ్లాగు పోస్టింగు మొదలుపెట్టాను.

కుచేలుని భార్య - అతనికుటుంబం దుర్భర దారిద్ద్ర్యంతో బాధపడుతూ వారి 32 మంది సంతానానికి ఆహారాన్నికూడా అందివ్వలేని తరుణంలో భర్తతో ఇలా అంటుంది.
తే.

బాల సఖుఁ డైన యప్పద్మపత్రనేత్రుఁ
గాన నేఁగి దరిద్రాంధకార మగ్ను
లయిన మము నుద్ధరింపుము హరి కృపాక
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ  ! నీవు.

నీ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ఠుని దగ్గఱకు వెళ్ళి రండి . ఆయన కృపాకటాక్షం మనమీద ప్రసరిస్తుంది. దాని వలన మనకు మన దారిద్ర్యబాధ నుండి  ఉపశమనం లభిస్తుంది .
అంతే కాదు , ఆయన
చ.
వరదుఁడు సాధుభక్త జన వత్సలుఁ డార్త శరణ్యు డిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడుఁ దాఁ గుశస్థలీ
పురమున యాదవప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁడు నీ
వరిగిన మిమ్ముఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్.

అనూన సంపదల్ - కాదు అనూహ్య సంపదల్ - అని చదువుకోవాలని ఒకరు అన్నారట.
మ.
కలలోనం దను ము న్నెఱుంగని మహాకష్టాత్ముఁ డై నట్టి దు
ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోన్
దలఁప న్నంతనె మెచ్చి యార్తిహరుఁ డై తన్నైన నిచ్చున్ సుని
శ్చలభక్తిన్ భజియించువారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్.
 
ఆర్తిహరులైనవారు మనస్సులో తలచినంత మాత్రాన్నే ఆర్తి హరుడగుట వలన వారికి తననే ఇచ్చేసుకుంటాడు, అందుచేత భక్తితో ప్రార్ధించేవారికి సకల సంపదలనూ తప్పక ఇస్తాడు వెళ్ళిరండి అని పంపిస్తుంది అతని భార్య కుచేలుడిని శ్రీకృష్ణుని దగ్గఱకు.
కుచేలుడు శ్రీకృష్ణ దర్శనం ఇహపరసాధనం అని మనస్సులో అనుకొని,
తే.
నీవు చెప్పినయట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమశోభన మా చక్రపాణి కిపుడు
కాను కేమైన గొంపోవఁ గలదె మనకు.
 
ఆయన నువ్వన్నట్లుగా సాక్షాత్ భగవంతుడు. భగవంతుని దర్శనానికి ఉత్తచేతులతో వెళ్ళకూడదు కదా ? మరి నేనేం కానుక పట్టుకెళ్ళనూ అంటాడు కుచేలుడు.
తే.
అనిన న య్యింతి యౌఁ గాక యనుచు విభుని 
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.

పాపం కొన్ని అటుకులను అతని శిథిల వస్త్రంలో మూటకట్టి ఇచ్చిందటా యిల్లాలు. అవి తీసుకుని శ్రీకృష్ణుని చూడటానికి బయలుదేరి వెళ్ళాడు కుచేలుడు.
వ. అట్లు చనుచుం దన మనంబున.
సీ.
ద్వారకానగరంబు నేరీతిఁ జొత్తును భాసురాంతఃపురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నె భ్భంగి దర్శింపఁగలను దద్ద్వారపాలు
రెక్కడి విప్రుండ విం దేలవచ్చెద వని యడ్డపెట్టిరే నపుడు వారి
కేమైనఁ బరిదానఁ మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్థశూన్యుండ నేను
తే.
నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండుఁ గలదె యాతఁ
డేల నన్ను నుపేక్షించు నేటిమాట
లనుచు నా ద్వారకాపుర మపుడు సొచ్చి.

పరిదానము అంటే బహుమతి లేక లంచము, అంటే ఆ రోజుల్లోకూడా లంచాలు గట్రా ఉన్నాయన్నమాట.

వ. అట్లు ప్రవేశించి, రాజమార్గంబునం చని, కక్ష్యాంతరంబు గడచి, చని ముందట.
సీ.
విశదమై యొప్పు షోడశ సహస్రాంగనా కలిత విశాల సంగతిఁ దనర్చి
మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధహర్మ్యములఁ జూచి
మనము బ్రహ్మానందమును బొందఁగడు నుబ్బి సంతోషబాష్పముల్ జడిగొనంగఁ
బ్రకట మై విలసిల్లు నొక వధూమణి మందిరమున నింతులు చామరములు వీవఁ
తే.
దనరు మృదు హంసతూలికా తల్పమందుఁ
దానుఁ బ్రియయును బహువినోదములఁ దనరి
మహిత లావణ్య మన్మథమన్మథుండు
ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు.

మన్మథమన్మథుండు అట ఎంతమంచి విశేషణమో చూడండి. రుక్మిణీ దేవి అంతఃపురం వరకూ సరాసరి రాగలిగాడన్నమాట . ఎంత కృపావిశేషమో.
సీ.
ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ గరుణాలవాలు భాసురకపోలుఁ
గౌస్తుభాలంకారుఁ గామితమందారు సురుచిరలావణ్యు సురశరణ్యు
హర్యక్షనిభ మధ్యు నఖిలలోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు
ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ బన్నగ శయను నబ్జాతనయను
తే.
మకరకుండల సద్భూషు మంజుభాషు
నిరుపమాకారు దుగ్ధసాగర విహారు
భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు. 

స్పష్టమైన పోతన గారి ముద్రగల పద్యాలు . ఇటువంటి పద్యాలు వచ్చినప్పుడు మనల్ని మనమే మఱచిపోతూ తన్మయత్వం చెందుతుంటాం.

మ.
కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డ ప్పేదవి
ప్రుని నశ్రాంత దరిద్రపీడుతుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘన తృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండో త్తరీయున్ గుచే
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుం డై దిగెన్ దల్పమున్.
క.
కర మర్థి నెదురుగాఁ జని, పరిరంభణ మాచరించి బంధుస్నేహ
స్ఫురణన్ దో డ్తెచ్చి సమా, దరమునఁ గూర్చుండఁ బెట్టెఁ దన తల్పమునన్. 

తన తల్పముమీదే కూర్చుండబెట్టుకొన్నాడట , చూడండి ! స్నేహానికెంత విలువనిచ్చాడో !
తే.
అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ
దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి
లలిత మృగమద ఘనసార మిళితమైన.
తే.
మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత
శ్రమము వాయంగఁ దాళవృంతముల విసరి
బంధు రామోద కలిత ధూపంబు లొసఁగి
మించు మణిదీపముల నివాళించి మఱియు.
వ.
సురభి కుసుమమాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు లిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన, నప్పు డ వ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప, నానందబాష్ప జలబిందు సందోహుండయ్యె. అట్టి యెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణంబులు మెఱయఁ జామరములు వీవం, దజ్జాత వాతంబు ఘర్మసలిలంబు నివారింపుచుండం జూచి, శుద్ధాంత కాంతాజనంబులు మనంబున నద్భుతం బంది, యి ట్లనిరి.
ఉ.
ఏమితపంబు సేసెనొకొ యీ ధరణీదివిజో త్తముండు దొల్
బామున యోగివిస్ఫుర దుపాస్యకుఁ డై తనరారు నీ జగత్
స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్.
వ. అదియునుంగాక.
చ.
తన పరియంకమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదమున్
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలన్ బరితుష్టుఁ జేయుచున్
వినయమునన్ భజించె ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుఁడో.
వ. అయ్యవసరంబున
క.
మురసంహరుఁడు కుచేలుని, కరము గరంబునఁ దెమల్చి కడక న్మన మా
గురు గృహమున వర్తించిన, చరితము లని కొన్ని తడవి చతురత మఱియున్-
సీ.
బ్రాహ్మణోత్తమ ! వేదపాఠన లబ్ధ దక్షతఁ గల చారు వంశంబువలనఁ
బరిణయం బై నట్టి భార్య సుశీల వర్తనములఁ దగ భవత్ సదృశ యగునె
తలఁప గృహక్షేత్ర ధన దార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట
దోఁచుచున్నది యేనుఁ దుది లోకసంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు
తే.
గతి మనంబునఁ గామమోహితులు గాక
యర్థిమై విహితకర్మంబు లాచరించి
ప్రకృతి సంబంధములు నన్ను భవ్యనిష్ఠఁ
దగిలి యుందురు గొంద ఱు త్తములు భువిని.
వ. అని మఱియు ని ట్లనియె.
క.
ఎఱుఁగుదె గురుమందిరమున, వెఱ వొప్పఁగ మనకు నతఁడు వెలయఁగ దెలుప
న్నెఱుఁగఁగ వలసిన యర్థము, లెఱిఁగి పరిజ్ఞాన మహిమ లెఱుఁగుట లెల్లన్.
వ. అని మఱియు, గురుప్రశంస సేయం దలంచి, యి ట్లనియె.
తే.
తివిరి యజ్ఞాన తిమిర ప్రదీప మగుచు
నవ్యం బైన బ్రహ్మంబు ననుభవించు
భరిత సత్త్వుండు సత్కర్మ నిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డనఘుండు బుధనుతుండు.

వ. అ మ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు, గురుభజనంబు పరమ ధర్మం బని యాచరించితి. అది గావున,
క.
భూసురుల కెల్ల ముఖ్యుఁడ, నై సకల కులాశ్రమంబులందుల నెపుడున్
ధీ సుజ్ఞానప్రదుఁ డన, దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లడలన్.
తే.
అట్టి వర్ణాశ్రంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలై క గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు. 

వ.
అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను తపో వ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను. గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు. అని చెప్పి మఱియును, మనము గురుమందిరంబున నున్నయెడ గురుపత్నీ నియుక్తుల మై, యొక్కనాఁ డింధనార్థం బడవికిం జనిన యవసరంబున,
వారిద్దరూ అడవికి వెళ్ళి వానలో తుఫానులో చిక్కుబడి తెల్లవారువరకూ తిరిగి రాలేకపోవటం వారిని వెదుక్కుంటూ వారి గురువైన సాందీపులవారు రావటం వారిని అక్కున చేర్చుకొని ఆశీర్వదించటం వగైరా కథ నంతటినీ గుర్తుచేస్తాడు.అప్పుడు గురువుగారు వారితో
చ.
కటకట ! యిట్లు మా కొఱకుఁ గా జనుదెంచి మహాటవిన్ సము
త్కట పరిపీడ నొందితిరి గావున శిష్యులు మా ఋణంబు నీఁ
గుట కిది కారణంబు సమకూరెడిఁ బో యిటమీఁద మీకు వి
స్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్.
క.
అని గారవించి యాయన, మనలన్ దోడ్కొనుచు నాత్మమందిరమునకున్
జనుదెంచుట లెల్లను నీ, మనమునఁ దలఁతేయటంచు మఱియును బలికెన్.

వ. అనఘా ! మన మధ్యయనంబు సేయుచు, నన్యోన్య స్నేహవాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱువవు గదా ! అని యవి యెల్లనుం దలంచి యాడు మాధవు మాటలు విని , యతనిం గనుంగొని, కుచేలుం డిట్లనియె.
క.
వనజోదర ! గురుమందిర,మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం
పని పను లెవ్వియుఁ గలవే, విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా !
క.
గురుమతిఁ దలపఁగఁ ద్రిజగ,ద్గురుఁడ వనందగిన నీకు గురుఁ డనఁగా నొం
డొరుఁ డెవ్వఁ డింతయును నీ, కరయంగ విడంబనంబ యగుఁగాదె హరీ ! 
విడంబనంబ = లీల
వ.
అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని, సమస్త భావాభిజ్ఞుం డైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుండగుచు, నతని జూచి, నీ విచ్చటికి వచ్చినపుడు నాయందుల భక్తిం జేసి, నాకు నుపాయనంబుగా నేమి పదార్థంబు దెచ్చితివి , అ ప్పదార్థంబు లేశమాత్రం బైనఁ బదివేలుగా నంగీకరింతు, అట్లుంగాక, నీచవర్తనుండై, మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన, నదియును నా మనంబునకు సమ్మతంబు గాదు. కావున,
క.
దళమైన పుష్పమైనను, ఫలమైనను సలిలమైనఁ బాయనిభక్తిన్
గొలిచిన జను లర్పించిన, నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్

చూడండి. గీతలోనూ భగవానుడీ విషయాన్నే సుమారుగా ఇవే మాటలలో చెప్తాడు.
అ.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృత
మశ్నామి ప్రయతాత్మనః|| 9-26 ||
కందము.
పత్ర ఫల పుష్ప తోయము
లాత్రముతో భక్త తతి సమర్పించిన , యా
పత్ర ఫల పుష్ప తోయము
లాత్రముతో స్వీకరింతు, నర్జున ! ప్రీతిన్ . ౨౪ ( శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి గారి అనువాదం )

క.
అని పద్మోదరుఁ డాడిన, వినయోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె
చ్చిన యటుకులు దగ నర్పిం, పనునేరక మోమువాంచి పలుకక యున్నన్.
వ.
అ వ్విప్రుండు చనుదెంచిన కార్యంబు దన దివ్యచిత్తంబున నెఱింగి, యితఁడు పూర్వభవంబున నై శ్వర్యకాముం డై, నన్ను సేవింపఁడు. ఐనను, ని క్కుచేలుండు నిజకాంతా ముఖోల్లాసంబు కొఱకు నాయొద్దకుం జనుదెంచినవాఁడు. ఇతనికి నింద్రాదులకుం బడయరాని బహు ప్రకారంబు లైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు, అని తలంచి, యతండు జీర్ణవస్త్రంబు కొన ముడిచి తెచ్చిన య య్యటుకులముడియఁ గని , యిది యేమి యని యొయ్యన న మ్ముడియఁ దన కరకమలంబున విడిచి, య య్యటుకులు గొన్ని పుచ్చికొని, యివియ సకలలోకంబులను నన్నుఁ బరితృప్తిం బొందింపజాలు, అని యప్పుడు,
క.
మురహరుఁడు పిడికెఁ డటుకులు, గర మొప్పఁగ నారగించి కౌతుకమతి యై
మఱియును పిడికెఁడు గొనఁ , దత్కర మప్పుడు వట్టెఁ గమల కరకమలములన్.

కమల కరకమలములన్= చూడండి యెంత అందంగా ప్రయోగించాడో. 

క.
సొంపారఁగ నితనికి బహు, సంపద లందింప నవియ చాలును నిఁక భ
క్షింపఁగ వలవదు త్రిజగ, త్సంపత్కర ! దేవదేవ ! సర్వాత్మ  ! హరీ !  

ఇటువంటి అనేక ఘట్టాలను .. పోతన భాగవతం లోనివి...  యెన్నిసార్లు చదివినా విన్నా  బ్లాగినా కూడా తనివితీరదు కదా. ఇప్పటి కిక్కడితో ముగిస్తాను.




6 comments

Apr 2, 2009

వారు నుత్సహించి వలనొప్ప దీవించి సేస లిడిరి యువతి శిరమునందు

రుక్మిణీ కల్యాణము-౭
వ.
అని గౌరీ దేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపూపంబులును, దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలఁ బూజించిన,
ఆ.వె.
వారు నుత్సహించి వలనొప్ప దీవించి
సేస లిడిరి యువతి శిరమునందు
సేస లెల్ల దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని మగువ వెడలె.
వ.
ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవనర్తకుండెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడసూపిన మోహినీదేవత కైవడి, దేవ దానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివిలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘమ ఘుమా యిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాభాసమాన యై, యిందుధరసుందరీ మందిరంబు వెడలి, మానస కాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి, మందగమనంబునఁ గనకకలశయుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్య యై, రత్నముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు కై దండ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణ పత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబు లైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప, నధరబింబఫలారుణమరీచి మాలికలు వదన కుందకుట్మలంబుల కనురాగంబు సంపాదింప, మనోజాత కేతన సన్నిభం బైన పయ్యెద కొంగు దూఁగ, సువర్ణ మేఖలాఘటిత మణికిరణపటలంబు లకాల శక్రచాప జనకంబు లై మెఱయఁ, జెఱకు విలుతుం డొఱవెఱికి, వాఁడియిడి, ఝళిపించిన ధగద్ధగాయమానంబు లగు బాణంబులపగిది, సురుచిర విలోకననికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీరనినదంబులు చెవులపండువులు సేయఁ, బాదసంచారంబున హరి రాక కెదురు సూచుచు, వీర మోహిని యై చనుదెంచుచున్న సమయంబున,
మ.
అళినీలాలకఁ బూర్ణ చంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధరన్
గలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభకుంభస్తనిన్
బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్తన్ మహో
త్పలగంధిన్ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ము లై రందఱున్.

0 comments

Mar 18, 2009

రుక్మిణీ కల్యాణము-6

రుక్మిణీ కల్యాణము-౬
వ.
ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవనర్తకుం డెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడసూపిన మోహినీదేవత కైవడి, దేవ దానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివిలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాసమాన యై, యిందుధరసుందరీ మందిరంబు వెడలి, మానస కాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి, మందగమనంబునఁ గనకకలశయుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమాన మధ్య యై, రత్న ముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండగొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబు లైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప, నధరబింబఫలారుణమరీచి మాలికలు వదన కుందకుట్మలంబుల కనురాగంబు సంపాదింప, మనోజాత కేతన సన్నిభం బైన పయ్యెదకొంగు దూఁగ, సువర్ణమేఖలాఘటిత మణికిరణపటలంబు లకాల శక్ర చాప జనకంబు లై మెఱయఁ, జెఱకు విలుతుం డొఱవెఱికి, వాఁడియిడి, ఝుళిపించిన ధగద్ధగాయమానంబు లగు బాణంబులపగిది, సురుచిర విలోకననికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీర నినదంబులు చెవులపండువులు సేయఁ, బాదసంచారంబున హరి రాక కెదురుసూచుచు, వీర మోహిని యై చనుదెంచుచున్న సమయంబున,
మ.
అళినీలాలకఁ బూర్ణ చంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధరన్
గలకంఠిన్ నవపల్ల వాంఘ్రియుగళన్ గందేభకుంభస్తనిన్
బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్తన్ మహో
త్పలగంధిన్ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ము లై రందఱున్.

0 comments

రుక్మిణీ కల్యాణము-5

రుక్మిణీ కల్యాణము-5
వ.
అంత రామకృష్ణులు తమ కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్య ఘోషణంబులతో నెదుర్కొని, విధ్యుక్త ప్రకారంబునఁ బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజన సేనాసమేతులైన వారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబు లైన నివేశంబులు గల్పించి, విడియించె.ఇట్లు కూడిన రాజులకెల్లను వయో వీర్య బలవిత్తంబు లెట్ల ట్ల కోరిన పదార్ధంబు లెల్ల నిప్పించి, పూజించె. అంత విదర్భపురము ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాంజలులం దదీయ వదనకమల మధుపానంబు సేయుచు.
మ.
తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి యై
మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.
వ.
అని వలికిరి. ఆ సమయంబున.
సీ.
సన్నద్ధు లై బహు శస్త్రసమేతు లై బలసి చుట్టును వీరభటులు గొలువ
ముందఱ నుపహారములు కానుకలుఁ గొంచు వర్గంబు లై వారవనిత లేగఁ
బుష్ప గంధాంబర భూషణ కలిత లై పాడుచు భూసుర భార్య లరుగఁ
బణవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీ ధ్వనులు మిన్ను పిక్కటిలఁగఁ
ఆ.వె.
దగిలి సఖులు గొల్వఁ దల్లులు బాంధవ
సతులు దోడ రాఁగ సవినయముగ
నగరువెడల నడచె నగజాతకును మ్రొక్క
బాల చికుర విహిత ఫాల యగుచు.
వ.
మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుం జనుదేర, మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలంచుచు, నిందుధరసుందరీ మందిరంబు చేరి, సలిల ధారా ధౌత చరణ కరారవింద యై, వార్చి, శుచి యై, గౌరీసమీపంబునకుం జనియె. అంత ముత్తైదువు లగు భూసురోత్తముల భార్యలు భవసహిత యైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షతంబు లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి, ధూప దీపంబు లొసంగి, నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీప మాలికల నివాళించి, రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు,
ఉ.
నమ్మితి నా మనంబున సనాతను లై న యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ ! నిన్
నమ్మిన వారి కెన్నఁటికి నాశము లేదు గదమ్మ ! యీశ్వరీ !
వ.
అని గౌరీదేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణాపూపంబులును,దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలఁ బూజించిన,
ఆ.వె.
వారు నుత్సహించి వలనొప్ప దీవించి
సేసలిడిరి యువతి శిరమునందు
సేస లెల్ల దాల్చి శివవల్లభకు మ్రొక్కి
మౌననియతి మాని మగువ వెడలె.

0 comments

Mar 13, 2009

రుక్మిణీ కల్యాణము-4

రుక్మిణీ కల్యాణము-4
వ.
అని వితర్కింపుచు.
ఉ.
పోఁడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుడున్
రాఁ డను నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్

లేఁ డను రుక్మికిం దగవు లే దిటఁ జై ద్యున కిత్తు నంచు ను

న్నాఁ డను గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁ డనున్.

ఉ.
చెప్పదు తల్లికిం దలఁపుఁ జిక్కు దిశల్ దరహాస చంద్రికన్
గప్పదు వక్త్రతామరస గంధసమాగత భృంగసంఘమున్

రొప్పదు నిద్రఁ గై కొన దురోజ పరస్పరసక్త హారముల్

విప్పదు కృష్ణమార్గగత వీక్షణపంక్తులఁ ద్రిప్ప దెప్పుడున్.

చ.
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు కొప్పుఁ జక్కగా
ముడువదు నెచ్చలిం గదిసి ముచ్చటకుం జన దన్న మేమియున్

గుడువదు నీరమున్ గొనదు కూరిమి కీరముఁ జేరి పద్యమున్

నొడువదు వల్లకీగుణ వినోదము సేయదు డాయ దన్యులన్.

సీ.
మృగనాభి యలఁదదు మగరాజమధ్యమ జలముల నాడదు జలజగంధి
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దుఱుమదు పువ్వుఁ బోణి

వనకేళిఁ గోరదు వనజాతలోచన హంసంబుఁ బెంపదు హంసగమన

లతల బోషింపదు లతికా లలితదేహ తొడవులు దొడవదు తొడవు తొడవు

ఆ.
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు
గమల గృహముఁ జొరదు కమలహస్త

గారవించి
తన్నుఁ గరుణఁ గైకొన వన

మాలి రాఁడు తగవుమాలి యనుచు.

వ.
మఱియును,
మ.
మలఁగున్ మెల్లనిగాలికిన్ బటు నట న్మత్త ద్విరేఫాళికిన్
గలఁగున్ గోయిల మ్రోఁత కై యలఁగు నుద్యత్ కీరసంభాషలన్
గలఁగున్ వెన్నెల వేఁడిమిన్ మలఁగు మాకందాంకుర చ్ఛాయకున్
దొలఁగున్ గొమ్మ మనోభవానల శిఖా దోదూయమానాంగి యై.
వ.
ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబుల యందును విరక్త యై, మనోజాలంబునం బొగిలెడి మగువకు శుభంబు చెప్పు చందంబున వామోరులోచన భుజంబు లదరె. అంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు సనుదెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠి మహోత్కంఠతోడ నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురుచని నిలువంబడిన, బ్రాహ్మణుం డి ట్లనియె.
ఉ.
మెచ్చె భవద్గుణోన్నతి క మేయ ధనాదుల నిచ్చె నాకుఁ దా
వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె సురాసురు లెల్ల నడ్డ మై
వచ్చిన నై న రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ
సచ్చరితంబు భాగ్యమును సర్వము నేఁడు ఫలించెఁ గన్యకా !
వ.
అనిన వైదర్భి యిట్లనియె.
మ.
జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి నన్
నిలువం బెట్టితి నీ కృపం బ్రతికితిన్ నీయట్టి పుణ్యాత్మకుల్
గలరే దీనికి నీకుఁ బ్రత్యుపకృతిన్ గావింపఁగానేర నం
జలి గావించెద భూసురాన్వయమణీ ! సద్బంధు చింతామణీ !
వ.
అని నమస్కరించె.

0 comments

Mar 12, 2009

రుక్మిణీ కల్యాణము-3

రుక్మిణీ కల్యాణము-3
చ.
కన్నియమీఁద నాతలఁపు గాఢము కూరుకురాదు రేయి నా
కెన్నఁడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే

మున్నె యెఱుంగుదున్ బరులమూఁ క లడంచి కుమారిఁ దెత్తు వి

ద్వన్నుత! మాను ద్రచ్చి నవవహ్ని శిఖన్ వడిఁ దెచ్చు కై వడిన్.
క.
వచ్చెద విదర్భ భూమికిఁ, జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి, వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చినఁ బోరన్.

వ.
అని పలికి, రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు దెలిసి, తనపంపున రథసారథియైన దారకుండు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి రథ మాయత్తంబు చేసి తెచ్చిన, నమోఘ మనోరథుం డైన హరి తానును, బ్రాహ్మణుండును, రథారోహణంబు చేసి, యేకరాత్రంబున నాన ర్తక దేశంబులు గడచి, విదర్భ దేశంబునకుం జనియె. అందుఁ గుండిన పురీశ్వరుం డైన భీష్మకుండు కొడుకునకు వశుం డై, కూఁతు శిశుపాలున కిత్తు నని తలంచి, శోభనోద్యోగంబు సేయించె. అప్పుడు,
సీ.
రచ్చలుఁ గ్రంతలు రాజమార్గంబులు విపణిదేశంబులు విశదములుగఁ
జేసిరి చందనసిక్త తోయంబులు గలయంగఁ జల్లిరి కలువడములు

రమణీయ వివిధతోరణములు గట్టిరి సకల గృహంబులు సక్కఁ జేసి

కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి రతివలు పురుషులు నన్నియెడల

ఆ.
వివిధవస్త్రములను వివిధ మాల్యాభర
ణానులేపనముల నమరి యుండి

రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి

రుత్సవమున నగర మొప్పియుండె.

వ.
అంత నా భీష్మకుండు విహితప్రకారంబులం బితృదేవతల నర్చించి, బ్రాహ్మణులకు భోజనంబులు వెట్టించి, మంగళాశీర్వచనంబులు సదివించి, రుక్మిణిదేవి నభిషిక్తం జేసి, వస్త్రయుగళ భూషితం గావించి, రత్నభూషణంబు లిడి, ఋ గ్యజు స్సామ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొఱకు నిగమనిగదిత న్యాయంబున హోమంబు గావించె. మఱియు నా రాజు దంపతుల మేలు కొఱకు తిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగె. అయ్యవసరంబున.
మ.
భటసంఘంబులతో రథావళులతో భద్రేభ యూథంబుతోఁ
బటు వేగాన్విత ఘోటక వ్రజముతో బంధుప్రియ శ్రేణితోఁ

గటు సంరంభంముతో విదర్భతనయం గై కొందు నంచున్ విశం

కట వృత్తిన్ జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి య వ్వీటికిన్.

ఉ.
బంధులఁ గూడి కృష్ణ బలభద్రులు వచ్చినఁ బాఱఁద్రోలి ని
ర్మంధరవృత్తిఁ జై ద్యునికి మానినిఁ గూర్చెద మంచు నుల్లసత్

సింధుర వీర వాజి రథ సేనలతోఁ జనుదెంచి రా జరా

సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరథ పౌండ్రకాదులున్.

వ.
మఱియు, నానాదేశంబుల రాజు లనేకు లేతెండిరి. అందు శిశుపాలు నెదుర్కొని, పూజించి, భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె. అంతఁ దద్వృత్తాంతంబు విని,
చ.
హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్య హితానుసారు లై
నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం

గర మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి నంచు వేగఁ దా

నరిగె హలాయుధుండు కమలాక్షునిఁ జూడ ననేక సేనతోన్.

క.
ఆలోపల నేకతమున, నాలోలవిశాలనయన యగు రుక్మిణి త
న్నా లోకలోచనుఁడు హరి, యాలోకము చేసి కదియఁ డని శంకిత యై.

శా.
లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుం

డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె నా యత్నంబు సిద్ధించునో

భగ్నం బై చనునో విరించి కృత మెబ్భంగిన్ బ్రవర్తించు నో !

మ.
ఘనుడా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో
విని కృష్ణుం డిది తప్పుగా దలఁచెనో విచ్చేసెనో యీశ్వరుం

డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యామహాదేవియున్

నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో.
వ.
అని వితర్కింపుచు.
(ఇంకా వుంది)

1 comments

రుక్మిణీ కల్యాణము

రుక్మిణీ కల్యాణము-౨
శ్రీకృష్ణుడా బ్రాహ్మణుని సాదరంగా గౌరవించి వచ్చిన పనిని వివరించమని కోరగా ఆ బ్రాహ్మణు డతనితో--
సీ.
ఏ నీ గుణంబులు కర్ణేంద్రింయబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు
తే.
నట్టి నీయందు నా చిత్త మనవరతము
నచ్చియున్నది నీ యాన నానలేదు
కరుణఁ జూడుము కంసారి ! ఖలవిదారి !
శ్రీయుతాకార ! మానినీ చిత్తచోర !
శా.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్ గోరరు ? కోరదే మును రమా కాంతాలలామంబు రా
జన్యానేకప సింహ ! నావలననే జన్మించెనే మోహముల్.
ఉ.
శ్రీయుతమూర్తి ! యో పురుషసింహమ ! సింహము పాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చై ద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగ డద్భుతమైన భవత్ప్రతాపముల్.
మ.
వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
గతజన్మంబుల నీశ్వరున్ హరి జగత్కల్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌ గాక ని
ర్జితు లై పోదురు గాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.
ఉ.
అంకిలి సెప్ప లేదు చతురంగ బలంబులదోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్య మే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
సీ.
లోపలి సౌధంబులోన వర్తింపంగఁ దేవచ్చునే నిన్నుఁ దెత్తునేనిఁ
గావలివారలఁ గల బంధువులఁ జంపి కాని తేరా దని కమలనయన!
భావించితేని నుపాయంబు చెప్పెద నాలింపు కులదేవయాత్రఁ జేసి
నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతు
తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
సతికి మ్రొక్కంగ నీవు నా సమయమునకు
వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
మ.
ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజ తోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
యనుకంపన్ విలసింప నేని వ్రతచర్యన్ నీఱు జన్మంబులన్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!
సీ.
ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణ రంధ్రంబుల కలిమి యేల
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని తనులతవలని సౌందర్య మేల
భువనమోహన! నినుఁ బొడగానఁగా లేని చక్షురింద్రియముల సత్త్వ మేల
దయిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల
ఆ.
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు.
వ.
అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాతి విశేషంబులును, బ్రాహ్మణుండు హరికి విన్నవించి, కర్తవ్యం బెద్దిసేయ నవధరింపుమని, సవరణగా నిట్లనియె.
సీ.
పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారు లూరు
లరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము
మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షు రుత్సవదాయి చన్నుదోయి
పరిహసి తార్ధేందు పటలంబు నిటలంబు జిత మత్తమధుకర శ్రేణి వేణి
ఆ.
భావజాశుగముల ప్రాపులు చూపులు
కుసుమశరుని వింటి కొమలు బొమలు
చిత్తతోషణములు చెలువభాషణములు
జలజనయనముఖము చంద్రసఖము.
ఉ.
ఆ యెలనాఁగ నీకుఁ దగు నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ దప్పదు జాడ్యము లేల నీవు నీ
తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము శత్రులన్ నుఱుము సేయుము సేయుము శోభనం బిలన్.
వ.
అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విధర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాది విశేషంబులును విని, యవధరించి, నిజకరంబున నతని కరంబుఁ బట్టి నగుచు, నయ్యాదవేంద్రుం డి ట్లనియె.

(ఇంకావుంది)

1 comments

Mar 11, 2009

రుక్మిణీ కల్యాణము

రుక్మిణీ కల్యాణము-

క.
భూషణములు సెవులకు బుధ, తోషణము లనేక జన్మ దురితౌఘ విని
శ్శోషణములు మంగళతర, ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్.

.
వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డ రాజు గలఁ డాతని కేవురు పుత్రు లగ్రజుం

దనఘుఁడు రుక్మి నాఁ బరఁగు నందరకుం గడగొట్టు చెల్లెలై

మనుజవరేణ్య ! పుట్టె నొక మానిని రుక్మిణి నాఁ బ్రసిద్ధ యై
.
సీ.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు
నబలలతోడ వియ్యంబు లందు

గుజ్జనగూళ్ళను గొమరొప్ప వండించి
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱయ

రమణీయ మందిరారామ దేశంబులఁ
బువ్వుఁ దీఁగెలకును బ్రోది సేయు

సదమల మణిమయ సౌధభాగంబుల
లీలతో ఖర్మడోలికల నూఁగు

తే.
బాలికలతోడఁ జెలరేఁగి బంతులాడు
శారికా కీర పంక్తికిఁ జదువుచెప్పు

బర్హి సంఘములకు మురిపములు గఱపు

మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
సీ.
దేవకీ సుతుకోర్కె తీఁగెలు వీడంగ వెలఁదికి మైదీఁగె వీడఁ దొణఁగెఁ
గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ గాంతి నింతికి ముఖకమల మొప్పె
మధువిరోధికి లోన మదనాగ్ని వొడచూపఁ బొలఁతికిఁ జనుదో.ి పొడుపుసూపె
శౌరికిధైర్యంబు సన్నమై డయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్న మయ్యె
ఆ.
హరికిఁ బ్రేమబంధ మధికంబు గాఁ గేశ
బంధ మధిక మగుచు బాల కమరెఁ
బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార
నెలఁత యౌవనంబు నిండియుండె.
వ.
ఇట్లు రుక్మి, రుక్మిరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి యను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున,
క.
తన తండ్రి గేహమునకుం, జనుదెంచుచునున్న యతిథిజనులవలనఁ గృ
ష్ణుని రూప బల గుణాదులు, విని కృష్ణుఁడు దనకుఁ దగినవిభుఁ డని తలఁచెన్.
ఉ.
బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషీ
సింధువు లై విచారములు సేయఁగ వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి మత్త పు
ష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచుఁ దలంచె నంధుఁ డై.

(మత్త పుష్పంధయవేణి - ఈమాటకు నాకు సరియైన అర్థము తెలియదు. కాని ఎందుకనో ఈ మాటంటే నా కెందుకో చాలా ఇష్టం.)
ఉ.
అన్న తలంపుఁ దా నెఱిఁగి య న్నవనీరజగంధి లోన నా
పన్నత నొంది యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి గర్వసం
ఛన్నుఁడు రుక్మి నేఁడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ
డెన్ని విధంబులం జని బుధేశ్వర ! చక్రికి
విన్నవించవే !
క.
అయ్యా ! కొడుకు విచారము, లయ్యయు వారింపఁ జాలఁ డటు కాకుండన్
నెయ్య మెఱిఁగించి చీరుము, చయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్.
ఇంకా వుంది.


1 comments

అదలించి రొప్పంగ నాలమందలు గావు గంధగజేంద్ర సంఘములు గాని

జరాసంధుడు మథురపై దండెత్తుట
జరాసంధుడు కృష్ణునితో యిట్లనెను.
సీ.
అదలించి రొప్పంగ నాలమందలు గావు గంధగజేంద్ర సంఘములు గాని
పరికించి వినఁగ నంభారవములు గావు వాజీంద్ర హేషారవములు గాని
పదహతిఁ గూల్పంగఁబ్రాతబండ్లును గావు నగసమాన స్యందములు గాని
ప్రియము లాడంగ నాభీరలోకము గాదు కాలాభ వైరి వర్గంబు గాని
తే.
యార్ప వనవహ్ని గాదు బాణాగ్ని గాని
మఱియు బృందావనము గాదు మొనలు గాని
యమున గాదు నటింప ఘోరాజి గాని
పోరు నీ కేల గోపాల ! పొమ్ము పొమ్ము.

మ.
తరుణిం జంపుటయో బకుం గెడపుటో ధాత్రీజముల్ గూల్చుటో
ఖరమున్ ద్రుంచుటయో ఫణిం బఱపుటో గాలిన్ నిబంధించుటో
గిరి హస్తంబునఁ దాల్చుటో లయమహాగ్ని స్ఫార దుర్వార దు
ర్భర బాణాహతి నెట్లు నిల్చెదవు స ప్రాణుండ వై గోపకా!
వ. అదియునుం గాక.
సీ.
గోపికావల్లకీ ఘోషణంబులు గావు శింజినీరవములు చెవుడుపఱచు
వల్ల వీకర ముక్త వారిధారలు గావు శరవృష్టిధారలు చక్కు సేయు
ఘోషాంగనాపాంగ కుటిలాహతులు గావు నిశితాసి నిహతులు నిగ్రహించు
నాభీరకామినీ హస్తాబ్జములు గావు ముష్టిఘాతంబులు మురువు డించు
తే.
నల్ల వ్రేపల్లె గాదు ఘోరావనీశ
మకరసంఘాత సంపూర్ణ మగధరాజ
వాహినీసాగరం బిది వనజనేత్ర !
నెఱసి నిను దీవి కై వడి నేఁడు ముంచు.
ఉ.
బాలుఁడ వీవు కృష్ణ ! బలభద్రునిఁ బంపు రణంబు సేయ గో
పాలక బాలుతోడ జనపాల శిఖామణి యైన మాగధుం
డాలము సేసె నంచు జను లాడెడి మాటకు సిగ్గు వుట్టెడిన్
జాలుఁ దొలంగు దివ్య శరజాలుర మమ్ము జయింపవచ్చునే.

0 comments

Mar 10, 2009

తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా

శ్రీకృష్ణబలరాములు నందుని చూడవచ్చుట
గోనిందుడు నందునితో యిట్లనియె.
శా.
తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా
తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం దొల్లి యే
తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి భవ త్సౌజన్యభావంబులన్

దండ్రీ! యింతటివార మైతిమి గదా త త్త ద్వయోలీలలన్.

బలరామ కృష్ణులు సాందీపని యొద్ద విద్య నభ్యసించుట.
శా.
ఉర్విన్ మానవు లెవ్వ రై న గురు వాక్యోద్యుక్తు లై కాని త
త్పూర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్

సర్వజ్ఞత్వముతో జగద్గురువు లై సంపూర్ణులై యుండియున్

గుర్వంగీకరణంబు సేయఁ జని రా గోవిందుడున్ రాముడున్.

గోపికలు ఉద్ధవునితో కృష్ణునికి చెప్పమని పలికిన మాటలు
శా.
ఏకాంతంబున నీదుపై నొరగి తా నేమేని భాషించుచో
మాకాంతుండు వచించునే రవిసుతా మధ్యప్రదేశంబునన్
రాకాచంద్ర మయూఖముల్ మెఱయఁగా రాసంబు మాతోడ నం
గీకారం బొనరించి బంధనియతిం గ్రీడించు విన్నాణముల్.
సీ.
తనుఁ బాసి యొక్కింత తడ వై న నిటమీఁద నేలపై మేనులు నిలువ వనుము
నేలపై మేనులు నిలువక యటమున్న ధైర్యంబు లొక్కటఁ దలఁగు ననుము
ధైర్యంబు లొక్కటఁ దలఁగిన పిమ్మటఁ జిత్తంబు లిక్కడఁ జిక్క వనుము
చిత్తంబు లిక్కడఁ జిక్కక వచ్చినఁ బ్రాణంబు లుండక పాయు ననుము
తే.
ప్రాణములు పోవ మఱి వచ్చి ప్రాణవిభుఁడు
ప్రాణి రక్షకుఁ డగు తన్నుఁ బ్రాణు లెల్ల
జేరి దూఱంగ మఱి యేమి సేయువాఁడు
వేగ విన్నప మొనరింపవే మహాత్మ!
క.
తగులరె మగలను మగువలు, తగులదె తను మున్ను కమల తగవు విడిచియున్
దగిలిన మగువల విడుచుట, దగుఁ దగదని తగవు బలుకఁ దగుదువు హరికిన్.

0 comments

Feb 24, 2009

మమ్ముఁ గంటిరి గాని మా బాల్య పౌగండ కై శోర వయసులఁ గదిసి మీర

శ్రీకృష్ణుండు దేవకీ వసుదేవులను కంసుని చెఱ మాన్పి వారితో---
సీ.
మమ్ముఁ గంటిరి గాని మా బాల్య పౌగండ కై శోర వయసులఁ గదిసి మీర
లెత్తుచు దింపుచు నెలమి మన్నింపుచు నుండు సౌభాగ్యంబు లొంద రైతి
రా కాంక్ష గలిగియు న్నది దైవయోగంబు తల్లిదండ్రులయొద్దఁ దనయు లుండి
యే యవసరమున నెబ్భంగి లాలితు లగుచు వర్ధిలుదు రట్టి మహిమ
తే.
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మఱియు వినుఁడు
నిఖిల పురుషార్థహేతు వై నెగడుచున్న
మేని కె వ్వార లాఢ్యులు మీర కారె
యా ఋణముఁ దీర్ప నూఱేండ్ల కైనఁ జనదు.
క.
చెల్లుబడి గలిగి యెవ్వఁడు, తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్
సెల్లింపఁ డట్టి కష్టుఁడు, ప్రల్లదుఁ డామీఁద నాత్మ పలలాశి యగున్.
క.
జననీజనకుల వృద్ధులఁ, దనయుల గురు విప్ర సాధు దారాదుల నే
జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక, వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.

0 comments

Feb 23, 2009

వీఁడఁటే ! రక్కసి విగతజీవగఁ జన్నుఁ బాలు ద్రావిన మేటి బాలకుండు

మథురలో స్త్రీలు కృష్ణుని చూచి ఒండొరులతో ఈవిధంగా అనుకుంటున్నారట.
క.
వీటఁ గల చేడె లెల్లను, హాటక మణి ఘటిత తుంగ హర్మ్యాగ్రములన్
గూటువలు గొనుచుఁ జూచిరి, పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్.
సీ.
వీఁడఁటే ! రక్కసి విగతజీవగఁ జన్నుఁ బాలు ద్రావిన మేటి బాలకుండు
వీఁడఁటే ! నందుని వెలదిఁకి జగమెల్ల ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు
వీఁడఁటే ! మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాఁపరీడు
వీఁడఁటే ! యెలయించి వ్రేతలమానంబు చూఱలాడిన లోకసుందరుండు
తే.
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు
వీనిఁ బొందని జన్మంబు విగతఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగరుతము
వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు.
మ.
చెలియా! గోపిక లీ కుమారతిలకున్ జింతింపుచున్ బాడుచున్
గలయం బల్కుచు నంటుచున్ నాకర్షింపుచున్ హస్తగా
మలక క్రీడకుఁ దెచ్చి యిచ్చలును సమ్మానంబులన్ బొందఁగాఁ
దొలిజన్మంబుల నేమి నోఁచిరొ గదే దుర్గప్రదేశంబులన్.

బలరామ కృష్ణులను పూజించి, అర్చించిన సుదామునికి ప్రీతులై వరము కోరుకొమ్మనగా నతడు కృష్ణునితో ----

క.
నీపాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును, దాపసమందార! నాకు దయసేయగదే!

0 comments

Feb 21, 2009

పరిఘల్ కోటలు కొమ్మలున్ బడగలున్ బ్రాసాదముల్ వీథులున్

మధురాపుర వర్ణన
మ.
పరిఘల్ కోటలు కొమ్మలున్ బడగలున్ బ్రాసాదముల్ వీథులున్
హరులున్ దేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్
తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్
కర మాశ్చర్యరుచిం దనర్చు మథురన్ గాంచెన్ విభుం డంతటన్.

0 comments

Feb 7, 2009

హరినవ్వుల్ హరిమాటలున్ హరి మనోజ్ఞాలాపముల్ లీలలున్

కంసుని పంపున అక్రూరుడు కృష్ణబలదేవులను ధనుర్యాగము నెపమున మధురకు తోడ్కొనిపోవుట.
అప్పుడు గోపికలు--
మ.
హరినవ్వుల్ హరిమాటలున్ హరి మనోజ్ఞాలాపముల్ లీలలున్
హరివేడ్కల్ హరిమన్ననల్ హరికరాబ్జాలంబ నాహ్వానముల్
హరిణీలోచన లందఱున్ దలఁ చుపాయం బెట్లొకో యంచు
నెరియన్ ముచ్చటలాడి రంత గములై యేకాంతగేహంబులన్.
వ. మఱియుం దమలో ని ట్లనిరి.
ఉ.
మేటిగృహస్థు బ్రహ్మ యని మిక్కిలి నమ్మితి మమ్మ! చూడ నే
పాటియు లేదు మాకుఁ బరిపాలకుఁ డైన సరోజనేత్రు ని
చ్చోట వసింపనీక నొకచోటికిఁబో విధియించి పిన్నబి
డ్డాటలు చేసె నీ సుఖము లక్కట ! భారతి కైనఁ జెప్పరే.

వ. అని విధిని దూఱుచు, మదనతాపాయత్త చిత్తలై
ఉ.
రమ్మని చీరినంతనె పురంబున కేగెడుఁ గాని నన్ను నీ
కొమ్మలు నమ్మినారు మరు కోలల కగ్గము సేసి పోవఁగా
ముమ్మర మైన తాపమున మ్రొగ్గుదురో యనఁ డంబుజాక్షుఁ డా
యమ్మలు గోపవృద్ధులు ప్రయాణము వల్దన రైరి చెల్లరే!
శా.
అక్రూరుం డని పేరు పెట్టుకొని నేఁ డస్మన్మనోవల్లభుం
జక్రిన్ మాకడఁ బాపికొంచు నరుగన్ జర్చించి యేతెంచి నాఁ
డక్రూరుం డఁట క్రూరుఁ డీతఁడు నిజం బక్రూరుఁ డౌనేని ని
ర్వక్రత్వంబునఁ గృష్ణుఁ బెట్టి తన త్రోవం బో విచారింపఁడే.

అక్రూరు డని పేరు పెట్టుకొని, యింత క్రూరమైన పనిని చేస్తున్నాడే! ఇత డక్రూరుడు కాడు నిజంగా ఎంత క్రూరుడోనే , నిజంగా పేరు పెట్టుకున్నట్లుగా అక్రూరుడే గనక అయితే కృష్ణుడిని మాకు విడిచిపెట్టి తన త్రోవను తాను పోవాలిగదా.
వారంతా కలసి ప్రయాణిస్తూ ఓచోట ఆగి ఓ చెఱువులో స్నానికి వెళ్ళినపుడు అక్రబరుడు కి చెఱువులో శేషుడు కనిపిస్తాడు. ఆ సందర్భంలో--
ఉ.
పోషితబాంధవుండు యదుపుంగవుఁ డా జలమందుఁ గాంచె
ద్భాషు సహస్రమస్తక విభాసిత భూషు నహీశు భూమి భృ
ద్వేషుఁ గృపాభిలాషుఁ బ్రతివీర చమూ విజిగీశు నిత్స సం
తోషు నరోషు నిర్దళితదోషు ననేక విశేషు శేషునిన్.

అబ్బ!ఎన్ని షకారాలో!

0 comments

Feb 6, 2009

లలనా యేటికి దెల్లవాఱె రవి యేలా తోచెఁ బూర్వాద్రిపైఁ

గోపికల విరహవేదన
మ.
లలనా యేటికి దెల్లవాఱె రవి యేలా తోచెఁ బూర్వాద్రిపైఁ
గలకాలంబు నహంబు గాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా
వలలలనా!యేటికిఁఱేఁడున్ కృపలేఁడు కీరములు దుర్వారంబు లెట్లో కదే
కలవే మాపటికాలమందు మనకున్ గంజాక్షు సంభోగముల్.
ఉ.
ఎప్పుడు ప్రొద్దు గ్రుంకు హరి యెప్పుడు గోవులమేపి తెచ్చు మా
కెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణ మబ్బు నతండు వచ్చి న
న్నెప్పుడు గారవించుఁ దుది యెప్పుడు మద్విరహాగ్ని రాశికిన్
జెప్పఁ గదమ్మ ! బోఁటి ! మరుసేఁతల నుల్లము దల్లడిల్లెడిన్.
మ.
చెలియా ! కృష్ణుఁడు నన్నుఁ బాసి వనముం జేరంగ న య్యా క్షణం
బులు నా కన్నియు నుండ నుండఁగఁ దగన్ బూర్ణంబు లై సాఁగి లో
పలఁ దోఁచుం బ్రహరంబు లై దినము లై పక్షస్వరూపంబు లై
నెల లై యబ్దము లై మహాయుగము లై నిండారు కల్పంబు లై.

0 comments

ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైన స

జలక్రీడాభివర్ణనము
శుకయోగీంద్రునితో పరీక్షన్మహారాజు- వెన్నుడు ఇంద్రియస్ఖలనము సేయక శరత్కాలమున గోపికలతో రమించెననగా -ఇట్లా అన్నాడు.
మత్తకోకిలము.
ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైన స
త్కర్ముఁ డీశుఁడు ధర్మశిక్షయు ధర్మరక్షయుఁ జేయగా
నర్మిలిన్ ధరమీఁద బుట్టి పరాంగనాజనసంగ మే
ధర్మమంచుఁ దలంచి చేసె? సుదాత్తమానస! చెప్పుమా!
వ.అనిన శుకుండిట్లనియె.
ఆ.
సర్వభక్షుఁ డగ్ని సర్వంబు భక్షించి, దోషి గాని పగిది దోష మైనఁ
జేసి దోషపదముఁ జెందరు తేజస్వు, లగుటఁ జంద్రవాసవాదు లధిప!
క.
ఈశ్వరుఁడు గానివాఁడు న, రేశ్వర! పరకాంతఁ దలఁచి యెట్లు బ్రదుకు? గౌ
రీశ్వరుఁడు దక్క నన్యుఁడు, విశ్వభయదవిషము మ్రింగి వెలయం గలఁడే?
మ.
ఘనుడై యెవ్వని పాదపంకజపరాగ ధ్యాన సంప్రాప్త యో
గ నిరూఢత్వముచే మునీంద్రులు మహాకర్మంబులం బాసి బం
ధ నిరోధంబులు లేక విచ్చలవిడిన్ దర్పించు, రా దివ్య శో
భనుఁ డెట్లుండిన నుండెఁగాక! కలవే బంధంబు లుర్వీశ్వరా!
ఆ.
గోపజనములందు గోపికలందును, సకల జంతులందు సంచరించు
నా మహాత్మునకుఁ బరాంగన లెవ్వరు?, సర్వమయుఁడు లీల సలిపెఁ గాక?

0 comments

Jan 27, 2009

రామలతోడను రాసము, రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో

రాసక్రీడాభివర్ణనము
క.
రామలతోడను రాసము, రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రాములమీఁద వియచ్చర, రామలు ముర్ఛల్లి పడిరి రాజకులేంద్రా.
క.
తారాధిప నిభ వదనలు, తారాధిప వంశ్యుఁ గూడి తారు నటింపం
దారలతోడ సుధాంశుఁడు, దారును వీక్షింప రేయి దడవుగ జరిగెన్.
మ.
యమునా కంకణ చారియై వనజ పుష్పామోద సంచారియై
రమణీ ఘర్మ నివారియై మదవతీ రాస శ్రమోత్తారి యై
ప్రమదామానస నవ్య భవ్య సుఖసంప త్కారి యై చేరి యా
కమలాక్షుం డలరంగ గాలి విసరెం గళ్యాణభావంబునన్.
సీ.
చెలువ యొక్కతె చెక్కుఁ జెక్కుతో మోపిన విభుఁడు తాంబూలచర్వితము వెట్టె
నాడుచు వొకలేమ యలసినఁ బ్రాణేశుఁ డున్నత దో స్త్సంభ మూఁత సేసెఁ
జెమరించి యొకభామ చేరినఁ గడగోరఁ జతురుఁడు కుచఘర్మజలము వాపె
నలకంబు లొకయింతి కలిక చిత్రకరేఖ నంటినఁ బ్రియుఁడు పాయంగ దువ్వెఁ
ఆ.
బడఁతి యొకతె పాడిపాడి డస్సిన యధ
రామృతమున నాథుఁ డాదరించె
హారమొక్కసతికి నంసావృతం బైనఁ
గాంతుఁ డురముఁ జేర్చి కౌఁగిలించె.
క.
హాసంబులఁ గరతల వి, న్యాసంబుల దర్శనముల నాలాపములన్
రాస శ్రాంతల కా హరి, సేసెన్ మన్ననలు కరుణఁజేసి నరేంద్రా.

0 comments

Jan 23, 2009

అబల యొక్కతె భక్తి నంజలిఁ గావించి ప్రాణేశు కెంగేలు వట్టికొనియె

గోపికాగీతలు
ఉ.
నీ వడవిన్ బవల్ దిరుగ నీ కుటిలాలక లాలితాస్య మి
చ్ఛావిధిఁ జూడకున్న నిమిషంబులు మాకు యుగంబు లై చనుం

గావున రాత్రులైన
నినుఁ గన్నుల నెప్పుడుఁ జూడకుండ ల
క్ష్మీవర! ఱెప్ప లడ్డముగఁ జేసె నిదేల విధాత క్రూరుఁడై.

సీ.
అబల యొక్కతె భక్తి నంజలిఁ గావించి ప్రాణేశు కెంగేలు వట్టికొనియె
నింతి యొక్కతె జీవితేశ్వరు బాహువు మూఁపున నిడుకొని ముదము నొందె
వనిత యొక్కతె తన వల్లభు తాంబూల చర్విత మాత్మహస్తమునఁ దాల్చెఁ
బడఁతి యొక్కతె ప్రియు పదములు విరహాగ్ని తప్త కుచంబులఁ దాపుకొనియె
ఆ.
భామ యొకతె భ్రుకుటిబంధంబు గావించి
ప్రణయభంగ కోపభాషణమున
దష్టదశన యగుచు దండించు కైవడి
వాఁడి చూడ్కిగముల వరునిఁ జూచె.
సీ.
ఎలయించి ప్రాణేశ! యెందుఁ బోయితి వని తోరంపు టలుకతో దూఱెనొకతె
జలజాక్ష! ననుఁ బాసి చనఁగ నీ పాదంబు లెట్లాడె నని వగ నెయిదె నొకతె
నాథ! నీ వరిగిన నా ప్రాణమున్నది కూర్మియే యిది యని కుందె నొకతె
యీశ్వర! నను నిన్ను నిందాఁక బాపె నీ పాపపు విధి యని పలికె నొకతె
ఆ.
తలఁగి పోవునట్టి తప్పేమి చేసితి
నధిప! పలుకు ధర్మ మనియె నొకతె
యేమి నోముఫలమొ హృదయేశ! నీ మోము
మరలఁ గంటి ననుచు మసలె నొకతె.

క.
కొలిచినఁ గొలుతురు కొందఱు, గొలుతురు దముఁ గొలువకున్నఁ గొందఱు వరులం
గొలిచినను గొలువకున్నను, గొలువరు మఱికొంద ఱెలమి గోపకుమారా!

0 comments

Jan 17, 2009

అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ బాటలీతరులార! పట్టరమ్మ!

సీ.
అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేలపాసితి వని యైలేయ లతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగడు గదా! చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి మాధవీలతలార! మనుపరమ్మ!

ఆ.
జాతిసతులఁ బాయ నీతియే హరి కని, జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ, జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!

గోపికలు కృష్ణుని లీలలను అనుకరించుట
సీ.
పూతనయై యొక్క పొలఁతి చరింపగ శౌరియై యొక కాంత చన్నుఁ గుడుచు;
బాలుఁడై యొకభామ పాలకు నేడ్చుచో బండి నే నను లేమఁ బాఱఁ దన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ; హరి నని నర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ; బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;

ఆ.
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ, గోపవత్సగణము గొంద ఱగుదు;
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ, బసుల మనెడి సతుల భరతముఖ్య!

ఇంకా గోపికలు కృష్ణుని వెదకుచు--
సీ.
కొమ్మకుఁ బువ్వులు గోసినా డిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ దృణములోఁ దోఁపదు తెఱవజాడ
ప్రియకు ధమ్మిల్లంబు వెట్టినాఁ డిక్కడఁ గూర్చున్న చోటిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మావి యిచ్చినాఁ డిక్కడ వెలఁది నిక్కిన గతి విశదమయ్యె
ఆ.
సుదతి తోడ నీరు సొచ్చినాఁ డిక్కడఁ, జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడ, ననగి పెనఁగియున్న యందమొప్పె.
సీ.
ఈ చరణంబులే యిందునిభానన! సనకాదిముని యోగసరణి నొప్పు
నీ పాదతలములే యెలనాఁగ! శ్రుతివధూ సీమంతవీధులఁ జెన్నుమిగులు
నీ పదాబ్జంబులే యిభకులోత్తమయాన! పాలేటి రాచూలి పట్టుగొమ్మ
లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ! ముక్తికాంతా మనోమోహనంబు
ఆ.
లీ యడుగుల రజమె యింతి! బ్రహ్మేశాది
దివిజవరులు మౌళిదిశలఁ దాల్తు
రనుచుఁ గొంద ఱబల లబ్జాక్షుఁ డేగిన
క్రమముఁ గనియు నతనిఁ గానరైరి.
పాలేటి= పాల సముద్రము యొక్క
సీ.
ఈ పొదరింటిలో నిందాఁకఁ గృష్ణుండు నాతోడ మన్మథనటన మాడె
ని య్యోల మగుచోట నిందాఁకఁ జెలువుండు గాఢంబుగా నన్ను గౌఁగిలించె
నీ మహీజము నీడ నిందాఁక సుభగుండు చిట్టంటు సేతల సిగ్గు గొనియె
నీ పుష్పలత పొంత నిందాఁక దయితుండు నను డాసి యధర పానంబు సేసె
ఆ.
నీ ప్రసూనవేది నిందాఁక రమణుండు
కుసుమదామములనుఁ గొప్పు దీర్చె
ననుచు గొంద ఱతివ లంభోజనయనుని
పూర్వలీలఁ దలఁచి పొగడి రధిప!
చిట్టంటు సేతలు=విలాసముగా

0 comments

Jan 16, 2009

బాంధవముననైనఁ బగనైనఁ వగనైనఁ, బ్రీతినైనఁ బ్రాణభీతినైన

ఆ.
బాంధవముననైనఁ బగనైనఁ వగనైనఁ, బ్రీతినైనఁ బ్రాణభీతినైన
భక్తినైన హరికిఁ బరతంత్రులై యుండు, జనులు మోక్షమునకుఁ జనుదు రధిప!


సీ.
ప్రాణేశుఁ డెఱిఁగిన బ్రాణంబునకుఁ దెగు దండించు నెఱిఁగిన ధరణివిభుఁడు
మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ దలవరి యెఱిఁగినఁ దగులు సేయుఁ
దలిదండ్రు లెఱిఁగిన దల లెత్తకుండుదు రేరా లెఱింగిన నెత్తిపొడుచు
నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి బంధువు లెఱిఁగిన బహి యొనర్తు

ఆ.
రితరు లెఱిఁగిరేని నెంతయుఁ జుల్కగాఁ, జూతు; రిందు నందు సుఖము లేదు;
యశము లేదు నిర్భయానందమును లేదు, జారుఁ జేరఁ జనదు చారుముఖికి.

కృష్ణుడు గోపికలతో--
క.
నడవడి గొఱ గాకున్నను, బడుగైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్
జడుఁడైన రోగి యైనను, విడుచుట మరియాద గాదు విభు నంగనకున్.

చ.
వనితలు నన్నుఁ గోరి యిట వచ్చితి, రింతఁ గొఱంత లేదు;మే
లొనరె;సమస్త జంతువులు నోలిఁ బ్రియంబులు గావె? నాకు; నై
నను నిలువంగఁ బోలదు, సనాతన ధర్మము లాఁడువారికిం
బెనిమిటులన్ భజించుటలు పెద్దలు చెప్పుచు నుందు రెల్లెడన్.

క.
ధ్యానాకర్ణన దర్శన, గానంబుల నా తలంపు గలిగినఁ జాలుం
బూనెదరు కృతార్థత్వము, మానవతుల్!చనుఁడు మరలి మందిరములకున్.

అని కృష్ణుడు హితబోధ చేస్తే గోపికలు అతనితో-
సీ.
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని తరలి పోవంగఁ బాదములు రావు;
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని తక్కిన పనికి హస్తములు సొరవు;
నీ వాగమృతధార నిండఁ గ్రోలఁగఁ గాని చెవు లన్యభాషలు సేరి వినవు;
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని చూడ వన్యంబులఁ జూడ్కి కవలు;
ఆ.
నిన్నె కాని పలుకనేరవు మా జిహ్వ, లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు
మా మనంబు లెల్ల మరపించి దొంగిలి, తేమి సేయువార మింకఁ? గృష్ణ!


సీ.
నీ యధరామృత నిర్ఝరంబుల నేఁడు సేరి వాతెఱలపైఁ జిలుకకున్న
నీ విశాలాంచిత నిర్మలవక్షంబుఁ గుచకుట్మలంబులఁ గూర్పకున్న
నీ రమ్యతర హస్త నీరజాతంబులు చికురబంధంబులఁ జేర్పకున్న
నీ కృపాలోకన నివహంబు మెల్లన నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న
ఆ.
నీ నవీన మాననీయ సల్లాపంబు, కర్ణరంధ్రదిశలఁ గప్పకున్న
నెట్లు బ్రదుకువార?మెందుఁ జేరెడువార? మధిప!వినఁగఁ దగదె యాఁడుకుయులు.

అంటారు.తరువాత కృష్ణుడు వారికి కనిపించకుండాపోతే అతడిని వెతుకుతూ ఇలా అన్నిటినీ అడుగుతూ ఉంటారు.
సీ.
పున్నాగ!కానవే పున్నాగవందితుఁ;దిలకంబ!కానవే తిలకనిటలు;
ఘనసార!కానవే ఘనసారశోభితు;బంధూక!కానవే బంధుమిత్రు;
మన్మథ!కానవే మన్మథాకారుని; వంశంబ!కానవే వంశధరునిఁ;
జందన!కానవే చందనశీతలుఁ; గుందంబ!కానవే కుందరదను;

తే.
నింద్రభూజమ!కానవే యింద్రవిభవుఁ, గువలవృక్షమ!కానవే కువలయేశుఁ
బ్రియకపాదప!కానవే ప్రియవిహారు;ననుచుఁ గృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.


ఇంకా--
ఉ.
నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెడివాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార!మీ పొదలమాటున లేఁడు గదమ్మ చెప్పరే?

ఉ.
అంగజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించు వాఁడు శ్రీ
రంగదురంబు వాఁడు మధురంబగు వేణురవంబు వాఁడు మ
మ్మంగజు పువ్వుఁదూపులకు నగ్గము సేసి లవంగ లుంగ నా
రంగములార!మీకడకు రాఁడు గదా!కృప నున్నఁ జూపరే!

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks