నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label మందరము(అయోధ్యకాండ). Show all posts
Showing posts with label మందరము(అయోధ్యకాండ). Show all posts

Apr 9, 2010

శ్రీరాముని సద్గుణాలు ( మందరం నుంచి )

కైక కోరికపై వనవాసం చేయటానికి వెళ్తున్న శ్రీరామునకై యంతఃపురస్త్రీలు దుఃఖించుట
కం.
మ్రొక్కుచుఁ దల్లికిఁ దండ్రికి,నక్కరణిని రామచంద్రుఁ డరిగిన నాపై
నొక్కమొగి నంతిపురమున, మిక్కుటమై యార్తరవము మింటికి నెగసెన్.
ప్రస్తుతము శ్రీరామప్రజల వృత్తాంతము చెప్పుటచాలించి యీలోపల నంతఃపురమున జరిగిన వృత్తాంతమును గవి చెప్పుచున్నాడు.
ముందు చెప్పిన విధముగా శ్రీరాముఁ డందఱు తల్లులకుఁ దండ్రికి నమస్కరించి రథమెక్కి పయనమై పోఁగా నంతఃపురమున మిక్కిలి యధికమైన యేడుపుధ్వని యాకాసమున కెగసెను.
కం.
గతి యెవ్వఁ డనాథులకున్, గతి యెవ్వఁడు దుర్బలులకుఁ గడుఁ దపసులకున్
గతి యెవఁడు శరణ మెవఁడా, పతి గతిచెడి యెచటి కేగువాఁడో యకటా.
పోతనగారి బాణీ స్పష్టంగానే కనిపిస్తున్నది.
దిక్కులేనివారికిని బలములేనివారికిని నెవఁడు పొందఁదగివనవాఁడో తపస్సు చేసికొనువారికిఁ బ్రాపింపఁ దగినవాఁడు రక్షకుఁడు నెవఁడో యట్లందఱకు రక్షకుఁడు ప్రాప్యుఁడైనవాఁడు ప్రాపురక్షకుఁడు లేక యయ్యో యెక్కడఁ బోవుచున్నాఁడో.
సీ.
తనమీఁద నెవరైనఁ దంట లాడిన నైనఁ , గోపంబు చెందఁడే కొమ్మలార !
యేమి చేసిన నది యెవరి నొప్పించునో, యని జంకుచుండునే యమ్మలార !
యెవ్వరేనియుఁ గింక నొ వ్వొంద వారల, నూఱట లాడునే యువిదలార !
పరసుఖదుఃఖముల్ స్వసుఖదుఃఖము లట్లు , పరికించు చుండునే తరుణులార !
తే.
కన్న తల్లిని గౌసల్యఁ గన్న పగిది
మనల నందఱఁ జూచునే మగువలార !
యట్టి పుణ్యాత్ముఁ డటువంటి యనఘు చరితుఁ
డెచట నున్నాఁడొ కటకటా యెందు జనునొ. 1124 
తనమీద నెవరైనను గొండెములు చెప్పినను గోపింపఁడు. తానుజేయు కార్య మెవరి మనమునకైన నొప్పి కలిగించునో యనిసందేహించి   యట్లెవరి మనసు నొవ్వని కార్యములే చేయుచుండును. తనమీఁద నెవరైన గోపించి నొప్పి చెందినను వారలను సమాధానపఱుచును. ఇతరుల సుఖము తనసుఖముగను ఇతరుల దుఃఖము తన దుఃఖముగను జూచుచుండును. కన్నతల్లిని గౌసల్య నేవిధముగఁ జూచునో యట్టులే మనలనందఱఁ జూచును. అటువంటి పుణ్యాత్ముఁడు అటువంటి నిర్దుష్ట చరిత్రుఁడు ఎందున్నాఁడో - యెందు బోవుఁచున్నాఁడో ,
ఈలాంటి ఎన్నో అందమైన పద్యాలతోనూ, అర్థ తాత్పర్య వాఖ్యానాలతోనూ సాగిపోతుంటుంది వాసుదాసు ( వావిలికొలను సుబ్బారావు ) గారి సుందరమైన మందర వ్యాఖ్యానము. అందఱూ తప్పక చదవాల్సిన మంచి పుస్తకం.









1 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks