నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label తాళ్ళపాక పదసాహిత్యము-పీఠికలు. Show all posts
Showing posts with label తాళ్ళపాక పదసాహిత్యము-పీఠికలు. Show all posts

Sep 14, 2008

తాళ్ళపాక పదసాహిత్యము-5వ సంపుటము-పీఠికలు

2వ భాగం.
"నాయనా! ఈ కొండ సాలగ్రామమయము। దీనిని చెప్పుకాళ్ళతో ఎక్కరా"దని చెప్పెను.ఆ యూరడింపునకు తనిసి అన్నమయ్య జగన్మాతపై వేంకటేశ్వర మకుటముతో ఆశుధారగా ఒక శతకము చెప్పెను. ఆపై చెప్పులు వదలి ఎక్కి మెల్లగా కొండచేరి చూడదలచిన స్థలములన్నియు చూచి ఆ రాత్రి నివసించి మరునాడు వేకువన కోనేటిలో స్నానముచేసి పండ్రెండు నామములు ధరించి దేవళమునకు పోగా గుడి తలుపులు తాళమువేసి యుండిరట. అన్నమయ్య స్వామిని శతకముతో కీర్తింపగనే తలుపులు తమకు తామే వీడెను. వైఖానసు లీతని మహిమ గుర్తించి స్వామి దర్శనము చేయించి ప్రసాదమిచ్చి గౌరవించినారు. ఇట్లు స్వామి నాతడెన్ని దినములు సేవించెనో,ఎప్పుడు స్వామి ప్రత్యక్షమాయెనో తెలియదు.ఒకనాడు విష్ణునామధేయుడైన యతికి స్వామి కలలో ప్రత్యక్షమై "నావాడొకడు రేపు నీ కడకు వచ్చును. ఆతనికి నీవు చక్రాంకనము చేసి పంచసంస్కారములతో వైష్ణవ దీక్ష నిప్పింపు"మని చెప్పెనట.ఆతడు వెరగంది లేచి ఉదయముననే తన నిత్యకృత్యములు దీర్చికొని శంఖచక్ర ముద్రలు చేతనూని అన్నమయ్యకై అఱ్ఱులు చాచి చూచుచుండెను.ఇంతలో స్వామి కలలో చెప్పిన గుర్తులతో అన్నమయ్య ఆ యతి ముంగిలి చేరగనే అతడానందపడి అన్నమయ్యకు చక్రాంక సంస్కారములు చేసి వైష్ణవదీక్ష ఇచ్చెనట. నాటినుండి అన్నమయ్య అన్నమాచార్యులయిరి. ఆపై గురువుగారి ఆనతితో ఊరికిపోయి పెద్దలమాట మేరకు తిరుమలక్క (తిమ్మక్క), అక్కలమ్మల నొకేసారి వివాహమై అహోబిలమున శఠకోపయతిచే శ్రీ వైష్ణవ సిద్ధాంమగు విశిష్టాద్వైతమును సమగ్రముగ నభ్యసించి, తన జీవితమంతయు ఆ మతప్రచారమునకే అంకితము చేసినారు.

విరక్తుడు హరిభక్తిపరాయణుడుఅగు అన్నమయ్య మహిమలూ,సాహిత్యమూ నానాటికీ బలిసి దేశమంతట వ్యాపించినవి.ఆనాళ్ళలో "టంగుటూరు"ను రాజధానిగా చేసికొని రాజ్యమేలుచుండిన సాళువ నరశింహరాయలు అన్నమయ్య కీర్తి విని ఆయనను తన యాస్థానమునకు పిలిపించుకొని అతనితో పాడించి విని ఆనంందించి కాంచనా భరణాదులచే సత్కరించెనట.రాజుగూడ హరిభక్తి గలవాడు గదా యని అన్నమయ్యయు అతని పిలుపును మన్నించి చేసిన సత్కారమును శ్రీనివాస ప్రీతిగ స్వీకరించెను. ప్రతిదిన మాస్థానమూ, సంకీర్తనల గానమూ, సాహిత్యగోష్ఠీ సాగుచుండెను. ఒకనాడు, అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుపై శృంగార రసవాహినిగా రచించిన "ఏమొకొ చిగురుటధరమున"(౧౨ సం. ౮౨వ పాట) అనుపాట పాడుటయు, సభయంతయు నిలుపులేని తలయూపులతో మెచ్చుకొనుటయు జరిగినది.కొందరీతని పాట విని తుంబురుడో,నారదుడో అవతరించె ననియు, కొందరీతని కవితను గుర్తెరిగి కాళిదాసుడే జన్మించినాడనియు కొనియాడుచుండిరి. ఆ పాట వినిన రాజు ఆనందపరవశుడై అన్నమయ్య నభినందించి "ఇట్టి కీర్తనము నాపై నొకటి రచింపు" మని ప్రార్ధించెనట. వెంటనే యన్నమయ్య రెండు చేతులతో చెవులు మూసికొని "శ్రీహరీ!పరమపతివ్రతా భావముతో శ్రీహరిని కీర్తించు నా జిహ్వ మానవుని కీర్తింపజాల"దనెను.తోడనే రాజు కెదలోని కోపము ముక్కుపై నెదురైనది.నెచ్చలి వని మెచ్చి ఒక కీర్తన నాపై రచింపుమనగా ఇంత తిరస్కారమా"యని ప్రభుతాహంకారముతో అన్నమయ్యకు సంకెళ్ళు వేయించి చెరసాలలోనుంచగా అన్నమయ్య:-

ముఖారి

ఆఁకటివేళల నలపైన వేళను
తేఁకువ శ్రీహరినామమే దిక్కు మఱిలేదు IIపల్లవిII

కొఱమాలి వున్నవేళ కులముచెడినవేళ
ఛెఱవడి వొరులచేఁ జిక్కినవేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII

ఆపదవచ్చినవేళ నాఱడిఁబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామమొక్కటే గతిగాక
మాపుదాఁకాఁ బొరలిన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII

సంకెలఁ బెట్టినవేళ చంపఁబిలిచిన వేళ
అంకిలిగా నప్పులవా రాఁగినవేళ
వేంకటేశునామమే విడిపించ గతిగాక
మంకుబుద్ధిఁ బొరలిన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII
(అధ్యా.సం.,౨౬ రేకు)

అని స్వామిని ప్రార్ధింపగా సంకెలలు తమకుతామే వీడినవట.రాజీసంగతి విని రెట్టించిన కోపముతో చెఱసాలనున్న అన్నమయ్య కడకు వచ్చి"మాయలు నాతో పనికిరావు. చఱసాల కావలివారికి లంచమిచ్చి సంకెళ్ళూడదీయించుకొని ఇది దైవానుగ్రహముగ చాటు కొను చున్నావు. ఇదిగో నా యెదుట ఇప్పుడే సంకెళ్ళు వేయించుచున్నాను. నీకు దైవబలమున్నది నిజమైనచో ఇప్పుడు సంకెళ్ళు విడిపించుకొ"మ్మని మరల సంకెళ్ళువేయింపగా అన్నమయ్య పైవిధముగనే శ్రీవేంకటేశు ప్రార్ధింపగా వెంటనే సంకెళ్ళూడిపోయినవట. అటుపై రాజు అన్నమయ్యకు సాష్టాంగపడి చేసినతప్పు మన్నించమని వేడుకొని అన్నమయ్య నందలమెక్కించి ఒక కోపు తాను మోయుచు నూరేగింపు చేసి పశ్చాత్తాపపడి ఘనముగ సంభావించెనట."చేసిన తప్పునకు పశ్చాత్తాపపడితివి.నిన్ను శ్రీహరి రక్షించుగాక!" అని దీవించి అన్నమయ్య యథాపూర్వముగ నుండెనట. అన్నమయ్య చెప్పినది చెప్పినట్లే జరుగుట ఇత్యాది మహిమలింక ననేకములు గలవు.(ఇంతవరకూ వ్రాసినది చిన్నన్న వ్రాసిన అన్నమాచార్య చరిత్రమును ఆధారముగా చేసికొని వ్రాసినది.)

అన్నమయ్య మతము:-

అన్నమయ్య పుట్టుకతో స్మార్తబ్రాహ్మణశాఖకుచెంది అద్వైతి అయినను తాను వలచి స్వీకరించినది శ్రీవైష్ణవ సిద్ధాంతమగు విశిష్టాద్వైతమే. ఆ మతమువారే దీక్ష యిచ్చి మత ప్రబోధము చేసినవారు. ఆ పనిగూడ స్వామి యనుగ్రహము వలననే సాగినది.

దేసాళం
గతులన్ని ఖిలమైన కలియుగమందున
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము IIపల్లవిII

యీతని కరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీ తిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము. IIగతుII

వెలయించె నీతఁడేకా వేదపురహస్యములు
చలిమి నీతఁడే చూపే శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రాధారణము
మలసి రామానుజులే మాటలాడేదైవము. IIగతుII

నియమము లీతఁడేకా నిలిపెఁ ప్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశునగమెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లి తండ్రి దైవము. IIగతుII ౨-౩౭౨ అధ్యా-౧౭౫ వ రేకు

పైకీర్తనము స్పష్టముగ నీతని మతమిదియని చాటుచున్నది. వీరి వివిధ సాహిత్యప్రక్రియలును ఆ మతము పై నాధారపడి నడచినవే.

"సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమె మాసంధ్య" --ఇత్యాదులుగూడ ఈతని మతస్వరూపమును తెలుపునవియే.
ఇంకా వుంది--

0 comments

Sep 8, 2008

తాళ్ళపాక పదసాహిత్యము-5వ సంపుటము-పీఠికలు

తాళ్లపాక కవుల శృంగార సంకీర్తనల ప్రారంభమున 5వ సంపుటికి ఉపోద్ఘాతముగా శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారిచేతను, తరువాత శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారిచేతను వ్రాయబడిన २ పీఠికలు అన్నమయ్య గురించిన వివరాల్నీ,విశేషాలనూ తెలుసుకోగోరే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటాయని భావించి ఆ పీఠికలను యథాతథంగా ఇక్కడ పొందు పరుస్తున్నానుగ్రహించగలరు.

శ్రీ
ఫ్రథమ ముద్రణ
పీఠిక

***
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగార సంకీర్తనల సముద్రమును ఈ ౧౨-వ (పూర్వ సంపుటపు సంఖ్య) సంపుటముతో ఈఁదుటకు ప్రారంభించినట్లైనది।మొత్తము ౨౦౦౨ గల ఆ సంకీర్తనల రేకులలో మొదటి నూఱు రేకులందలి సంకీర్తనలిందు పరిశోధితములై ప్రకటింపబడినవి।రేకులలో ౧౯,౯౬,౯౭,౯౮,౯౯,౧౦౦ సంఖ్యల రేకులు మాకు లభింపలేదు।మఱి నాల్గవ సంపుటమున, ౩౧-వ రేకులోని మూఁడవ సంకీర్తన మొదలు ౬0 వఱకుఁ గల రేకులలోని సంకీర్తనలన్నియు కీ।శే। శ్రీ ప్రభాకరశాస్త్రిగారి చేతి మీఁదుగా పరిశోధితములై ప్రచురింపబడినవి। తక్కిన సంకీర్తనలన్నియు ఈ సంపుటమున క్రమముగా చేర్చబడినవి.౧౧-వ సంపుటమందువలె ఇందును సాధారణపు రేకులు(సా-రే), నిడురేకులు(ని-రే) ,పెద్దరేకులు(పె-రే), తంజావూరి సరస్వతీ భండారపు వ్రాఁతప్రతి(తం-ప్ర),శ్రీ తాళ్ళపాక వేంకట శేషాచార్యులవారింటి వ్రాఁతప్రతి (తా-వెం)-అను నైదు మూలములను పోల్చి సరిచూచి పాఠములను నిర్ణయించితిని। పాఠ భేదములు క్రింద సూచింపఁబడినవి।

అధ్యాత్మ సంకీర్తనలు ఏఁబదేఁబది రేకులలోనివి ఒక్కొక్క సంపుటముగా ఇంతకుముందు ప్రచురణకెక్కినవి।ఇఁకముందు శృంగార సంకీర్తనలు నూరునూరురేకులవి ఒక్కొక్క సంపుటముగా చేర్చి ముద్రించు సంకల్పమున్నది।ఈ మహాకార్యము త్వరగా సాఁగుటకిది కొంతయుపకరించునని, సంపుటములు గూడ చేతికందముగా అందుపాటుగా నుండగలవని, నా నమ్మిక।
౧౯౩౭ వ సంవత్సరమున శ్రీ తిరుమల-తిరుపతి దేవస్థానముల వారు ప్రచురించిన ది వర్క్స్ ఆఫ్ తాళ్ళపాక పోయెట్స్ సం.3 అను సంపుటములో అపక్రమముగా ప్రకటితములైన అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు ఈ సంపుటమునుండి యథాక్రమముగా పరిశోథిత పాఠములతో వెలువడుచున్నవి।
శృంగారరసవీధులు వివిధ జాతీయ దేశీయభాషా విశేషముల కాకరములు।కనుక "విదితార్థగ్రామ్యోక్తులు- పదిలముగాఁ బొంకమెఱిఁగి పలుకఁగఁ జెల్లున్"అనుటయు, "ఉచితభాష పదములఁ జెల్లున్"అనుటయు, అన్నమాచార్యుల యభిప్రాయమని చిన తిరుమలాచార్యుఁడు 'సంకీర్తన లక్షణము' న తెలిపినాఁడు।(ప్ర।౫౫,౫౬)। మరి వ్యాకృతము అవ్యాకృతమునైన భాషను 'ఇదం బ్రహ్మమిదం క్షాత్రం' అన్నట్లు నిర్లక్ష్యముగా లొంగఁదీసుకొని ప్రయోగించు సిద్ధహస్తుఁడు అన్నమాచార్యులు।ఆయన రసావేశముతో పాడిన పాటలు విని వ్రాఁత కెక్కించిన వారు, రేకులపై చెక్కునప్పుడు చెప్పినవారు, చెక్కినవారును శబ్దస్వరూపములు సంధులు మొదలగు విషయములందు వారి వారి వ్యుత్పత్తికిని అభ్యాసమునకును తగినట్లు ఎన్నోమార్పులు చేసియుండక తప్పదు। అరసున్నల,బండిఱాల ప్రయోగవిషయమున పద్ధతియు పట్టుదలయు రేకులు గీసినవారికున్నను వ్యుత్పన్నమైన నియమమున్నట్లు గానరాదు।రేఫఱకార నిర్ణయమును ఎంతో శ్రద్ధతోచేసి విధించిన పెద్దతిరుమలాచార్యుల అధ్యక్షత క్రిందనే జరిగిన యీ రేకుల లేఖనములో ఆ రెంటి విషయమునఁ గానవచ్చు అవ్యవస్థ వింతగా తోఁపక పోదు।ని-రే లలోని పాఠములు సా-రే ల లోను వానిలోనివి పె-రే లలోను కొంత కొంత సవరించినట్లున్నవి।ఇట్టి స్థితిలో అన్నమాచార్యులనుగ్రహించిన శబ్దరూపముల యాథాతథ్యము నిర్ణయించుట అసాధ్యము। ఆ కాలపు శబ్దముల వ్యవహారస్వరూపము తెలియుటకై ప్రాయశః ఆయా రూపములట్లట్లే ఇందు నిలువరింపబడినవి।నేటి పఠనరీతికనువుగా కొన్ని చిఱుమార్పులు మాత్రము చేయక తప్పినది గాదు।
అన్నమాచార్యుల శృంగారభావనలు అధ్యాత్మికముగా అసాధారణములైనవి।ఆదిభౌతికముగా అతని యనుభవములును అట్టివేయని యూహింపవచ్చును।కనుక ఈ శృంగారసంకీర్తనలలో ప్రతిఫలించిన పురుషోత్తముఁడగు శ్రీవేంకటేశ్వరుని విశ్వశృంగారలీలలు, ఆ నిరంకుశ ప్రవాహములో ఈఁదులాడుచు తలమునకలై తనుకులాడు విశ్వజీవనాయికల వింత వింతలైన అనుభవాలు, వానిని వెలుపఱుచు వివిధములగు సందర్భములు, వాక్యములు, పదములు,- అన్నియు అసాధారణములుగనే యుండుట యందాశ్చర్య మేమియు లేదు। యధాశక్తిగా వానిని తెలిసికొని సంతరించు ప్రయత్న మిందు చేసితిని।కాని ఎన్నో సందేహములు నిరుత్తరముగా నిలిచినవి। పరిశోధనరసికులకు ఇఁకముందు ఎంతో పని యిందు గలదు। భావుకులైన పండితులును గాయకులును ఈ రచనల రసానుభవమును ప్రజలకందఱికిని పంచిపెట్టవలసిన పూఁటకాపులు।
ఈ కార్యము నాచే ఇంతవఱకు చేయించినది, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల నిర్వాహకులగు శ్రీ చెలికాని అన్నారావుగారి నిర్హేతుక దయయని, ఈశ్రీనివాసకైంకర్యమును ఫలమును వారివేయని చెప్పుట పునరుక్తి। దీనిని తుదిదాఁకించు నవకాశము గల్పించి శ్రీవేంకటేశ్వరుఁడు వారి ననుగ్రహించుఁగాక!
శ్రీ తిరుమల తిరుపతి దేవాలయ ముద్రాశాలవారు దీనినింత యందముగా ముద్రించి నా ధన్యవాదములకు పాత్రులైరి।

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా
పరిశోధనాలయము,తిరుపతి।
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ,
సంగీత వాజ్ఞయ పరిశోధకుఁడు।
౪-౧౦-౧౯౫౮
**
ద్వితీయ ముద్రణ

పీఠిక
***
ప్రస్థావన:-
పూజ్యపాదులు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు ౪-౧౦-౧౯౫౮ న ప్రకటించిన పండ్రెండవ సంపుటమిది। దీనితోనే తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు ప్రారంభమైనవి। ఇందు శృంగార సంకీర్తనలు ఒకటవ రేకునుండి ముప్ఫైయొకటవ రేకులోని రెండు కీర్తనలు కలిసి ౧౭౪ కీర్తనలు, ఆపై ౮౧ రేకునుండి ౯౫ వరకుగల ౩౫ రేకులలోని పాటలు ౨౦౬ వెరసి ౩౮౦ కీర్తనలు ముద్రితములగుచున్నవి। ౩౧వ రేకులోని మూడవ పాటనుండి ౬౦వ రేకు పూర్తిగానున్న పాటలను కీ।శే। ప్రభాకరశాస్త్రిగారు ౧౯౪౭ వ సంవత్సరమున నాల్గవ సంపుటమున ప్రకటించినారు।

అన్నమాచార్య శృంగార సంకీర్తనల రేకులలో ౧౯, ౯౬,౯౭,౯౮,౯౯,౧౦౦ సంఖ్యలుగల రేకులు దొరకలేదు। ఈ సంకీర్తనల రేకులు మూడు తరగతులుగ నున్నవి।౧। శృంగార సంకీర్తనల రేకులు ౧౫1/२ అం। పొడవు, ౭ అం। వెడల్పుగలవి (సా-రే) సాధారణ రేకులని, ౨। తాళపత్రాకృతిలో ౩౩అం।పొడవు, ౨1/2అం।వెడల్పుగలవి(ని-రే) నిడుద రేకులని, ౩। ౨౮ అం।పొడవు,౧౬అం వెడల్పు గలవి(పె-రే) పెద్ద రేకులనియు వ్యవహారములో నున్నవి। ఈ కుండలీకరణములో చూపిన అక్షరములు ఆయా తరగతులకు చెందిన రేకులకు సంకేతములు।
సా-రేకులలోని పాటలే ని-రే ;పె-రే లలో గూడ కొంత పాఠభేదములతో నున్నవి। మొదట తాళపత్రాకృతి రేకులలో వ్రాసి అవి అస్థిరములని తలచి మరల సా-రే లలో వ్రాసినట్లును, ఐదారు పె-రే లను ఒక కడియముతో గ్రుచ్చి యాత్రాస్థలములకు ఎత్తుకొని పోవుట కనువుగా సిద్ధపఱచినట్లును పెద్దలు చెప్పుచుందురు।
శ్రీ శర్మగారు ఈ సంపుటమునందలి పాటలన్నింటిని ముత్తెఱగులరేకులతో మరిరెండు వ్రాతప్రతులతో సంప్రతించి పాఠభేదములను పాదదీపికలో చూపుచు వెలువరచినారు। ఇది అనితర సాధారణమైన కార్యము।

అన్నమాచార్యుల కృతులను తెలుగు ఎమ్మే వారికి విశిష్ట పాఠ్యభాగముగ నిర్ణయించుటచే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము వారి ఆంధ్రసాహిత్య ప్రీతి, అన్నమయ్య వాజ్ఞ్మయమునందుగల భక్తీ, దీనిని గడ్డకు తీసుకొని రావలెనను దొడ్డ సంకల్పమూ మిగుల కొనియాడ దగియున్నవి।

వాల్మీకి మొదలు తమవరకు గల సంస్కృత వాజ్ఞ్మయమును, కవిత్రయము మొదలు శ్రీనాథునికి ముందు వరకు గల తెలుగు సారస్వతమును ఆపోశనము పట్టి స్వతంత్ర ప్రతిభా వ్యుత్పత్తులతో పలువిధములగు కావ్యరీతులపై చేయివేసి తాము నడచిన సాహిత్యవీథులందంతట సాటిలేని వారని కీర్తిగాంచి, ప్రబంధకవులకు - దాక్షిణాత్యకవులకు తమ సారస్వతప్రసాదమును పంచిపెట్టినది ఈ తాళ్ళపాక వంశము। వీరి సాహిత్యము ఎక్కువ భాగము పద వాజ్ఞ్మయమగుట చేతను, వీరి వాజ్ఞ్మయమంతయు రాగిరేకుల కెక్కి వేంకటేశ్వరుని ఆలయమున ఒక మూల అరలో చాలా కాలము అజ్ఞాతవాసము చేయుటచేతను దీనికప్పటికి రావలసినంత ప్రసిద్ధి రాలేదు।

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమువారు పై విధముగ సంకల్పించుటచే ఈ సాహిత్యమునందలి మర్మములు కాలక్రమముగగ చాల బైటపడగలవు।

మన విశ్వవిద్యాలయము తెలుగు ఎమ్మే విద్యార్థులకు చాలినన్ని ముద్రణప్రతులు లేనందున ఈ ద్వితీయ ముద్రణము ఆవశ్యకమైనది। విశ్వవిద్యాలయమువారి కోరికను గౌరవించి శ్రీ తిరుమల - తిరుపతి దేవస్థానమువారు ఈ ద్వితీయ ముద్రణమునకు మిక్కిలి ప్రాధాన్యమిచ్చి అన్ని పనులకంటె ముందు ఈ ముద్రణము సాగించినారు। శ్రీనివాసుని కృపతో ఈ యుభయుల సంకల్పబలము ఫలించి అన్నమాచార్య సారస్వత సౌరభము నేల నాలుగుచెఱగుల నెరసి పండి పరిమళించుగాక!

శ్రీ అన్నమాచార్య చరిత్ర:

శ్రీ అన్నమాచార్యులు పుట్టుకతో నందవరీక స్మార్తబ్రాహ్మణ శాఖకు చెందినవారు। ఈ నందవరీకులందఱును ఋగ్వేదులు; అశ్వలాయన సూత్రులు। ఈ తాళ్ళపాకవారిది భారద్వాజ గోత్రము। ఈ ఇంటి పేరుతో అన్య గోత్రములవారు గూడ ఉన్నట్లు తెలియుచున్నది।

నందవరీకులు:-

ఈ నందవరీకులందరును పదియవ శతాబ్దమున కాశినుండి ఆంధ్రదేశమునకు వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులు। వీరి చరిత్రమిట్లు చెప్పుచున్నది:- (చూ- చౌడేశ్వరీ మాహాత్మ్యము, గౌని(ను)పల్లె రామప్పకవి.)
నేటి కర్నూలు మండలములో "బనగానిపల్లి - పాణ్యం" ల మధ్యనున్న నందవరమను గ్రామము రాజధానిగా పదియవ శతాబ్దమున నందుడనెడు రాజు పాలించుచుండెను। అతనికి, నిత్యము ఉషఃకాలమున కాశిగంగలో స్నానముచేసి తెల్లవారకమునుపే తన గ్రామమును చేరునట్టి సిద్ధికావలెనని ఒక పేరాస యుండెనట।దత్తాత్రేయసిద్ధుని వలన మంత్రశక్తిగల పాదుకలను సంపాదించి ఆసిద్ధుడే తెల్పిన ఒక సొరంగము త్రోవలో కాశికివెళ్ళి స్నానము చేసి సూర్యోదయమునకు ముందే ఇల్లు చేరుచుండెను। సిద్ధుని ఆదేశముతో తన భార్యకుగూడ చెప్పక ఆమెకును తెలియకుండనే ఈ పని సాగించుచుండెను। ఒకనాడు ఉషఃకాలమున మేల్కొని పడకపై భర్తను గానక పరితపించి అతని గుట్టు తెలిసికొన్నది। తానుగూడ కాశీ స్నానమునకు రావలెనని మగనితో మారాముచేసి వెళ్ళి స్నానము చేసినదట। స్నానమైన తరువాత ఆయమ ఇంటికి దూరమగుటచే మంత్రప్రభావము పనిచేయక రాజు తన భార్యతో గూడ అచ్చటనే నిలిచిపోవలసిన స్థితి యేర్పడినది। అప్పుడచ్చట స్నానముచేయుచున్న బ్రాహ్మణులను చూచి "నా సంకల్పము ప్రకారము ఉదయమునకు ముందే మమ్ము ఊరు జేర్చు మహిమోపేతులు ఎవ్వరైన మీలో కలరా ? అట్లైన మమ్ము కడతేర్చుడు" అని ప్రార్ధించెను। వారు దానికి సమ్మతింపగా మీరు కోరినదేదైనను నేనివ్వగలనని చాముండేశ్వరీ ఘట్టమున దేవీ సాక్షికముగ వాగ్దానము చేసెను। వారు మాకాయవసర మిప్పుడు లేదు; కొలది కాలములో మహాక్షామము రాబోవుచున్నది; అప్పుడు మేము మీకడకువచ్చి మీ సాయము పొందగలమనిరి। తరువాత వారు చెప్పినట్లు క్షామము రాగా ఆ సాయము చేసిన బ్రాహ్మణ కుటుంబములలో కొందరు పెద్దలు నందవరమునకు వచ్చి రాజు చెప్పినమాట గుర్తుచేసి సాయము చేయుమని రాజును వేడిరి। రాజు, "నేను మీ కెప్పుడు చెప్పితిని? దీని కే దైవము సాక్షి?" అని ప్రశ్నింపగా వారు కాశికి తిరిగివచ్చి తాము కొలిచెడి చౌడేశ్వరీ(చాముండేశ్వరీ) దేవిని సాక్ష్యము కోరగా ఆమె , "మీరు ముందుకు నడచుచుండుడు; వెనుకకు తిరిగి చూడరాదు; అట్లెవరైన ఎక్కడనైన తిరిగి చూచిన నే నచ్చటనే నిలిచిపోదును।" అని ఖండితము చేసి వారివెంట వచ్చి రాజునకు యథార్థ విషయమును తెలిపి రాజుగారిచే నందవరమను గ్రామమును ఆబ్రాహ్మణులకు ధారాదత్తము చేయించి వారందరి ప్రార్ధనపై ఆ దేవి నందవరముననే స్థిరపడి పోయినదట। కావుననే కాశిలోని చౌడేశ్వరీ దేవాలయము నేటికిని శూన్యగర్భాలయముగ నున్నదని వాడుక।

వీరు కాశినుండి వచ్చునపుడు క్షామపీడితులైన దుగ్గన అప్పయ్య అను ఆరువేల నియోగి బ్రాహ్మణుడొకరు సకుటుంబముగ వీరితో కలిసివచ్చి నందవరముననే స్థిరపడియుండెనట। ఆనాటి బ్రాహ్మణ కుటుంబముల ఇండ్లపేర్లన్నియు వేదశాస్త్ర పురాణములతో 'కాణాదం', 'మహాభాష్యం' ఇత్యాదిగా ఈ నాటికిని రికార్డులలో దొరకుచున్నవి। కావున వారందరు ఆ నాటికి శుద్ధవైదికశాఖకు చెందినవారే। కొంతకాలమునకు, తమతో వచ్చిన దుగ్గన అప్పయ్య అనునతడు తన కుమార్తెను ఈ కుటుంబములలో నెవ్వరికో పెత్తనముచేసి స్వీకరింపుడని ప్రార్ధింపగా వీరు మేమన్య శాఖలో పెండ్లియాడమని తిరస్కరించిరట। దానితో తనకు వేరు ఆశ్రయము లేక ఆ అప్పయ్య కుటుంబముతోసహా ఆత్మహత్య చేసికొని బ్రహ్మరక్షస్సుగా మారి వీరిని బాధించ జొచ్చెను। వీరాబాధపడలేక తమ కులదైవమగు చౌడేశ్వరిని ప్రార్ధింపగా ఆమె బ్రహ్మహత్యాదోషముతో మీ మహిమ పొల్లుపోయినది। మీరికపై లౌకిక వృత్తులను (కరిణీకం వగైరా) చేపట్టి నన్ను మరువకుండ కొలుచుచు నా భక్తులగు తొగటవీరులకు దేశికులై బ్రతుకుడని ఆదేశించినదట। అదిమొదలు ఈ వైదికబ్రాహ్మణ కుటుంబములన్నియు నందవరీకులు అను నియోగి బ్రాహ్మణులుగా ఆంధ్రదేశమున వ్యవహరింప బడుచున్నారు। నిజమునకు వీరు శుద్ధవైదిక శాఖకు చెందినవారు। నందరాజుచే కొనిరాబడిన వైదికులు గావున 'నందవైదీకులు ' అని, నందవరమున నెలకొన్నవారుగావున 'నందవరీకులు' అని ఈ రెండు పేర్లును నేటికి తడబాటులో నున్నవి। ఆనందవరీక శాఖకు చేరిన కుటుంబమే మన తాళ్లపాక వారిది। క్రమముగా వీర్ల ఇంటిపేర్లన్నియు గ్రామనామధేయములతో సిద్ధములై వ్యవహారములో నున్నవి।

ఈ తాళ్ళపాక అన్నమయ్య జన్మస్థలము నేటి కడపజిల్లా, రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక అను గ్రామము। అదే వీరి ఇంటిపేరుగ నిలిచినది। ఆ ప్రదేశమంతయు ఆనాటి వాడుకలోని పొత్తపినాడు లోనిది। అన్నమయ్యతల్లి లక్కమాంబ। తండ్రి నారాయణసూరి। నారాయణసూరికి చాలకాలము సంతానము కలుగకుండుటచే ఆ దంపతులు మన వేంకటేశ్వరునకు ముడుపు గట్టిరట। ఆనాటి రాత్రి వారికి కలలో స్వామి కాలియందెలు , స్వామివారికటారు దర్శనమిచ్చినవి। వాని ప్రసాదమే మన అన్నమయ్య। శ్రీ స్వామివారి చిరుగజ్జల ప్రభావమే అన్నమయ్య సంగీత సాహిత్య కళారాశియగుటకు కారణము కావచ్చు। పన్నిద్దరాళ్వారులలో ఒకరగు పెరియాళ్వారు వలె అన్నమయ్యయు స్వామినందకాంశమను ప్రసిద్ధి గలదు। నారాయణసూరి దంపతుల కలలో స్వామివారి కటారు దర్శనమిచ్చిన ఫలితమిదియే కావచ్చు। 'అన్నం బ్రహ్మేతి వ్యజనాత్' అను శృతి ప్రకారము నారాయణసూరి పరబ్రహ్మవాచకముగా తన పుత్రునకు 'అన్నమయ్య' అని నామకరణము చేసినారు।

అన్నమయ్య జన్మ కాలాది చర్చ:

అన్మయ్య క్రీ శ ౧౪౨౪ క్రోధి సంవత్సర వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు విశాఖా నక్షత్రమందు జన్మించినట్లు కీ శే ప్రభాకరశాస్త్రిగారు పేర్కొని యున్నారు। శ్రీ శాస్త్రిగారే, వేంకటేశ్వర వచనములకు పీఠిక వ్రాయుచు (౧౯౪౫, పీఠిక- పుటలు,౧౨,౧౩) అన్నమయ్య జన్మకాలము క్రీ శ ౧౪౦౮ అని వ్రాసి, అన్నమాచార్య చరిత్ర పీఠిక(౧౯౪౯,పీఠిక - పుటలు ౨,౩) లో దానిని సవరించి కీ శ ౧౪౨౪ అని వ్రాసినారు। డాII వేటూరి ఆనందమూర్తిగారు "తాళ్ళపాక కవుల కృతులు, వివిధ సాహితీ ప్రక్రియలు" అను గ్రంథమున (పుటలు ౬౦ నుండి ౬౫ వరకు) దీనినే బలపరచుచు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నిర్ణయమును , శ్రీ చాగంటి శేషయ్యగారి నిర్ణయమును త్రోసి పుచ్చిరి.

అసలు రేకులలో నున్న వాక్యమిది:- "స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహన శకపరుషంబులు ౧౩౪౬ అగు నేటి క్రోధి సంవత్సరమందు తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించిన పదారు యేండ్లకు తిరువేంగళనాఛుండు ప్రత్యక్షమయితేను అది మొదలుగాను శాలివాహన శక వరుషంబులు ౧౪౨౪ అగు నేటి దుందుభి సంవత్సర ఫాల్గుణ బహుళ ౧౨ నిరుధానకు తిరువేంగళనాథుని మీఁదను అంకితముగాను తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన శృంగార సంకీర్తనములు"।

ముందు చర్చించిన వారందరు ఇందలి వాక్యనిర్మాణపద్ధతిని బట్టియే చర్చ సాగించినట్లు చెప్పినారు।నా అభిప్రాయమిది:-
ఈ వాక్యము జన్మ నిర్యాణములను తెలుపుట కేర్పడినది గాదు। ఆతని జీవిత కాలములో ఏది సారభూతమైన సమయమో దానిని తెలుపుటకే ఏర్పడినది। జన్మ ప్రభృతి పదహారేండ్లవరకు గడచిన కాలము సారహీనమైనదనియు , పదహారవయేట తిరువేంగళనాథుడు ప్రత్యక్షమైన తర్వాత , అతనిపై దినమునకు ఒక్క కీర్తనమునకు తక్కువ గాకుండ స్వామిని కొనియాడిన కాలమే సారభూతమైనదనియు, ఆపని నిర్యాణ దినమువరకు సాగినందున నిర్యాణదినము మాత్రము (దుందుభి-ఫాల్గుణ-బహుళ౧౨) లెక్కకు వచ్చినదనియు తెలుపుటే ఈ వాక్య పరమార్థము।
కావున రేకులపై గనపడు ౭౯ సంవత్సరములతోపాటు సారహీనముగ గడచిన ౧౬ సంవత్సరములు కలిస్తే ౯౫ సంవత్సరములు ఆతని జీవితకాలమని తేలినది। ౧౪౦౮ విరోధి వైశాఖ శుద్ధ పూర్ణిమ నిశాఖా నక్షత్రమున జన్మమనుట సబబు। విరక్తుడగు అన్మయ్య ఈ నిధముగ లెక్కించె ననుట సమంజసము।

ఈ వాక్యమునందు రెండు 'నేడు' శబ్దములున్నవి। ఒక 'నేటి క్రోధి యందు' తిరివేంగళనాథుఁడు ప్రత్యక్షమైనాడు। మరియొక 'నేటి దుందుభి' వరకు ఈ సంకీర్తన రచన సాగినది। ఇది సారభూతమైన కాలము। ఈ రెండు నేడులు అనంతప్రభవాది సంవత్సరములలో ఒకటి స్వామి దర్శనమునకు, మరియొకటి తన నిర్టాణమునకు గురుతుగా ప్రస్తావింపబడినవి। 'నేటి క్రోధి యందు' అన్నది క్రియ నపేక్షించుచున్నది। 'ప్రత్యక్షమైతేను ' అన్న క్రియ దీనికి పూరకము। ఎప్పుడు? అను నాకాంక్ష- ఎదురగుచున్నది.'అవతరించిన పదారు యేండ్లకు అన్నది సమాధానము।' అవతరణము ముందే జరిగినదన్నమాట।'అవతరించిన' ధాతుజ విశేషణము 'పదారు యేండ్లకు' అను పదముతో సమసించి సులభాన్వయముగా అర్థము పొసగు చున్నది। ఇట్లన్వయించుట దూరాన్వయమని పెద్దలెందుకు వాకొనిరో తోచకున్నది। అవతరణమే ఈ వాక్యమున చెప్పదలచినచో 'అవతరించినన్' అనిగా యుండవలయును! ఈ విధముగా అన్వయించుటచే అన్నమయ్య తన మనుమలకు బ్రహ్మోపదేశము చేసెనను చారిత్రికాంశము సుపరిష్కృతమగుచున్నది। దీనికై శ్రమపడి సమన్వయము మనము చేయవలసిన పనిలేదు। ఇంతకూ అన్నమయ్య దృష్టిలోనే అసారభూతమైన పదహారేండ్ల వయసునకై చేసిన ఈ కోలాహలమూ అసారమే। కాలమూ పెద్దలూ దీనిని గుర్తించగలరు।

అన్నమయ్య అడ్డాలబిడ్డడైయున్ననాళ్ళలోనే తిరుమలప్ప ప్రసాదమని చెప్పకుంటే ఉగ్గుగూడా త్రాగడట। కొంచెమెదిగి
ఐదేండ్ల వాడైనా డన్నమయ్య। నారాయణసూరి శంకరాచార్యులకువలె ఈతనికి ఐదవయేటనే ఉపనయనము చేయించినారు। "నవమేత్వాయుష్కామం పంచమే బ్రహ్మవర్చసకామమ్" అను స్మృతి ననుసరించి, తన కొడుకు బ్రహ్మవర్చస్వి కాగలడని నారాయణసూరి అట్లు చేసియుండును। ఉపనయనమై గురువునొద్ద విద్యాభ్యాసమునకు చేర్చిరి। అది వట్టి శాస్త్రమర్యాదగనే నడచినది। "ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః" అన్నట్లు అన్నమయ్య కన్నివిద్యలూ తమకు తామేవచ్చి నాలుకకొన నాట్యమాడసాగినవి। విద్యాభ్యాస కాలముననే కవితా వనిత వీరి కౌగిట కొదిగినట్లున్నది। ఆనాటినుండియే అన్నమయ్య సంకీర్తనలు పాడి ఆడుచుండెడి వాడట। ఆయన ఆడినది ఆట, పాడినది పాటగా లోకులు మెచ్చి కీర్తించుచుండిరట। భగవద్భక్తి కసాద్యమైనది లేదను ఆస్తికులెవ్వరును ఈ విషయమునందు వింతపడరు।

రాను రాను అన్నమయ్యకు శ్రీనివాసునిపై మరులు బలియుచుండెను। పూర్వ జన్మలంస్కార ఫలితముగ ఒకనాటి వేకువన అన్నమయ్యకు కలలో స్వామి దేవాలయము, గోపురము, బంగారు వాకిళ్ళు, గర్భాలయము, అందు శతకోటి తేజముతో వెలుగు స్వామి మూర్తి దర్శనమిచ్చి తన్ను రమ్మని పిలిచినట్లుండెనట।


భూపాలంఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి. IIపల్లవిII

అతిశయంబైన శేషాద్రిశిఖరముఁ గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటిసూర్యతేజములు వెలుఁగఁ గంటి
చతురాస్యుఁ బొడగంటిఁ జయ్యన మేలుకంటి. IIఇప్పుII

కనకరత్నకవాటకాంతు లిరుగడఁ గంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమమణీమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటిఁ గ్రక్కన మేలుకంటి. IIఇప్పుII



అరుదైన శంఖచక్రాదు లిరుగడఁ గంటి

సరిలేని యభయహస్తము గంటిని

తిరువేంకటాచలాధిపునిఁ జూడగఁ గంటి

హరిఁగంటి గురుఁగంటి నంతట మేలుకంటి। IIఇప్పుII

అధ్యా సం ౬వ రేకు

ఈ పాట పై చరిత్ర వాక్యమునకు సాక్షి।వెంటనే ఇంటినారికి చెప్పక ఒంటరిగా తిరుమలకు పయనమై తన యూరినుండి కాలినడకతో తిరుపతి చేరి, అందలి గ్రామదేవతకు నమస్కరించి, ఆనాటి వేకువన కొండకు పయనమై అలిపిరి యొద్దనున్న చింతచెట్టుకు, ఆ దాపలనున్న నృసింహస్వామికి మ్రొక్కి, జాము ప్రొద్దెక్కునంతకు మోకాళ్ళమెట్టు చేరి, అప్పటికి కలిగిన బడలికతో సొమ్మసిలి నేల వ్రాలిపోయెనట। జగన్మాత యగు అలమేలుమంగ ఆ మైకములో నున్నవానిని లేపి తన కడగంటి చూపులతోడనే ఆతని బడలికలు దీర్చి "నాయనా! ఈ కొండ సాలగ్రామమయము। దీనిని చెప్పుకాళ్ళతో ఎక్కరాదని చెప్పెను. --ఇంకావుంది

0 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks